Next Page 

జాలిలేని జాబిలి పేజి 1


                    జాలి లేని జాబిలి


                                     -కొమ్మూరి వేణుగోపాలరావు    మధుబాబు - పదిహేనేళ్ళ వయస్సుల్లో వున్నప్పుడు కథలు రాయటం మొదలుపెట్టాడు. రాయాలన్న జిజ్ఞాస ఓ దృశ్యం చూశాక ఆనాటి సాయంత్రం కలిగింది. ఆ దృశ్యం యిది!

    ఢిల్లీనుంచి హిందూ ముస్లిం తగాదాలకు వెరచి అతని అక్క సరస్వతిని బావ పంపించేసినప్పుడు ఆమె ఒక్కగానొక్క ముద్దుబిడ్డడు నానీకి కడుపులో బల్ల పెరిగి కామెర్లు వచ్చినై. ఆ చిన్న ప్రాణాన్ని కాపాడ్డానికి మళ్ళా ప్రయత్నం  జరిగింది. మొదట కూతురు ప్రాణానికి  ప్రాణాన్ని రక్షించటానికి యింటిల్లపాదీ తల్లడిల్లిపోయారు. పదిహేనేళ్ళ మధుబాబు ఆ పసికందు అంటే ప్రాణం యిచ్చేవాడు. పసివాడు బ్రతకడని తల్లీ- తండ్రి కూతురికి తెలీకుండా దుఃఖ పడటం చూసి రాత్రంతా వెక్కివెక్కి ఏడ్చాడు. తెల్లవారింది. సూర్యుడు పదిబారలు ముందుకు పరిగెత్తాడు. ప్రపంచం అలవాటుగా సందడిలో పడింది. ముందుగదిలోంచి సరస్వతి పెట్టిన గావుకేక యిల్లంతా ధ్వనించింది. వంటింట్లోంచి నడిచివస్తోన్న మధుబాబుకు గుండె గుబగుబలాడింది. అంతా పరిగెత్తారక్కడికి. పసివాడు అంత్యదశలో వున్నాడు. అక్కవడిలో- అభాగ్యురాలి కౌగిలిలో యమకింకరులతో పోట్లాడుతున్నట్లు యాతన అనుభవిస్తున్నాడు. క్రమంగా కళ్లు తేలవేసి, ముట్టుకునేందుకు భయపడేటట్లు వున్నాడు. మధుబాబు తల్లి, తండ్రీ నిశ్శబ్దంగా ఏడుస్తున్నారు. ఇరుగూ, పొరుగువాళ్ళూ, దారినపొయ్యేవాళ్ళూ చుట్టూ మూగారు. మధుబాబు ఏడుస్తూ తల  పైకెత్తి చూశాడు. ఓ పదేళ్ల అమ్మాయి.... పెద్ద పెద్ద  కళ్ళతో ఎదురుగా నిల్చుని వుంది జనంలో చిట్టిగౌను వేసుకుని తెల్లగా, చక్కగా, బీదగా, లేతగా వుంది. జుత్తు ముఖంమీద చెదురుగా పడి ఆ ముంగురుల మధ్య కళ్ళనుండి ముత్యాల వంటి నీటిబిందువులు చిన్నారి చెంపలమీదుగా జారిపోతున్నాయి. ఆ పాప్  ఏడుస్తోంది ఏమిటి? ఏమిటి సంబంధం?ఇంత కరుణ ఎలా దాగివుంది అంత బుల్లి హృదయంలో? నానీవంకే దృష్టి నిల్పి చూస్తూ కన్నీళ్లు విడుస్తోంది....ఇంతలో....ప్రకృతి వికృతఘోష చేసింది. అంతా గొల్లుమన్నారు.

           
                                *    *    *

    దూరంగా పరిగెత్తే రైలుబండి కూత, ఎదురింట్లో మేకపోతు అమానుష పధ, అస్తమిస్తోన్న సూర్యుడి కొండశిఖరంమీద అర్థంలేని సౌందర్యం, దగ్గర్లో రావిచెట్టు చిత్రమైన ఆకుల కదలిక, యింట్లోంచి..... అబ్బా! ఈ దారుణ నిశ్శబ్దం.....

