TeluguOne - Grandhalayam
తులసి

                                            తులసి
                                                               ---- యండమూరి వీరేంద్రనాథ్
    అర్ధరాత్రి

    ఒక అజినపత్ర నిద్రలేచిన వేళ -

    శ్మశానపు నడిబొడ్డున ఖద్యోదుడు ఆవిర్భవించినట్టు పశ్యత్పాలుడి పాలనేత్రం నుంచి ఎగిసినట్టు మంటలు. టపటప కొట్టుకున్న నాగాంతకపు రెక్క ఎగిసిపడిన కృకవాకువు రక్తం. వికృతమైన సకృత్ప్రజనపు అరుపు. కృకలాసపు నిర్నిమేషపు కన్ను.

    ఉన్నట్టుండి అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. చరాలు ఆచరాలై -నడిచి వస్తున్న మనుష్యుల్ని చూసి మౌనం వహించాయి.

    దూరంగా చీకట్లోంచి ఒక గుంపు వస్తూంది, నెమ్మదిగా నడుస్తూ.........

    వాళ్ళ కళ్ళు సగం మూసుకుని వున్నాయి. అయినా శ్మశానపు అణువణువూ తెలిసినట్టు కదిలివస్తున్నారు, క్రమబద్దంగా, లయబద్దంగా వాళ్ళు అలా కదిలి వస్తూంటే ఒక కెరటం ఉవ్వెత్తున ఎగిసి ముందుకు వస్తున్నట్టుంది. వాళ్ళ చేతుల్లో కాగడాలు అర్ధరాత్రి శత్రురాజ్యం మీద దండెత్తడానికి బయల్దేరిన సైనికుల్లా వున్నాయి.

    అందులో ప్రతీ ఒక్కడూ క్షుద్రదేవతోపాసకుడే.

    చనిపోయిన తన సహచరుణ్ని చూడడానికి, బిస్తా గ్రామం నుంచి బయల్దేరి శ్మశానానికి వస్తున్నారు వాళ్ళు.

    సరిగ్గా ఇరవై నాలుగు గంటల క్రితం కాద్రా చనిపోయేడు. బిస్తా గ్రామపు మహా మాంత్రికుడు కాద్రా. కాష్మోరా అనే క్షుద్రదేవతని ఉపాసన చేస్తుండగా ముగ్గురు నాగరీకులు కార్లో (ఈ కారు అనే పదం అక్కడ చాలా మందికి తెలీదు) వచ్చి అతన్ని చంపేసేరు.

    బిస్తాలోకి పరాయి వాళ్ళు వచ్చేరు. వచ్చి తమ తాలూకు మనిషిని చంపేసేరు.

    చనిపోయిన మంత్రగాని చుట్టూ ఇరవై నాల్గు గంటలపాటూ క్షుద్ర దేవతలు ఆవరించి వుంటాయి... ఆ తరువాతే అతణ్ని చూడాలి. అందుకే వాళ్ళు బయల్దేరారు. అయితే కేవలం చూడ్డానికే కాదు.

    వాళ్ళ పెదవులు ఛందోబద్దంగా కదులుతున్నాయి.

    ఉక్త అత్యుక్త మధ్య ప్రతిష్ట గాయత్రి ఉష్ణిక్కు, అనుష్టుప్పు. ప్రజ్ఞి -అతిశక్వరి - అషి, ధృతి, కృతి, ఉత్కృతి మొదలైన ఛందస్సులకి రాక్షసగణాల్ని చేర్చి క్షుద్రదేవతల్ని పిలుస్తున్నారు వాళ్ళు. అవర్ణ వివర్ణ వార్యాసూర్త క్రోధ భ్రంశ క్షుద్ర స్వేద ఉన్మాదములయిన పైత్యములతో తమ శత్రువు చచ్చిపోవడం కోసం వాళ్ళు మంత్రాల్ని జపిస్తున్నారు.

    నెమ్మదిగా వాళ్ళు శ్మశానపు నడిబొడ్డుకు చేరుకున్నారు.

    మంటలు ఉజ్వలంగా వెలుగుతున్నాయి.

    అక్కడ నిలబడి వున్నాడు -

    విషాచి.

