Next Page 

నివేదిత  పేజి 1


                                                    నివేదిత

                                                                       -కొమ్మూరి వేణుగోపాలరావు

 

 

 ఆనందపురం ఒక పల్లెటూరు. పల్లెటూరు అని పిలవడం ఆ గ్రామానికి అన్ని విధాలా సరిపోయింది. ఎందుకంటే అక్కడకు పదిమైళ్ళ దూరంలోపున ఏ బస్తీ కానరాదు. బస్సు దారి కూడా నాలుగైదు మైళ్ళు పై మాటే గాని యీలోపున తగలదు. రాకపోకలన్నీ కాలిబాట మీదగాని ఎడ్లబండీల మీదగాని జరుగుతాయి. ఊళ్ళో ఎలక్ట్రిసిటీ లేదు. కృష్ణానది పన్నెండు మైళ్ళ అవతలెక్కడో ప్రవహిస్తూ ఉంది. అయితే ఊరికి మూడు ప్రక్కలా ఏరు ప్రవహిస్తూ ఉంది. వేసవికాలం రెండు మూడు నెలలూ తప్ప మిగతా అన్ని సమయాలూ నీరు సమృద్ధిగా వుంటుంది ఏటిలో. అక్కడి భూమి చాలా సజీవమైంది. అంత కళకళలాడుతూ, పాడి పంటలతో తులతూగుతూ, పచ్చని పైర్లతో మిలమిలలాడే గ్రామం చుట్టు ప్రక్కల లేదు. "చినుకు రావటంలేదు " అన్న మాట ఆ ఊరి ప్రజలు ఉచ్ఛరించి చాలా ఏళ్ళు గతించిపోయాయి. ఏరుదాటి పైకి సాగితే కనులపండువుగా తోటలు, యింకా రెండుమూడు మైళ్ళుపోతే ఎత్తయిన కొండలు, దానిమీద దట్టంగా పెరిగిన అడవులు.

 

    ఊళ్ళో పాతిక ముఫ్ఫై బ్రాహ్మణ కొంపలుదాకా ఉన్నాయి. వాళ్ళలో వందలాది ఎకరాలకు అధిపతులైన సంపన్నుల దగ్గర్నుంచీ, పౌరోహిత్యం చేసుకుని బ్రతికే సాదావారి వరకూ ఉన్నారు.  

 

    ఊరికి ఉత్తరాన ఓ దేవాలయం ఉంది. అది వేణుగోపాలస్వామి దేవాలయం. ఆ ఆలయాన్ని ఊరి కామందుల్లో ఒకరైన రంగశాయిగారి పూర్వులు చాలా సంవత్సరాల క్రితం కట్టించారు. రంగశాయిగారు కూడా యిప్పుడు లేరు. ఆయన గతించి నాలుగైదు సంవత్సరాలకు పైగా అయింది. దేవాలయం కట్టించిన దాదిగా ఒక వైష్ణవ కుటుంబం దాని పరిరక్షణకై నియోగించబడింది. అప్పట్నుంచీ ఆ వంశీకులు దేవాలయ ప్రాంగణంలోనే వున్న యింట్లో కాపురముంటూ, స్వామివారి సేవలనుగానీ, గుడి సంరక్షణను గానీ దిగ్విజయంగా జరిపిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఉన్నవారి వంశీ కుని పేరు గోవిందాచార్యులుగారు. రంగశాయిగారి సమవయస్కులు ఆయన, యాభయి అయిదేళ్ళు దాటిన వ్యక్తి. పరమ నిష్టాగరిష్టుడు. ఆచార సంపన్నుడు, చాదస్తుడు ఇంకా ఏమైనా పేర్లు పెట్టవచ్చు. ఆ మొత్తంమీద ఆయన ప్రభ దివ్యంగా వెలిగిపోతోంది ప్రస్తుతం గ్రామంలో. ఆయనకి పుత్రప్రాప్తి లేదు. ఒక కూతురు ఉంది. ఆమె పేరు వేదిత. ఆమెకు తల్లి, తండ్రి సర్వం గోవిందాచారిగారే.

 

    ఒకనాటి ఉదయం ఎనిమిది గంటలవేళ వేదిత దేవాలయ ప్రాంగణంలోని కోనేటి గట్టున పాదాలు మెట్లమీద ఉంచి కూర్చుని ఆలోచిస్తోంది. శీతాకాలం ప్రవేశించే రోజులు. చలీ, వెచ్చదనం కలిసి గిలిగింతలు పెట్టే సమయం. బాలభానుడి లేతకిరణాలు మెత్తగా నులివెచ్చగా ఆమె సుకుమార శరీరాన్ని సాకుతూ, ఆమె తనూకాంతిని యినుమడింపజేస్తున్నాయి. అసలే ఆమె తల స్నానంచేసి జుట్టు విరబోసుకుని ధవళ వస్త్రధారిణియై ఉన్నదేమో... చిరుగాలికి ఆమె కేశాలు కదిలి ముఖం మీద పడి దోబూచులాడుతూ, స్నిగ్ధమూ స్విన్నమూ అయిన ఆమె మోము మరింత ధవళకాంతులు విరజిమ్ముతూ, అరుణరాగ రంజితమై ఉంది.

