TeluguOne - Grandhalayam
కోమలి పిలుపు

                                కోమలి పిలుపు
                                                          --వసుంధర
   
   
                                

 

     

    అతను ఈల వేశాడు.
   
    ఆమె వెనక్కు తిరిగింది.
   
    అంతవరక్జూ ఆమె ముందు నడుస్తున్నది. అతడు అనుసరిస్తున్నాడు. ఇప్పుడిద్దరూ ఒకరి కొకరు అభిముఖంగా ఉన్నారు.
   
    అధి నిర్మానుష్యమైన దారి ఏమీ కాదు. అయితే ఆ దారిలో ఎక్కువగా వెళ్ళేది విద్యార్ధినీ-విద్యార్దులే__ ముఖ్యంగా ఆ సమయంలో.
   
    అతన్ని ఆమె చూసింది. అతడామెను చూశాడు.
   
    అతడి ముఖంలో గోపికలను అల్లరిపెట్టే శ్రీకృష్ణుడి నిర్లక్ష్యం ఉన్నది. ఆమె ముఖంలో ఉదయభానుడి ఎరుపు ఉన్నది.
   
    ఇద్దరూ కొద్దిక్షణాలు పరస్పరం చూసుకున్నారు.
   
    అతను మళ్ళీ ఈల వేశాడు.
   
    ఇది చాలా అరుదైన సంఘటన.
   
    సాధారణంగా అక్కడ రివాజు ఏమిటంటే-మగపిల్లల ఈలలకు, చప్పట్లకు, వ్యాఖ్యానాలకు ఆడపిల్లలు వెనక్కి తిరక్కూడదు. ఒకవేళ ఆడపిల్లలలా వెనక్కు తిరిగితే, తామెవరో గుర్తు తెలియకుండా ఉండడం కోసం మగపిల్లలు వెనక్కు తిరిగిపోవడమో, అటూ ఇటూ దిక్కులు చూడడమో చేస్తారు.
   
    ఆమె వెనక్కి తిరిగింది. నువ్వేనా? అన్నట్లు అతడిని చూసింది.
   
    అతడు నిర్లక్ష్యంగా నిలబడ్డాడు. నేనే అన్నట్లుచూడడమే కాక మరోసారి ఈలవేశాడు.
   
    ఇప్పుడామె ముఖం మధ్యాహ్న సూర్యుడిలాగున్నది.
   
    అతడి ముఖంలో శ్రీకృష్ణుడి ఛాయలింకా బలపడుతున్నవి.
   
    ఆమె అతడ్ని సమీపించి ఊహించని విధంగా "నువ్వు రెండుసార్లు ఈలవేశావు కదూ?" అన్నది.
   
    "అవును" అన్నాడతనోసారి కాలరును సవరించుకుని.
   
    ఆమె మెరుపు వేగంతో తన కాలి చెప్పుతీసి, రెండుసార్లు అతడి దవడ వాయించి-మళ్ళీ చెప్పు తొడుక్కుని వెళ్ళిపోయింది.
   
    అతడికిది వూహించని సంఘటన అయుండాలి. అతడి ముఖంలో శ్రీకృష్ణుడికంటె శిశుపాలుడి ఛాయలు ఎక్కువగా ఉన్నాయిప్పుడు.
   
    అతడికంటే ఎక్కువగా ఈ సంఘటనకు నేను భయ భ్రాంతున్నయ్యాను. ఎందుకంటే నాకు అతడు, ఆమె కూడా తెలుసు.
   
    అతడిపేరు కొండల్రావు. వూళ్ళోని ఆడపిల్లలకు సింహస్వప్నం. రౌడీ అనీ గూండా అని కూడా చెప్పుకుంటారు. ఒకరి జోలికి వాడు వెళ్ళడమేగానీ వాడి జోలికి ఎవరూ వెళ్ళరు. వాడు చాలా ప్రమాదకరమైన మనిషి. వాడికి వయసేం తక్కువలేకపోయినా కొన్ని రాజకీయ ప్రయోజనాలకోసం కాలేజీలో బియ్యే కొనసాగిస్తున్నాడని చెప్పుకుంటారు. ఆడపిల్లలు వాడ్ని తప్పించుకుని తిరుగుతారు. తప్పించుకోలేకపోతే అవమానాన్ని భరిస్తారు. భరించలేక ఎదురు తిరిగితే మరింతగా అవమానపడతారు.
   
    బురదలో రాయివేస్తే మన బట్టలే పాడవుతాయి. కొండల్రావు బురదవంటివాడు.
   
    ఇప్పుడామె బురదలో రాయి వేసిందనే చెప్పాలి.
   
    ఆమె పేరు కోమలి. ఆమెది మా పొరుగిల్లు. పక్కింటమ్మాయి__అని నాకు బాగా దగ్గర స్నేహితులతో ఆమె గురించి అంటూంటాను.
   
    మా ఇద్దరికీ మూడు సంవత్సరాల వయోభేదం ఉన్నది. ఆమె నా కంటె చిన్నది. అయినప్పటికీ చిన్నప్పట్నించీ మేమిద్దరం కలిసి ఆడుకున్నాం. ఆమెకు అయిదు సంవత్సరాల వయసు నుంచీ నాకు తెలుసు. చాలా విషయాల్లో మా ఇద్దరివీ అభిప్రాయాలు ఒకటి. మేము మంచిస్నేహితులం.
   
    ఆమె గురించి స్నేహితురాలిలా తప్ప మరో విధంగా ఆలోచించడం నాకిష్టముండదు. అయినప్పటికీ తప్పడం లేదు. అందుకు కారణం వయసు ప్రభావమని మనసు అంటుంది. స్నేహితుల ప్రభావమని నేననుకుంటాను.
   
    స్నేహితులు అనుకునేందుకు నాకు మరీ ఎక్కువమంది లేరు నిజంగా చెప్పాలంటే నేను పూర్తిగా మనసు విప్పి మాట్లాడగలిగినది ఒక గోపీ వద్ద మాత్రమే. ఆ గోపీతో పాటు ఎప్పుడూ కలిసి వుండడం వలన రఘు కూడా నాకు దగ్గరయ్యాడు ఎటొచ్చీ గోపీ ఉన్నప్పుడు మాత్రమే మేమిద్దరమూ కలిసి వుంటాం.
   
    గోపీ నాతో తరచుగా అంటూండేవాడు...
   
    అసలు పిల్లలు బడికి వెళ్ళడం ఎందుకంటే__గోపీ చెప్పాడు. తల్లిదండ్రులు పిల్లలను గారాంచేసి అపురూపంగా పెంచుతారు. తామేదో ప్రత్యేకామినవారనీ, ప్రపంచమంతా తామంటే అమిత శ్రద్ద వహిస్తుందనీ పిల్లలకు అనిపించేలా చేస్తారు. తమ లోపాలు తెలుసుకుని పదిమందిలో తమకు తాముగా బ్రతకడం తెలుసుకొనడం కోసం పిల్లలు బడికి వెళ్ళాలి లేకపోతే చదువంతా ఇంట్లోనే కూర్చుని ప్రయివేటుగా పూర్తి చేసేయవచ్చు.
   
    అలాగే చిన్నతనంలో నేర్పే పాఠాలు నిత్యజీవితానికి అవసరమైనవి కావు. మనిషి తనకున్న జ్ఞాపకశక్తిని పెంపొందించుకొనడానికీ, మెదడును సునిశితం చేసుకునేందుకూ అవి శిక్షణనిస్తాయి.


Related Novels