Next Page 
మధుమాసవేళలో ... పేజి 1

 

                                                 మధుమాసవేళలో...
    
                                                                             ----కురుమద్దాలి విజయలక్ష్మి
    
       

                                   

  

   మదన్ గోపాల్ కి ప్రాణం పోతున్నది.
    
    ఇదేమాట అతన్నాస్థితిలో చూసిన ఎవరూ అనరు. "నాకు పోవుచున్నది ప్రా....ణ.....౦" అని తాగినవాడిలా అడుగులు తడబడుతుండగా మాట తడబడింది. దాహంతో నాలుక పీక్కుపోతుంటే ఎవరికయినా అంతేమరి.
    
    మదన్ గోపాల్ కి పాతికేళ్ళ వయసుంది. సంపూర్ణ ఆయురారోగ్యాలు వున్నాయి. అతని బుద్ది అతని తాలూకా ముఖము అందంగా వుంటాయి. సరీగా చెప్పాలంటే మన్మధుడి తమ్ముడిలా వుంటాడు. మన్మధుడి తమ్ముడిని ఎవరూ చూసి వుండకపోతే మీ అభిమాన హీరో ముఖం తల్చుకోండి అచ్చంగా అలా వుంటాడు. ఈ మధ్యనే స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం వచ్చింది. మరి..."పోవుచున్నది ప్రాణం" అని ఎందుకనుకున్నాడూ అంటే, విజయవాడలో స్టేట్ బ్యాంక్ లో ఇలా చదువు పూర్తికాగానే అలా ఉద్యోగం వచ్చినందున.
    
    "పోదూ, మరీ బడాయి. ఈకాలంలో ఫస్ట్ క్లాసు వచ్చిన వారికే ఉద్యోగానికి గతిలేదు. అలాంటిది ఇలా చదువుకాగానే అలా ఉద్యోగం వచ్చిందంటే ఆ బిడ్డడి పూర్వజన్మ సుకృతం కాదూ!" అని అనొచ్చు ఎవరయినా, వివరం తెల్సుకుంటే ఎవరయినా ఈమాట అనరు. మదన్ గోపాల్ పుడుతూనే బుద్ది మంతుడిలా పుట్టాడు కాబట్టి బుద్దిగా చదువుకున్నాడు. బాగా చదువుకున్నాడు గాబట్టి అన్ని ఫస్టుక్లాసుల్లో పాసయ్యాడు. అయ్యాడు కాబట్టో ఖాళీ వుండబట్టో పిలిచి పిల్లనిచ్చినట్లు ఉద్యోగం యిచ్చారు. ఇంతవరకూ బాగానేవుంది. అసలు కష్టం యిప్పుడొచ్చింది. ఇది మామూలు విషయం కాదు అలాంటి ఇలాంటి ఆషామాషీ విషయంకాదు. ఖాళీ వాటా వొకటి అద్దెకి కావాలి. ఇదీ సంగతి.
    
    తెలీనివాళ్ళు ఫక్కున ముఖాన నవ్వొచ్చు. ముఖాన నవ్వారూ అంటే వాళ్ళకి విజయవాడ తెలిసుండదు. తెలిసుంటే నవ్వరు. ఏది! మరీ ముఖానే.
    
    రామాయణంలో పదునాలుగేళ్ళ వనవాసము కష్టం కాదు. భారతంలో మారువేషాలతో విరాటుడి కొలువు కష్టం కాదు. తుఫాను సమయంలో దివిసీమలో వుండటం కష్టం కాదు. విజయవాడ పట్టణంలో అద్దెకుండటానికో వాటా సంపాదించటం మాత్రం బహుకష్టం. ఇది అనుభవించినవారికి మాత్రమే తెలిసిన సత్యం.
    
    మదన్ గోపాల్ కి యిలా ఉద్యోగం వచ్చింది అలా వెంటనే ఇళ్ళ వేటకి బయలుదేరాడు. సుబ్బరంగా విల్లూ, బాణాలూ పుచ్చుకుని వేటకి ఏ కీకారణ్యానికి వెళ్ళొచ్చినా నాలుగు పులులు, అయిదు లేళ్ళు, మూడు కుందేళ్ళు, రెండు నిప్పుకోళ్ళు ఒక బాతు దొరికేవి. సుబ్బరంగా సంతలో వాటి నమ్ముకుంటే నిబ్బరంగా రోజులెళ్ళిపోయేవి. చదువుకొని ఉద్యోగం సంపాదించినవాడు కాబట్టి ఈ వేటలో పడ్డాడు.
    
    విజయవాడలో మండుటెండాకాలంలో వంటచేసే ఆడడానికి సిగరెట్టుతాగే మగాడికి అగ్గిపెట్టెతో పనుండదు. అగ్గి పుల్లలుంటే చాలు. అలా ఓసారి సూర్యభగవానుడికి చూపిస్తే భగ్గుమంటుంది. అలా నిప్పుపెట్టెతో పనిలేకుండా అగ్గిపుల్ల వెలిగే పగటిసమయంలో ఇళ్ళవేటకి బయలుదేరిన మదన్ గోపాల్ "నాకు పోవుచున్నది ప్రాణం" అని అనుకోవటంలో వింతేముంది, విడ్డూరమేముంది! అప్పటికి నిమ్మకాయసోడాలు డజను ఉత్తసోడాలు డజను పుచ్చుకున్నాడు. వాటిదోవ వాటిదే ప్రాణందోవ ప్రాణందే.    
    
    పోనీ పగలు రాళ్ళు పగిలే యెండ కాస్తున్నది రాత్రిళ్ళు ఇళ్ళవేట కెళదామా అంటే "దొంగతనానికి వచ్చావా? దొం....నా....కా...? తాగొచ్చావురా! మా....ర్...!" అంటూ చావు దెబ్బలుతినే ప్రమాదంవుంది. అందుకే పగలే వెన్నెలా టైములో బయలుదేరి వీధి వీధి తిరుగుతున్నాడు మదన్ గోపాల్. ఇలా తిరగటం మొదలుపెట్టి ఇప్పటికి నాలుగోవారం నడుస్తున్నది.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS