Next Page 

పెంకుటిల్లు పేజి 1


                                               పెంకుటిల్లు


                               -కొమ్మూరి వేణుగోపాలరావు    నాలుగు రోడ్లు కలిసే చోటుకు కొంచెం ఇవతలగా ఒక పెద్ద ఇల్లు ఉంది. ఆ సందులో మొదటి ఇల్లు అదే. పెంకుటిల్లు, ఇంటి ముందు భాగంలో ఖాళీ ప్రదేశం. చాలా దారి ఏర్పాటు చేయబడి వుంది. ఆ దారికి అటూ ఇటూ వున్న విశాలమైన ప్రదేశంలో ప్రస్తుతం చెట్టూ చేమా ఏదీ లేదు. పైపెచ్చు పరిశుభ్రం చెదురుగా వుండి ఓ విధమైన అసహ్యాన్ని కలుగ జేస్తాయి.

    ఆ పెద్ద పెంకుటిల్లు కూడా అట్లాగే వుంది. దాన్ని బాగుచేద్దామనిగాని శుభ్రంగా ఉంచుదామనిగాని ఎవరికీ ఆలోచన వున్నట్లు కనబడదు. పై కప్పు సరిగ్గా లేదు. వాన కురిస్తే నీరంతా ఇంట్లినే వుంటుంది. గోడలకు సున్నం పూసి ఎన్ని సంవత్సరాలు గడిచిందో! చాలా గాలి వానల్ని చూసిన ఆ ఇల్లు  రెండు పెను తుఫానులు వస్తే నామ రూపాలు లేకుండా సమసిపోవచ్చు.

    ఇంటి ముందున్న అరుగుమీద తాపీగా కూర్చుని చుట్ట కాల్చుకుంటున్న వ్యక్తి పేరు చిదంబరం. ఆయన వయసు నలభై అయిదు దాటింది. వేసుకున్న బట్టలు కొంచెం మాసి వున్నాయి. ఎవరికోసమో ఎదురు చూస్తున్నాడు. ఉదయం పదిన్నర దాటి వుంటుంది.

    "నాన్నా!" అని ఎనిమిదేళ్ళ పిల్ల ఛాయ బయటకు వచ్చింది. నాన్న జవాబు చెప్పకుండా ఊహాలోకంలో మునిగి వున్నాడు.

    "నిన్నే నాన్నా!"

    ఈసారి చిదంబరం ఉలిక్కిపడి చూసి "ఏమిటి?" అన్నాడు. విసుగ్గా.

    "అమ్మ భోజనానికి రమ్మంది."

    "ఎవరిని?"

    ఆ పిల్ల తెల్లబోయి "నిన్నే నాన్నా!" అంది.

    చిదంబరం ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి "అప్పుడేనా? ఇప్పుడు టైము ఎంతయింది?" అన్నాడు.

    "పది దాటిందేమో. వాళ్ళంతా కూర్చున్నారు. అమ్మ నిన్ను కూడా రమ్మంది",

    "సరే పద" అంటూ లేచాడాయన. మళ్ళీ.......ఏదో గుర్తువచ్చి పోబోతున్న కూతుర్ని పిలిచి "వాళ్ళు వస్తారేమో, నువ్వు ఇక్కడ వుండి చూస్తూ వుండు. రాగానే కూచోపెట్టు" అని లోపలకు వెళ్ళిపోయాడు. చిన్న పిల్ల ఛాయా తండ్రిగారి ఆజ్ఞ ప్రకారం అక్కడే కూర్చుని వీధిలోకి చూడసాగింది.

    చిదంబరం భోజనానికి పోయేసరికి అక్కడ చిన్న కొడుకూ, పెద్ద కొడుకూ సిద్ధంగా కూర్చుని వున్నారప్పుడే.

    భోజనం ప్రారంభించాక "ఇవాళ వంట ఇట్టా తగలబడిందేమిటే?" అన్నాడు నెయ్యి వడ్డిస్తూన్న భార్యకేసి చూసి.

    "బాగానే వుంది ఇవ్వాళ్ళ అన్నీ నేత్తో ముంచి తెలిస్తేనూ" అని జవాబు సన్నగా వినవచ్చింది.

    "నేతితోనా?"

    ఆయన ఆశ్చర్యం చూసి ఆవిడ ముసిముసిగా నవ్వి "ఆఁ" అంది.

    ఆవిడలా  నవ్వటం చూసి ఆయన గ్రహించుకొని "ఓహొ అదా?" అంటూ గబగబా అన్నం కలుపసాగాడు.

    తండ్రికి కొంచెం దూరంలో కూర్చున్న చిన్న కొడుకు వాసుదేవరావు భోజనం మధ్యలో తలయెత్తి, మెల్లగా "ఇవ్వాళ్ళ జీతం కట్టాలి నాన్నా?" అన్నాడు.

    "అలాగే కడదాం" అని సమాధానం చెప్పాడు.

    "ఇప్పుడిస్తావా మరి?"

    "నా దగ్గర డబ్బు లెక్కడివిరా?"

