Next Page 

ఆలోచన ఒక యజ్ఞం పేజి 1


                                                  ఆలోచన ఒక యజ్ఞం
                                        __________________________________    
                                                    అందులోంచి అద్భుత జీవితం!
                

    
                                                                               --డా|| కొమ్మూరి వేణుగోపాలరావు
    
                                       

 

   ఈ సంవత్సరంలో నా సాహిత్యజీవితంలో చిరస్థాయిగా గుర్తుంచుకోదగిన రచన చేయాలని నాలో తపన బయలుదేరింది. ఇంతవరకూ ఎన్నో నవలలు రాశాను. కొన్ని వందల కథలు రాశాను. ఏమన్నా సాధించానా? తెలీదు. నాకు చేతనైనంత వరకూ నా రచనల్లో అన్నిరకాల అంశాలూ స్పృశించాను. మధ్యతరగతి కుటుంబాలు, ఉమ్మడికుటుంబాలు, మానవ నైజాలలోని బలహీనతలూ, మనస్తత్వాల లోతులూ, మెడికల్ ఫిక్షన్, నాకు తెలిసినంత వరకూ అట్టడుగు జీవితాలూ....ఎప్పుడూ వైవిధ్యం కోసమే శ్రమించాను. నాకు గుర్తింపు వచ్చిందా, నేనాశించిన రావలసినంత గుర్తింపు వచ్చిందా? తెలీదు. ఆదరణ లభించిందా? తెలీదు.
    
    జీవితంలో అందరికీ అన్నీ జరగవు. ఈ సత్యం సమయం మించిపోయాక తెలుసుకుంటాం. ఇది మామూలు సత్యంకాదు. మహాసత్యం!
    
    ఈ మథనంలోకి తర్వాత వెడదాం. ఇప్పుడు మనం గుర్తింపు గురించి మాట్లాడుకుంటున్నాం.
    
    గుర్తింపు
    
    ఈ అంశానికి జీవితంలో చాలా ప్రాధాన్యం వున్నది. మీరు మీవంతు బాధ్యతగా కృషినో, శ్రమనో ధారపోస్తున్నప్పుడు అది ఓ కర్తవ్యంగా భావించాలి కాని, 'గుర్తింపు'ను ఆశించటం దేనికి? అన్న ప్రశ్న మేధావులమని చెప్పుకునేవారే వేస్తూవుంటారు. ఈ ప్రశ్న వినటానికైతే బావుంటుంది కానీ, ఇందులో నిజాయితీ లేదు. సహజత్వం లేదు. ఆచరించటానికి సాధ్యం కాకుండా ఎదుటి వ్యక్తిని నిందితున్ని చేసే ఓ ప్రకర్ష.
    
    కొంతమంది అమలు చేయటానికి సాధ్యంకాని విషయాలనే తరచూ ప్రస్తావిస్తూ, తద్వారా తమ ప్రత్యేకతను ప్రదర్శిస్తూ వుంటారు. వాటిలో ఇదొకటి.
    
    ఓ కళాకారుడు జీవితమంతా కళాసాధనతో, కళారాధనతో, అందులో విజయం కోసం ఆరాటంతో, పోరాటంతో, తపనతో మునిగితేలుతూ వుంటాడు. అతడి మనసు ఆ తపస్సులోని ఫలితం కోసం, అంటే గుర్తింపు కోసం తహతహ లాడుతూ వుంటుంది.
    
    అది తప్పా?
    
    అతనిలో గొప్పశక్తి నిక్షిప్తమై వున్నప్పుడు ఆ శక్తిని గుర్తించవలసిన ఆవశ్యకత సమాజానికెంత వున్నదో, ఆశపడవలసిన అవసరంకూడా అంతే వున్నది.
    
    అలాగే... తన క్రీడా జీవితంలో ఉన్నతశిఖరాలను చేరుకోవడంకోసం ఉవ్విళ్ళూరే ఓ క్రీడాకారుడు, నటుడు లేక నటి, వృత్తిధర్మాన్ని తపస్సుగా భావించే వ్యక్తి.... ఏ రంగానికి చెందినవారైనా కానివ్వండి. అనుక్షణం గుర్తింపుకోసం తపిస్తూ ఉంటారు.
    
    అంతవరకూ ఎందుకు? చిన్న చిన్న విషయాలలో మన మనసుకు బాధకలిగించే నిత్యసంఘటనలు అనేకం జరుగుతూ వుంటాయి.
    