    ఆ అమ్మాయి ఎందుకు ఏడ్చింది? అనుకున్నాడు మధుబాబు డాబామీద నిలబడి ఆ సంధ్యాకాంతుల్లో.
   
    ఏదో విరక్తి యింత చిన్నవయస్సులో! అర్థంకాని అయోమయ భ్రాంతి జీవిత విషాదాలపై, నూతన ఆలోచనలపట్ల.

    అవునూ! ఏమిటి మానవత్వమంటే? ప్రపంచంలో ఒకరికీ ఒకరికీ మధ్య సంబంధమేమిటి? బ్రతుక్కీ చావుకీ తేడా ఏమిటి? ఎందుకు ఏడుస్తారు, సంతోషిస్తారు జనం ఒకరిగురించి ఒకరు? ఒకవేళ ఏకాకిగా జీవించటంలోనే సుఖం వుందేమో! సాధ్యమౌతుందా అది ఈ  భూమ్మీద?

    పడమట సూర్యుడు అస్తమించాడు. చీకటిఛాయలు  ఎగబ్రాకుతున్నాయి భూమ్యాకాశాలకు. ఎందుకీ లోతైన, వింతైన, క్లిష్టమైన ఆలోచనలు యిప్పుడు? ఆ చచ్చిపోయే దృశ్యం తనని కదిపింది, కుదిపింది. స్మశానంలో గోతిలో బొమికలుగా మారుతున్నాడు గావును నాని. అబ్బ!.....పాపం ఆ అమ్మాయి ఏడ్చింది. ఏమిటో అసంతృప్తిగా వుంది తనకు. అదేమిటో తెలీదు. ఎవరితోనైనా పంచుకోవాలి యీ అవస్థ. కాని ఎట్లా  తనకే తెలియందే? ఈ దుఃఖం, వేదాంతం, చావటం, ఏడవటం ఎట్లా భరిస్తాడు తను? అమ్మతో చెప్పుకోవాలి కోప్పడుతుంది అమ్మ నాన్నతో? అసలు వినిపించుకోడు.

    తనతోనే చెప్పుకోవాలి.

    ఆ రాత్రి..... ఆ చెలరేగిన మనసులోని దుమారంతో..... మధుబాబుకి ఏదో చప్పున స్ఫురించింది.

    అతనికి అర్థమైనట్లుగా వుంది.


                                                           *    *    *   

    రాత్రి పన్నెండు దాటుతోంది. నిద్రపోతోందో, ఏం చేస్తోందో తెలీదుగాని దుఃఖంతో అలసిపోయిన సరస్వతి ఓ గదిలో చాపచుట్టలా పడివుంది. ఢిల్లీకి- ఆమె పెనిమిటికి వైరు వెళ్ళింది. పెద్దగదిలో తల్లీ, తండ్రీ, పిల్లలూ అంతా పడుకుని వున్నారు.

    మధుబాబు చదువుకోసం ప్రత్యేకంగా ఓ గదివుంది. అతను లైటు వేసుకుని డ్రాయరుముందు కూర్చుని రాస్తున్నాడు ఏకదీక్షగా. మనుషులగురించి, మమతలని గురించి, తనకు తెలియని ప్రేమ, వాత్సల్యాలని గురించి. కుక్కపిల్ల విశ్వాసాన్నిగురించి, పులిపిల్ల క్రూరత్వాన్ని గురించి.

    అతనికి నిద్రవిషయం జ్ఞాపకం రావటంలేదు. రాస్తున్నాడు ఓపిగ్గా, పేజీలకు పేజీలు దొర్లిపోతున్నాయి. కుదురులేని అక్షరాలు గుంపులు గుంపులుగా ప్రోగుపడ్తున్నాయి.

