Next Page 
ఎ.కె.47 పేజి 1

           
                             ఎ.కె. 47

                                          __చందు హర్షవర్ధన్



   
                                                             ఒక విశ్లేషణ

                                         శ్రీ ఎ. బ్రహ్మానందరెడ్డి

    ఇవాళ కమర్షియల్ నవలా సాహిత్యం 'క్రయిం' అనే ఒకే కేంద్రం చుట్టూ తిరుగుతూంది. సమాజానికి, సాహిత్యానికి వున్న పరస్పర సంబంధమే దీనికి ముఖ్య కారణం కావచ్చు.

    ఒక్క కమర్షియల్ నవలా రచయితలే కాదు, సీరియస్ నవలలు రాసేవారు కూడా వాస్తవ సామాజిక చిత్రణకు పూనుకుంటే, ఈ'క్రయిం' ఎలిమెంట్ ను విస్మరించి రాయడం అసాధ్యం. రెండు పాయలకూ ఉండే తేడా లక్ష్య సంవిధానంలోనే.

    ప్రస్తుతం కమర్షియల్ నవలకు వున్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. కమర్షియల్ నవల రాయడం కత్తిమీద సాము. దీనిలో పక్కావ్యాపార సూత్రాలు ఇమిడి వున్నాయి. అన్ని రుచులను తీర్చవలసిన బాధ్యత నవలా రచయితపై ఉంటుంది. ఎత్తుగడ, నడక, ముగింపు అన్నీ ఒక పద్ధతిగా జరిగి, ఒక్క ఊపున చదివించే గుణాన్ని సాధించడం అన్నింటికన్నా ముఖ్యం.

    ఎందరో నవలా రచయితలు ముగ్గురు నలుగురు మాత్రమే బాగా రాణించడంలో గల రహస్యం ఈ రస విద్య వీళ్ళకు పట్టుబడడమే !

    క్రయిం, రాజకీయాలు, వాస్తవ సంఘటనలు, సస్పెన్స్, థ్రిల్, సెంటిమెంట్, కొంతమేరకు శృంగారం కలిపితే కమర్షిల్ నవల పుడుతుంది.

    అయితే, ఈ మేలికలయికలను విభిన్నంగా ఉంచడానికి, కొత్త అందాలను చెప్పడానికి రచయిత ప్రయత్నించాలి. లేకపోతే నవలలు ఒకే మూసలో తయారయి పోటీకి తట్టుకుని మార్కెట్టులో విజయవంతం కావడం కష్టం.

    ఇవన్నీ తెలిసిన రచయిత శ్రీ చందు హర్షవర్ధన్ 'ఎ.కె.47' పట్టుకుని రంగంలోకి వచ్చారు.

    ఇది వర్తమాన పరిస్థితి ఆధారంగా రాసిన నవల. దీనిలో సబ్జెక్టు తీవ్రవాదం.

    తీవ్రవాదాన్ని చాలా మంది రచయితలు టచ్ చేశారు. అయితే, అది ఆయా నవలలలో ఒక అంశం మాత్రమే. హర్షవర్ధన్ రాసిన 'ఎ.కె.47' ఆ కోవలోకి రాదు. ఇది పూర్తిగా తీవ్రవాదం మీద రాసిన నవల.

    టెర్రరిజం సాగుతున్న ధోరణి ఇందులో ఉంటుంది గాని, జరుగుతున్న సంఘటనలను ఏరి గుదిగుచ్చే ప్రయత్నమేమీ జరగలేదు. కనుక ఇదిఒక డాక్యుమెంటులాగా మారిపోయే ప్రమాదం తప్పింది.

    ఈ నవలలో రాజకీయాలు వున్నాయి. కాని వాటిపట్ల నెగిటివ్ ఎప్రోచ్ లేదు. పోలీసు వ్యవస్థ గురించి వుంది. అయితే, ఆ వ్యవస్థలోని మంచి _ చెడుల రెండు పార్శ్వాలు ఇందులో కనిపిస్తాయి.
   
    ఆదర్శాల వీధిలో, సాయుధ మార్గం సమ సమాజ స్థాపనకు ముఖ్యమని భ్రాంతిలో పడిన యువతరం విదేశీ ఏజెంట్లు చేతిలో ఎలా కీలుబొమ్మ లవుతున్నారో హర్షవర్ధన్ రాశారు.

    ఇది కమర్షియల్ నవల గనుక నాటకీయతను, కాల్పనికతను సమృద్దిగా జోడించారు. ఏ సీన్ ఎక్కడ ముగిస్తే సస్పెన్స్ పుడుతుందో. మళ్ళీ ఆ సీన్ ఎక్కడ ఎత్తుకోవాలో, ఏ యే పాత్రలను ఎక్కడ ప్రవేశపెట్టి, ఎలా నడిపించాలో శ్రీ హర్షవర్ధన్ కు బాగా తెలుసు.   

    సబ్జెక్టుకు అనువైన ఉత్కంఠభరితమైన శైలి ఆయనలో వుంది. అందువల్లనే ఈ నవల చదవడం మొదలుపెడితే ఇక ఎక్కడా ఆగలేం _ ఏక బిగిన చదివి తీరవలసిందే !
   
    "చావుకంటే, చావుకు సంబంధించిన భావనే మనిషిని భయకంపితుని చేస్తుంది." "తెలియని యదార్ధం కంటే ఉత్తుత్తి భ్రమలే ఒక్కోసారి మనిషికి ఊరట కలిగిస్తాయి." వంటి మంచి వాక్యాలు మధ్య మధ్య తారసపడి, ఆలోజింపచేస్తాయి.

    కష్టమైన సబ్జెక్ట్ ను అవలీలగా డీల్ చేసి, చక్కటి నవలను అందించిన శ్రీ హర్షవర్ధన్ ను అభినందిస్తూ, లోపలి పేజీలలోకి ధైర్యంగా వెళ్ళవలసిందిగా పాఠకులను ఆహ్వానిస్తున్నాను.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS