Next Page 

హ్యూమరాలజీ - 3 పేజి 1


                                 హ్యూమరాలజీ-3

                                                                                            -యర్రంశెట్టి శాయి

                                     


                                                          టెలుగూ గన్


                               


    నక్సలైట్స్ ని ఎదుర్కోటానికి భూస్వాములందరికీ గన్స్ ఇవ్వాలని ఎన్టీఆర్ కోరిక.

 

    ఆ కోరిక తీరాక ఆంధ్రప్రదేశ్ లో ఓరోజు మాకాలనీ మామూలుగానే రకరకాల సమస్యలతో హడావుడిగా వుంది. రంగారెడ్డి రిక్లెయిమ్డ్ హౌస్ సైట్ లో ఇల్లు ఎలా కట్టాలో నూట అరవై మూడోసారి ప్లాను గీస్తున్నాడు. శాయీరామ్ ఏ సాకు చూపి కాలనీ తాలూకు జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలా అని శతవిధాలా ఆలోచిస్తున్నాడు.

 

    జనార్ధన్ తను హీరోగా నటించిన ఫ్లాఫ్ సినిమా తాలూకూ వీడియో కాసెట్, అద్దె వి.సి.ఆర్ తీసుకొచ్చి రోజుకో ఇంట్లో బలవంతంగా చూపే స్కీమ కింద ఆరోజు పార్వతీదేవి ఇంట్లో క్యాసెట్ చూపిస్తున్నాడు.

 

    డిటెక్టివ్ రచయిత్రి రాజేశ్వరి తన లేటెస్ట్ నవల సబ్జెక్ట్ కోసం హిచ్ కాక్ సినిమా తాలూకూ రివ్యూ చదువుతోంది.

 

    యాదగిరి ఆంధ్రప్రదేశ్ తాలూకూ కుళ్ళు రాజకీయాల గురించి మా కాలనీ గూండాకి బలవంతంగా, విశదంగా చెప్తున్నాడు.

 

    గోపాల్రావ్ తమ 'ఈక్షణం' తెలుగు పత్రికకు 'ఆంధ్రప్రదేశ్ లో గూండాల స్వర్ణయుగం' అనే ఆర్టికల్ తయారుచేస్తున్నాడు.  

 

    చంద్రకాంత్ ఛటోపాధ్యాయ్ ప్రచురణకు నోచుకోని తన ఇరవై రెండవ నవల రాస్తున్నాడు.

 

    నేను మనకు స్వాతంత్ర్యం వచ్చిన్నాటినుంచి నేటివరకూ మన సైన్యానికి ఏయే దేశాలనుంచి ఏయే ఆయుధాలు మన ప్రభుత్వాలు కొన్నదీ, వాటిల్లో ఎవరెవరికి ఎంతెంత కమిషన్ ళు ముట్టిందీ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ సాయంతో రిసెర్చ్ చేయడం ప్రారంభించాను.

 

    ఇలా అందరం ఎవరి కార్యక్రమాల్లో వారు హడావుడిగా ఉండగా చాలా పెద్దగా 'ధడ్' మంటూ ఆటోమేటిక్ గన్ పేలిన శబ్దం వినిపించింది.

 

    అందరం అనుమానంగా బయటకు పరుగెత్తుకొచ్చాము.

 

    "శ్యామల్రావ్ ఇంటివేపు నుంచీ తుపాకి కాల్చిన శబ్దం వచ్చింది" అన్నాడు శాయీరామ్.

 

    అందరం శ్యామల్రావ్ ఇంటివైపు పరుగెత్తాం.

 

    అప్పటికే వాళ్ళింటి ఇరుగుపొరుగు వాళ్ళు గుమికూడి వున్నారక్కడ. శ్యామల్రావ్ ఇంటి తలుపులు మూసివున్నాయ్.

 

    "తప్పకుండా శ్యామల్రావ్ ఎవర్నో మర్డర్ చేసి వుంటాడు" అంది రాజేశ్వరి అనుమానంగా.

 

    రంగారెడ్డి వెళ్ళి గట్టిగా తలుపులు కొట్టి శ్యామల్రావ్ ని బిగ్గరగా పిలవసాగాడు.

 

    "శ్యామల్రావ్, శ్యామల్రావ్-శ్యామల్రావ్!"

 

    మరో అయిదునిమిషాల తర్వాత శ్యామల్రావ్ నెమ్మదిగా తలుపు తెరుచుకుని బయటికొచ్చాడు.

 

    అతని ముఖం పాలిపోయి వుంది.

 

    "ఏమిటి-మీ ఇంట్లో గన్ కాల్చిన శబ్దం వినిపించింది!" అడిగాడు రంగారెడ్డి.

 

    శ్యామల్రావ్ కళ్ళవెంబడి నీళ్ళు తిరిగినయ్.

 

    రంగారెడ్డి మీద వాలిపోయి భోరున ఏడ్చేయసాగాడు.

 

    అందరికి సస్పెన్స్ పెరిగిపోయింది. కొంతమందికి శ్యామల్రావ్ మీద జాలికూడా కలిగింది- పాపం ఏదో ఘోరం జరిగిపో వుంటుందని!

 

    "ఏమిటయ్యా! ఏడుస్తావేంటి? ఏం జరిగిందసలు?" అతనిని చిరాగ్గా వదిలించుకుని అడిగాడు రంగారెడ్డి.

 

    "ఇంకా ఏం జరగాలి రంగారెడ్డీ! ఇంక మేము ఎవరి కోసం బతకాలి రంగారెడ్డీ!" అంటూ మళ్ళీ భోరుమన్నాడు. మాకు సస్పెన్స్ మరింత పెరిగిపోయింది.

 

    వెనుకే అతని కొడుకు కూడా ఏడుస్తూ బయటికొచ్చాడు.

 

    "నాన్నా! మన ఇంటి దేవత దేవతల్లో కలిసిపోయింది నాన్నా! నేనూ ఇంత విషం తిని దాంతోపాటు పైకెళ్ళిపోతాను నాన్నా- ఇంత ప్రేమగా చూసుకున్నా- నీకు అప్పుడె దేవుడి పిలుపు వచ్చిందా రాజ్యలక్ష్మీ!" అంటూ నేలమీదపడి మట్టిలో పొర్లుతూ ఏడవసాగాడతను.

 

    మాకందరికి షాక్ తగిలినట్లయింది.

 

    రాజ్యలక్ష్మి ఎవరోకాదు, శ్యామల్రావ్ కోడలు. రెండు సంవత్సరాల క్రిందటే శ్యామల్రావ్ కొడుకుతో పెళ్ళయిందామెకి. పెళ్లయిన మర్నాటినుంచీ వాళ్ళు ఆమెను కట్నకానుకల కోసం నానాహింసలూ పెట్టడం మాకందరికీ తెలుసు. శ్యామల్రావ్, అతని భార్య, వాళ్ళబ్బాయ్, రెండో కొడుకూ కలసి ఆమెను చంపడానిక్కూడా ప్రయత్నాలు చేయడం తెలిసి మేమందరం వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది.

 

    "చూశారా! నేను చెప్పలేదూ! మర్డర్" అంది రాజేశ్వరి నెమ్మదిగా.

 

    "అదేమిటి! ఎలా చనిపోయిందామె?" అడిగింది పార్వతీదేవి అనుమానంగా శ్యామల్రావ్ ని.

 

    "ఎలాగని చెప్పను చెల్లమ్మా! చెప్పటానికి నోరు రావడం లేదు. నక్సలైట్స్ దాడి గురించి భయపడి గవర్నమెంట్ దగ్గర గన్ కొనుక్కున్నాను. ఆ గన్ ని జాగ్రత్తగా నా అల్మారాలో దాచి తాళం కూడా వేశాను. కోడలి సంగతి మీకు తెలిసిందేగదా! ప్రతి మంగళవారం వద్దంటున్నా వినకుండా ఇంట్లో వస్తువులన్నీ శుభ్రం చేసి నీట్ గా పెడుతుంది. అలవాటు ప్రకారం నా అల్మారాలోని సామాన్లన్నీ తీసి శుభ్రం చేస్తోంటే గన్ కనిపించింది. పాపం అది లోడ్ చేసి వుందని కూడా తెలుసుకోలేని అమాయకురాలు. దానిని శుభ్రంచేస్తూ పొరబాటున తన వేపు గురిపెట్టినప్పుడు ట్రిగ్గర్ కూడా గట్టిగా నొక్కి క్లీన్ చేయబోయింది. అంతే! క్షణాల్లో ప్రాణంపోయింది..."

 

    మా కందరికీ ఠక్కున అర్థమయిపోయింది.

 

    కోడలిని గన్ తో కాల్చిచంపి మాకీ కథ అల్లి చెప్తున్నారు వాళ్ళు.

 

    "ఇదిగో శ్యామల్రావ్! నీయవ్వ- ఎంతమంచి కథల్జెప్పినావ్ రా భాయ్! నీ కోడలు గన్ గిట్ట శుభ్రం చేస్తుంటే అచానక్ గోలి ఎళ్ళినాది? మా చెవుల్లో పూలుపెట్టుకుని వున్నామనుకున్నావ్?" హేళనగా అన్నాడు యాదగిరి.

 

    "నాకు తెలుసయ్యా! ఇంతమందిలో ఎవరొకళ్ళు నీలా బురద జల్లుతారని నేను యిందాకే అనుకున్నా! రండి! మీరే చూడండి! ఆమె చేతిలో గన్ ఇంకా అలాగే వుంది. అదిచూస్తే మీకు క్లియర్ గా తెలిసిపోతుంది. మీరే నా మాటలు నమ్ముతారు అప్పుడు" బాధ నటిస్తూ అన్నాడు.

Next Page