Next Page 

బుద్ధిజీవి పేజి 1


                             బుద్ధిజీవి

                                                                      - మైనంపాటి భాస్కర్

 

                                    

ఇప్పటికి రెండు తరాల తర్వాత - ఆ రోజు కూడా అలవాటుగానే సూర్యుడు ఉదయించాడు. అతీం మామూలుగానే తెల్లవారింది.
అంత సాధారణంగా ఉన్న ఆ రోజున, అసాధారణమైన సంఘటనలు మూడు - ఒకదాన్ని ఒకటి తరుముకొస్తున్నట్లు, వెంట వెంటనే జరుగుతాయని ఊహించలేకపోయింది అపురూప.
"2053 వ సంవత్సరం - మే ఏడవ తారీఖు - వార్తలు చదువుతున్నది..." అని వినబడుతోంది టీవీలో.
వెచ్చటి సువాసనలు వెదజల్లుతున్న బ్లాక్ కాఫీ కప్పు చేతిలో పట్టుకుని టీవీ ముందు కూర్చున్న అపురూప నుదురు చిట్లించి ఛానెల్ మార్చింది. ఎవరో వార్తలు చదువుతుంటే వినడం బోరు ఆ అమ్మాయికి. తను చదవడమే ఎక్కువ ఇష్టం.
ఛానెల్ మార్చగానే, ప్రకాశవంతంగా ఉన్న టీవీ స్క్రీన్ అక్షరాలతో వార్తాపత్రికలా కనబడటం మొదలెట్టింది. అక్షరాలు నెమ్మదిగా పైకి జరిగిపోతున్నాయి. శీర్షికలు మాత్రం చదువుతోంది అపురూప.
"రోదసిలో రెండు అంతరిక్ష నౌకల హైజాకింగ్. అగ్రరాజ్యాల పరస్పర ఆరోపణ."
"జల కాలుష్యం వల్ల అట్లాంటిక్ మహాసముద్రంలోని చేపల జాతుల అంతర్ధానం."
"అమెరికన్ ప్రెసిడెంటు అంగారక గ్రహ యాత్ర. అక్కడి సైనిక స్థావరాల సందర్శన. ప్రపంచ శాంతికై అన్ని దేశాలూ...ఉద్బోధ!"
'బేష్!" అనుకుంది అపురూప చిరాగ్గా. 'ఇలాంటి ఏడుపు రోజూ ఉండేదే! వీటిని పెద్ద న్యూస్ ఐటమ్స్ గా వెయ్యడం ఎందుకో? కుక్క మనిషిని కరిస్తే అది న్యూస్ కాదు. మనిషి కుక్కని కరిస్తే అది న్యూస్. అంతేగాని..." అనుకుంది.
అంతలో-
ఎవరో ఎలుగెత్తి అరుస్తున్నంత పెద్ద అక్షరాలతో మరో శీర్షిక!
"తనను తయారుచేసిన శాస్త్రజ్ఞుడినే చంపి మరమనిషి పలాయనం!"
నిటారుగా కూర్చుని సంభ్రమంగా ఒక మీట నొక్కింది అపురూప.
పైకి జరిగిపోయిన అక్షరాలు మళ్ళీ స్క్రీన్ మీద ప్రత్యక్షమయ్యాయి.
"తనను తయారుచేసిన శాస్త్రజ్ఞుడినే చంపి మరమనిషి పలాయనం!"
"న్యూ సిటీ మే ఆరవ తారీఖు!
అత్యంత సమర్ధంగా పనిచేసే రాబొట్స్ అనే మర మనుషులని డిజైన్ చెయ్యడంలో డాక్టర్ సంజీవ్ ప్రపంచ ప్రసిద్ధి పొందారు. ఆయన సృష్టించిన అధునాతనమైన రాబొట్స్ వల్ల ప్రజలకి దైనందిన జీవితంలో శారీరక, మానసిక శ్రమ చాలా తగ్గిపోయిందన్న సంగతి పాఠకులకి తెలుసు. ఆయన డిజైన్ చేసిన రాబొట్స్ మామూలు పనులన్నీ చెయ్యడమేకాక, సంగీతాన్ని కంపోజ్ చెయ్యడం, చిన్న చిన్న కవితలు అల్లడం లాంటి వినోదాలు కూడా కలిగించేవి.
ఆయన గత కొద్ది సంవత్సరాలుగా అత్యంత శక్తివంతమైన ఒక రాబొట్ ని రూపొందించే ప్రయత్నంలో మునిగిపోయి ఉన్నారు. ఇప్పటిదాకా వచ్చిన రాబొట్స్ కేవలం మనం 'ఫీడ్' చేసిన సమాచారాన్ని బట్టీ, మనం ప్రోగ్రాం చేసిన విధానాన్ని అనుసరించీ పనులు చేస్తున్నాయి. అలా కాకుండా పరిసరాలను గమనిస్తూ, తనంతట తాను సమాచారాన్ని గ్రహించి, ఆలోచించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలిగినంత మేథ గల కంప్యూటర్ అమర్చిన రాబొట్ ని తయారుచెయ్యాలని ఆయన సంకల్పించారు.
కానీ దురదృష్టవశాత్తు డిజైనింగ్ లో ఏదో ఊహించరాని లోపం జరిగి, ఆ రాబొట్ డాక్టర్ సంజీవ్ స్వాధీనంలో లేకుండా పోయిందనీ, మేధావిని పోలిన రాబొట్ కి బదులు దుష్టశక్తి లాంటి మరమనిషి ఉద్భవించిందనీ శాస్త్రజ్ఞులు భయపడుతున్నారు.
తనకు తోచినట్లు ఇష్టానుసారంగా ప్రవర్తించగల ఈ మెషిన్ మనిషి మనుగడకే ముప్పు తేగలదనీ, ఇలాంటి అనవసరమైన, అపాయకరమైన పరిశోధనలు చెయ్యడం సైన్సుతో చెలగాటమనీ, ఇది డాక్టర్ సంజీవ్ లాంటి విజ్ఞులు చెయ్యవలసినపని కాదనీ కొంతమంది శాస్త్రజ్ఞులు విమర్శించారు.
ఈ మరమనిషి మొదలుపెట్టిన మారణహోమంలో మొదటి సమిధ దాని సృష్టికర్త అయిన డాక్టర్ సంజీవ్ గారే కావడం విషాదకరం.
కీర్తిశేషులయిన శ్రీ సంజీవ్ ప్రవాసాంధ్రులు - ఇరవయ్యేళ్ళ క్రితం అమెరికాలో స్థిరపడిపోయారు. వీరికి గత సంవత్సరమే భార్యావియోగం కలిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. నిన్న సంజీవ్ గారి అంత్యక్రియలు న్యూసిటీ విద్యుత్ శ్మశాన వాటికలో ఆయన కుమారుడు అజిత్ చేతి మీదుగా జరిగాయి."
అక్కడిదాకా చదివి నిట్టూర్చింది అపురూప. సో డాక్టర్ సంజీవ్ ప్రవాసాంధ్రుడన్న మాట!ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా తెలుగు గడ్డని వదిలివెళితే తప్ప వెలుగులోకి రావడం లేదు చాలామంది మేధావులు!
ఈ ఆనవాయితీకి భంగం కలిగించి ఉన్నచోటే వెలుగు విరజిమ్ముతున్న ఒకే ఒక వ్యక్తి డాక్టర్ శోధన. ది ఫేమస్ జెనెటిక్ ఇంజనీర్ డాక్టర్ శోధన.
- తన తల్లి!
కొద్దిగా గర్వం లాంటిది మెదిలింది అపురూప మొహంలో.
టీవీ స్క్రీన్ మీద అక్షరాలు జరిగిపోతూనే ఉన్నాయి.
"డాక్టర్ సంజీవ్ గారి ఇంట్లో దొరికిన పేపర్స్ అన్నీ కూలంకషంగా పరిశీలించి చూడగా, వాటిలో తప్పించుకు పోయిన రాబొట్ ఫొటో దొరికింది. ఆయన ఈ మోడల్ కి "నరహరి" అని పేరు పెట్టారు. ప్రజలు అప్రమత్తంగా వుండడానికి గానూ దాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాం.
అక్షరాలు తొలగిపోయి దృశ్యాలు కనబడుతున్నాయి ఇప్పుడు.
రాబొట్ ఫొటో కనబడుతోంది.
 స్థూలంగా మనిషి ఆకారంలోనే వుంది అది. దాదాపు ఆరున్నర అడుగుల ఎత్తున బలిష్టంగా వుంది. పెద్ద తల, పెదిమలు సాగదీసి వెటకారంగా నవ్వుతున్నట్లు ఉన్నాయి. తళతళ మెరిసే పళ్ళ వరస.
