TeluguOne - Grandhalayam
Gorintaku

       
                                              గోరింటాకు

 

                                               -కొమ్మూరి వేణుగోపాలరావు

 

                    

 

    చెడిపోయినవారి చరిత్రలన్నీ ఒక్కమాదిరిగా వుండవు. వాళ్ళ జీవితాలను తిరగేస్తే వాటినుండి ఏరుకోవలసిందికూడా కొంత కనిపిస్తుంది. అసలు చెడిపోవటంకూడా అందరికీ సాధ్యంకాదు. ఈ భూమ్మీద కొందరు బుద్ధిమంతులుగా వుండడానికి కారణం వాళ్ళకు చెడిపోవడం చేతకాకపోవడమే.

 

                                          * * *

 

    జీవితంలో ఎక్కడెక్కడివాళ్ళూ వచ్చి ఎప్పుడో ఎలాగో కలుసుకుని ఒక్కటిగా అయిపోతుంటారు. దీనినే స్నేహమనే పేరుతో పిలుస్తారు. దీన్ని చూసే పిల్లల తల్లిదండ్రులు భయపడేది కూడా.

 

    అలా జీవితప్రవాహంలో కొట్టుకువచ్చి తమ తమ పదిహేనవయేట ఒకరినొకరు ఢీకొన్నారు చక్రపాణి, రాజారావు. ఆ దెబ్బకి ఇద్దరి తలలు బొప్పెలు కట్టాయి. కాసేపు ఒకరివంక ఒకరు కోపంగా చూసుకున్నారు. తరువాత వాళ్ళకు తెలియకుండానే నవ్వేశారు. అప్పటికి మట్టుకు ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు మరునాడు అనుకోకుండా కాఫీహోటల్లో తారసపడి పలుకరించుకున్నారు. రాజారావు తాను బలవంతంగా బిల్లు చెల్లించాడు. మరోనాడు సినిమాహాలు దగ్గర కలుసుకున్నారు. తరువాత రోజూ ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళారు. ఆ మరుసటివారం 'అండీ' అల్లాపోయి, 'ఏమోయ్' అనుకున్నారు. తరువాతవారం భుజాలమీద చేతులు వేసుకు తిరిగారు.

 

    చక్రపాణి ఎర్రగా, పొడుగ్గా, బక్కపలుచగా ఉండేవాడు. అతని సిగ్గు, అమాయకత్వం ఒక విధంగా అతన్లో ఆకర్షణ. ఎప్పుడూ తన వయస్సుకన్నా చిన్నగా, లేతగా కనిపించేవాడు. నవ్వితే అది చిరునవ్వు. ఆడపోలికలు కనిపించేవి.

 

    అతని చిన్నతనం సామాన్యమైనది. సామాన్యమైనదికూడా విచిత్రమైనదాని క్రింద జమ - చిత్రంగా వుండటం జీవితానికి సహజం కాబట్టి.

 

    చిన్నప్పుడు అతనికో అలవాటు వుండేది. వారానికీ, పదిరోజులకీ ఒకసారి ఏ క్లాసులో కూర్చున్నప్పుడో జీవితమంటే భయంవేసేది. మెల్లిగా వొణికిపోయేవాడు. క్రమంగా నా అన్నవాళ్ళవీ, పిదప తనదీ చావులు వికృతంగా ఊహించుకునేవాడు. అసలే కొంచెం అర్భకుడు. ఆలోచన్ల తుఫాన్ లో నానాహైరానా పడిపోయేవాడు. ఎప్పుడూ చూడని శ్మశానవాటిక, ఎప్పుడో చూసిన గారడీవాని చేతిలోని బొమికల్లో కనిపించే జలపాతాల్లోని నీటితుప్పరా, ఏవో రంగురంగుల దృశ్యాలలా కళ్ళముందు నడయాడి కంగారుపెట్టేవి. చావు, అమ్మో! చావు. వాళ్ళూ, వీళ్ళూ ఎగిరిపోతున్నప్పుడు నాకూ ఇది తప్పదు ఎన్నడో, అని అనుకుంటూ వుండగానే ఏ దారుణ క్షణంలోనో యముడువేసిన పాశం తన గొంతుకచుట్టూ చుట్టుకొని బరబర ఈడ్చుకుపోతుంది.   

 

    చావునూ, నిద్రనూ పోల్చుకుంటూ వుండేవాడు. రాత్రిళ్ళు నలుగురి మధ్యా పడుకుని నిద్రవస్తే ఎలాగూ తెలివి తప్పిపోతుంది. తెలివి తప్పిపోతే తనను గురించి తనకు తెలియదు. తెల్లారేవరకు తను ఎవరో, ఎక్కడ ఉంటాడో! అమ్మో! స్మృతి లేకపోతే ఎలా? నిద్రకు భయపడి కళ్ళు బలవంతాన తెరుచుకుని జపం చేసేవాడు.

 

    ఎవడికైనా చెడుగా ఆలోచించడం తప్పదేమో. అప్పుడప్పుడు క్లాసులో పాఠాలు వినడం మానేసి 'మా అమ్మ చచ్చిపోయాక నాన్నారు మళ్ళీ పెళ్ళిచేసుకుంటారా? అప్పుడు సవతి తల్లికీ నాకూ పడుతుందా? నేను గుండు చేయించుకోవాలా? చేయించుకుంటే అద్దంలో నా ముఖం యెలా వుంటుంది?" అన్న దరిద్రపు వూహల్లో మునిగిపోయేవాడు.

 

    ఇద్దరు మగపిల్లలు పుట్టిపోయాక దక్కినవాడు కావడంవల్ల, ఆ తరువాత మగసంతానం లేని కారణంచేత వాళ్ళ ఇంట్లో బలే గారాబం. అతను జన్మించాకే ఆ కుటుంబానికి అదృష్టం పట్టిందనీ, అప్పట్నుంచీ వాళ్ళ తండ్రి పట్టిందల్లా బంగారం అయిందనీ అతనిముందే చెప్పుకోవటం కద్దు. ఇరుగుపొరుగు వున్న వాళ్ళంతా బీదవాళ్ళు. ఇతర కులాలవాళ్ళే. అక్కయ్యలతో ఆడుకుంటానికి చాలామంది ఆడపిల్లలు వస్తూండటం, వాళ్ళతో తనూ కలిసి ఆడుతూ ఉండేవాడు కాబట్టి ఆడపిల్లలతో చెలిమి అలవాటయింది. వాళ్ళంతా తనకంటే పెద్దవాళ్ళు. తను పదకొండేళ్ళ వయసులో ఉన్నప్పుడు తనకంటే పెద్దవాళ్ళుంటే వేరే చెప్పేదేముంది? మొగుడూ పెళ్ళాల ఆటలు ఆడేవాళ్ళు. పురుషుడనేవాడు తాను ఒక్కడే కాబట్టి మొగుడి పాత్ర యెప్పుడూ తనదే. పెళ్ళాం మటుకు రోజుకు ఒకరుగా మారుతూ వుండేవారు. ఒక్కొక్కసారి నేనంటే నేనని పోటీపడి జుట్టూ జుట్టూ పట్టుకుని పీక్కునేవాళ్ళు. అతని పెళ్ళాలతో కొంతమంది ఇదివరకే పెళ్ళయినవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మిగతావాళ్ళతో సమానంగా ఉత్సాహంగా ప్రదర్శించేవాళ్ళు . శాస్త్రయుక్తంగా ఉత్తుత్తి మంత్రాలతో వివాహపుతంతు ముగిసిపొయ్యేది. తరువాత ఏవో తినుబండారాలతో విందు. పెళ్ళికొడుకునీ, పెళ్ళికూతురునీ ఒక సరసన కూర్చోబెట్టి సరసాలు, వేడుకలు గంధాలు పూయించటం, ఒకళ్ళ యెంగిలి ఒకళ్ళకు తాగించడం, ఇలాంటివి. తరువాత అతను ఉద్యోగంలో ప్రవేశించాలి. ఇంటికి ఆలస్యంగా వచ్చి తలుపు తట్టాలి. ఇంత ఆలస్యమయితే ఎలా చచ్చేది బాబూ! అని ఆమె అలుగుతుంది. అతను బ్రతిమాలడం. ఇదీ తంతు.  

 

    కాలం మార్పు తెచ్చిపెడుతూంది కదా! క్రమంగా ఆడపిల్లల్ని చూస్తే సిగ్గుతో చచ్చినచావై అక్కడినుండి పారిపోతుండేవాడు. తరువాత తరువాత అతన్ని చూచి వాళ్ళే పారిపోతుండేవాళ్ళు.

 

    కష్టపడి చదవటమంటే అంతగా తెలియదు. ప్రయివేటు వుండేది. మార్కులు బొటాబొటిగా వస్తూండేవి. స్కూల్లో రకరకాల విద్యార్థులు తనతో చెలిమి చేస్తూండేవాళ్ళు. జేబులో ఒకటీ, రెండూ వుండేవి కాబట్టి ఏవో నెపాలతో ఖర్చుచేస్తూ వుండేవాళ్ళు. తానేదో అమాయకుడనని తనకు తెలుస్తూ వుండేది. ఇరుగుపొరుగు మూకతో గోలీకాయ లాడేవాడు. బెచ్చాలాడేవాడు. (అతనంటే చిన్నవయస్సులో ఆడపిల్లలతో చింతపిక్కలు, అచ్చంగాయలు ఆడేవాడు) గాలిపటాలెగురవేసేవాడు. కాని ఎందులోనూ ప్రావీణ్యంలేదు. ఇంటిచుట్టూ ఎప్పుడూ దెబ్బలాటలు జరుగుతూండేవి. ఆడాళ్ళూ మగాళ్ళూ కొట్టుకునేవాళ్ళు. ఆడాళ్ళూ ఆడాళ్ళూ కొట్టుకునేవాళ్ళు. మగాళ్ళూ మగాళ్ళూ సరేసరి. ఒక ఆడది మరో ఆడదాన్ని బూతులు తిడుతూంటే బలేగా ఉండేది. వాళ్లు కాసేపు మగాళ్ళయేవాళ్ళు. చివరకు తీర్పుకు వీళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు.

Related Novels