    వాసు కొంచెం బిక్క మొహం వేసి, "మరి అలాగే కడదాం అంటివిగా" అన్నాడు.

    "అవునురా నాయనా. కాని, ఎప్పుడూ నేనిస్తూంటేనే కడుతున్నావా?"

    కొడుకు దగ్గర్నుంచి సమాధానం రాకపోయేసరికి మళ్ళీ ఆయనే "ఎప్పుడూ ఎవరిస్తున్నారో వాళ్ళే ఇస్తారు" అన్నాడు.

    "అమ్మ దగ్గర డబ్బుల్లేవట!"

    "నేను జన్మలో నమ్మ నీ మాట."

    "నమ్మకపోతే ఎవరికి నష్టం? నిజంగా చెబుతున్నాను. నా దగ్గిర చిల్లిగవ్వకూడా లేదు" అంది ఆయనగారి అర్థాంగి.

    ఆయనగారు మాట్లాడకుండావూరుకునేసరికి యిందాకటి నుంచి మాట్లాడకుండా భోజనం చేస్తున్నా పెద్దన్నగారు నారాయణ "ఎంత కట్టాలిరా?" అని అడిగాడు.

    ఎంతకావాలో అతనికి తమ్ముడు చెప్పేక "రేపు జీతాలు వస్తాయి, ఇస్తాలే" అన్నాడు.

    తరువాత ఎక్కువ మాటలు లేకుండానే భోజనాలు జరిగాయి. చేయి కడుకున్ని వస్తూ "అమ్మాయి కనిపించలేదు" అని అడిగాడు చిదంబరం.

    "సుభద్ర గారింటికి వెళ్ళింది"

    "ఓహొ!" అని ఆయన తలవూపి యివతలకు వచ్చే లోపలే "నాన్నా" అంటూ లోపలికి పరుగెత్తుకుంటూ వచ్చింది ఛాయ.

    "ఏమిటి ఛాయమ్మా?" అని అడిగాడు చిదంబరం.

    "వాళ్ళు వచ్చారు నాన్నా!"

    వెంటనే ఆయన కంగారు పడుతూ బయటకు వచ్చి అరుగుమీద కూర్చున్న ముగ్గురి పెద్ద మనుషుల వంక చూస్తూ "ఇందాకట్నుంచి మీ కోసమే చూస్తున్నాను ఇవాళ యింత  ఆలస్యం అయిందేమిటి? గదిలోకి రండి" అంటూ ఎడమవైపున వున్న ఒక చిన్నగదిలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ పరిచివున్న చాపమీద ముగ్గురూ కూర్చున్నాక తనుకూడా కూర్చుని "ఏమిటి సంగతులు!" అని ప్రశ్నించాడు.

    "రోజూ ఏముంటాయి!" అని బదులు చెప్పారందులో ఒకాయన. అయనగారి పేరు  అవధాసులుగారు. ఏభై ఏళ్ళు పైబడిన మనిషి.

    "ఏమండీ మీరు?" అని చిదంబరం యీసారి మధ్య కూర్చున్న రామ్మూర్తిగారిని అడిగాడు.

    నా జవాబూ అదే."

    "ఇహ మిగిలింది మీరు!"

    గంగాధరంగారు నెరసిన మీసాన్ని దువ్వుకుంటూ "నా కెప్పుడూ ఒక్కటే విశేషం. మా అమ్మాయికి పెళ్ళి సంబంధాన్ని చూడడం" అని బయట గుమ్మంలోకి చూశారు.

    నారాయణ తన పాత సైకిలును బయట పెట్టుకుంటూ ఈయన మాటలు విని కాబోలు, ఒక చూపు కోపంగా విసిరి వెళ్ళిపోయాడు.

    "ఆఫీసుకు కాబోలు!"

    "మా అబ్బాయి సంగతా! అవును" అని చిదంబరం జవాబు చెప్పాడు.

    "పాపం గంగాధరంగారికి వాళ్ళమ్మాయి పెళ్ళి విషయం గురించే ఎప్పుడూ బెంగ" అన్నాడు రామ్మూర్తిగారు.

    "ఆఁ......చేసెయ్యటమంటే నాకో ప్రాబ్లం కాదు. కాస్త అయినా వారికిచ్చి చేద్దామనీ" అని గంగాధరంగారు సమాధానం ఇచ్చారు.

    చిదంబరం తనకు ఆ ధోరణి ఇష్టంలేనట్లుగా "ఇహ ప్రారంభింద్దామా?" అంటూ పేకను బయటకు తీశాడు. చాలా కొద్దిసేపట్లో ఆటలో అందరూ సంపూర్తిగా నిమగ్నులైపోయారు.                                                 2


    రాత్రి పది గంటలకు పడుకుంటూ "ఇవాళ యమగా ఆడేశాననుకో" అన్నాడు చిదంబరం.

    భార్య జవాబు చెప్పలేదు.

    "ఏమోయ్!" అన్నాడాయన మెల్లగా, మృదువుగా.

