Next Page 

మేడలో నీడలు పేజి 1


                                  మేడలో నీడలు

                                                                      _ కొమ్మూరి వేణుగోపాలరావు

 


    నాలుగు రోడ్లు కలిసేచోటుకు కొంచెం ఎడంగా ఓ దేవాలయం వుంది. అది వేణుగోపాలస్వామి దేవాలయం. ఆలయానికి సమీపంలో ఓ పెద్ద మేడ వుంది. ఆ సందులోకల్లా పెద్దమేడ అదే.

 

    మేడ యజమాని విశ్వనాథరావుగారు పైన కిటికీదగ్గర నిలబడి ఉదయం ఎనిమిది గంటలవేళ బయటకు అవలోకిస్తున్నారు.

 

    ఆ సందు పొడుగునా ఎదురుగా ఆక్రమించుకుని వున్న పెద్ద చెరువులోని నీళ్లు సూర్యకాంతికి మిలమిలమెరుస్తున్నాయి. ఆ నీరెండకు తళతళలాడుతున్న గుడిగోపురం బంగారుకాంతుల నీడ, ఎదురుగుండా మెరిసే నీటిలో అందంగా కదలాడుతోంది.

 

    కాకినాడ పట్టణంలోని అందం అదే. ఎక్కడికక్కడ ప్రశాంతత, స్తబ్దత. కొద్దో గొప్పో ప్రకృతి సౌందర్యం.

 

    ఆ రమణీయకతను అనుభవిస్తూ ముగ్ధుడవుతున్నారు విశ్వనాథరావుగారు.

 

    కొద్దిరోజులుగా గుళ్లో బాజాలు జరుగుతున్నాయి. అందుకని ఆలయంలోని హడావుడితో, వచ్చీపోయె జనంతో ఆ ప్రాంతమంతా సందడిగా వుంటోంది. రోజూ ఒక పెద్దమనిషి అయిన ఖర్చుని భరిస్తూంటాడు. పులిహోర, చక్రపొంగలి ఆ చుట్టుప్రక్కల ఇళ్ళన్నిటికీ పంచిపెట్టబడుతూ వుంటాయి.

 

    ప్రొద్దున్నే గుడిపూజారి వచ్చి మరునాడు వంతు తమదే అని విశ్వనాథరావుగార్ని హెచ్చరించి వెళ్ళాడు.

 

    ఆయన సిగరెట్టు కాలుస్తూ ఆలోచించసాగాడు.

 

    ఇంతలో వెనకనుండి "ఏమండీ!" అన్న పిలుపు సన్నగా వినవచ్చింది.

 

    ఆయన తాపీగా పొగవదిలి "ఏమిటి" అన్నాడు వెనక్కు తిరక్కుండానే.

 

    "అబ్బాయి యివాళ కూడా రానట్లేనా?" అనడిగింది లలితమ్మగారు.

 

    "అట్లాగే కనబడుతోంది. వెళ్ళినవాడు ఇంతవరకూ ఉత్తరమూ రాయలేదు. ట్రైన్ టైంకూడా అయినట్లుంది" అన్నాడాయన.

 

    వెనకనుండి ఓ నిట్టూర్పు వినబడింది.

 

    ఆయన చకితుడై ఇటుతిరిగి భార్యకేసి విస్మయంగా చూస్తూ "లలితా! ఎందుకే ఈ దిగులు?" అన్నాడు.

 

    "అబ్బే! ఏమీ లేదండి..." అని లలితమ్మగారు తప్పించుకోజూసింది.

 

    "నాకు తెలుసులేవే" అన్నాడు విశ్వనాథంగారు. సానునయంగా భార్యదగ్గర కొచ్చారు.

 

    ఆవిడ తలవంచుకుని బాధగా ఆలోచిస్తోంది.

 

    "లలితా!"

 

    ఆమె తల ఎత్తి చూసింది.

 

    "వెనకటి రోజులే బాగున్నాయనిపిస్తుంది నాకు."

 

    లలితమ్మగారు ఒకసారి గతంలోకి పోయింది. బాగున్నాయా అవి నిజంగా? లేక ఇదో ఆత్మవంచనా? ఎప్పటికప్పుడు ఇలా అనుకోవటం భ్రమ కాదా? ఏం చూసింది తాను గతంలో?


    
    "ఏమిటి ఆలోచిస్తున్నావ్?"

 

    లలితమ్మగారు చప్పున తేరుకుని "అదే... మన రామం గురించి" అన్నది.

 

    ప్రపంచంలోని గొప్పసత్యాలలో ఒకటేమిటంటే బాంధవ్యంలోని రాగద్వేషాలు. ఇటీవల కొన్నిరోజులుగా పెద్దకొడుకు రామానికీ తలిదండ్రులకి మధ్య మనఃక్లేశంలాంటిది వచ్చిపడింది. బాధపడుతూనే అహంభావ ప్రదర్శనం చేయడం మానవ నైజం. అలాగే ఇక్కడా జరుగుతోంది.