    ఒకరింటికి మనం భోజనానికి పిలిస్తే వెడతాం. పాపం, ఆ ఇల్లాలు ఎంతో శ్రమించి, మనను సంతోషపెట్టాలని తన మనసంతా అందులో నిమగ్నం చేసి వొండుతుంది. మన సంస్కృతి ఏమిటంటే, మనను ఎదుటివారు సంతోషపెట్టినప్పుడు కానీ, గౌరవించినప్పుడుకానీ, చల్లటిమాటతో కృతజ్ఞత చెప్పటం భోజనాలైనాక కొంతమంది నిండుమనసుతో ఆ బాధ్యతను నిర్విర్తిస్తారు. కొందరు మనస్సులో ఆ భావమున్నా దాన్ని బయటికి వ్యక్తం చేయాలన్న ధ్యాస వారికీ వుండదు. మరికొందరు యాంత్రికంగా తిని వెళ్ళిపోతారు, ఇవన్నీ ఆ గృహిణి మనసుమీద పనిచేసి సంతోష పడేలా చేయటమో, విముఖత కలగజేయటమో చేస్తాయి.
    
    గుర్తింపు కోరుకోవటం అవసరమా? గుర్తింపుకోసం మనిషి ఆరాటపడటం, అలా కోరుకోవటం అల్పత్వమవుతుందా? అన్న విషయాలు ఈ ప్రాథమిక దశలో చర్చించదలుచుకోలేదు. ఈ గ్రంథంలో నేను సామాన్య మానవుడి దృక్పథాల గురించీ, ప్రాక్టికల్ గా వుండే విషయాలగురించే ఎక్కువగా చర్చించదలిచాను, ఈ సందర్భంలో ఇంకో సత్యంకూడా మీ దృష్టికి తీసుకురావాలని విద్య, ఆర్ధిక, ఉద్యోగ, వృత్తి, వ్యాపారహోదాలను బట్టి ఒకరు రకరకాల స్థాయిల్లో వున్నా వారిలో చాలామంది ఆలోచన సరళిలో సామాన్యులే ఎందుకంటే మనిషి ఏ అంతస్థులో వున్నా లోలోపల సామాన్యుడుగానే వుండిపోతాడు కాబట్టి! అంతకన్నా ఇంకోరకంగా వుండటం సాధారణంగా సాధ్యంకాదు కాబట్టి.
    
    నాకు జటిలభాష రాయడం ఇష్టంలేదు. నిజం చెప్పాలంటే జటిలంగా రాయటం చేతకాదు కూడా ఎంత క్లిష్ట విషయాలనైనా, ఆలోచనాత్మక అంశాలనైనా, సరళభాషల్లో సహజమైన తీరులో రాయగలగాలి. అప్పుడే ఆ భావాలు పాఠకుడి హృదయాన్ని తాకగలుగుతాయి.
    
    సమయం, సందర్భం లేని కవితాధోరణి, అవసరమున్నా, లేకపోయినా శిల్పచాతుర్యంతో కూడిన వర్ణనలూ, కొంతవరకూ అందంగానే కనబడవచ్చు కానీ, అవి విషయానికీ, పాఠకుడికీ మధ్య అడ్డుగా నిలుస్తాయి. విసుగుపుట్టిస్తాయి కూడా. గొప్ప గొప్ప తత్త్వవేత్తల గ్రంథాలు చదవాలని ఎంతో ఆసక్తిగా సేకరించి, చదవటం మొదలు పెట్టాక, పేజీపేజీలో, ప్రతి అధ్యాయానికీ మొదట ఏవో దృశ్యాలను వర్ణించుకుంటూ పోవటం, తర్వాత చర్చించబోయే అంశానికీ, ఈ వర్ణనకూ సంబంధం లేకుండా వుండటంతో ఆయా గ్రంథాలను చదవలేకపోయాను.
    
    ఇది జీవితాలకు సంబంధించిన గ్రంథం. అందుకని ప్రతివాక్యం, ప్రతి అక్షరం సూటిగా, స్పష్టంగా రాయదలిచాను. ఇందులో ఎవరెవరివో విజాతీయుల పేర్లూ, ఉపమానాలు వుండవు. వాటిజోలికి నేను పోదలచుకోలేదు. ఇక్కడ విజ్ఞాన ప్రదర్శన లేదు నాకు తెలిసిందీ, నాకున్న జీవితానుభవంతో నేనాలోచించగలిగిందీ మీముందు సవినయంగా విశదీకరించదలచాను.
    
