Next Page 

శారద  పేజి 1


                                 శారద

                                        -కొమ్మూరి వేణుగోపాలరావు

    ఈ కథ జరగటానికి పదేళ్ళకి పూర్వం ధనవంతులనీ, దాతలనీ పేరు పొందిన ఓ సదాచార బ్రాహ్మణ కుటుంబంలో ఈ సంఘటన జరిగింది.

    రవి అప్పుడు పన్నెండేళ్ళ కుర్రవాడు. వాడి పూర్తీపేరు రవీంద్రనాధ్. వాడి పసితనంలో ఈ పేరు ఏరికోరి వాడి చిన్నక్క పెట్టింది. ఆ పేరుతప్ప మరేదైనా తన చిన్నతనాన వాళ్ళు పెట్టివుంటే, ఈ ఇల్లువిడిచి పారిపోయేవాడ్నని స్నేహితులతో చెబుతుండేవాడు. వాళ్ళు నాయనమ్మ ముద్దుతో, ముచ్చటతో "బుల్లీ" అనో, "బుచ్చీ" అనో పిలిస్తే పలికేవాడు కాదు. పైపెచ్చు ఆవిడ దగ్గరకు వెళ్ళి. "ఇదిగో నాయనమ్మా! ఈరోజు నువ్వు చేసిన అపరాధానికి ఫైన్ గా నేను అన్నం మానేస్తున్నాను" అని బెదిరించేవాడు. "అయ్యో! తండ్రీ, నీకిష్టమైన పాటోళీ చేశానురా!" అనేది ఆవిడ. వాడికి నోరూరేది. ఆవిడ వేళకి అన్నం వడ్డించి, "రావిబాబూ! మా నాయనవిగా, భోజనానికి రా బాబూ!" అని పిలిచేది. వాడు కదిలేవాడు కాదు. అప్పుడు చిన్నక్క వచ్చేది. "రవీ! నేనన్నం కలిపి పెడతాను రావూ?" అని పిలిచేది వాడు చక్కాపోయి ఓ డోసు ఎక్కువగా పట్టించేవాడు.

    ఆరోజు రాత్రి పదిగంటలు దాటింది. బయట వాన పడుతుంది. రవి  వాళ్ళ నాయనమ్మదగ్గర పడుకున్నాడు. ఏదో పీడకల వచ్చి, అప్పుడు హఠాత్తుగా మెలకువ వచ్చింది. బాగా భయంవేసి గజగజమని వణికాడు. అది చాలా విచిత్రమైన కల. వాడు ఒక్కడూ ఇంట్లో కూర్చునివున్నాడు. ఇంట్లోనూ, ఊళ్ళోనూ జనం ఎవ్వరూ లేరు. వాళ్ళంతా కట్టగట్టుకుని ఎక్కడకు పోయారో కూడా వాడికి అంతుపట్టలేదు. ఇంతలో తలుపు తెరుచుకుని ఓ సింహం లోపలకు ప్రవేశిస్తుంది. వాడికి చచ్చే భయంవేసింది. గజగజమని వణుకుతున్నాడు. తనని రక్షించేందుకు ఎవరూ లేరు . ఇదా! గర్జిస్తూ మీదకు దూకేటట్లుగా వుంది. ఇవాల్టితో తన పని ఆఖరేనని తెలుసుకున్నాడు. గట్టిగా కళ్ళు మూసుకుని, మళ్ళీ ఓరగా తెరిచిచూశాడు. సింహం మీదమీదకు వస్తోంది. అప్పుడు హఠాత్తుగా వాడి మెదడులో ఏదో మెరుపు మెరిసినట్లయింది. తార్కికంగా ఆలోచించాడు. "నేను ఇంట్లో ఒంటరిగా వుండటం ఎలా సంభవం? మా చిన్నక్కకు, నాయనమ్మకు, అమ్మకు, నాన్నకు నేనంటే అంత ప్రేమకదా? వాళ్ళు నన్ను ఒక్కడినే నిర్భయంగా ఇంట్లో విడిచి, ఎక్కడకు పోతారు? నేన్నమ్మను. అయినా ఊళ్ళోని జనమంతా కలిసి ఏ గంగలో దూకినట్లు? అయినా ఊళ్ళోకి సింహం రావటం ఏమిటి? పోనీ, వచ్చిందయ్యా! సరాసరి తలుపులు తెరుచుకుని ఇంట్లోకి రావడం ఏమిటి? నేన్నమ్మను. ఇది నిజంగా జరిగే విషయంకాదు. ఇదేదో మాయ. అదీ నేన్నమ్మను. కలియుగంలో మాయ జరగటం ఏమిటి? ఇది తప్పకుండా కల అయివుంటుంది."  