    మధుబాబు తనకు తెలీకుండానే ఓ కథ తయారుచేస్తున్నాడు. అందులో జంతువులూ, మనుషులూ, పక్షులూ, అన్నీ పాత్రలే. అన్నీ మాట్లాడుతాయి. ఆ మాటకు భాషపొందిక లేదు. శైలి లేదు. భావం కొంచెం వున్నది. స్పష్టత బొత్తిగా లేదు. ఉండదు, వుండకూడదు. ఆ ఉద్రిక్తస్థితిలో అసలు స్పష్టతవున్న బాధలో నిగూఢత వుండదు. ఒక చావు మనిషిని కన్నీళ్ళపాలు చేయవచ్చును గాని ఆ కన్నీళ్ళు కేవలం ఆ ఒక్కచావునిగురించే భాషతో సాము చేయనక్కరలేదు. అవధులేని ఆంతర్యం ఎక్కడవుందో నిజమైన మానవత్వం అక్కడే మిళితమై వుంది. మంచీ-చెడూ, పుణ్యం-పాపం, శాంతి-భీభత్సం అన్నీ కలగా పులగంగా కలిపి వున్నవాడే సమగ్రమైన మానవుడు.

    అంతలో అతని కథలోకి ఓ పదేళ్ళ పాప ప్రవేశించింది. ఆ అమ్మాయి ఓ చచ్చిపోయిన రామచిలుకని చూసింది. ఆ అమ్మాయి ఏడ్చింది. ఇంతలోనే ఎక్కడనుంచో ఓ ఎలుక వచ్చి "పాపా!" నువ్వెందుకేడుస్తున్నావు?" అనడిగింది జాలిగా. ఆ పాప "చిలుక చచ్చిపోయింది" అని చెప్పింది. "ఈ చిలుక ఎంత అందంగా వున్నదో చూడు ఎలుకా! ఆకుపచ్చగా, బలే తమాషాగా, ఏమి సొగసు!! పాపం దాని ఆయుష్షు తీరిపోయింది" ఎలుకా ఆలోచించింది. "నే బ్రతికించనా పాపా?" "ఎలా?" "నా ప్రాణమిచ్చి" "అమ్మో! మరి నువ్వు  చచ్చిపోతూ-" చిలుక అందంగా వుంటుంది. చిలుకను చూసి ఆనందిస్తారు. నాప్రాణం వుండి లాభమేమి?" అని అది తనప్రాణం యివ్వటానికి ఆయత్తపడింది. పాప భయంతో జలదరించిపోయి, దాన్ని ప్రాధేయపడి, వారించి "ప్రపంచంలో విలువలేని ప్రాణంలేదు ఎలుకా గుర్తుందా నువ్వోసారి సింహాన్ని రక్షించావు. ఓ వేటగాడి బారినుండి అనేక పావురాల్ని కాపాడావు. వద్దు వద్దు. నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు" అంటూ మళ్ళీ ఏడ్చింది.

    "నువ్వు యిప్పుడు ఎందుకేడుస్తున్నావు?"

    "నాకు తెలియదు."

    అంతటితో కథ ఆగిపోయింది. చాలా పెద్దకథ తయారయింది. "మనుషులు ఎందుకు ఏడుస్తారు?" అని పెట్టాడు కథపేరు. ఒకనిముషం ఆలోచించి "పాప ఎందుకు ఏడ్చింది?" అని మార్చాడు. చాలా రాత్రయింది. కనకదుర్గ గుడిమీద మూడుగంటలు కొట్టారు. అతను బాగా అలిసిపోయాడు. చేతులు నొప్పులు పుట్టాయి. తల అంతా గందరగోళమైపోయింది. లేచి  లైటు తీసేశాడు. అతనికి భయంవేసింది. ఈ గదిలో మంచం వుండదు. తల్లీమ్ తండ్రీ పడుకునివున్న గదిలోకి వెళ్లి చీకట్లో తడుముకుంటూ తన మంచం మీదకు చేరి పడుకున్నాడు. మరునిముషంలో గాఢంగా నిద్రపట్టేసింది.


                                                                          2

    సరస్వతి అంటే మధుబాబుకు చిన్నప్పటినుంచీ ప్రాణం. ఆమె అతనికంటే వయస్సులో రెండు సంవత్సరాలు పెద్ద.  ఈ పదిహేడేళ్లకే మాతృత్వంలోని సాధకబాధకాలు అనుభవించేసింది. స్కూల్ ఫైనల్ వరకూ చదువుకుంది సరస్వతి. పరీక్ష అయిపోగానే పెళ్లికావటం, కొద్దిమాసాల్లోనే కాపురానికి వెళ్లిపోవటం, ఏడాది తిరిగేసరికి మాతృమూర్తి కావటం గబగబ జరిగి పోయాయి.