    ఈ గ్రంథం రాయటంలో ముఖ్యోద్దేశమున్నది. గుండెలను తొలిచే తపన వున్నది.
    
    ఏమిటా ముఖ్యోద్దేశం?
    
    ఏమిటా తపన?
    
    మనిషి చాలా శ్రమిస్తున్నాడు. కష్టపడుతున్నాడు. కొంతమంది కష్టానికి తగిన ఫలితం పొందుతున్నారు, కొంతమంది పొందరు. ఎందుకని? ఎక్కడ వుంది లోపం? చేతకాకనా? అదృష్టం లేకనా? కాలం కలిసిరాకనా? సమన్వయలోపమా?
    
    అసలు చాలా చాలా వున్నా మనిషి ఎందుకు సుఖపడలేకపోతున్నాడు? చాలా సాధిస్తాడు. చాలా వుంటాయి. కొంతమందికి ఎప్పుడూ అపజయాలే జీవితంలో ఎప్పుడూ ఓడిపోతూనే వుంటారు.
    
    మనిషి సుఖపడలేకపోతున్నాడు.
    
    అవును మనిషి సుఖపడలేకపోతున్నాడు.
    
    ఈ విషయం నా మనసును చాలా బాధపెడుతోంది.
    
    సుఖం!!
    
    దీనిమీద అందరికీ ఎంతో ఆశవుంది. ఆసక్తివుంది. దాన్ని ఆస్వాదించాలని, అనుభవించాలనీ ఉవ్విళ్ళూరుతుంటారు అది అందరికీ కావాలి. దానికి అనేకమైన పేర్లు పెట్టుకుంటూ వుంటారు. రూపాలు కల్పించుకుంటూ వుంటారు.
    
    సుఖం అప్పుడప్పుడు అందుతూ వుంటుంది. అందినట్లే అంది జారిపోతూ వుంటుంది. లేకపోతే తన వునికిని సుస్థిరం చేసినట్లు కనబడుతూనే, యింకోరూపంలో దుఃఖాన్ని కలిగిస్తూ వుంటుంది.
    
    జీవితంలో ఎన్నో చూశాను. జయాలనూ, అపజయాలనూ అనుభవించాను. ఎందరి జీవితాలనో అధ్యయనం చేశాను. ఇప్పుడు..... ఈ దశలో.... ఎన్నో విషయాలు నా మనసును కలచివేస్తున్నాయి.
    
    అబ్బ! కొన్ని సందర్భాల్లో మనుషులు ఎంత అసహ్యంగా ప్రవర్తిస్తూ వుంటారు! (బహుశాఆ జాబితాలో నేనూ వుండివుంటాను)
    
    కుటుంబవ్యవస్థ, సంబంధబాంధవ్యాలు, ప్రేమలు, పెళ్ళిళ్ళు, స్నేహాలు, వృత్తి ధర్మాలు, ఆధ్యాత్మికచింతనలు, వ్యసనాలు, వ్యాపకాలు, నైతికవిలువలు, ఆడంబరాలు, అసహజాలు, అలవాట్లు పెనుతుఫానులాంటి ఆర్ధికప్రమాణాలు, ఆత్మహత్యలు, జీవిత చరిత్రలను మార్చేసే కొన్ని మరణాలు, నమ్మకాలు, మూఢనమ్మకాలు, తెలివి, అక్రమ సంబంధాలు, దురలవాట్లు, కాఠిన్యాలు, వ్యంగ్యాలు, ద్వేషాలు, శాడిజాలు, అధిక ప్రసంగాలు, ఉడుకుమోతుతనాలు, స్వార్ధాలు, అర్ధం పర్ధంలేని త్యాగాలు, పసలేని వ్యాపకాలు, తప్పించుకోలేని శారీరకరుగ్మతలు, అయిన దానికీ, కానిదానికీ టెన్షన్లు, ఇతరుల జీవితాల్లో దూరటాలు, ఇతరులను ఇబ్బందిపెట్టే ఉచిత సలహాలు, మితిమీరిన కర్మకాండలు, విరుచుకుపడే నిస్సహాయతలు, వృద్దావస్థలోని నిస్సహాయతలు, ఆత్మవంచనలు, ఆత్మన్యూనతలు, సెల్ఫ్ పిటీలు, అహంకారాలు....!

Next Page