 

    ఇంతలో తోటలో పెరుగుతూన్న కుందేలుపిల్ల ఒకటి అటుకేసి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె దానివైపు దృష్టి మరల్చి చేతులుచాచి దాన్ని అందుకుని, వొళ్ళోకి తీసుకుని ప్రేమతో దువ్వుతోంది . వెనుకగా అడుగుల చప్పుడయింది. ఎండుటాకులు గల్లుగల్లుమన్నాయి. ఈ అడుగుల చప్పుడు ఆమెకు కొత్త. తలత్రిప్పి చూసేసరికి ఓ యువకుడు.... పొడుగ్గా, బలంగా ఉన్నాడు. ఓ చేతిలో తుపాకీ ఉంది. మరో చేతిలో సిగరెట్టు కాలుతోంది. ఏకాంత ప్రదేశాన, కోనేటి గట్టున దేవతా స్త్రీలా కూర్చున్న యువతి. అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి.

 

    వేదిత చప్పునలేచి నిలబడి "ఎవరు మీరు?" అనడిగింది కొంచెం కోపం ధ్వనిస్తూన్న కంఠంతో.

 

    ఆ యువకుడి ముఖాన ఆశ్చర్యం మాయమై పెదాలపై చిరునవ్వు వెలిసింది.

 

    "ఓ మానవుడ్ని" అన్నాడు కొంటెగా.

 

    "ఎందుకొచ్చా రిక్కడికి?" అదే కాఠిన్యం ఆమె కంఠంలో.

 

    "ఔరా!" అన్నాడతను నాటక ఫక్కీలో, "నేను భారతదేశంలో లేని ఈ నాలుగేళ్ళలోనూ దేశం ఎంత దుర్గతి పాలయింది? భక్తులు దేవాలయానికి వస్తే కారణమడిగే దౌర్జన్యులుగా పరిణమించారా మన ప్రజలు!"

 

    "ఓహో! మీరు భక్తులా?" అన్నదామె చిరునవ్వు దాచుకుంటూ.

 

    "ఏం? కాకూడదా?"

 

    "భక్తులెవరూ తుపాకీలూ, సిగరెట్లూ పట్టుకుని దేవాలయంలో ప్రవేశించరు."

 

    "ఓ! ఐయామ్ సారీ" అంటూ అతను సిగరెట్టు దూరంగా విసిరేశాడు.

 

    ఆమె యెందుకో అతను ముఖంలోనికి పరకాయించి చూసింది. సాధారణంగా ఆమె ఎవరి ముఖంలోకి చూస్తూ మాట్లాడదు. యధాలాపంగా చూసేసరికి యేదో స్ఫురించి రెండు మూడు క్షణాలు అలాగే దృష్టిసారించి "మీరు...మీరు" అంది.

 

    "చిన్నప్పుడు ఈ తోటల్లో ఆడుకున్నాను. క్రిందపడి పొర్లాను. చెట్లెక్కి కోతిలా గెంతాను. అప్పుడో అమ్మాయి ఉండేది. చాలా చిలిపి చలాకీపిల్ల. నేనూ, నా స్నేహితుడు యింకొకడూ ఆ అమ్మాయితో కలిసి ఆటలాడేవాళ్ళం, యేడిపించేవాళ్లం. నేనాఅమ్మాయిని "రాలుగాయి" అని పిలిచేవాడ్ని అంటూ అతను క్రీగంట ఆమెవైపు చూశాడు.

 

    ఆమె పెదవులు కొంచెం అదిరాయి. "శేషశాయి బాబూ!" అంది కంపిత స్వరంతో.

 

    "అదేమిటి? అంత పెద్ద పేరు చేశావు? నేను చిన్ననాటి శేషూనికానా?"

 

    "ఉహు! కాదు" అని తలఅడ్డంగా వూపింది వేదిత. "ఇది బాల్యం కాదు మరోదశ. మీరసలు చిన్ననాటి రూపంతో లేనేలేరు. ముఖం పోలికే లేదు. ముదురుగాకూడా తయారయ్యారు.

 

    "ఆమాట నిజమే " అన్నాడతను ఒప్పుకుంటున్నట్లు. "ఆ మాట కొస్తే మా శ్రీమతే నన్ను గుర్తుపట్టలేదు." అంటే ఒకటుందిలే. పెళ్ళయ్యాక మేమిద్దరం కలిసి ఉంది మూడు రోజులే."

Next Page