TeluguOne - Grandhalayam | Online Book Store | Novel Reading | Telugu Novels | Telugu Kathalu | Famous Telugu Writers | Chandu Sombabu | Yandamuri Veerendranath | Merlapaka Murali | Vasireddy Seeta Devi | Samaram Novels
Anitara Sadhyudu


                              అనితర సాధ్యుడు

                                                               _ సూర్యదేవర రామ్ మోహనరావు

 

    
                                                      ప్రొలోగ్

 

    అల్లూరి సీతారామరాజు, ఝాన్సీరాణి, బోస్, గాంధి, నెహ్రూ, వల్లభాయ్, ప్రకాశం పంతులు, జెమ్ షెడ్జీ, తాతా, షివ్ నారాయణ్ బిర్లా, అంబాని, కార్జన్ భాయ్ పటేల్, లెనిన్, హిట్లర్, నెపోలియన్, అలెగ్జాండర్, అమితాబ్, ఎల్.వి.ప్రసాద్, నాగిరెడ్డి, చక్రపాణి ఇంకా ఎందరో... అందరూ ఒకప్పుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వాళ్ళేంకాదు.

 

    వారి వారి రంగాలు వేరయినా, అనుక్షణం యుద్ధం చేస్తూ, విజయాలను సొంతం చేసుకుంటూ, నాయకత్వ లక్షణాలను అలవర్చుకొని, నాయకులుగా నిలబడి ఆ తరువాతే అనుచరుల్ని అండగా చేసుకొని సమిష్టి యుద్ధానికి సంసిద్ధులై అప్పుడే అనితరసాధ్యులయ్యారు.

 

    నలుగురు నమ్మేదాకా-

 

    పదుగురు అండగా చేరేదాకా-    

 

    ఎవరయినా ఒంటిగా, ఒకటిగా నిలబడక తప్పదు. గెలుపు అభివృద్ధికి ఒక మెట్టే అయితే ఓటమి ప్రగతికి రెండు మెట్లవుతాయి.


        
    "Success has hundred fathers but failure is an orphan"

 

    సరిగ్గా అప్పుడే ఈ ప్రపంచంలో సాధ్యం కానిది లేదని రుజువు చేయడం ఆరంభమవుతుంది.

 

    గెలుపు ఓటమిల మధ్య ఓ వ్యక్తి జరిపే సమరమే ఈ 'అనితర సాధ్యుడు.'

 

    He can beat anybody with nobody's help.

 

    సహాయం సామర్ధ్యానికి అవమానం కావచ్చు. కాని ప్రయత్నానికి స్ఫూర్తి తప్పనిసరి! ఒక ధీశాలి విజయం వెనక ఒక ప్రేరక శక్తి వుంటుంది. ఆ శక్తి తప్పనిసరిగా స్త్రీ అయివుంటుంది.


                              *    *    *    *


    Money - making is an art that can be practiced and acquired. If we have that zeal and goal we can make money in so many ways - through legally - approved methods. That all depends upon the strength of our will.

 

    ఒకానొకప్పుడు ఆలీ హఫీద్ అనే రైతు వుండేవాడు. అతను తనకున్న దానితో సంతృప్తిగా జీవిస్తుండేవాడు.

 

    ఒకసారి అనుకోకుండా అతను వృద్ధుడైన ఓ బౌద్ధ భిక్షువును కలుసుకున్నాడు.

 

    ఆ బౌద్ధ భిక్షువు సంభాషణ అనుకోకుండా వజ్రాల మీదకు మరలింది. "బొటనవేలంత వజ్రముంటే వేల ఎకరాలు కొనవచ్చు. వజ్రాల గనే వుంటే కొనలేని దుండదు. అప్పుడు నీ పిల్లల్ని మహారాజుల్లా పెంచవచ్చు" అని అన్నాడట.

 

    ఆ రాత్రంతా ఆలీ హఫీద్ కి నిద్ర పట్టలేదు. వజ్రాల గురించే ఆలోచిస్తూ వుండిపోయాడు.

 

    అతని ఆశలు, కలలు వజ్రాలగనిచుట్టే తిరుగుతున్నాయి.

 

    హఫీద్ తెల్లవారుతూనే బౌద్ధ భిక్షువు దగ్గరకు వెళ్లి వజ్రాలెక్కడ దొరుకుతాయని అర్థించాడు.

 

    హఫీద్ మొలకెత్తిన దురాశను గమనించిన బౌద్ధ భిక్షువు తొలుత చెప్పేందుకు నిరాకరించాడట. కాని హఫీద్ బలవంతం చేయడంతో బౌద్ధ భిక్షువుకు చెప్పక తప్పలేదు. ఎత్తయిన కొండల మధ్య, తెల్లటి ఇసుక దిబ్బల గుండా ప్రవహించే నదీ తీరాన వజ్రాలు దొరుకుతాయని చెప్పి ఒకింత బాధపడ్డాడట హఫీద్ ని చూసి.

 

    హఫీద్ రాత్రింబవళ్ళు వజ్రాల గురించి తిరుగుతూనే వున్నాడు. కాలం, జేబులో డబ్బులు హరించి పోతున్నాయే తప్ప వజ్రాలను పట్టుకోలేక పోయాడు.

 

    నిరాశా, నిస్పృహలతో హఫీద్ కుంగిపోయాడు. కొన్నాళ్ళకు జేబులో వున్న డబ్బులన్నీ ఖర్చయిపోయాయి. దాంతో ఆ బాధను, నిరాశను భరించలేక హఫీద్ సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

 

    అక్కడితో కథ పూర్తవలేదు.

 

    హఫీద్ పొలంకొన్న ఆసామి ఓరోజు తన ఒంటెను తీసుకొని పొలానికి వెళ్ళి, దాన్ని పచ్చికపై వదిలేసి తను చెట్టు క్రింద నీడలో కూర్చుండిపోయాడు.

 

    అంతలో ఒంటె ఆ పొలంలో వున్న వాగు దగ్గర ఆగి, ప్రవహించే నీటిని తాగేందుకు తలను వంచింది.

 

    సరిగ్గా అదే టైమ్ కి అటు చూసిన ఆసామికళ్ళు ఆశ్చర్యంతో పెద్ద వయ్యాయి.

 

    ప్రవహిస్తున్న నీటిప్రక్కనే వున్న ఇసుకలో ఏదో వస్తువు మెరుస్తూ కనిపించింది.

 

    అంతే... ఆసామి వడివడిగా వెళ్లి మెరుస్తున్న రాయిన ఇసుకలోంచి బయటకు లాగాడు.

 

    ఆ తరువాత అలాంటి మెరుస్తున్న మరికొన్ని రాళ్ళను ఆ ఇసుక నుంచి వెలికితీశాడు.

 

    ఆ తరువాత ఒకింత పరిశీలనగా ఆ మెరుస్తున్న రాళ్ళను చూసి ఒక్కసారి ఆనందోద్వేగానికి లోనయ్యాడు.

 

    కొద్దిక్షణాలు అతనికి నోటిమాట రాలేదు. ఉన్నచోటు నుంచి అంగుళం మేర కదలలేకపోయాడు.


Related Novels


 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.