    ఇలా అనుకున్నాక వాడికి కావలసినంత ధైర్యం వచ్చింది. కలని కల అని తెలుసుకున్నాడు కాబట్టి ఈ సింహానికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇది తనను చంపివేసినా ఫర్వాలేదు. తర్వాత మెలకువ వస్తుంది.

    "ఇది తప్పకుండా కలే అయివుంటుంది. అసలు మనదేశంలో సివంగులున్నాయట గానీ సింహాలులేవట. ఉన్నా వింధ్యప్రాంతాలలో ఎక్కడో అఘోరిస్తూ వుంటాయని చిన్నక్క చెప్పింది. అంతదూరంనుండి అది ఇక్కడికి రావటం అసంభవం" అనుకున్నాడు.  

    సహనంతో కళ్ళు తెరిచి చూడసాగాడు. సింహం దూకడానికి సన్నాహం చేసుకుంటోంది. చివరకు దూకనే దూకింది.

    రవికి మెలకువ వచ్చింది.

    వాడికి మెలకువ వచ్చాక భయంవేసింది. అటూఇటూ చూశాడు. ప్రక్కన నాయనమ్మ గుర్రుపెడుతూ నిద్రపోతుంది. గుర్రుపెట్టటమంటే తనకు చెడ్డ చిరాకు. బయట వాన. రేకులషెడ్డుమీద పడుతున్న చప్పుడు స్పష్టంగా వినిపిస్తుంది.

    "నాయనమ్మా!" అని పిలిచాడు.

    నాయనమ్మా పలుకకుండా గుర్రు ఎక్కువచేసింది.

    రవి మెల్లగా లేచి నిలబడ్డాడు. తనకు వచ్చిన కల విషయం చిన్నక్కకు చెప్పాలి. "అందులో అర్థం ఇదని ఆవిడకు వెల్లడించాలి. మరి కలలో అది నాకు కల అని తెలిసిపోయింది చిన్నక్కా!" అని తను తెలియచెయ్యాలి. "నువ్వు చాలా తెలివిగలవాడివి రవీ!" అని ఆవిడ మెచ్చుకోవాలి.

    చిన్నక్క గది మేడమీద వుంది. దాని ప్రక్కన పెద్దక్క గది వుంది. పెద్దక్క బావతో వెళ్ళిపోయింది. పండుగలకు వచ్చినప్పుడు అందులోనే వుంటుంది. రవి మెట్లు ఎక్కుతున్నాడు. నిద్రమత్తు ఇంకా పూర్తిగా వీడలేదు. మెల్లగా గదిని సమీపించాడు.

    "చిన్నక్కా!" అని పిలవబోయాడు కానీ నోట్లోనిమాట నోటిలోనే వుండిపోయింది. గదిలోంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయి. వాడు తెల్లబోయాడు. ఇంత రాత్రివేళ చిన్నక్క ఎవరితో మాట్లాడుతుంది? కుతూహలం హెచ్చింది. కిటికీదగ్గరకు వెళ్ళి లోపలకు తొంగిచూశాడు. లోపల లైటు వెలుగుతోంది. ఓ పెద్దబ్బాయి నిలబడివున్నాడు. వాడ్ని తనింతవరకూ ఎన్నడూ చూడలేదుకూడా. వానలో తడిసి వచ్చినట్లున్నాడు.

    "ఎంత సాహసంచేశావ్? ఎవరైనా చూస్తే నా గతి ఏమౌతుందో ఆలోచించుకున్నావా?" అంది చిన్నక్క.

    "శారదా!" అన్నాడు వాడు. "ఈ రాత్రి నీ దగ్గరకు రాకుండా వుంటే నా గతి ఏమౌతుందో ఆలోచించవేం?"

    "ఆలోచించి లాభం లేదుగనుక!"

    "మళ్ళీ అదేమాట! నువ్వు నన్ను ఎందుకంత దూరం చేస్తున్నావు?"

    చిన్నక్క ఏమీ జవాబు చెప్పలేదు. ఆమె ముఖంలో సగభాగమే రవికి కనబడుతోంది.

    "మాట్లాడవేం?"

    "ప్రసాద్! నీకో విషయం చెబుతాను విను" అంది చిన్నక్క. "నువ్వూ, మేమూ ఒకటికాదు. కానీ ఇలా ఎందుకు జరిగిందో నాకూ అర్ధంకావటం లేదు. తప్పు, కూడదు అని తెలుసుకుంటూనే అమాయకంగా నేనూ ప్రవర్తించాను."

    వాడామాటకి మధ్యలోనే అడ్డువస్తూ "తప్పయినదీ, కూడనిదీ మనం ఏం చేశాం?"    

Next Page