TeluguOne - Grandhalayam
Paduchudanam Railubandi


                         పడుచుదనం రైలుబండి


                                              -కురుమద్ధాలి విజయలక్ష్మి

 

                                      


    పది నిమిషాలు-


    సరీగా పదినిమిషాలు నుంచి అటు రాజారావు ఇటు వందన చూపులతో మాట్లాడుకుంటున్నారు.


    తండ్రి కూతుళ్ళ మూకాభినయనం శారద చూడనూ లేదు. గ్రహించనూ లేదు. తన మానాన తను చందమామ తిరగేస్తున్నది.


    శారదకి పుస్తకాలు చదివే పిచ్చిలేదు. పుస్తకాలు ఎక్కువ చదివేవాళ్ళు పుస్తకాల పురుగులని ఓ రకం పిచ్చివాళ్ళని ఆమె గణభిప్రాయం. చందమామ లాంటివి తిరగేసి మరీ తోచకపోతే ఒక్క కథ చదువుతుంది. ఇంట్లో వున్న వివిధ సినిమా పుస్తకాలు తిరగేసి సగం గుడ్డలు, సగం సిగ్గు విడిచి వున్న సినిమా వాళ్ళ బొమ్మలు చూసి "వీళ్ళకి ఇంత పేరేమిటో?" అని బోలెడంత ఆశ్చర్యంతో ఆలోచిస్తుంది.


    రాజారావుకి భార్యమీద ప్రేమ, గౌరవం. ఆమె మనసునొచ్చుకునే పనులేమి చేయడు.


    వందనకి కూడా తల్లిమీద మహా ప్రేమ! తల్లిమాట కాదనలేదు. అలా అని ఆ కాలం పిల్లలా వుండనూ లేదు. తన అవసరానికి తండ్రి సపోర్ట్ తీసుకుంటుంది.


    విషయమేమిటో వందన ముందే మాట్లాడేసింది. రాజారావుకి పూర్తిగా ఇష్టం లేకపోయినా ఒక్కగానొక్క కూతురు వందనాదేవి మనసుకి కష్టం కలిగించటం మొదటకే అయిష్టం వల్ల "మీ అమ్మ ఊ...అంటే నేనూ ఊ...సరేనా!" అని మాట ఇచ్చేశాడు.

    "డాడీ! మళ్ళీ మాట మార్చొద్దు. మమ్మీ చేత నో...అనిపించే బాధ్యత మీది." అంది వందన.

    
    "ఆ అడిగేదేదో ముందుగ నీవు అడుగు. నీకు వంత పాట నేను పాడతాను ఓకేనా!"


    "అదేం కుదరదు. ముందు మీరు అడగండి, నేను పాడుతాను. వం...త...పా...ట" చిరుకోపంతో అంది వందన.


    లాభం లేదు అనుకున్న రాజారావు తనే తగ్గి "సరే, సరే" అనేశాడు. సరే అంటే సగం మాట ఇచ్చేసినట్లే.


    "మా మాంచి డాడీ!" ముద్దుగా అంది వందన.


    రాజారావు నవ్వి ఊరుకున్నాడు.


    శారద ఖాళీగ వుండటం చూసి తండ్రి కూతుళ్ళు నెమ్మదిగా అక్కడికొచ్చి పక్క పక్క సోఫాల్లో కూర్చున్నారు.


    మాట్లాడు డాడీ! నేను నీ పక్కనే వున్నా కదా! డోంట్ వర్రీ!" అని వందన చూపులతో సైగ భాషలో ధైర్యం ఇస్తూ తొందరచేస్తున్నది.


    "ఆగు తల్లీ! మాట్లాడుతా కదా! గొంతు సవరించుకోవాలి కదా!" అన్నట్లు చూశాడు రాజారావు.


    వాళ్ళరిరువురి మధ్య అలా పదినిమిషాలు కాలం గడిచిపోయింది.


    శారద ఇదేం గమనించలేదు. చందమామ తిరగేస్తూ రాజులకాలం నాటి కథల గురించి ఆలోచిస్తున్నది.


    రాజారావు ఎట్టకేలకి గొంతు సవరించుకుని పెదవి విప్పాడు. "శారదా! ఓయ్ శారదా!"


    "పిలిచారా!" చందమామలోంచి తలతిప్పి చూస్తూ అడిగింది శారద.


    "నేను పిలిచాననే కదా! "పిలిచారా?" అని ప్రశ్నించావ్. చాలా అర్జంట్. నీతో మాట్లాడాలోయ్!" రాజారావు అన్నాడు.


    "మీకు...నాకు అన్నీ అర్జంట్ పనులే. రిటైర్డ్ అయ్యారు కదా! ఏమీతోచక మీకన్నీ అర్జంటుగానే అనిపిస్తూ..." శారద అప్పుడే కూతుర్ని చూసింది. చూస్తూనే "ఓహ్! అర్థమైంది" అంది.


    "అర్థమైంది ఏమిటోయ్?" రాజారావుకు కుతూహలంగా అడిగాడు.


    "మీ ముద్దుల కూతురు ఇక్కడే ఉంది కదా! అదే విషయం."


    "అంటే!"


    "ఏమీ అర్థం కానట్టు అడగటం...ఆ అడగటం తీరులోనే తెలుస్తోంది. నాకు తెలుసులెండి మీ తండ్రీకూతుళ్ళ విషయం. నేను లేకుండా చూసి ఇరువురు మంతనాలాడతారు. ఓ నిర్ణయానికి కూడా వచ్చేస్తారు. ఆ తర్వాత నన్ను పిలిచి ఏమీ తెలీనట్టు విషయం ఎత్తుతారు. అవునా!"


    "అబ్బే! అలాంటిదేమీలేదు శారదా! మరి...మరి..."


    "ఆ నసుగుడే తెలుస్తోంది. విషయమేమిటో కానివ్వండి."


    రాజారావు చెప్పేలోపలే వందన అందుకొంది. "అదికాదు మమ్మీ!" అంటూ.


    "ఏది కాదు. ముందు ఆ "మమ్మీ అనే పిలుపు మానెయ్యమని ఎన్ని లక్షలసార్లు చెప్పాను. "అమ్మ" అన్న పిలువు నిక్షేపంగా ఉండగ మమ్మీలు డమ్మీలు దేనికి?" శారద విసుక్కుంటూ అంది.


    కొన్ని మాటలు...కొన్ని పిలుపులు శారద మనసుకి బొత్తిగా పడవ్. పడలేదు కదాని దిగమింగుకుని ఉండలేక అప్పటికప్పుడే అడిగేస్తూ ఉంటుంది.


Related Novels