Next Page 
కావేరి పేజి 1

                                        కావేరి
                                                                యార్లగడ్డ సరోజినీదేవి

 


   

 


    సినిమానుంచి తిరిగి రాగానే సరాసరి గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకునే నెపంతో తలుపులు దగ్గిరకు చేర్లావేసి కిటికీలోవున్న అద్దం చేతిలోకి తీసుకుని తన ప్రతి బింబాన్ని అనేక కోణాలనుంచి చూసుకోసాగింది కావేరి!

    అలా చూసుకోవటంలో ఎంతో తృప్తిని పడుతుంది.

    కురులను సర్దుకుంటూ ఒకకోణంలోనుంచి, పమిటిని సర్దుకుంటాను, నడుంమీద చెయ్యివేసుకుని ఏటవాలుగాను నిలబడి, బుగ్గమీద వేలువుంచుకుని అలవోకగా చూస్తూ నిలబడటం, ప్రియుడిని ఎలా తన్మయత్వంలో కౌగిలించుకోవాలో?

    అలా అన్నిభంగిమలలోనూ తనే హీరోయిన్ అయినట్లుగా ఊహాలోకంలోకి తెలిపోతున్నది. పరవశించినట్లుగా అరమోడ్పులతో కళ్ళు మూసుకున్నది.

    ఇన్ని విధాలుగా కావేరి తంటాలుపడి అనేక భంగిమలలో తనను చూసుకోవటానికి కారణంవుంది.

    ఊహ తెలిసినప్పటినుంచీ తను సినిమా హీరోయిన్ కావాలన్న తపన కలిగేది! వయస్సు పెరిగినకొలదీ సినిమాలుచూడటం, సినిమాపత్రికలు చదవటంతోనే సరిపెట్టలేదు. తను చాలా అందమయినదన్న ఒక అభిప్రాయంకూడా కావేరిలో బలపడిపోయింది.

    ఆరోజు తల్లిని నివేధించి మరీ సినిమాకు బయలుదేరతీసింది. కూతురు మాటకాదనలేకను, అందరూ వేలంవెర్రిగా సినిమా చూసేందుకు ఎగబడటంతోతనకీ చూడాలన్న కోరిక సుభద్రమ్మకి కలగటం అందరం కలిసి వెళ్ళితే బాగుంటుందనిపించి రెండవఆట కిరుగుపొరుగు ఆడవారిని కూడా పోగేసింది.

    ఆ గ్రామానికి మూడుకిలోమీటర్ల దూరంలోనున్న చిన్న సెంటరు లాంటిచోట టూరింగ్ టాకీస్ వెలిసింది. గోడలుగా గోనెసంచులును కలిపి కుట్టి పైనుంచి వేలాడతీశారు. చాలనిచోట తడికలు అడ్డంపెట్టారు. పైన చీనారేకులతో కప్పారు. వెనక్కి ఆనుకునేటందుకు అడ్డులేని సాదా కుర్చీలు, బెంచీలు, నడుం నిలబెట్టి మూడున్నర నాలుగుగంటలు ఓపికగా కూర్చుని అరగంటకొక రీలుమార్చి సినిమా చూపించే ఆపరేటరు! అలా ప్రతిసారి రీలుమార్చేటందుకు మరో పదినిముషాల టైం పట్టటం.

    ఆలస్యం అయినా సినిమాచూస్తే చాలనుకునే అమాయక పల్లెటూరి జనం! పట్నానికి ఎంతో దూరంగాను, ఒక మారుమూలకి విసిరివేయబడి నట్లుండే ఆ గ్రామానికి అప్పుడే చైతన్యం వచ్చినట్లు అయింది.

    ఆ సినిమాహాలులో ఎప్పటివో పాతసినిమాలు తెచ్చి ఆడిస్తారు. పాతసినిమా అంటే మూడు నాలుగు సంవత్సరాలు గడిచిన తరువాత ఆ పల్లెప్రజలకి కొత్తసినిమాగా వుంటుంది. బాగుంటే చూసినవాళ్ళే ఇంకోసారికూడా చూడటం! ఆహా! ఓహో! అని చెప్పుకోవటంతో వింటున్న వారికి కొంత ఉత్సాహం కలగటంతో వీళ్ళూ బయలుదేరటం! కాస్త కలవారయితే బండ్లుకట్టుకుని వెళ్ళటం!

