Next Page 

సీతాచరితం పేజి 1


                                                         సీతాచరితం

                                                                    డాక్టర్ దాశరథి రంగాచార్య


                                           
            
    ఆలోచనామృతం


    హితం చేకూర్చేది సాహిత్యం. సాహిత్యం అనే పదంలోనే హితం వుంది. "హితం" అనే పదం కాస్త సున్నితమైనది. హితం అనే పదార్థాన్ని మనం అర్థం చేసుకోవాలంటే 'ప్రియం' 'హితం' రెంటిని బోల్చి చూడాల్సి వుంటుంది. ప్రియం అంటే అప్పటికి ఆనందం చేకూర్చేది. దానికి రానున్న పరిణామాలతో సంబంధం గాని ప్రయోజనంగాని లేదు. హితం అలాంటిది కాదు. అప్పటికి ఆనందకరమైనా, కాకున్నా భవిష్యత్తులో శ్రేయోదాయకమైంది హితం. ఈ హితం, ప్రియం, రెండింటి తేడా తేల్చుకోవడానికి ఉదాహరణగా ఒక రోగిని తీసుకుందాం. రోగి చేదుమందు త్రాగటానికి యిష్టపడడు. అలా అని అతనికి తీయని మందిస్తే లేదా మందివ్వకుండా వుంటే, తాత్కాలికముగా అతనికి సంతోషం కల్గేమాట నిజం. దాన్నే మనం ప్రియం అంటాము. అలా కాక వైద్యుడు బలవంతంగా అతనితో మందు త్రాగించి అతని రోగ నివారణకు ఉపయోగపడితే దాన్ని హితం అంటారు. అలా అంటున్నామంటే, హితం సర్వదా అప్రియమై వుంటుందని అర్థం కాదు. ప్రియమైన హితం కూడా వుండొచ్చు. మొత్తం మీద ప్రియం తాత్కాలికం కాగా, హితం దీర్ఘకాలికమని చెప్పొచ్చు. అలాంటి హితాన్ని చెప్పేది సాహిత్యం అనుకుంటే, సాహిత్యం తన పాత్రను హితం చేకూర్చడానికే వినియోగిస్తుందని అనుకోవచ్చు.


    సాహిత్య ప్రయోజనం హితం చేకూర్చడం అనుకున్నాం. అంటే సాహిత్యం హితకారి అని అర్థం. సద్యః ప్రియమైనదాన్ని చెప్పి తాత్కాలిక సంతోషాన్ని కల్గించడం మాత్రం సాహిత్య ప్రయోజనం కాదు. కారాదు. అలా అంటే సాహిత్యానికి ప్రియం చెప్పడం కంటే ఉన్నత లక్ష్యముందని అర్థం అందుకే-


    "అప్రియ్యస్యతు పథ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభః" అన్నారు వాల్మీకి. ప్రియం చెప్పేవారు అనేకమంది లభిస్తారు. అప్రియమైన హితం చెప్పేవాళ్ళు దుర్లభం అంటారు వాల్మీకి. సాహిత్యం అంత దుర్లభమైందే - సాహిత్యకారుడు లేక రచయిత అప్రియమైనా హితాన్ని చెప్పుతాడు. మన సాహిత్యంలో చాల భాగముంది హితం చెప్పేది. అందులో అప్రియమున్నా మనం దాన్ని అట్టే పట్టించుకోరాదు. ఏంచేతంటే హితం అనే గుణం ప్రియాన్ని కప్పిపుచ్చగల స్తోమత గలది. సాహిత్యం హితం చేకూర్చేది అనే నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ హితం ఎవరికి చేకూర్చాలి అని ఆలోచించాలి!


    మనది వ్యష్టి జీవనం కాదు. సమిష్టి జీవనం. "సహనావతు, సహనౌ భునక్తు, సహవీర్యం కరవాహ హై" అంటుంది వేదం. అంటే కల్సి పనిచేద్దాం. కలిసి యుద్దం చేద్దాం. ఒంటరిగా బ్రతకడం మన సంప్రదాయం కాదు. నల్గురితో ఆనందించడం, నల్గురు కలిసి పనిచేయడం మన సంప్రదాయం. మనం వ్యష్టి జీవులంకాము. సామాజిక జీవులం. సమాజం ఒక ప్రవాహం లాంటిది. అది నిరంతరం ప్రవహిస్తుంటుంది. దానికి అంతరాయం లేదు. వ్యక్తులు ఆ మహా ప్రవాహంలో బిందువుల్లాంటి వారు. ఈ బిందువులు వస్తుంటాయి. పోతుంటాయి. కాని ప్రవాహం ఆగదు. వ్యక్తిని మనం ఒక నూలుపోగు అనుకుంటే సమాజం ఆ నూలుపోగుత నేసిన బట్టలాంటిది. బట్ట మాన సంరక్షణ చేయగలదు. నూలుపోగుకు ఒంటరిగా ఆ శక్తి లేదు. ఒంటరిగా ఆ వ్యక్తి సమాజంలో అంతర్బాగమయినా, ఏ ఒక్క వ్యక్తి బృహత్తరమైన సమాజం కూడ కాలేడు. సమాజం ఒక వ్యక్తి ఎలాకాదో, ఒక వ్యక్తి సమాజం కూడ కాలేడు. సమాజం బృహత్తరమైంది. దానిని విశ్వరూపం. అది సార్వజనీనమైంది. సర్వకాలీనమైంది. అందుకే సమాజాన్ని గూర్చి చెబుతూ పురుష సూక్తము -


    "సహస్ర శీర్షాపురుషః స్రహస్రాక్ష సహస్రపాత్" అంటుంది. పురుష సూక్తకారుడు వ్యక్తిని గూర్చి చెప్పటం లేదు. సమాజాన్ని గూర్చి వివరిస్తున్నాడు. సమాజానికి వేల తలలుంటాయి. వేల కళ్ళుంటాయి. అంటున్నాడు. 'వేయి' అప్పటికి వారికి తెలిసిన సంఖ్య అయి వుంటుంది. అదే ఈనాడవుతే కోట్ల తలలు కోట్ల చేతులు కోట్ల కాళ్ళు అని వుండేవాడు.