    శారదాంబ ఆయన వంక చూసింది.

    "నువ్వు నా ప్రశ్నకు ఎందుకు జవాబు చెప్పలేదో కాస్త చెప్పు" అన్నారాయన.

    "బాగుంది. ఇదీ ఒక ప్రశ్నే."

    "ఇవాళ నీతో మాట్లాడాలి. పడుకో!"

    "కూర్చునే వింటాను. చెప్పండి".

    "సరే. అయితే కూర్చునే విను." అని ఆయన మెల్లగా మంచం మీద వాలి ఉపక్రమించాడు. "చూడసలు, ఈ మధ్య నాకు బొత్తిగా తీరకుండా వుంది. ప్రొద్దున్న ఎనిమిదింటికి లేస్తానా? కాస్త స్నానమూ, అదీ చేసేసరికి పదయి వూరుకుంటుంది. ఇంతలోనే పేకాటకి వాళ్ళు వస్తారాయె? వాళ్ళు వచ్చారా? క్షణమైనా రెస్టు తీసుకునేందుకు వీలులేదు. సాయంత్రం అయిదుదాకా అలా అయిపోతుంది. తరువాత విషయం సరే సరి. అటూ ఇటూ షికారు పొయొచ్చేసరికి ఎనిమిది కొడతారు. నీ ఇంటిపనుల్లో నువ్వుంటావు. దాసీ దాన్ని పెట్టుకోవే అంటే పెట్టుకోవు. నా మాట ఒకటి వినవు కదా? అటువంటి నీతోనే ఇరవై అయిదేళ్ళు కాపురం చేశాను, చూసుకో మరి."

    ఆవిడ చాటుగా కళ్ళు తుడుచుకుని "మీరు, అసలు విషయం చెప్పనే లేదు" అంది.

    ఆయన కంగారుగా "చెబుతున్నానే! నా కేమిటో ఒక విషయం చెప్పబోతే అనేక విషయాలు వచ్చేస్తాయి అందులో నీతో మాట్లాడటానికి సావకాశం ఎప్పటికో గాని చిక్కదాయె! ఒక్కసారిగా అన్నీ కక్కేయాలని వుంటుంది. చూడసలు, మాట్లాడుతూ అసలు విషయం మరచిపోయాను" అని కొంచెం ఆలోచించాడు.

    శారదాంబ ఏదో చెప్పబోగా హడావుడిగా "ఆగు, నన్ను చెప్పనియ్యి. రాధమ్మ కెన్నేళ్ళు నిండాయి! అన్నాడు.

    "పదహారు" అందావిడ రుద్దకంఠంతో.

    "చూశావా? మనం ఇన్నాళ్ళవరకూ దాని పెళ్ళి విషయం ఆలోచించనే లేదు. మా అమ్మయినా సరిగ్గా చెప్పలేదు నాకు."

    ఆవిడ మధ్యలోనే ఆపి "అత్తగారు ఈ విషయం రోజూ చెబుతూనే వుందిగా" అంది.

    "బాగుంది-నే నబద్ధం ఆడుతున్నా నంటావా?"

    శారదాంబ జవాబు చెప్పెలోపల "సరే, ఒప్పుకుంటానయ్యా! నాకు మతిమరుపు. అమ్మ రోజూ చెబుతూనే వుంది. నాకే తీరిక వుండక ఎక్కడా సంబంధాలు  చూడటం లేదు. ఇకమీదట ఎల్లాగో తీరిక చేసుకోవాలి. ఒక్క పనా? ఒక్క యిదా? టైమంతా పేకాటలోనే సరిపోయే. ఆ విషయం అలా వుంచు. ఇంకొకటి చెబుదామనుకున్నాను. మన నారాయణకు పెళ్ళి చేయాలంటావా? వద్దంటావా?" అన్నాడు గబగబా.

    "చెయ్యాలి."

    "ఆ మాటన్నావు బాగుంది. వాడసలు ఈ విషయమే యెత్తడాయె. వాడి పెళ్ళి విషయం వాడు అడగక్కరలేదూ? నాతో అసలు సాధారణంగా మాట్లాడనే మాట్లాడడు. రేపు కనుక్కో. అన్నట్లు ఇప్పుడే గుర్తు వచ్చింది. మన ప్రకాశంగాడి నుంచి ఇవాళే వుత్తరం  వచ్చింది అర్జంటుగా డెబ్బయి రూపాయలు పంపమని రాశాడు. వాడు లేనిపోనివి కోరుతున్నాడనటంలేదు. అవసరమే. పట్నంలో వాడి  చదువు కోసం బోలెడు డబ్బు అవసరం అవుతుంది. కాని ఎలా చచ్చేది చెప్పు? నా దగ్గర దమ్మిడీ కూడ లేదని నీకు తెలుసు. మనకి వున్నది కాస్త పొలం. అదయినా సరిగా పండడం లేదు. ఆ పల్లెట్టూరు రైతు సఫాగా యి యేడు ఎగకొట్టేశాడు గదా. వింటున్నావా?"

Next Page