    బిస్తా గ్రామంలోకెల్లా వయసు మీరినవాడు అతడు. చర్మం సాగి వేలాడుతోంది. మంట వెలుగు వాలిన రెప్పల క్రింద కాళ్ళమీద వికృతంగా మెరుస్తూంది రొమ్ముమీద ఎముకలు చర్మంనుంచి బయటకు పొడుచుకు వచ్చినయ్. నడుముకి చిన్న గుడ్డ తప్ప ఇంకేమీ లేదు.

    సరిగ్గా పన్నెండయింది.

    దివిటీలు అక్కడికి చేరుకున్నాయి. చిన్నలు, పెద్దలు, యువకులు, వృద్ధులు అందరూ వున్నారక్కడ. మొత్తం బిస్తా గ్రామమే అక్కడికి చేరుకొన్నట్టు వుంది.

     వాళ్ళు ఎన్నో మరణాల్ని చూసిన వాళ్ళు - మరణాల మధ్య బ్రతుకు తున్నవాళ్ళు, మరణాన్ని బ్రతుకు తెరువుగా చేసుకున్నవాళ్ళు.

    అయినా మరణం అంత భయంకరంగా వుంటుందని వాళ్ళకి తెలీదు. అప్రయత్నంగా 'హ' అన్నారు. ఒక్కసారిగా అంతమంది నోటినుంచి వచ్చిన శబ్దం గాలిలో హిప్ మన్న శబ్దం చేసింది. ఒక డేగ రెక్కలు టపటపా కొట్టుకుంది.

    వాళ్ళముందు కాద్రా శవం భయంకరంగా వుంది -వళ్లు జలదరించేలా..

    అప్పటికి కాద్రా మరణించి ఇరవై నాలుగు గంటలు అయింది. రక్తం పీల్చేయబడిన శరీరం, గాలిపోయిన బ్లాడర్ లా వుంది. ఒక డేగ పీకినట్టుంది - కన్ను ముఖంనుంచి బయటకొచ్చి , ఎలక్ట్రికల్ వర్లు ఆధారంగా వేలాడుతున్న హోల్డర్ లా నరాల ఆధారంతో వేలాడుతూంది. నోటి దగ్గర రక్తం గడ్డకట్టింది. ఏ నక్కో పీక్కుతినట్టు తొడ దగ్గిర మాంసం నల్లగా కమిలిపోయింది. సగం గోతిలో, సగం పైనా పడటంతో చెయ్యి మాత్రం పైకి కనబడుతూంది.

    అక్కడున్న వాళ్ళందరూ ఆ శవాన్నే కన్నార్పకుండా చూస్తున్నారు. కొంతసేపు క్రితమే వాళ్ళకు తెలిసింది కాద్రా కాష్మోరాని ప్రయోగిస్తున్నాడని.

    అప్పటి వరకూ ఆ రహస్యం తెలిసినవాళ్ళు  ఇద్దరే.

    ఆ గ్రామ పెద్ద విషాచి, కాద్రా రక్తం తుడిచిన వృద్ధుడు. వాళ్ళిద్దరికే తెలుసు కాద్రా కాష్మోరాని నిద్రలేపుతున్న సంగతి. ఇరవై రోజులు క్రితం విషాచి కాద్రాని కలుసుకున్నాడు. కాష్మోరా వంటి భయంకరమైన క్షుద్రదేవతని నిద్ర లేపే ప్రయత్నం చెయ్యొద్దన్నాడు. కాద్రా వినలేదు. దానికి ఫలితం అనుభవించాడు. ఐతే దానికి కారణం ఎవరో ముగ్గురు వచ్చారు. వృద్ధుడు వాళ్ళకి కాద్రా ఎక్కడున్నాడో చెప్పాడు. అంతే. తెల్లవారు జామున శ్మశానం నడిబొ్డులో కాద్రా చచ్చిపడున్నాడు.

    రక్తం పీల్చెయ్యబడి -

    కాద్రా మరణం సంగతి ప్రొద్దున్న తెలిసింది. ఓ కుర్రవాడు చూసేడు శవాన్ని. ఊళ్ళోకొచ్చి విషాచికి చెప్పి - ఆ తర్వాత అరగంటలో రక్తం కక్కుకుని చచ్చిపోయాడు. విషయం తెలిసిన వెంటనే ఎవరూ శ్మశానం వైపు వెళ్ళకుండా కట్టుదిట్టం చేసేడు విషాచి.

