Next Page 

సుడిగుండాపురం రైల్వే హాల్ట్  పేజి 1


                   సుడిగుండాపురం రైల్వే హాల్ట్

                                                                                  యర్రంశెట్టి శాయి

                  


    జంట నగరాలు మామూలుగానే చాలా హడావుడిగా వున్నాయ్.
    రాత్రికి రాత్రే కార్పొరేషన్ వాళ్ళు వాటర్ వర్క్స్ వాళ్ళూ తవ్విన గోతుల్లో పడి పైకి వస్తున్నవారూ, పైకి వచ్చే ఆశలు వదులుకుని గావుకేకలు వేస్తున్నవారూ, ట్రాఫిక్ పోలీసుల విజిల్సూ, వారిని వేటాడి చంపేయటానికి ప్రయత్నిస్తున్న లారీలు, నడిరోడ్డుమీద ఆటోలు ఆపి మూడు ముక్కలాడుకుంటున్న డ్రైవర్లూ, సరదాగా చీమల్తో పందెం వేసి తెగ బహుమతులు గెల్చుకుంటున్న ఆర్టీసీ వాళ్ళూ, ఇలా ఎవరి హడావుడిలో వాళ్ళున్నారు.
    కానీ ఇవేమీ పట్టించుకోకుండా చాలా సీరియస్ గా కారు డ్రైవ్ చేసుకుంటూ, మధ్యలో 'హా' అని నిట్టూరుస్తూ అబిడ్స్ సెంటర్ చేరుకున్నాడు కె.ఎస్.ప్రకాష్.
    కారు మామూలుగానే రాంగ్ పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేసి, ఆ పక్కనే నిలబడ్డ ట్రాఫిక్ కానిస్టేబుల్ చేతిలో అయిదు నోట్లు పెట్టి, తను ఆ సందులో వున్న ఆరాస్ అనే ఇరానీ హోటల్లోకి నడిచాడు.
    కిక్కిరిసిపోయిన సమోసాలూ, టీలూ సేవిస్తున్న జనం అందరినీ తేరిపార చూస్తూ ముందుకు నడవసాగాడు.
    ఆఖరి టేబుల్ దగ్గర కూర్చుని సమోసాలు నవుల్తూ, డక్కన్ క్రానికల్ పేపర్లో ఉద్యోగ వార్తలు చదువుతున్న భవానీశంకర్ ని చూడగానే అతనికి ప్రాణం లేచివచ్చినట్లయింది.
    "హాయ్ భవానీ!" అంటూ వెర్రికేకవేసి ఆనందంగా టేబుల్స్ మీదనుంచే గెంతుతూ అతనివేపు పరుగెత్తాడతను. ఆ కేకకు అదిరిపోయిన కొంతమంది అప్పుడే నోట్లోకి పీల్చిన 'టీ' ని పక్కవాడి మీద గుమ్మరించేశారు. మరికొంతమంది అది హైదారాబాద్ నగరంలో సర్వసాధారణమైపోయిన గుండాలా ఎటాక్ అనుకుని టేబుల్స్ కిందకు దూరిపోయారు.
    ఈ హడావుడి చూసి హోటల్ వెయిటర్స్ ఏదో కొంప మునిగిపోయిందని చకచకా షట్టర్స్ దించేశారు. ఇంత కంగారుగా అంత పెద్ద హోటల్ వాళ్ళు షట్టర్స్ దించడం చూసి ఆ చుట్టుపక్కలున్న ఇతర దుకాణాలన్నీ కూడా శరవేగంతో మూతబడిపోసాగినయ్.
    ఇలా హఠాత్తుగా అబిడ్స్ లో షాపులన్నీ మూత పడడం గమనించేసరికి రోడ్డుమీద వెళ్ళే జనం సడెన్ గా డైరెక్షన్ మార్చేసుకుని సందులోకి పారిపోసాగారు.
    జనం సడెన్ గా డైరెక్షన్ మార్చేసుకుని సందుల్లోకి పారిపోసాగారు.
    వాళ్ళను చూసి ఆర్టీసీ బస్ లు ఆపేసి డ్రైవర్లు పోలీస్ స్టేషన్ లోకి పరుగెత్తారు. ఈ గొడవంతా చూసి భయపడిపోయిన పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి, పోలీస్ వ్యాన్ లోకి పరుగెత్తి తలదాచుకున్నారు.
    అయితే ఈ విషయం తెలియని సదరు శాల్తీ భవానీశంకర్ ని చేరుకొని అమాంతం కౌగిలించుకున్నంత పని చేశాడు.
    "నీకోసమే చూస్తున్నా గురూ! నీ రూమ్ కెళ్ళి వచ్చాను" అన్నాడతను ఆయాసంతో ఒగరుస్తూ.
    "ఇది మన బ్రేక్ ఫాస్ట్ కమ్-లంచ్ టైమ్ బ్రదర్! ఈ టైమ్ లో మనం ఈ హోటల్లో తప్ప ఇంకెక్కడా వుండం. ఎందుకనో తెలుసా?"
    "తెలీదు."
    "మనకి మొత్తం జంట నగరాల్లో అప్పు పెట్టేది కేవలం ఈ హోటల్ ఓనర్ ఒక్కడే."
    "అది సరేగానీ ఇవాళ పొద్దున ఏం జరిగిందో తెలుసా?"
    "ఇంకా నేను న్యూస్ పేపర్ చూడలేదు బ్రదర్! గవర్నమెంట్ మళ్ళీ పడిపోయిందా?"
    "అదికాదు! ఇవాళ సుష్మాసహానీ అనే అందాల దేవతను చూశాను" ఆనందంగా అన్నాడతను.
    భవానీశంకర్ వులిక్కిపడ్డాడు.
    "సుష్మా సహానీయా?"
    "అవును గురూ...! నిజంగా మందు కొట్టకుండా చెబుతున్నాను. ప్రపంచంలో ఆ అమ్మాయి అంత అందగత్తె ఇంకెవరూ వుండరు. కావాలంటే బెట్ కడతాను."
    "కానీ నిన్నటివరకూ మధూలిక అనే అమ్మాయే ప్రపంచంలోకెల్లా అందమైన అమ్మాయి అన్నట్లు గుర్తు?"
    "కె.ఎస్.ప్రకాష్ కొంచెం చిరాకుపడ్డాడు. "అది పాస్టెన్స్ గురూ! చరిత్రను తవ్వొద్దని ప్రముఖ రచయిత కైకలూరు కనకారావ్ తన లేటెస్ట్ నవల్లో రాశాడు. అదీగాక మధూలికకూ మనకూ చెడిపోయింది."
    "ఎందుకని?"
    "ఎందుకేమిటి? ప్రపంచంలోకెల్లా ఉత్తమ నటుడు ఎన్టీఆర్ అంది. కాదు...చిరంజీవి అన్నాన్నేను. అంతే...ఇక జన్మలో నా ముఖం తనకు చూపవద్దని వార్నింగిచ్చి మధ్యలో లేచి వెళ్ళిపోయింది."
    "వెరీ బాడ్! కనీసం ఎటికసీ కోసం సినిమా అయ్యేంతవరకూ వుండాల్సింది."
    "ఆఖరికి ఇంటర్వెల్ కూడా అవకముందే వెళ్ళిపోయింది."
    "పోనీ నువ్వయినా వెనకెళ్ళి బ్రతిమాలి తీసుకురావలసింది."
    "ఎలా? కొంత సినిమా మిస్ అయిపోతుందిగా!"
    "అఫ్ కోర్స్! ఆ మాటా నిజమే"
    "అదీగాకుండా నా సంగతి నీకు తెలీందేముంది? ప్రియురాల్నయినా వదులుకుంటానుగానీ, చిరంజీవిని ప్రపంచ ఉత్తమ నటుడు కాదని ఎవరయినా అంటే మాత్రం సహించలేను."
    "అవునవును...! కాలేజిలో కూడా ఇదే విషయంలో లెక్చరర్ తో క్లాస్ రూమ్ లో పావుగంట హ్యాండ్ ఫైటింగ్ కూడా చేశావ్."
    "ఇంతకూ ఈ సుష్మాసహానీ సంగతేంటీ? అసలు నన్ను ప్రేమించడానికి వప్పుకుంటుందంటావా?"
    "తప్పకుండా ఒప్పుకుంటుంది బ్రదర్! నీకేం తక్కువని కాదంటుంది? అందులో నిన్ను కొట్టేవాడెవడూ లేడు."
    "కానీ నా కన్ను అప్పుడప్పుడు కొంచెం మెల్లగా కనబడుతుందని మధూలిక ఓసారి అంది కదా?"
    "అవన్నీ నువ్వు పట్టించుకోకూడదు బ్రదర్! ఓవర్ లవ్ వున్నప్పుడు చాలామంది అలా ఓవర్ రియాక్ట్ అవుతుంటారు. ఇక నీకు డబ్బుకీ తక్కువేమీలేదు."
    ప్రకాష్ ఆశ్చర్యంగా చూశాడు "లేకపోవడమేమిటి? అసలు నా దగ్గర డబ్బెక్కడుందని?"
    "నీకు లేకపోతేనేం? మీ మావయ్య కోటీశ్వరుడు కదా!"
    "ఏడ్చినట్లుంది. తన కంపెనీలో చచ్చేట్లు పని చేయించుకుంటాడు. కానీ సంవత్సరం నుంచీ ఒక పైసా ఇవ్వటంలేదు. ఎప్పుడయినా అత్తయ్య జాలిపడి పదో, పాతికో ఇవ్వటమే!"

Next Page