    అంతకుముందు వారంరోజులనుంచీ కావేరీ తల్లిని పీడించుకుని తింటుంది. అందుకు కారణం! ఆ క్రితంరోజురాత్రి సుబ్బులు సినిమా చూసివచ్చి క్లాసులో అందరినీ చుట్టూ చేర్చుకుని కథని చెప్పటమే! సుబ్బులు కథ చెప్పుతుంటే అచ్చు సినిమాచూసినట్టే వున్నది. తమకంటే అన్నివిధాలా తక్కువ స్థితిగతులున్న సుబ్బులు వచ్చిన ప్రతీ సినిమా చూడటం? ఆ మరురోజునే ఆ సినిమాకథని ఒక్క సీనుకూడా మరిచి పోకుండా చెప్పటం కావేరీకి సహించరాని విషయం అయిపోయింది.

    "మా అమ్మ నేను సినిమాకి వెళదామంటేచాలు! తీసుకెళ్ళుతుంది" అని మరింత గొప్పగా చెప్పుతుంటే కావేరీకి కోపంవచ్చింది.

    తను కూడా తల్లితో సినిమాకు వెళ్ళి సుబ్బులు చెప్పినట్లుగానే తను కూడా క్లాసులో సినిమా కథ చెప్పాలి! మా అమ్మ నేను అడగగానే తీసుకెళ్ళిందని చెప్పాలి! లేకపోతే కథ చెప్పుతూ నా వైపుకి చూస్తుందా? అన్న కోపం మనసులో వుంచుకుని స్కూలునుంచి వచ్చినప్పటినుంచీ తల్లిని బ్రతిమాలటమే!

    ఆ సినిమా గురించి ఆ సినిమాలో నటించిన జయప్రద-జయసుధల ఫోటోలు అంతకుముదే "సితారా! జ్యోతిచిత్ర"లాంటి సినీవార పత్రికల్లో చూడటం, ఆ సినిమా టూరింగ్ టాకీస్ లో వచ్చిందని తెలిసినప్పటినుంచీ తల్లిని తల్లిని అడుగుతున్నది గాని యింతగా పట్టుపట్టలేదు. కాని ఈ రోజు సుబ్బులు తనను చిన్నచూపు చూసిందన్న బాధ కలిగి మరింతగా పేచీ పెట్టింది. యింక తప్పదన్నట్టుగా సుభద్రమ్మ యిరుగు పొరుగు ఆడవారిని పోగుచేసి మరీ తీసుకువెళ్ళింది.

    ఆ టూరింగ్ టాకీస్ లో పనిచేసే వాగులు సినిమాహాలు కట్టక ముందు పరంధామయ్యగారి దగ్గిరే నౌఖరీగా వుండేవాడు.

    సినిమాహాలులో దొరికిన ఆ ముప్పయిరూపాయల జీతంతోనే తానేదో ప్రధానమంత్రి అనుకోకుండా అయిపోయినట్లుగా భావించి మురిసిపోతూ కాలరు ఎగరవేసుకుంటూ తిరిగేవాడు. ఎప్పుడన్నా తల్లి తండ్రులను చూసేందుకు వచ్చినప్పుడు తను దాచుకున్న డబ్బులు తెచ్చి తల్లితండ్రులకి యిచ్చేవాడు. సినిమా స్టయిలులో డైలాగ్సు కూడా వదిలే వాడు! మాట్లాడుతూ వుండగానే జేబులోనుంచి దువ్వెన తీసి క్రాపు దువ్వుకుంటూ వుండేవాడు.

    "ఒరే నాగులూ!"

    అని పిలిచే తల్లితండ్రులు "బాబు నాగేంద్రా?" అని పిలవటం మొదలుపెట్టారు. ఎవరికన్నా చెప్పినా! "మా నాగేంద్ర ఎంత నేర్చుకున్నాడు?" అనే చెప్పటం!

    దానితో నాగులు పేరు నాగేంద్రగా స్థిరపడిపోయింది.

    అయినా పరంధామయ్యగారి దగ్గిర నాలుగుబస్తాల జీతంనుంచి మొదలయిన పాలేరుతనం పన్నెండు బస్తాలతో ఆగిపోయినా అలవాటయిన "నాగులు" అన్న పిలుపే తప్ప మరొకటిరాదు!

    తన తల్లితండ్రులను చూసేందుకు వచ్చినప్పుడంతా కావేరీకి సినిమా పోస్టర్లు రకరకాలవి తెచ్చి యిచ్చేవాడు. పాటల పుస్తకం కూడా తెచ్చి యిస్తూ వుండేవాడు. రాబోయే సినిమాలు ఏమేమిటో చెప్పేవాడు. ఆ చెప్పటంలో కూడా ఒక విధమయిన స్టయిలు ప్రదర్శించేవాడు.

