Next Page 

జయ - విజయ పేజి 1


                                 జయ - విజయ

                                                                    -యర్రంశెట్టి సాయి    

                               


    ఆ నవల చదివిన చాలారోజులవరకూ దాని ప్రభావం నుంచి బయటపడలేకపోయింది విజయ. ముఖ్యంగా రచయిత కథా నాయకురాలి పాత్రను సృష్టించిన తీరు, నడిపిన విధం ఎంతో గాఢంగా మనసుకి హత్తుకుపోయింది. అందులో రాధ ఓ మధ్యతరగతి అమ్మాయి. ఒక మిలటరీ ఆఫీసర్ ని ప్రేమిస్తుంది. ఇద్దరూ వివాహం చేసుకోవాలనుకుంటారు. తీరా వివాహానికి ముందు జీప్ ప్రమాదంలో అతను మరణిస్తాడు. ఆ తరువాత ఆమెను ఎవరూ వివాహం చేసుకోడానికి ముందుకు రారు. కొద్ది సంవత్సరాల తర్వాత తన చెల్లెలు ద్వారా ఆమెతో పరిచయం కలిగిన సృజన్ ఆమెను ప్రేమించి వివాహం చేసుకుంటాడు. కాని ఆమె అంతకుముందు ఓ మిలటరీ ఆఫీసర్ తో సంబంధం కలిగిఉందని తెలుసుకుని ఆమెను నిర్దాక్షిణ్యంగా వదిలేస్తాడు. చివరివరకూ ఎన్నో కష్టాలు ఎదుర్కొని సృజన్ స్నేహితుడినే వివాహం చేసుకుంటుందామె.    
    ఆ రచయితను తను కలుసుకుని అతని నవల తననెంతగా ఆకట్టుకున్నది. అది చదివిన ఆడపిల్లలకు ఎంతటి మనోవికాసం, మనోధైర్యం కలిగేదీ అన్నీ అతనిని అభినందిస్తూ చెప్పాలనుకుందామె. కానీ అతనెక్కడుంటాడో తనకెలా తెలుస్తుంది? ఆ నవలను ప్రచురించిన పత్రికకు ఉత్తరం రాయమని సలహా ఇచ్చింది ఆమె సహోద్యోగిని రజని. ఆమె అంతకుముందు ఇలాగే ఓ రచయిత్రిని అభినందిస్తూ ఆమె రచన ప్రచురించిన పత్రికకు ఉత్తరం రాస్తే వారు ఆ ఉత్తరాన్ని ఆమెకు రీడైరెక్టు చేశారు.
    అయితే తను ఆ రచయితకు రాసిన ఉత్తరం మధ్యలో ఆ పత్రిక వాళ్ళు చదువుతారేమో అన్న సంశయం కలిగిందామెకి. అలా చేయడం ఆమెకి నచ్చలేదు.
    "పోనీ అతని అడ్రస్ తెలియజేయమనిరాస్తే అడ్రసిస్తారా?" అడిగిందామె.
    "ఏమో! ఇస్తారనే అనుకుంటాను?" అనుమానంగా జవాబిచ్చింది రజని.
    "సరే! అయితే ఇవాళే రాస్తాను!" అంది విజయ. అప్పటికప్పుడే ఆఫీస్ ఫ్యూన్ ద్వారా రెండు కవర్లు తెప్పించి ఒకదానిమీద తన అడ్రస్ రాసి మరో కవర్లో ఉత్తరంతో పాటు వుంచి పోస్ట్ చేసిందామె.
    "ఏమిటింత అర్జంటుగా రాస్తున్నావ్? ఆ రచయిత నవల అంత బావుందా?" అడిగింది రజని ఆశ్చర్యంగా.
    "నువ్వే చదివి చూడరాదూ! బావుందో లేదో" అంది విజయ చిరునవ్వుతో.  
    "అది కాదోయ్! సాధారణంగా నీకే నవలా నచ్చదు కదా! అన్నీ టైమ్ పాస్ నవలలని తీసిపారేస్తుంటావ్!"
    "అది నిజమేననుకో! కానీ ఈ నవల మాత్రం ఎంతో భిన్నంగా ఉంది. పర్పస్ ఉన్న నవల!"
    "ఓహో! అలాగయితే నేను తప్పక చదవాల్సిందే!" నవ్వుతూ అంది రజని.
    ఆ రోజంతా ఆ ఉత్తరం గురించే ఆలోచిస్తూండి పోయిందామె. తను ఈ రోజు పోస్ట్ చేస్తే ఆ మర్నాడు తనకు అందుతుంది. అంటే నాలుగురోజులాగాలన్నమాట! ఆఫీసు నుంచి ఇంటికి చేరుకునేసరికి తనకోసమే ఎదురుచూస్తూ కనిపించింది జయ.
    "నీకోసమే ఎదురు చూస్తున్నానక్కా" అంది చిరునవ్వుతో.
    "ఏమిటి సంగతి?" అడిగింది విజయ నవ్వుతూ.
    "మా ఫ్రెండ్సంతా కలసి మాజిక్ షో కెళ్దామని అనుకున్నాం" పి.సి. సర్కార్ మాజిక్ అక్కా! ఎంతో బావుంటుందట ఆశగా అందామె.
    "సరే వెళ్ళిరా! ఇప్పుడెవరొద్దన్నారు?"
    "అమ్మనడిగితే డబ్బుల్లేవు పొమ్మంటోంది! నీ దగ్గరుంటే..." నసిగిందామె.
    విజయ తన పర్సులో నుంచి అయిదు రూపాయల కాగితం తీసి ఆమెకందించింది.
    "చాలా?"
    "ఇంకో రెండు రూపాయలు కావాలక్కా!"
    విజయ మరో రెండు రూపాయలు ఆమెకిచ్చింది. అప్పుడే పార్వతి లోపల్నుంచి అక్కడికొచ్చి విజయ జయకు డబ్బివటం గమనించింది.
    "వద్దన్నా వినకుండా విజయ దగ్గర డబ్బు తీసుకుంటున్నావ్ కదూ?" కోపంగా అందామె.
    "చూడక్కా" ముఖం మాడ్చుకుని విజయతో అంది జయ.
    "పోనీ అమ్మా! మాజిక్ షో కెళ్తుందట గదా!"
    "నీకు తెలీదే విజయా! ఎప్పుడూ ఏదోక వంక పెట్టుకుని రోడ్ల వెంబడి తిరగడం బాగా అలవాటయిపోయింది. ఎవరయినా గమనిస్తే ఏమనుకుంటారు? పెళ్ళీడు కొచ్చిన పిల్ల తెగించిపోయిందేమని చెప్పుకోరు?" ఆవేదనతో అంది పార్వతి.
    "నీకా భయం అక్కర్లేదులే అమ్మా! జయ ఇంట్లో కూర్చునే పిల్లకాదు కదా! కాలేజీలో చదువుతోంది! అలాంటప్పుడు ఆ మాత్రం తిరగకుండా ఎలా వుంటుంది?" జయను సమర్ధిస్తూ అంది విజయ.
    జయ ఆనందంగా తల్లివేపు చూసింది.
    "అలా చెప్పక్కా! అమ్మ అస్తమానం వేధించేస్తోంది నన్ను. షికార్లు చేస్తున్నానని!
    ఇంట్లో ఎంతసేపూ ఏం తోస్తుంది 'బోర్ అంటే వినిపించుకోదు! తనను సమర్ధించుకుంటూ అంది జయ.
    "అవున్లే! మీరిద్దరూ ఒకటి! నా మాటలేమీ మీకు నచ్చవ్! నేనేమయినా అంటే పాతకాలం మాటలంటూ తోసిపారేస్తారు." నిష్టూరంగా అంది పార్వతి.
   

Next Page