    ఆమె స్కూల్ ఫైనల్ చదువుతున్నప్పుడు, అతను ఫోర్త్ ఫారం చదువుతుండే వాడు. ఇద్దరూ కలిసి స్కూలుకి నడిచిపోతూండేవారు. వాళ్లు స్కూలుకి పోయే దారిలో ఓ యిల్లు వుండేది. చిన్న పెంకుటిల్లు. అందులో ఓ స్త్రీ నివసిస్తూ వుండేది. పదిహేడు, పద్దెనిమిదేళ్ల సుందర స్వరూపం ఆమెది.

    తళతళ మెరిసే శరీరచ్ఛాయా, చెంపకు చారడేసి కళ్ళు, చూపరులని మంత్రముగ్ధులని చేసే లావణ్యం, ఎప్పుడూ చిరునవ్వుతో కళకళలాడుతుండేది.

    ఆమె ఎవరో యీ పిల్లలకు తెలియదు. అక్కడికి ఎట్లా వచ్చిందో అంతకంటే తెలియదు. కాని రోజూ వీళ్లు వచ్చేపోయేవేళ కిటికీదగ్గర నిలబడి సకౌతుకంగా తిలకిస్తూ వుండేది. ఓ సాయంత్రం బడినుంచి తిరిగివస్తున్నప్పుడు తలుపులు తీసి గుమ్మం ఇవతలకు వచ్చి చెయ్యెత్తి పిలిచింది. తమనేనా అనుకున్నారు మొదట. "నా దగ్గరకు రారూ?" అన్నది మళ్ళీ మృదుకంఠంతో. మధుబాబుకు ఆమెదగ్గరకు పోదామని ఆత్రంగా వుంది. కాని సరస్వతి తటపటాయిస్తోంది ఈ అపరిచిత యువతి చెంతకు ఎట్లా వెళ్ళటమా అని? మధుబాబు చొరవచేసి అక్క చెయ్యిపట్టుకుని మెల్లగా అక్కడికి తీసుకుపోయాడు.

    "సందేహిస్తున్నారు కదూ!" అన్నది ఆమె ముత్యాలవంటి పలువరస ప్రదర్శిస్తూ నవ్వి.

    అక్కా, తమ్ముడూ సిగ్గుతో తలవంచుకున్నారు.

    ఆ స్త్రీ పేరు రజని. కూలీనాలీ చేసుకునేవాళ్ళ కుటుంబంలో జన్మించింది. బాల్యంలోనే తల్లినీ, తండ్రిని పోగొట్టుకున్న హతభాగిని. అప్పటినుంచీ తెలిసిన వాళ్లు ఎవరో దగ్గరకు చేరదీసి కొంచెం పెద్దయినాక తమతో పాటు కూలిపనికి తీసుకుపోతూ పెంచారు. పదహారేళ్ల నూతన యవ్వనంలో తనని పెంచిన వాళ్లతో కలిసి బెజవాడ వచ్చేసింది. కూలిపని చేసుకునేవారిలో యీ సౌందర్యం, సోయగం, సుకుమారత్వం అరుదుకదా. యువకులు పిచ్చెక్కి పోయారు. వలలు పన్నారు. వాళ్లు ఎంతవరకు సఫలీకృతులయినారో తెలీదు గాని ఆమె పనిచేస్తున్న సున్నపుమిల్లు యజమాని రాజయ్యగారి కళ్ళు ఆమెమీద పడినయి. అజమాయిషీ చేసే నెపంతో రోజూ వాళ్ళమధ్యకు వచ్చి ఆమెను చూసి గుటకలు మ్రింగుతూవుండేవాడు. నలభైఏళ్ళు పైబడిన మనిషి ఆయన. ఈ వ్యామోహానికి తట్టుకోలేక పోయాడు.

Next Page