Previous Page Next Page 

మారణహోమం పేజి 2

   
    
    అతని కళ్ళు స్కూటర్ వాలా దగ్గర ఉన్న బ్రీఫ్ కేసు మీద పడింది.   
    "బ్రీఫ్ కేసు తెరు" అన్నాడు.   
    వెంటనే స్కూటర్ కిక్ కొట్టి స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు స్కూటర్ వాలా.   
    పోలీసు తన బుల్లెట్ మీద ఎక్కి తరిమాడు. రెండొందల గజాల తర్వాత బాలన్స్ తప్పి కిందపడ్డాడు స్కూటర్ వాలా.   
    అతని బ్రీఫ్ కేసులో నుండి కిందపడ్డాయి అమెరికన్ డాలర్ నోట్లు!   
    వెంటనే అతన్ని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి తీసుకెళ్ళారు ప్రశ్నించడానికి.   
    అతనిపేరు జగ్ మోహన్. మొదట్లో కలిగిన భయాన్ని అప్పటికి అణుచుకోగలిగాడు అతను. బుకాయించడం మొదలెట్టాడు. ఆ బ్రీఫ్ కేసు అసలు తనది కాదన్నాడు.   
    బ్రీఫ్ కేసులు తారుమారు అయి ఉంటాయన్నాడు. అమెరికన్ డాలర్ అంటే ఎలా ఉంటుందో తను ఇప్పుడే చూస్తున్నానన్నాడు 

    రెండ్రోజులపాటు అలా మొరాయించాడతను.   
    మూడోరోజున 'థర్డ్ డిగ్రీ' ఉపయోగించడం మొదలెట్టారు పోలీసులు.   
    పైకి కనబడని పోలీసు దెబ్బలు తినడం మొదలెట్టి పదహారు గంటలు గడిచాక అతను చెప్పడం మొదలెట్టాడు.   
    అతను చెబుతున్నది వింటుంటే కవితాగానం వింటున్నట్లనిపించింది పోలీసులకి. ఎన్ని విషయాలు ఒకటా రెండా? వందలు! వేలు!   
    వాటన్నిటి వెనకా నిఖిల్ ఉన్నాడని తెలియడంతో తమ చెవులని తామే నమ్మలేక పోయారు వాళ్ళు.   
    నిఖిల్ దొరికిపోబోతున్నాడు! చిట్టచివరికి!   
    నిఖిల్! చట్టానికి అందడనుకున్న నిఖిల్! ఒక అనుచరుడి పొరబాటు వల్ల దొరికి పోబోతున్నాడు.   
    ఆ తర్వాత ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసి, నిఖిల్ అరెస్టుచెయ్యడం ఎంతోసేపు పట్టలేదు. ఆ వార్త తెల్లవారేలోపల నగరమంతా కార్చిచ్చులాగా వ్యాపించింది. టాప్ రాంకింగ్ ఆఫీసర్ల దగ్గరనుండి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి సందేశాలు అందాయి. నిఖిల్ మీద పెట్టబోయే కేసు నిర్దుష్టంగా, లోపరహితంగా ఉండాలని అతను చేసిన నేరాలకి హీనపక్షం యావజ్జీవ కారాగారవాస శిక్షపడుతుంది. పడి తీరాలి! కానీ అతను గుంటనక్క లాంటివాడు. కేసులో ఏమాత్రం లొసుగు ఉన్నా, జారిపోతాడు, మళ్ళీ దొరక్కుండా!   
    పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇదంతా విని విసుగ్గా తలాడించాడు. అతనికి తెలుసు. తనది భల్లూకపు పట్టు అనీ ఆ పట్టులోకి ఒక్కసారి వచ్చినవాళ్ళు ఇంక విడిపించుకు పోలేరనీ, అందరూ తనకి చిన్నపిల్లాడికి చెప్పినట్లు జాగ్రత్తలు చెప్పడం అతనికి నచ్చలేదు.   
    రేపటి నుండి హియరింగు మొదలవుతుంది. అందుకే ఆఫీసులో అంతపని. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో బాటు ఆయన స్టాఫ్ అంతా కూడా ఊపిరి తీసుకోవడం మర్చిపోయినట్లు పని చేస్తున్నారు.   
    ఆలోచనల్లో నుండి బయటపడి, శాండ్ విచ్ తినడం మొదలెట్టింది అమూల్య. తర్వాత ఫ్రిజ్ లో నుండి పాలుతీసి కోల్డు కాఫీ చేసుకు తాగింది. అపార్ట్ మెంటు తలుపులు అన్నీ భద్రంగా వేస్తుంటే అనిపించింది. తనలాంటి సింగిల్ గర్ల్ కి ఈ డబుల్ బెడ్ రూం అపార్టుమెంటు అనవసరమేమోనని ఈ అపార్టుమెంటు పిన్నీవాళ్ళు ఈ మధ్యనే కొన్నారు. ఖాళీగా ఉందని తను ఉంటోంది. త్వరలో ఇంకెవరన్నా అమ్మాయిని తోడు తెచ్చుకోవాలి. లేదా తనే వేరే చిన్న పోర్షన్ చూసుకుని వెళ్ళిపోవాలి.   
    మెత్తటి ఫోంబెడ్ మీద పడుకుంది అమూల్య. రేపటి హియరింగ్ గుర్తుస్తుంటే ఆ ఎగ్జయిట్ మెంటుతో నిద్ర కూడా పట్టేటట్లులేదు. ఏదయినా పుస్తకం చదువుతూ రాత్రి గడిపెయ్యాలనిపించింది.   
    పక్కనే వున్న బుక్ షెల్ఫులో నుండి ఒక పుస్తకం అందుకుంది.   
    సిడ్నీ షెల్దాన్ రాసిన నవల అది. రేజ్ ఆఫ్ ఏంజెల్స్ దానిపేరు.   
    కవర్ పేజీవైపు కొద్దిక్షణాలు చూసింది అమూల్య. ఎర్రటి పెద్ద అక్షరాలతో రచయిత పేరు రాసి వుంది.

    ఆ పేరు కింద రక్తం కారుతున్న నల్లగులాబి పువ్వు బొమ్మ.   
    ఆ తర్వాత నెమ్మదిగా పుస్తకం తెరిచింది.   
    పుస్తకం తెరచి తెరవగానే ఆమె కనురెప్పలు మూతపడిపోయాయి. అలసిసొలసి ఉన్న శరీరం ఆమెకి తెలియకుండానే నిద్రలోకి జారిపోయింది.   
    ఆమె ఆరోజున ఆనవలలోని మొదటి కొద్ది పేజీలు  చదివినా, ఈనాడు ఈ రచయిత ఈ నవల రాయవలసిన అవసరం వుండేది కాదు.

   
                                                          * * *
    
    కోర్టులో ప్రేక్షకుల గాలరీ క్రిక్కిరిసిపోయి వుంది. కోర్టు ఆవరణ బయట కూడా వేలమానది జనం తొక్కిసలాడుతూ నిలబడి వున్నారు.   
    కోర్టులో నిలబడి ఉన్నాడు నిఖిల్. బాగా ఒడ్డూ పొడుగూ ఉన్నాడతను. చిన్నప్పటినుండీ ఎండకీ, వానకీ గురయినట్లు కొంచెం కమిలిపోయి ఉంది శరీరం.   
    అయినా అతనిలో ఇతమిద్దంగా ఇదీ అని చెప్పడానికి రాని విలక్షణమైన ఆకర్షణ ఏదో ఉంది. అతని చూపుల్లో, నిలబడ్డ తీరులో నిర్లక్ష్యం అహంభావం కనబడుతున్నాయి.   
    బోనులో ప్రాసిక్యూషన్ సాక్షి నిలబడి ఉన్నాడు. స్టోన్ వాష్ ప్యాంటూ, కాలరులేని ముదురురంగు షర్టూ వేసుకుని ఉన్న అతని పేరు జగ్ మోహన్. కిరాయి కిరాతకుడు అతను. నిఖిల్ చేసిన చాలా నేరాలని కళ్ళారా చూసినవాడు. నిఖిల్ చేయించిన చాలా ఘోరాలని స్వయంగా చేసినవాడు అతను. డాలర్ల కేసులో దొరికిపోయాడు. అప్రూవర్ గా ఇప్పుడు రహస్యాలన్నీ బయట పెట్టేస్తున్నాడు.   
    అతన్ని అప్రూవర్ గా మార్చడంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్ర కూడా చాలా ఉంది. జగ్ మోహన్ కి ఏమీ భయంలేదనీ, భారత ప్రభుత్వమే అతని వెనక ఉందనీ, అతని ప్రాణాలకు తమందరి ప్రాణాలు అడ్డం అనీ అతనికి జీవితాంతం రక్షణ ఏర్పాటు చేయబడుతుందనీ, భరోసా ఇచ్చాడు. అప్రూవర్ గా మారితే తక్కువ శిక్షతో బయటపడేలా చేస్తానని ఆశపెట్టాడు.

  Previous Page Next Page