Next Page 
డేంజర్ మినిట్స్ పేజి 1

       
                                                                  డేంజర్ మినిట్స్

                                                                                        -చందు హర్షవర్ధన్

    రాత్రి...

    తొమ్మిదిగంటలు...

    ఆకాశాన  దట్టంగా  కమ్ముకున్న  మేఘాలు....

    ఆగి ఆగి  వీస్తున్న  ఈదురుగాలి వింత  శబ్దాలకు తోడు చిరు జల్లులు మొదలయ్యాయి.

    అది ఫవర్ కట్ సమయం  కాకపోయినా  కరెంట్  ఆఫ్ అయింది. ఎక్కడో  ట్రాన్స్ ఫార్మర్ బ్రేక్  అయి వుండాలి.

    అసలే అమావాస్య.... ఆపై  విద్యుచ్ఛక్తి నిలిచిపోవడం.... అంతా  చీకటి  మయం!

    అలాంటి  వాతావరణాన్ని  కూడా  లెక్కచేయకుండా నగరానికి  దూరంగా మాగ్జిమమ్ స్పీడ్ లో  దూసుకుపోతున్నది రెడ్ కలర్ 100 సిసి మారుతీ వ్యాన్.
   
    ఆవ్యాన్ లో పాతికేళ్ళలోపు వయసున్న ముగ్గురు  యువకులు  వున్నారు. ఎవరిలోనూ భయం, ఆదుర్దా, ఆందోళన  లాంటివి  మచ్చుకయినా  కనిపించటంలేదు. ఎడ్వంచర్ చేయబోతున్న థ్రిల్ తప్ప....

    కాని నగరం పొలిమేరల నుంచీ  తమ వ్యాన్  వెనకనే  నేవీబ్లూ  కలర్ మారుతీ వ్యాన్ ఒకటి అనుసరించి వస్తున్న విషయం  వాళ్ళు గమనించి గమనించలేదు.

    నగరానికి సుమారు ఇరవై  కిలోమీటర్ల  దూరంలో  వున్న గెస్ట్ హౌస్ లోకి  వెళ్ళింది రెడ్ కలర్  మారుతీ వ్యాన్.

    ముగ్గురు యువకులకూ గేటులోనే ఎదురొచ్చిన  వాచ్ మేన్ అబ్భులు  చిలికి చేటంత ముఖంతో స్వాగతం  పలుకుతూ లోనికి  తీసుకువెళ్ళాడు.

    గెస్ట్ హౌస్ బయటనే రోడ్డు వారగా  కారుని  ఆపి  క్రిందకు దిగింది ఒక యువతి....

    ఆమె లెక్చలర్ నీలిమ!

    గెస్ట్ హౌస్ లోపల  అధునాతనంగా వున్న బెడ్ పై ముగ్గురు  యువకులు  విలాసంగా  కూర్చుని ఎవరికేం కావాలో ఆర్డర్స్  పాస్ చేస్తున్నారు.

    వాచ్ మెన్ అబ్బులు  వినయంగా  చేతులు కట్టుకొని వింటున్నాడు.

     ముగ్గురిలో ఒకతను రమేష్....మాజీ మంత్రిగారి  అబ్బాయి ఆయన గెస్ట్ హౌస్ లోనే  ప్రస్తుతం వీళ్ళు వున్నది. మరొకతను అనిల్....ప్రముఖ వ్యాపారవేత్త ముంకుదరావుగారి ఏకైక  సంతానం. మూడవ వ్యక్తి వెంకట్....ప్రముఖ న్యాయవాది పుత్రరత్నం.

    వీళ్ళు ముగ్గురూ మంచి మిత్రులు . ఎప్పుడు ఏపని చేసినా  ముగ్గురు  కలిపే చేస్తారు. ఎక్కడకు వెళ్ళినా  ముగ్గురూ కలిసే  వెళతారు. ఒక విధంగా వీళ్ళకు లేని అలవాటంటూ లేదు. మందు....మగువ....గుర్రపు పందాలు కాయటం. ఏ వ్యసనమయినా ముగ్గురూ కలిసే పంచుకోవడం వాళ్ళ బలహీనత!

    `గెస్ట్ హౌస్ బయట నిలిచి వున్న నీలిమ  పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించింది. ఆ మిత్రత్రయం కార్యకలాపాలకు  స్థావరం  ఆ గెస్ట్ హౌస్  అని నిర్ధారించుకొన్నది.

    అబ్బులు బయటకు రావడం  గమనించి  ప్రక్కకు  తప్పుకున్నది.

    సైకిల్ ఎక్కి  హుషారుగా  తొక్కుకుంటూ నగరం  వైపు  వెళ్ళి పోయాడతను.

    అతను అంత అర్ధరాత్రి వేళ ఎందుకు వెలుతున్నాడో వూహించే ప్రయత్నం చేస్తూ  లోపలకు  నడిచిందామె.

    తెరిచి వున్న కిటికీలో నుంచి  గదిలో  వాళ్ళేం చేస్తున్నారో బయటకు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ దృశ్యం చూస్తున్నకొద్దీ నీలిమ రక్తం ఆవేశంతో  వురుకులెత్తుతోంది.

    ముగ్గురి ఎదుటా  స్కాచ్ బాటిల్స్ , చికెన్  ఐటమ్స్ , జీడిపప్పు  ప్లేట్లు....ఆనందంగా  కేరింతలు కొడుతూ, చిలిపి జోక్స్ వేసుకుంటూ సరదాగా  ఎంజాయ్ చేస్తున్నారు.

    ఉన్నట్టుండి వెంకట్  చూపులు  యధాలాపంగా కిటికీ వైపు  చూశాయి. తమవైపే రోష కషాయిత నేత్రాలతో చూస్తున్న నీలిమ కనిపించడంతో ఖంగు తిన్నాడతను.

    ఎక్కిన కైపు దిగిపోతున్నట్లు  ఆశ్చర్యంగా కనులు నులుముకొని మరీ చుసాడు.

    తెల్లని చీరలో....విరబోసుకున్న నల్లని కురులపై  తెల్లని మల్లెలతో, చిరునవ్వుతో నిలిచి వున్న నీలిమను  స్పష్టంగా  చూడటంతో కెవ్వున కేక  వేశాడతను..

    ''అమ్మో....దే....య్యం...."

    మిగిలిన ఇద్దరూ ఒక్కసారిగా  వులిక్కిపడ్డారు.

    ''ఒరే....ఏ మైందిరా? మత్తు ఎక్కువయిందా....?'' రమేష్ విసుగ్గా మిత్రుణ్ణి మందలించాడు.

    ''కాదురా....నీ....లి....మ....దే....య్యం....కనిపించింది.''

    అంతే....

    వాళ్ళ మత్తు  కూడా దిగిపోయినట్టయింది.

    ''నీలిమ దెయ్యమా....ఎక్కడ?'' 


Next Page 

  • WRITERS
    PUBLICATIONS