    కాష్మోరాని లేపడమే కష్టం ఆఖరి అంకం అంత కష్టం కాదు. బొమ్మని మంటల్లో వేస్తే చాలు, ఆరాధన పూర్తయినట్టే.

    మరేమిటి అడ్డు పడింది?

    లక్ష ప్రశ్నలు అక్కడి వారిని వేధిస్తున్నాయి.

    వాళ్ళ ఆలోచనలు భంగపరుస్తూ విషాచి ఒరియాలో బిగ్గరగా ఏదో అన్నాడు. వాళ్ళలో నలుగురు యువకులు ముందుకు వచ్చారు. మళ్ళీ అతడేదో అన్నాడు. అందులో ఒకడు వంగి కాద్రా శరీరాన్ని గోతిలో నుంచి బయటకు లాగేడు. శవం గుండె భాగంలో చిన్న క్రాస్ లాగా రంధ్రం చేయబడింది. గులాభి అంటుని తీసినట్టు వేళ్లతో గుండెని పైకి పెకిలించి సహచరుడికి అందించాడు. తరువాత శవాన్ని తిప్పి, బోర్లా పడేలా చేసేడు. చెవుల వెనుకనుంచి చర్మాన్ని కోసి ఒక్కసారి వేళ్ళతో కదిపేసరికి స్కల్ ముందుకు వెళ్ళిపోయింది. మెదడుని బయటకు తీసేడు.

    బిస్తా గ్రామంలో కెల్లా గొప్ప మంత్రగాడు కాద్రా. అంత గొప్ప మంత్రగాడి గుండెకీ, మెదడుకీ, ఎంత విలువుంటుందో క్షుద్ర విద్యలతో పరిచయం వున్న వాళ్ళకి తెలుస్తుంది.

                                                                    *********

    మంత్రగాణ్ని దహనం చెయ్యరు. పాతి పెడ్తారు. ఆ పాతి పెట్టడం కూడా పూర్తిగా పాతి పెట్టరు. శరీరం అంతా భూమిలో వుంటుంది. ఒక చెయ్యి మాత్రం బయటికి వుంటుంది...

    క్షుద్ర దేవతల పిలుపు నందుకోవడం కోసం అలా చెయ్యి బయటకు వుంచాలని వాళ్ళ విశ్వాసం. ఏ నక్కా పీక్కు తినకపోతే మాంసం శుష్కించి కేవలం ఎముకల అరచెయ్యి భూమిలోంచి బయటకు పొడుచుకు వచ్చినట్టు భయంకరంగా ఉంటుంది.

    శవాన్ని పాతిపెట్టిన తరువాత కృకవాకువు రక్తాన్ని తీర్ఘంగా సేవించి గ్రామం వైపు సాగిపోయారు వాళ్ళు.

    వృద్ధుడూ, విషాచి కనుసైగ నందుకుని ఇంకొక కుర్రవాడూ మాత్రం ఆగిపోయారు. వెళుతున్న వాళ్ళకి తెలుసు, ఆ కుర్రవాణ్ణి గ్రామ పెద్ద ఆగిపొమ్మనాడంటే - ఇంకొన్ని సంవత్సరాల్లో ఆ గ్రామంలో మరో మహా మాంత్రికుడు తయారవ్వబోతున్నాడన్న మాట. విషాచి దయకు పాత్రుడయినవాడు ఎంతో అదృష్ట వంతుడు. ఎన్నో సంవత్సరాలు శుశ్రూష చేస్తే గానీ యువకులకు గురువు అనుగ్రహం దొరకదు. అది దొరికి, సాధన చేసి పరిపూర్ణత సాధించేసరికి వృద్ధాప్యం వస్తుంది.


        నిజమైన మంత్రగాడెవడూ యాభై సంవత్సరాలకి ముందు సిద్ధత్వం పొందడు. కానీ ఆ కుర్రవాడు అదృష్టవంతుడు. ఇరవైయ్యేళ్ళకే మహా మాంత్రికుడవబోతున్నాడు.


Related Novels