Next Page 

రౌడీరాజ్యం పేజి 1


                              రౌడీ రాజ్యం

                                                                              __ మైనంపాటి భాస్కర్

 
   
    తెగిన పుస్తెలూ, పగిలే గాజులూ, పిల్లల ఏడ్పులూ, తల్లుల శోకం, బెదిరిన బతుకులూ, చెదిరిన కలలు, నిత్యం హత్యలు, రక్త కన్నీరూ_ ఇదే రౌడీ రాజ్యం.

                                                        ఫస్ట్ బ్లడ్

    అమావాస్య....

    ఆదివారం....

    అర్దరాత్రి....

    అరిష్ట ఘడియ...

    అనుకోకుండా ఆ అరిష్ట ఘడియే తమ తొలి కలయికకి ముహూర్తం అయ్యిందని గ్రహించలేదు రాజూ, రాధా కూడా!

    స్మశానం పక్కనే వుంది సంకెళ్ళ బాగ్.

    ఆ తోటకు సంకెళ్ళ బ్యాగ్ అనే ఆ చిత్రమైన పేరెందుకొచ్చిందో తెలిసిన వాళ్ళు తక్కువ.

    చెట్టుమీద గుడ్లగూబ గూఢచారిలా కూర్చుని చూస్తోంది కింది దృశ్యాన్ని.

    ఆ దృశ్యం స్పష్టంగా కనబడటం లేదు.

    అస్పష్టంగా వినబడుతోంది.

    లీలగా రేఖా మాత్రంగా కనబడుతున్నాయి ఆకారాలు.

    ఒకమ్మాయి, ఒకబ్బాయి....

    గుసగుసగా వినబడుతున్నాయి గొంతులు.

    "భయంగా వుందా రాధా?"

    నెమ్మదిగా అంది రాధ_ "భయం, సిగ్గు అన్నీ వదిలెయ్యబట్టేకదా ఇక్కడికి రాగలిగాను."

    ఇష్టంగా ఆమె చేతిని ఒత్తాడు రాజు.

    "నీతో మాట్లాడుతుంటే ఎలా వుందో తెలుసా రాధా! నా ఫేవరేట్ హీరోయిన్ ని ఇంటర్వ్యూ చేస్తున్నట్లు వుంది"

    "ఎవరు మీ ఫేవరేట్ హీరోయిన్?" ఆ అమ్మాయి గొంతులో సన్నటి జెలసీ.

    నవ్వాడు రాజు. "ఇంకెవరూ? నువ్వే!"

    "అబ్బ!" అంది రాధ అతని మాటలు నమ్మనట్లు. కానీ అలా అనడంలోనే ఆమె సంతోషం కనబడిపోతుంది.

    అతను ఆ అమ్మాయికి ఇంకాస్త దగ్గరగా జరిగాడు.

    ఓ మొగాడు తన ఒంటిని కోర్కెతో తాకబోవడం, అందుకు తను అభ్యంతరం పెట్టకుండా అనుమతి ఇస్తున్నట్లు కదలకుండా వుండిపోవడం కొత్త అనుభవం రాధకి.

    అతని మొహం ఆమె మొహానికి దగ్గరయింది.

    నున్నటి ఆమె చెంపలని అతని చెంపలు గరుగ్గా తాకాయి. అతని పెదిమలు సంకోచంగా ఆమె పెదాలను స్పృశించాయి. రెండు క్షణాలపాటు.

    కళ్ళు అరమోడ్పుగా పెట్టింది రాధ. అంతలోనే అతని మొహం దూరంగా జరిగిపోయింది.

    సందేహంగా కళ్ళు తెరిచింది.       

    చుట్టూ వున్న చీకటి రెండు ముద్దలుగా ఘనీభవించినట్లు అనిపించింది రాధకి. కళ్ళు చిట్లించి దృష్టి కేంద్రీకరించి చూసింది.

    ఆ రెండు చీకటి ముద్దలూ రెండు మానవాకారాల్లాగా కనబడ్డాయి.

    అదిరిపడింది రాధ.

    "ఎవరు?" అంది వణుకుతూ. అంటూనే రాజుని పక్కకి నెట్టేసింది.

    "ఎవడ్రా ఈలం....కొ....మరిడేశ్వరరావు కొడుకేనా? అంది ఒక గొంతు.

    ఆ గొంతెవరిదో గుర్తుపట్టగానే గుండె ఆగిపోయినంత పనయింది రాధకి.

    ఆ ఆకారం కదిలింది. మరుక్షణంలో ఇనపదూలంలాంటి ఒక కాలు రాజు ఎదుర్రొమ్ముని బలంగా తాకింది. ఆ దెబ్బతో రాజు ఊపిరితిత్తుల్లోని ఊపిరి అంతా బయటికొచ్చేసినట్లయ్యింది. పెద్దగా మూలిగి బాధతో విలవిలలాడటం మొదలుపెట్టాడు.

    ఆ దెబ్బ తనకే తగిలినంత ఆర్తిగా ఆర్తనాదం చేసింది రాధ. భయంతో ఆమె మెదడు మొద్దుబారిపోయినట్లయ్యింది. తక్షణం స్పృహ తప్పింది.

    "లేరా లే....!" అంది ఆ గొంతు.

    తనని కొట్టింది తన తండ్రికి బద్ధశత్రువైన దుర్గేష్ అని గ్రహించాడు రాజు.

    లేచి నిలబడబోయాడు.

    "నీ...." అని కాలెత్తాడు దుర్గేష్.

    ఈసారి రాజు డొక్కలో తగిలింది దెబ్బ.

    బాధతో వంగిపోయాడు రాజు.

    అసహనంగా అటూ ఇటూ చూశాడు దుర్గేష్. ఆయుధం ఏదీ అందుబాటులో లేక, పక్కన వున్న తన అనుచరుడి చేతిలో ఉన్న స్టీలుమిల్కు కారియర్ ని విసురుగా లాక్కున్నాడు. అతని చెయ్యి ఆగకుండా అదే వేగంతో అర్ధచంద్రాకారంలో కదిలింది.

Next Page