TeluguOne - Grandhalayam | Online Book Store | Novel Reading | Telugu Novels | Telugu Kathalu | Famous Telugu Writers | Chandu Sombabu | Yandamuri Veerendranath | Merlapaka Murali | Vasireddy Seeta Devi | Samaram Novels
రేపటి మహిళ


                                                                  రేపటి మహిళ
                                                                                                  __ సి. ఆనంద రామం


    "భార్యని చంపిన భర్త"
    కరీంనగర్ జిల్లా మెట్ పల్లిలో రుద్రయ్య తన భార్య సత్తెమ్మను హత్య చేశాడు.
    సత్తెమ్మ కొంతకాలంగా మరో పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది.
    అది తెలిసిన రుద్రయ్య ఆగ్రహం పట్టలేక రుబ్బుడు పొత్రంతో సత్తెమ్మ తలమీద బాది హత్య చేసాడు.
    పోలీసులు అతన్ని బంధించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
    "వండ్రఫుల్" చదువుతూన్న పేపరు చేతిలో పట్టుకుని సోఫాలోంచి ఒక్క హైజంపు చేశాడు భాగవతార్. బేలన్స్ తప్పి తూలి పడబోయి టీపాయి పట్టుకుని నిలదొక్కుకున్నాడు. మరొక్కసారి పేపర్ లోని వార్త చదవబోయాడు. అక్షరాలూ అలుక్కుపోయి మసక మసగ్గా కనిపించాయి.
    "ఓరి దేవుడా! నాకేమైంది," అని ఖంగారు పడిపోతూ జుట్టుపీక్కున్నాడు. ఎప్పటికప్పుడు క్రిందకు జారిపోయే కళ్ళజోడుని పైకి నెట్టుకోవడం అతని అలవాటు, అలా కుడిచేతి చూపుడు వేలితో ముక్కుమీదవున్న కళ్ళజోడుని పైకి తీసుకోబోయి చేతికేమీ తగలకపోవడంతో "అరెరె! నా చేతికేమైనా అయిందా? స్పర్శజ్ఞానం పోయిందా?" అని ఖంగారు పడిపోయాడు. కొంతదూరంలో కిటికిలోంచి వస్తున్న సూర్యకిరణాలు పడి మెరుస్తూ కనిపించింది కళ్లజోడు. "నా కళ్ళజోడు కిందకెలా వచ్చింది?" అని కాస్సేపు బుర్ర గోక్కుని కళ్లజోడు పెట్టుకుని పేపర్లో వచ్చిన వార్త మళ్లా చదివాడు. భార్యని చంపడం వరకూ బాగానే వుంది. భర్త అరెస్టు కావడం బాగాలేదు. భార్య లవర్ ని అరెస్టు చెయ్యాలి. ఈ ఆలోచన బాగుంది. మొదట  మృదులని హత్య చేయాలి. తరువాత ఆ నేరం మృదుల లవర్ మీదికి నెట్టేయాలి. ఇంతకీ ఎవరు మృదుల లవర్? మృదంగం వాయించే అమెరికన్ "ఏండేటో" యా, ప్రఖ్యాత రచయిత "అనంగ్" అనుకోవాలా? లేక అడవుల్లో కొండల్లో మూలికల కోసం వెతికే టిబెటియన్ "మింగియార్" అని అనుమానించాలా?
    మొదట ఈ ముగ్గురిలో ఎవరి మృదుల ప్రియుడో తేల్చుకోవాలి? ఆ తరువాత పకడ్బందీగా పథకం వేసుకోవాలి.
    ఏముంది మృదుల? "లైఫ్ ఈజ్ టు లివ్," అని కదూ! "అసలు నీకు లైఫ్ అనేది లేకుండా చేస్తాను మృదులా.... ఆహ్హహ్హ.... ఆహ్హహ్హ...."
    హాలంతా అటూ యిటూ తిరుగుతూ తనలోతను ఆలోచించుకుంటూ మళ్ళీ మళ్ళీ నవ్వుకున్నాడు భాగవతార్.

                              *    *    *
    "ఆహ్హహ్హ...." చప్పట్లు కొడుతూ వెక్కిరిస్తూ చిన్నపిల్లలా నవ్వసాగింది మృదుల. కార్పెట్ మీద బోర్లాపడ్డ భాగవతార్ మొదట భయంగా చూసి తరువాత కోపం తెచ్చుకుని, తరువాత ధైర్యంగా నిలబడ్డాడు.
    "ఏమిటీ అల్లరి?" కసరాలని ప్రయత్నించాడు. కాని ఆ స్వరం దీనంగా బ్రతిమాలుకుంటున్నట్లుగా వచ్చింది.
    మృదుల నవ్వుతూనే "ఏమిటీ! మీరు పిల్లికి కూడా భయపడతారా? పిల్లి "మ్యావ్" లో కూడా గొప్ప సంగీతం ఉంది తెలుసా?" అంటూ మొఖానికి తొడుక్కున్న ప్లాస్టిక్ పిల్లి ముఖం తీసేసి అతడి కుర్చీ చేతిమీద వచ్చి కూర్చుంది. మోకాళ్ల వరకు వున్న టైట్ ఫ్రాక్ వేసుకోవడం వల్ల తెల్లగా నున్నగా కనిపిస్తున్నాయి మోకాళ్ళు. వాటి వేపు చూడాలని ఎంత కుతూహలంగా వుంటుందో అంత బాధగానూ వుంటుంది భాగవతార్ కి.
    ఎప్పుడూ పరాగ్గా ఆలోచించుకోవడం భాగవతార్ కి అలవాటు. రకరకాల ప్లాస్టిక్ మొహాలు తొడుక్కుని అతను పరాగ్గా వున్నప్పుడల్లా భయపెట్టడం మృదులకి సరదా. అంత పెద్దమనిషి అంతర్జాతీయ సంగేతవిద్యాంసుడు చిన్నపిల్లాడిలా భయపడుతూంటే చూడ్డానికి చాలా ఫన్నీగా వుంటుంది. ఆమె గదిలో గోడలమీద ఒక దానిపైన మరొకటి పేర్చిన స్టాండ్స్ మీద రకరకాల జంతువుల భూతాల కార్టూన్ ప్లాస్టిక్ ముఖాలు తగిలించి వుంటాయి. ఆ గది ఒక గృహిణి పడగ్గదిలాగ కాక చిన్నపిల్ల బొమ్మల గదిలా తోస్తుంది. అయితే, ఇది ఆ గదిలోని మొదటి భాగం మాత్రమే. గది రెండోవైపు వుడెన్ షెల్ఫ్స్ లో రకరకాల పుస్తకాలు, సగం, సగం వ్రాసి పెట్టిన కాగితాలున్న ఎన్నెన్నో ఫైల్సు, ఒక క్రమంలో సర్ది వుంచిన పాటల కాసెట్స్ లైబ్రరీ, మరోప్రక్క వీడియో కాసెట్స్ లైబ్రరీ వుంటాయి. ప్లాస్టిక్ ముఖాలతో ఆడుకుంటున్నా, సేకరించిన మెటీరియల్ ఫైల్ చేసుకుంటున్నా, రికార్డు చేసిన వీడియోలు చూస్తున్నా మృదుల మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. కన్నీళ్ళు, ఏడుపు, బాధ, చికాకు మొదలైన మాటలు ఆమె నిఘంటువులో లేవు. 
    "నువ్వు ఇలాంటి గౌనులు వేసుకోవడం నాకు బాగుండవు" ఏడుపు మొహంతో చెప్పాడు భాగవతార్.
    "నాకు తెలుసు. నేను ఇలాంటి గౌన్లు వేసుకున్నప్పుడల్లా, నువ్వలా అంటూనే వున్నావు."
    "అంతేగాని, నువ్వీ గౌనులు వేసుకోవడం మనవన్నమాట."
    "నేనెందుకు మానటం. నాకీ గౌను బానేవుంది."
    "నాకు బాగుండలేదని మానెయ్యొచ్చుగా!"
    "నీకు బాగుండకపోతే యిలాంటి గౌన్లు నువ్వు వేసుకోవద్దు. నువ్విలా ఏడ్పు మొహంపెట్టి మాట్లాడ్డం నాకు బాగాలేదు. నువ్వు మానగలవా?" పక పక నవ్వుతూ, ఆ నవ్వుకి అనుగుణంగా అతని తలమీద చేతులతో మద్దెల వాయించింది.
    "ఎలా వుంది వాయిద్యం? మొన్న ఏం డెటో డైనింగ్ టేబిల్ మీద యిలా వాయించి చూపించాడు."
    "ఎప్పుడూ" ఏడుపు మొహం తప్పడంలేదు భాగవతార్ కి.
    "టీకి వచ్చినప్పుడో, లేక డిన్నర్ కి వచ్చినప్పుడో నాకు గుర్తు రావడం లేదు."
    "ఎప్పుడు పిలిచావు అతన్ని డిన్నర్ కి?"
    "అదీ గుర్తులేదు. ఎప్పుడో నువ్వు లేనప్పుడు ఒక్కదానికి బోర్ కొడితే పిలిపించుంటాను."
    జుట్టు పీక్కున్నాడు భాగవతార్.
