Next Page 

డెత్ సెల్ పేజి 1

 

                               డెత్ సెల్

                                                      యర్రంశెట్టి సాయి

 

                           

 

    చౌరస్తాలో నిలబడ్డాడు సురేష్. అన్ని వేపుల నుంచీ అన్ని వేపులకూ జనంతో పాటు వాహనాలు కూడా దూసుకు పోతున్నాయ్. టైం చూసుకున్నాడు సురేష్.
    అయిదున్నర అవటానికి ఇంకో పది నిమిషాలుంది. అప్పుడే తన పక్క నుంచి వెళ్తోన్న యువతిని జాగ్రత్తగా చూశాడతను. '36-26-32' అనుకున్నాడు స్వగతంగా. కానీ ఆ మాట అతనికి తెలియకుండానే పైకి వినిపించడంతో ఆ యువతి చటుక్కున ఆగి అతని వైపు కోపంగా చూసింది.
    "ఎమిటంటున్నావు?" అంది ముఖంలోని అందాన్ని కొంచెం చెరిపేసుకుని.
    సురేష్ చిరునవ్వు నవ్వాడు "36-26-32 మేడమ్!"
    ఆమె ముఖం ఎర్రబడింది. "ఏమిటి?" అంది రోషంతో రెట్టిస్తూ.
    "మేజర్ మెంట్స్ మేడమ్.....! మా ప్యాక్టరీలో సిలిండర్ మేజర్ మెంట్స్."
    ఆ యువతికి ఇంకేమనాలో తెలీలేదు.
    "ఇడియట్........" అనేసి తాన దారిన తను వడివడిగా నడుస్తూ వెళ్ళి పోయింది.
    రెండు నిమిషాల్లో మరో యువతి తన ముందు నుంచి వెళ్ళటం గమనించాడు.
    "32-24-28" అనుకున్నాడతను.
    ఆ యువతి కూడా జనంలో కలసిపోయాక మరోసారి టైం చూసుకున్నాడతను.
    ఇంకో రెండు నిమిషాలుంది.
    "ఎంత సేపయింది?" వెనుక నుంచి వచ్చి అతని చేయి పట్టుకుంటూ అడిగింది తులసి.
    "అరె రెండు నిమిషాలముందే ఎలా వచ్చేశావ్? మీ బాస్ ని ఇవాళ నీ చేయి నిమరనిచ్చావా?" ఆశ్చర్యంగా అడిగాడతను.
    "డోంట్ బి సిల్లీ" చిరుకోపంతో అందామె.
    ఇద్దరూ బస్ స్టాప్ లో నిలబడ్డారు.
    "ఇప్పుడెం చేద్దాం?" ఆలోచిస్తూ అడిగిందామె.
    "అదే! ముందు మాములుగా ముద్దులు పెట్టుకుని తరువాత మాములుగా......"
    "సురేష్" చిరాకుగా అంది తులసి.
    "ఓ.కె., ఓ.కె.! స్టాప్ చేశాను."
    "ముందు ఏ అడ్రస్ కెళ్దాం" తన బ్యాగ్ లో నుంచి కాగితం తీస్తూ అడిగిందామె.
    ఆమె వంకే ఆనందంగా చూశాడు సురేష్. తెల్లగా పోనీ టెయిల్, కూలింగ్ గ్లాసెస్ తో, ఎవరూ ఆమెను మూడు వందల యాభయ్ రూపాయల జీతం మీద పనిచేసే టైపిస్ట్ అనుకోరు. ఇంత అందమైన అమ్మాయి ప్రేమను పొందటం యింకా కలేనేమో అనిపిస్తూంటుంది. అప్పుడప్పుడూ.
    "కోటిలో ఒక ఏజన్సీ వుంది. అక్కడి కెళ్దాం" లిస్ట్ అంతా చూసి అందామె.
    ఇద్దరూ బస్ ఎక్కారు.
    కండక్టర్ వచ్చాడతని దగ్గరకు.
    "ఎక్కడికి?"
    "కోటీ రెండు లేడీస్ టికెట్స్"
    "లేడిస్ టికేట్లా?"
    "అవును! అంటే వీటికి చార్జ్ లేడిస్ చెల్లిస్తారని అర్ధం."
    తులసి నవ్వుతూ బ్యాగ్ లోనుంచి డబ్బు తీసి యిచ్చింది.
    శ్రీనివాసా రియల్ ఎస్టేట్ అండ్ రెంటల్ ఏజన్సీస్ ఓ సందులో వుంది. టేబుల్ వెనుక ఓ లావుపాటి వ్యక్తీ కూర్చుని వున్నాడు.
    "మే ఐ కమిన్" అడిగాడు సురేష్.
    "ప్లీజ్ కమిన్! హావ్ యువర్ సీట్స్"
    ఇద్దరూ కుర్చీల్లో కూర్చున్నారు.
    "ఇల్లు కావాలి" చెప్పాడు సురేష్.
    "కొంటానికా? అద్దెకా?"
    తులసి 'అద్దెకు అని చెప్పే లోపలే సురేష్ "కొంటానికి......." అనేశాడు.
    "ఎంతలో?"
    "ఎంతలో వున్నాయ్?"
    "లక్షన్నర నుంచి పది లక్షల వరకూ వున్నాయి."
    "లాభం లేదు . వెళ్దాం పద తులసి......." అంటూ కుర్చీలో నుంచి లేవబోయాడతను.
    ముసలతను కంగారు పడ్డాడు.
    "మీకు ఎంతలో కావాలి?"
    "కనీసం యాభయ్ లక్షల బంగళా......."
    తులసి ఇంక లాభం లేదని కల్పించుకుంది.
    "అద్దెకు చిన్నఇల్లెమయినా వుంటే......"
    అతను మరీ పజిల్ అయిపోయాడు.
    "యాభయ్ లక్షల రేంజ్ లో మాంచి బిల్డింగ్ ఏదయినా కనిపించినప్పుడు మాతో చేప్దురుగాని, అంత లోపల అద్దెకు చిన్న ఇల్లు ఏదైనా."

Next Page