 

    రామానికి పాతికేళ్ల వయస్సుంటుంది. చూడటానికి ముచ్చటగా వుండే రూపం అతనిది. అతను చిన్నప్పటినుంచీ కొంచెం స్వేచ్చా ప్రవృత్తితోనే పెరుగుతూ వచ్చాడు. కాని అతని స్వేచ్చా ప్రవృత్తి బయటకు విచ్చలవిడిగా కనిపించేది కాదు. అందువలన తల్లిదండ్రులు అది హర్షించటమా, హర్షించక పోవటమా అన్న ప్రశ్న ఎప్పుడూ రాలేదు. అతను ముఖాముఖి అంతవరకూ తల్లిదండ్రుల్ని ఎప్పుడూ ఎదిరించలేదు. అసలు తండ్రిముఖం ఎదుట సాధారణంగా కనిపించేవాడు కాదు కూడా. ఆయన గదిలోకి వస్తే తను యీ గదిలోకి వస్తూండేవాడు. ఇంటర్మీడియట్, బి.ఏ. చదివే రోజుల్లో కూడా తనకు కావలసిన డబ్బు తల్లిని చాటుగా మాటుగా అడిగి తీసుకోవటమే గాని తనకిది కావాలని తండ్రినెప్పుడూ అడిగి ఎరుగడు. అతను ఇంటర్ ప్యాసైన రోజుల్లోనే వచ్చిపడింది సమస్య. కుమారుడ్ని యింజనీరింగు చదివించాలని ఉబలాటపడ్డాడు ఆయన. రామానికది ఇష్టంలేదు. అతని బాల్యంలో అతనికి డాక్టర్ చదవాలని వుండేది. కాని ముందు వెనుకలు ఆలోచన లేకుండా లెక్కలగ్రూపు తీసుకోవటం వలన ఆ అవకాశం లేకుండా పోయింది.

 

    రామం పెద్దకొడుకు కావటంచేత అతనిమీద యెన్నో ఆశలు నిర్మించుకోవటం వాళ్ళకు సహజం. తన పుత్రుడు పెద్ద ఇంజనీరో, ఐ.ఎ.ఎస్. ఆఫీసరో కావాలని ఆయన కలలుగన్నాడు. కాని లెక్కలంటే ఆసక్తిలేని రామం యాంత్రికంగా చదివేసరికి అతనికి క్లాసు రాలేదు. దాంతో అతని చదువు పెద్దసమస్య అయికూర్చుంది. తనకంటే పెద్దవాడు కావాలని ఆశపడిన విశ్వనాథంగారు రామానికీ బి.ఏ. తప్ప మరో గత్యంతరం లేకపోయేసరికి అతని భవిష్యత్ ని గురించి బెంగపడ్డారు. అనుకున్నది నెరవేరకపోయేసరికి అది తాత్కాలికమైన కోపంగా, చికాకుగా పరిణమించింది. పరోక్షంగానూ, బహిరంగంగానూ ఆయన కొడుకుమీద విసుక్కోసాగాడు.

 

    అందుకని రామం ఆయన కళ్ళ ఎదుటపడటం పూర్తిగా మానేశాడు. సహజంగా యింట్లోని యితర వ్యక్తులతో కూడా అతను ఎక్కువ మాట్లాడడు. చెల్లెలు ఆశ అంటే అతనికి ఎంతో ప్రాణం. ఆమెతోనే ఎప్పుడైనా చనువుగా, ఆప్యాయంగా మాట్లాడుతూ వుంటాడు. ఇంట్లో యింత ముభావంగా వుండే రామం బయట ఎంతో చలాకీగా వుండేవాడు. తన దేహసౌష్టవాన్ని గురించీ, పర్సనాలిటీని గురించీ అతనికి గురీ, నమ్మకం వున్నాయి. వాటిని ఎరగా పెట్టి తను చాలా సాధించగలనని అతనికి తెలుసు. అతనికి చాలా అభిరుచులున్నాయి. కాలేజీలో స్టేజి ఎక్కి తరచు ఉపన్యాసాలు దంచేస్తూ వుండేవాడు. నాటకాల్లో నటించటమంటే అతనికి మహా సరదా. అతని రూపంతో, ఈ ఆకర్షణలతో అతను మిగతావాళ్లని సమ్మోహితపరుస్తూండే వాడు. ఎక్కడన్నా తిరగనీ, యింట్లోకి వచ్చేటప్పుడు మాత్రం వెనకదారిన పిల్లిలా ప్రవేశిస్తూ వుండేవాడు.

Next Page