Next Page 

పసుపు కుంకుమ పేజి 1


                                పసుపు-కుంకుమ

                                                     - కొమ్మూరి  వేణుగోపాలరావు

    మాలతి, భానుమతి బస్ స్టాప్ దగ్గర నిల్చున్నారు.

    ఆ ఇద్దరిలో లేత నీలిరంగు ఫుల్ వాయిస్ చీరె కట్టుకుని,అదే రంగు రూబీ జాకెట్టు  తొడుక్కుని, పమిట భుజాలమీద నిండుగా కప్పుకుని వున్న అమ్మాయి మాలతి. ఎరుపురంగు నైలెక్స్ చీరె, ఎరుపు రంగుదే జాకెట్టు వేసుకుని చలాకీగా నిలబడివున్న అమ్మాయి భానుమతి. పొడవుగా పొందికగా, శాంతంగా, ప్రశాంతంగా, వినయంగా, సిగ్గుగా  నిలబడిన అమ్మాయి మాలతి. అంతే పొందికగా వున్నా ఒక క్షణమైనా నిలకడగా నిలబదలేనట్లుగా, చురుకుగా,  అసహనంగా, కొంటెగా, గడుసుగా, పొగరుగా,  అర్ధంలేని సిగ్గు నాకసహ్యమన్నట్లు ఆత్మవిశ్వాసంతో కనబడుతున్న అమ్మాయి భానుమతి. తెల్లగా, అందంగా, ఆకర్షణీయంగా వున్న అమ్మాయి మాలతి.ఆకర్షణీయంగా, అందంగా, చామనఛాయగా వున్న అమ్మాయి భానుమతి.

    శరీరాలు చురుక్కుమనిపించే పది గంటలప్పటి మార్చినెల ఎండలవి.

    అప్పటికి పదకొండోసారో, పన్నెండోసారో రిస్టువాచీ చూసుకున్న భానుమతి "అబ్బ! ఈ బస్సు రాదేం బాబూ?" అంటూనే ఫక్కున నవ్వేసింది.

    "దేనికి నవ్వుతున్నావు ?" అన్నది మాలతి. ఆమె ఎందుకు నవ్విందో అర్ధం కాక.

    "అబ్బ! ఈ బస్సు రాదేంబాబూ! అన్న ఈ మాట ఏదో కథలో పెట్టిన శీర్షికలా లేదు ?"

    భానుమతి తరచూ ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది. ఆమె పెదవులమీదుగా ఒక్కో మాట బయటకు వచ్చేలోపల, దాని తాలూకు అంశమింకేదో మనసులో మెదులుతూ వుంటుంది.

    "ఒకసారి ఇలాగే జరిగింది మాలీ! రాత్రివేళ గాజులు కొనుక్కుని చార్మినార్  ఛాయల్లో నడచివస్తున్నాను. వెనకనుంచి "వస్తానన్నావు, రాలేదేం?" అన్న మృదు మధురమైన కంఠం వినిపించింది. ఆ కంఠస్వరం విని పులకించి పోయాను. అన్నది ఎవరా అన్న ఆసక్తితో వెనక్కి తిరిగిచూశాను. ఆ చీకట్లో ఎవరో ముసలితాతతో మాట్లాడుతోన్న ఎనిమిదేళ్ళ పాప ముఖం మసగమసగ్గా కనిపించింది. ఆ ప్రక్కనే ఓ యువకుడితో మాట్లాడుతోన్న ఇంకో అమ్మాయి కనిపించింది. పాప, వయస్సులో వున్న అమ్మాయి ... ఆ యిద్దరిలో ఈ మాటలు ఎవరన్నదీ తెలియలేదు. ఎవరయినా అని వుండవచ్చు. తర్వాత అక్కడినుంచి వచ్చేశాను. అయినా ఈ మాటలు నన్ను చాలాకాలం వెంటాడాయి. ఇప్పటికీ వెంటాడుతూనే వున్నాయి. "వస్తానన్నావు, రాలేదేం? వస్తానన్నావు, రాలేదేం? బాగాలేదూ ?"

    "బాగానే వుంది కానీ సరిగ్గా అర్ధంకాలేదు."

    భానుమతి మళ్లీ గలగలా నవ్వింది. "నాకు తెలుసు, నీకిష్టంలేని  సంగతులు మాట్లాడినప్పుడు అలానే అంటావు. అసలు నీ మనసంతా ఆఫీసుమీదా, ఆఫీసరుగారి మీదా వుంది, నాకు తెలుసులే" అంది.