    కావేరి నాగులుని విచిత్రంగా చూసేది! ఎంత అదృష్టవంతుడు? అనుకునేది! తానే మగవాడు అయివున్నట్లయితే నాగులుకంటే కూడా గొప్పవాడు అయివుండేది! ఈసారికి మద్రాసు వెళ్ళిపోయి సినిమాలో చాన్సులకోసం ఎంతోమంది నిర్మాతలని కలుసుకునేది! హీరో పాత్రలు ధరించి లక్షలకి లక్షలు సంపాదించేది! తన దురదృష్టం కొలదీ ఆడదయి పుట్టటం వలన కోరికలు తీరకపోగా కనీసం టూరింగ్ టాకీస్ లోకి వచ్చిన సినిమా చూసేందుకు రెండురూపాయల టిక్కెట్టు కాకపోయినా ఎనభై పైసల టిక్కెట్టుకి కూడా వెళ్లేందుకు నోచుకోలేదన్న్దదే బాధ!

    నాగులు యిచ్చిన వాల్ పోస్టర్సు, సినిమాపాటల పుస్తకాలని ఆమెతో అమూల్యమయిన వస్తువులుగా తన ట్రంకుపెట్టెలో దాచుకుంటూ వుండేది. తీరుబడి వేళలో తల్లి చూడకుండా గది తలుపులు వేసుకుని వాటిని మరీ చూసుకుని మురిసిపోయేది!

    అలా సినిమా తారలను చూస్తుంటే? తనకంటే వారేమంత అందంగా వున్నారనే భావం కావేరీలో కలిగేది! సినిమాలో హీరోయిన్ చెప్పిన డైలాగులన్నీ కంఠతాపట్టి అద్దం ముందు నిలబడి వాళ్ళకంటే ఎక్కువ గంభీరాతగా వల్లించి మురిసిపోతూవుండేది!

    కొత్తగా పరిచయం అయిన హీరో మాట్లాడుతుంటే హీరోయిన్ నునుసిగ్గులు పడుతూ ఎలా మెలికలుతిరుగుతుందో? అలా అభినయించేది. వాళ్ళు చేసినట్లు డాన్సు చేసేది!

    అలా చేస్తూ అభినయించటం, అద్దంలో చూసుకుంటున్న ప్రతీ క్షణం కావేరీలో తను సినిమా హీరోయిన్ అయిపోవాలన్న కోరిక నానాటికీ బలపడసాగింది.

    ఆ సంవత్సరమే స్కూలు యానివర్సిడే అని ప్రారంభించారు. ఆ సందర్భంలో ప్రదర్శించిన నాటికలో కావేరి హీరోయిన్!

    "నువ్వు చాలా అందంగా వుంటావు. నీ కళ్ళు భూచక్రాలులాగా గుండ్రంగా అందంగా వుంటాయి. నువ్వే హీరోయిన్ పాత్రకి సరిపోతావు? ధైర్యంగా నటించటం అలవాటు చేసుకుంటే రేపు నువ్వు సినీ హీరోయిన్ ని ఎంతో త్వరగా అవగలవు?"

    అని ఆనాటిక వ్రాసి డైరెక్టుచేసే డ్రాయింగ్ మాస్టారు అంటుంటే ఎంతో ఉప్పొంగిపోయింది. ఆ నాటికలో వేషం వేసినందుకు తల్లీ బాగా చివాట్లు పెట్టింది.

    తల్లిమీద కోపం వచ్చినా దిగమ్రింగుకునేది! రేపు తను సినీ హీరోయిన్ అయి లక్షలకి లక్షలు సంపాదించినవాడు తన తల్లిని అసలు చేరనివ్వదు! దూరంగా వుంచుతుంది. తాను సంపాదించే లక్షలు; మేడ; ఖరీదుగల ఇంపోర్టెడ్ కారులో తిరుగుతూవుంటే చూసి ఏడుస్తుందిలే! అనుకునేది ఆ కోపంతో!

    పెద్దమనిషి అయినా తరువాత హైస్కూలు చదువుని మానిపించాలని పరంధామయ్య, సుభద్రమ్మ ఎంతగానో ప్రయత్నించారు.

    తను చదువు మానితే సినిమా పత్రికలు కొనుక్కోవటం వీలవదని, స్కూలు యానివర్సిడే నాటకాలలో యాక్టుచేసే అవకాశం వుండదని, తాను ఈ అవకాశం పోగొట్టుకుంటే ఈ నాలుగు గోడల మధ్యా బంధితురాలయి వుండిపోవలసి వస్తుంది. తాను అడపా తడపా నాటకాలలో పాల్గొని స్టేజీమీద ప్రదర్శించగలిగితేనే రేపు తాను సినీ హీరోయిన్ గా రాణించగలిగేది! అనేది కూడా కలిగింది.


Next Page 

WRITERS
PUBLICATIONS