    "అస్తమానూ అలా జుట్టు పీక్కుంటే బట్టతల మరికాస్త పెద్దదౌతుంది." పకాలున నవ్వింది. ఆ అమ్మాయి నవ్వినప్పుడల్లా ఎక్కడో కొండల్లో పుట్టిన సెలయేరు అడ్డూ అదుపూ లేకుండా బండరాళ్ళను తప్పించుకుంటూ ఎక్కడికో గలగల ప్రవహిస్తున్నట్లు ఆహ్లాదకరంగా వుంటుంది. ఏదో ఉత్సాహం నవచైతన్యం ఆమె అణువణువునా వెల్లి విరుస్తున్నట్లు మెరిసిపోతుంది. ఇరవై యేళ్ళు ఇంకా నిండలేదు ఆ పిల్లకి. చేసుకునే అలంకరణ వల్లనో మనసులో వున్న నైర్మల్యం వల్లనో ఉన్న వయసు కంటే చాల చిన్నదానిలా పదహారు దాటని దానిలా కనిపిస్తుంది.
    మృదుల నవ్వగానే గబుక్కున జుట్టు పీక్కోవడం ఆపేసాడు భాగవతార్. మృదుల మరింత నవ్వుతూ అతడి జుట్టు చిలిపిగా రేపిపారేసి పరుగులు తీస్తూ టి.వి. రూమ్ లోకి వెళ్ళిపోయింది. ఆ పిల్ల సాధారణంగా నడవదు పరుగులే. దిగాలు పడిపోయాడు భాగవతార్. మృదుల చిలిపి చేష్టలు, చిలిపి అల్లరి అతడికెంతో యిష్టం. తను ఉత్సాహంగా వుండడమే కాదు. తన పరిసరాలలో అందరికీ ఉత్సాహాన్ని ప్రసరింప చేస్తుందా అన్నట్లు ఎవ్వరినీ స్తబ్దంగా వుండనివ్వదు. ఆమె కళ్ళ ఎదుట వున్నంతసేపూ సప్తవర్ణాల హరివిల్లు ఆకాశంతో నిమిత్తం లేకుండా నాట్యం చేస్తున్నట్టే వుంటుంది. ఆ మెరుపులు, ఆనందింపజేస్తాయి, మైమరపిస్తాయి, కాని భయపెడతాయి కూడా_ముఖ్యంగా భాగవతార్ ని. అతనికి ఈ నాటికి సమాధానం దొరకని ప్రశ్న నలభై పై బడిన తనని మృదుల ఎందుకు ఏరికోరి పెళ్ళి చేసుకుందాని?
    సరిగ్గా సంవత్సరం కిందట_
    రవీంద్రభారతిలో పాటకచ్చేరి చేస్తున్నాడు. ఎప్పటిలానే రవీంద్రభారతి పైనా కిందా కూడా నిండిపోయారు జనం. టిక్కెట్టు కొనుక్కుని వచ్చినవాళ్లే ప్రేక్షకులందరూ, మూడున్నర గంటలసేపు సాగిందా కచేరి. భాగవతార్ కర్నాటక సంగీత కచ్చేరికి అమెరికానించి వచ్చి భాగవతార్ శిష్యుడైన ఏండెటో మృదంగ వాయిద్యం ఒక ప్రత్యేక ఆకర్షణ. పాట కచ్చేరీ పూర్తయ్యాక అభిమానులు ఒకరినొకరు తోసుకుంటూ స్టేజిమీదకి ప్రవాహంలా రాసాగారు. వాలంటీర్లు, పోలీసులు వాళ్ళనదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు పూలదండలు తీసుకొచ్చి మెడలో వేస్తున్నారు. మరికొందరు పాదాలకు నమస్కరించి పాదధూళి శిరస్సున ధరిస్తున్నారు. ఈ అభిమానుల గౌరవ ప్రశంసలకు పొంగిపోతూనే వాళ్ళని తప్పించుకుని బయటపడడానికి ప్రయత్నిస్తున్నాడు భాగవతార్. ఫ్లాష్ కెమెరాలు క్లిక్, క్లిక్ మంటున్నాయి. ఈ సందట్లో పంజాబీ డ్రస్సులో హైహీల్స్ వేసుకున్న అమ్మాయి జనాన్ని తోసుకుంటూ వచ్చేసి భాగవతార్ బుగ్గమీద ముద్దు పెట్టేసుకుని రెండుచేతులూ పట్టుకుని వూపుతూ, "మార్వెలెస్_వండ్రఫుల్_వసంతరాగం పాడితే మోడులు చిగురిస్తాయని, దీపక్ రాగం పాడితే చీకట్లో దీపాలు వెలుగుతాయని_" మేఘ మల్హర్ పాడితే మండు వేసవిలో చినుకులు పడతాయని వర్ణిస్తారే అలా వుంది మీ పాట.
    కదలకుండా అయిదు నిముషాలు కూర్చోలేను. మూడున్నర గంటలు కదల్లేకపోయానంటే నాకే ఆశ్చర్యంగా వుంది. ఆటోగ్రాఫ్ ప్లీజ్! ఎర్రగులాబీ పువ్వులాంటి లేత అరచేతిని ముందుకు జాపింది. ఇదివరల్లో కొందరు అరచేతిలో ఆటోగ్రాఫ్ లు పెట్టమని అడిగినప్పుడు భాగవతార్ అదేదో అవమానమన్నట్లు భావించి వాళ్లపైన కళ్ళెర్ర జేసేవాడు. ఈ పిల్లలో యేముందో కోపం తెచ్చుకోవడం అతనికి సాధ్యం కాలేదు. ఏండెటో దగ్గిర బాల పాయింట్ పెన్ తీసుకుని ఆ అమ్మాయి అరచేతిలో ఆటోగ్రాఫ్ చేసాడు. కెమెరాలు మళ్ళీ క్లిక్ మన్నాయి. ఆ మర్నాడు అన్ని పేపర్లల్లోను ఆ అమ్మాయి భాగవతార్ బుగ్గమీద ముద్దు పెట్టుకుంటూన్న ఫొటో వచ్చేసింది. అది చూసి భాగవతార్ మండిపడుతూ, "ఈ పత్రికల వాళ్ళకి బుద్ధిలేదు. ఏ ఫోటో పడితే ఆ ఫోటో వేసేస్తారు. ఛీ, ఛీ," అని విసుక్కున్నాడు. విసుక్కుంటూనే ఆ ఫోటోవైపు మరో నాలుగుసార్లు చూసుకున్నాడు. ఏండెటో నవ్వుతూ "కోపం దేనికి సార్, దిసీజ్ ది బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ యూ, మీరు గర్వపడాలి" హౌ బ్యూటిఫుల్ యీజ్  షీ? అన్నాడు. ఫొటోవైపు మరోసారి చూసాడు భాగవతార్. పొటో చూస్తున్న కొద్దీ అంతకుముందు ఎన్ని సంవత్సరాలుగానో పోగొట్టుకున్న ఆత్మవిశ్వాసం తిరిగి తనలో చేరుకుంటున్నట్టుగా తోచింది. పదిహేనేళ్ళ కిందట అతనొక అమ్మాయిని ప్రేమించాడు. అప్పటికి అతను సంగీత విద్వాంసుడిగా యింత ప్రఖ్యాతిగాంచలేదు. ఆ అమ్మాయి మధ్యతరగతి కుటుంబీకుల పిల్లే, అయినా, "ఏం చూసి చేసుకోమంటావు నన్ను?" అని నిరసనగా నవ్వేసింది. ఇప్పుడా అమ్మాయి ఎక్కడుందో తెలియదుగాని ఆ తరువాత అతడు మరో స్త్రీని పెళ్ళి చేసుకోమని అడగలేకపోయాడు. అవమానాలు భరించే శక్తి లేదతనిలో.
    రెండ్రోజుల తరువాత కొత్త స్వరకల్పన ఆలోచిస్తున్న భాగవతార్ "వచ్చేసానండీ!" అన్న తియ్యని మాటలకు ఉలిక్కిపడి తలెత్తాడు. ఎదురుగా రవీంద్రభారతిలో అమ్మాయి. ఈసారి పాంట్ షర్టులో వుంది. "రెండు రోజుల్నించి తెగ ఆలోచించానండి. ఒక నిర్ణయానికొచ్చేసాను. నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను. ఆఫ్ కోర్సు మీరు ఒప్పుకుంటేనే అనుకోండి" అని నవ్వేసింది. ఆ అమ్మాయి వేళాకోళం చేస్తోందో నిజంగా మాట్లాడుతోందో అర్ధంకాలేదు భాగవతార్ కి. కంగారుగా "ఏమిటేమిటి?" అన్నాడు.
    "పెళ్ళిసార్! పెళ్ళి!" చేతులతో మంగళసూత్రం కట్టడం అభినయించి చూపింది.
    "నీకు అమ్మానాన్నాలేరా?"
    "ఉన్నార్ సార్, మా నాన్నగారు ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్. మా అమ్మ ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్. నేనింకా వాళ్ళకి చెప్పలేదు. ముందు మనం నిర్ణయించుకోకుండా పెద్దవాళ్ళకెందుకు చెప్పడం?"


Related Novels


 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.