    మాలతి ముఖం కొంచెం ఎరు పెక్కింది. "ఆఫీసుమీద ఉందను, ఒప్పుకుంటాను. అంతేగానీ ఆఫీసరుగారి మీద..... నాకలాంటి భ్రాంతులేమీ లేవు."

    "ఉంటే తప్పేమిటీ?"

    "నేను తప్పొప్పుల గురించి మాట్లాడటంలేదు. లేనిది లేదని చెబుతున్నాను."

    "రేపు ఉన్నా లేదనే చెబుతావు. ఎందుకంటే నువ్వొట్టి ఆడదానివి."

    నీ వ్యాఖ్యానానికి సంతోషించాను. అదిగో బస్సు వచ్చేస్తోంది. పద పద, ఇదికూడా అందుకోలేక పోయామంటే మనకి అక్షింతలు తప్పవు.

    బస్సుకోసం ఎదురుచూసేవాళ్ళు  తక్కువేం లేరు . ఎవరిమట్టుకు వాళ్లు గట్టెక్కిపోదామనే ఆదుర్దాలో వున్నారేమో అది ఆగీ. ఆగకముందే క్యూ సిస్టాన్ని ఉల్లంఘించి ఒక్కుమ్మడిగా ఎగబడ్డారు. భానుమతి పరిస్థితి గమనించి మొహమాటపడితే తాము వున్నచోటునే ఉండిపోతామని అర్ధం చేసుకుంది. "రా మాలీ!" అని మాలతి చెయ్యి పట్టుకుని ఆమెను లాక్కుంటూ చాకులా ముందుకు దూసుకుపోయింది. మాలతికి ఒక్కక్షణం కళ్ళు చీకట్లు క్రమ్మినట్లనిపించింది. తనచుట్టూ ఉహించలేనంత దగ్గరగా ఎవరెవరో మనషులు, తమని అదిమివేస్తూ ఊపిరాడనట్లుగా చేస్తూ ఎవరెవరివో శరీరాలు. బస్సులో అడుగు పెట్టాక తమ ఉనికి తెలుసుకునే ప్రళయంలోంచే బయటపడినట్లయింది. తమబట్టలు నలిగిపోయాయనీ, తమ జుట్టు చెదిరిపోయిందనీ గ్రహించిన మాలతి "ఛీ పాడు " అంది.

    భానుమతి నవ్వుతూ ఆమెవంక చూసి "పద అక్కడ సీట్లు ఖాళీగా వున్నాయి" అంది.

    "ఏమిటంత పాడుపని చేసినట్లుగా ప్రశ్చాత్తాప పడిపోతున్నావు ?" అంది ఇద్దరూ కూర్చున్నాక.

    "కాదేమిటి ? వాళ్ళందరి ఒళ్ళూ మనకి తగలలా? "

    "తగిలితే ఏమయిందట?"

    "అసహ్యం కదూ?"

    "ఒక మనిషి శరీరం మరోమనిషి  శరీరానికి తగిలినంత మాత్రాన అసహ్యమా? డాక్ట్రర్లు ఆడపేషెంట్లని  ముట్టుకుంటారు. ఒకరికొకరు బంధువులయినపుడు- వాళ్ళలో వయసు మళ్ళినవాళ్ళు చిన్నవాళ్ళయిన ఆడపిల్లల్ని అనేక వంకలతో ముట్టుకుంటారు. అన్నాచెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ళు ఒకరినొకరు ముట్టుకుంటారు. మొగుడూ పెళ్ళాలు ఒకర్నొకరు ముట్టుకుంటారు......"

    "బాగుంది నువ్వుచెప్పేది. రక్తసంబంధీకులైన వాళ్ళకీ, ఇతరులకీ తేడా లేదంటావా?"

    "ఎక్కడుంది తేడా? మనం ఆపాదించుకున్న బంధుత్వాలలోనా? మనచుట్టూ అందంగా, అభేధ్యంగా  నిర్మించుకున్న ఉక్కు పొరల్లోనా? మొగుడంటే ఇష్టంలేకపోతే వాడి స్పర్శే మళ్లీ అసహ్యమవుతుంది. మళ్లీ అన్నా చెల్లెళ్ళ మధ్య మానసికబంధాలు తెగినప్పుడు ఆ స్పర్శే అసహ్య మవుతుంది."                

Next Page