డాక్టర్ సంజీవ్ కావాలనే అలా తీర్చిదిద్దాడో, లేదా అప్రయత్నంగానే అలా వచ్చేసిందో తెలియదుగానీ ఆ నవ్వు విషాన్ని చిలుకుతున్నట్లు వెగటుగా ఉంది. దట్టమైన కనుబొమ్మలు ముక్కు దగ్గిర కిందకి జారిపోయి కలుసుకుని ఆ రాబొట్ కి కోపిష్టి వాలకాన్ని తెప్పించాయి. నెత్తిమీద స్టీలు వైర్లతో చేసినట్లు కనబడుతున్న వెంట్రుకలు.
నరహరి!
అపురూప వెన్ను జలదరించింది. సగం మనిషీ, సగం సింహం రూపం గల అవతారంతో సామ్యం తెస్తూ సగం మనిషీ (!) సగం మెషినూ అయిన ఈ రాబొట్ కి అలాంటి పేరుపెట్టాడా సంజీవ్?
లేదా, ఆయన అనుకోకుండానే "నరులని హరించేది" అన్న ధ్వని వచ్చేసిందా ఆ పేరులో?
అయినా ఈ రాబొట్ ని అంత భయానకంగా కనపడేటట్లు తయారు చెయ్యడమెందుకు? ఈ సైంటిస్టులు ఒక్కోసారి చిన్నపిల్లలకంటే కష్టంగా ప్రవర్తించ గలరు!
ఆయన పిల్ల తరహా చేష్ట ఇప్పుడు పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందన్న మాట ప్రపంచానికి!
టీవీలో దృశ్యం మారింది.
ఫైబర్ గ్లాసుతో కట్టిన పెద్ద ఇల్లు కనబడుతోంది. తర్వాత ఇంటిలోపలి భాగం.
ఇల్లు చాలా అధునాతనంగానే ఉన్నా ఇంటినిండా ఏవేవో పరికరాలు కిక్కిరిసి పోయినట్లు కనబడుతున్నాయి.
విరిగిపోయిన బొమ్మలా అడ్డంగా మంచం మీదపడి ఉన్నాడు సంజీవ్.
దృశ్యం మెల్లగా క్లోజప్ లోకి మారింది. సంజీవ్ మొహం నల్లగా మాడిపోయినట్లు కనబడుతోంది.
భయంతో వళ్ళు గగుర్పొడిచింది అపురూపకి.
స్వయంకృతాపరాధానికి తక్షణ శిక్ష అనుభవించినట్లు దారుణంగా చనిపోయాడు డాక్టర్ సంజీవ్.
అతను చనిపోయినా అతను సృష్టించిన మహమ్మారి లాంటి మెషిన్ మాత్రం అదుపుతప్పి మనుషుల మధ్య పడిందా?
స్వయంగా అన్నీ పరిశీలించి, సమాచారం గ్రహించి, తనకు తోచినట్లు ప్రవర్తించగల మర మనిషా? అమ్మో!
'ఫ్రాంకెన్ స్టెయిన్ మాన్ స్టర్' లాంటి అభూతకల్పన నిజం కాబోతోందా?
న్యూ సిటీ విద్యుత్ శ్మశాన వాటిక కనబడుతోంది స్క్రీన్ మీద. డాక్టర్ సంజీవ్ అంత్యక్రియలకు పురప్రముఖులూ, సైంటిస్టులూ చాలామంది హాజరయ్యారు.
వారిమధ్య డాక్టర్ సంజీవ్ కొడుకు అజిత్. క్లోజప్ లో అతని మొహం కనబడుతోంది. కళ్ళలో తెలివితేటలూ, దయ, ప్రశాంతత గోచరిస్తున్నాయి. కానీ ఆ ప్రశాంతత వెనుక అణిచి పెట్టుకున్న విషాదం మెదులుతోంది. వయసుకి మించిన గాభీర్యం వుంది అతని వ్యక్తిత్వంలో.
ఎవరో పెద్దమనిషి తన భుజం చుట్టూ చేతులేసి సానుభూతి తెలుపుతుంటే వినయంగా ధన్యవాదాలు చెబుతున్నాడతను.
అతను గ్రీకు శిల్పంలా చాలా అందంగా ఉన్నాడు. క్రమం తప్పని ఎక్సర్ సైజ్ వల్ల ప్రతి కండరం ఇనుములా గట్టిపడినట్లు బలిష్టంగా ఉంది అతని శరీరం. ఆరోగ్యంగా బిగువుగా వున్న చెంపలు. ఆ చెంపలని కప్పేస్తూ గుబురుగా పట్టు దారాల పొదలా ఉన్న గెడ్డం. చేతులమీద, గుండెల మీద కూడా గుబురు వెంట్రుకలు.
మగతనానికి ఉదాహరణలా ఉన్నాడతను.

Next Page