    సమాజం వ్యక్తి కంటే విశిష్టమైంది. ఉన్నతమైంది. ప్రయోజనకరమైంది. శాశ్వతమయినది. సమాజంలో అంతర్భాగమయినవాడు వ్యక్తి. వ్యక్తి వ్యష్టిగానూ, సమిష్టిగాను, సమాజ జీవనానికి ఉపకరిస్తున్నాడు. ఐతే ఏ ఒక్క వ్యక్తి సమాజం కాలేడు. ఐనా వ్యక్తి ప్రాధాన్యతను, అతని శ్రమను, అతని త్యాగాన్ని మనం కాదనలేం, సమాజం కాదనలేదు. ఐతే అంచెలంచెలుగా ప్రాధాన్యతను గుర్తిస్తూపోతే వ్యక్తి కంటే సమాజం ప్రధానమయిందని మనకు అర్థమవుతుంది. అందుకు మనువు "త్యజేదేకం, కులస్వార్థే, కులం జనపద స్వార్థే" అన్నాడు.


    కులం యొక్క శ్రేయస్సు కోసం, వ్యక్తి శ్రేయస్సును జనపదపు శ్రేయస్సు కోసం, కులం శ్రేయస్సును వదలుకోమంటాడు. అంటే వ్యక్తి కంటే కులం, కులం కంటే జనపదం - ఒకదానికంటే ఒకటి ఉన్నతమయినవని అర్థం. ఈ విధంగా అన్నిటికంటే ఉన్నతమయినది సమాజం అని అర్థం చేసుకుందాం.


    ఇప్పుడు హితం చేకూర్చేది ఎవరికి అని ఆలోచిస్తే సమాజానికే హితం చేకూర్చాలి అనే నిర్ణయం తేలుతుంది. కాబట్టి సాహిత్యం సమాజానికి హితం చేకూర్చేదిగా వుండాలి. మన సాహిత్యం అనాదిగా సమాజ శ్రేయస్సును కోరేదిగా - అందుకు మార్గాలన్వేషించేదిగా - పథ నిర్దేశం చేసేదిగా వుంటున్నది.
    

    పరిణామం


    సమాజంతోపాటు మారడం సాహిత్య లక్షణం. సమాజం సజీవమైంది. సజీవమైన పదార్థాలు పరిణామానికి లొంగుతాయి. నిర్జీవమైన పదార్థాలకు పరిణామం లేదు. ఎల్లోరా శిల్పం, అజంతా చిత్రం సజీవములు కావు. కాబట్టి వాటికి పరిణామములు లేవు. ఒక అందమైన పూవు, ఒక అందగత్తె సజీవములు. కాబట్టి మొగ్గవేయడం, పూతపూయడం రాలడం అనే పరిణామాలకు లొంగుతాయి.


    సమాజం సజీవమైంది. కాబట్టి సదా పరిణామాలకు లొంగుతుంటుంది. సమాజం ఒక రాయి కాదు, బండకాదు, ఒక ప్రవాహం. పొంగటం, లొంగడం దాని లక్షణం. ప్రవాహంలో నీరుండే మాట నిజం. కాని ఎప్పుడు అదే నీరుండదు. నీటిని మార్చుకుంటూ, సదా ప్రవహించడం ప్రవాహలక్షణం. అదేవిధంగా సమాజం ఒక్కరకంగా వుండదు. ప్రగతి, పరిణతి సమాజ లక్షణం. సమాజం ఒక్కరకంగా వుండదు. ఒక్కరకంగా వుండదు. సమాజానికి, సాహిత్యానికి అవినావభావ సంబంధముంది. అవి ఒకదానితో నొకటి పెనవేసుకుని వుంటాయి. కాబట్టి సమాజం మారినప్పుడు సాహిత్యం మారుతుంది.


    వేదాన్ని మనం ప్రభుసంహిత అంటాము. అంటే అది శాసించి హితం చెబుతుందని అర్థం "సత్యం వద, ధర్మం చర" ఇది శాసనం. దీనికి వ్యక్తులు యిష్టానిష్టములతో పనిలేదు. వారు శాసనానికి విధేయులు కావల్సిందే. అంటే సాహిత్యానికి ప్రభువునకున్న బలం, వేదకాలములో ఉండింది. శాసనాన్ని ధిక్కరించినవాడు శిక్షకు గురికావల్సిందే. వేదం చెప్పింది శాసనం. ఆ శాసనాన్ని అనుసరించడం అందరి ధర్మం.


    భయపెట్టి జనాన్ని లొంగదీయడం, వారిని శాసనబద్దుల్ని చేయడం వేదపు మతం. ఐతే భయం కల్పించి ఎల్లకాలం రాజ్యం చేయలేం. భయాన్ని వదలడం మానవ సహజం. భయాన్ని ఎదుర్కోవడం మానవ లక్షణం. మానవుడు వేదాన్ని శాసనంగా అంగీకరించలేడు. కొంతకాలం గడిచిన తర్వాత, సాహిత్యకారుడు, మేధావులు ఆలోచించారు. మనిషిని మంచి మార్గాన నడిపించడానికి, అతని జీవితం ఆనందమయం చేయడానికి మార్గాలన్వేషించారు. భయం పనికిరాదని, నయానికి దిగారు.

Next Page