Next Page 
కాంక్రీట్ జంగిల్  పేజి 1


                          కాంక్రీట్ జంగిల్

                                               -చందు హర్షవర్ధన్ 

                                                




    1977

    ఆగస్టు 22

    కొన్ని క్షణాల క్రితం వరకూ తెల్లరంగు పరుచుకుని వున్న ఆకాశం కాస్తా, చంద్రుడు మబ్బుల చాటుకు తప్పుకోవడంతో నగరం మొత్తం నల్లదుప్పటి పరిచినట్టు గాఢాంధకారంలో మునిగిపోయింది.

    కారు మబ్బులు కమ్ముకుంటున్న ఆకాశం....

    ప్రళయంగా మారుతున్న ప్రకృతి....

    మబ్బుల చాటున అదృశ్యమైపోయిన చంద్రుడు....

    బీభీత్సంగా వీస్తున్న గాలి....

    ఇవేమీ తమకు పట్టనట్టు ఆ నగరం మాత్రం....నగరంలో మనుషులతో పూర్తి బిజీగా వున్నది.

    పావుగంట క్రితం బయలుదేరిన ఒక టాటా ఎస్టీమ్ ఆ హోరు గాలిని సయితం కోసుకుంటూ వంద కిలోమీటర్ల వేగంతో వచ్చి షడన్ బ్రేక్ తో పాతబస్తీలోని ఒకపాడు పడ్డ భవనం ముందు ఆగింది.

    నల్లని తారురోడ్డు....అందునా కారు చీకటిలో షడన్ బ్రేక్ తో ఆగడంతో, ఆ రాపిడికి టాటా ఎస్టీమ్ టైర్స్ చుట్టూ మంటలు రేగాయి.

    చూసేవాళ్ళకు అదొకవింత అనుభూతి....రోజూ ప్రయాణించేవాళ్ళకు అది రొటీన్!
 
    కారులో నుంచి జగపతి....అతని పర్సనల్ సెక్రటరీ దిగారు.

    జగపతి ధీమాగా పాడుబడ్డ భవనంలోకి అడుగుపెట్టాడు.

    అతని వెనుకనే బ్రీఫ్ కేసులో అనుసరించాడు అతని పర్సనల్ సెక్రటరీ.

    "ఎవరు మీరు?"

    లోపలకు అడుగుపెట్టీ పెట్టడంతోనే అక్కడ కాపలావున్న వ్యక్తికి ఆ ఇద్దరివైపు గుచ్చి గుచ్చి చూస్తూ ప్రశ్నించాడు.

    "నా పేరు జగపతి....నేనెవరో మీ బాస్ కు తెలుసు....నేను కలుసుకోవడానికి వచ్చానని చెప్పు...." చిద్విలాసంగా అన్నాడతను.

    "ఒక నిమిషం ఉండండి" అంటూ అతను లోపలకు వెళ్ళి నిమిషం తరువాత మరొక వ్యక్తితో తిరిగివచ్చాడు.

    "మిస్టర్ జగపతీ....మీరు మాత్రం లోపలకు వెళ్ళవచ్చు" అన్నాడతను.

    రెండవ వ్యక్తి జగపతిని ఆపాదమస్తకం చెక్ చేశాడు.

    చేసేదేమీ లేక సెక్రటరీ చేతిలో నుంచి బ్రీఫ్ కేస్ ను తీసుకుని అతనిని అనుసరించాడు జగపతి.

    బయటనుంచి చూడడానికి అతి చిన్నదిలా అనిపించే ఆ భవనం నిజానికి చాలా పెద్దది.

    మరొక విచిత్రం ఏమిటంటే ఈ చివరినుంచి ఆ చివరి వరకు కుడి ఎడమవైపులా వరుసగా గదులు వున్నాయి. ఆ గదులలో బెడ్ లపై రొమ్ములు విరుచుకుని గాఢమైన నిద్రలో మునిగివున్నారు సిటీలో పేరుగాంచిన వస్తాదులు.

    ప్రతి బెడ్ ప్రక్కన చిన్న టేబుల్!

    ఆ టేబుల్ మీద విస్కీ బాటిల్స్, తినుబండారాలు పేర్చివున్నాయి.

    జగపతి ఆ గదులవైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఒకవైపు మూలగా వున్న మెట్లెక్కి పై అంతస్తు చేరుకున్నాడు.

    గోడలకు అమర్చివున్న ఫ్లడ్ లైట్స్ కాంతిలో ఆ భవంతిలోని ప్రతి గదీ స్పష్టంగా కనిపిస్తుంది అతని కంటికి! చివరగా వున్న ఒక విశాలమైన గదిలో....  

    ఎత్తుగా అమర్చివున్న ఫోమ్ బెడ్ మీద విలాసంగా పడుకుని వున్నాడు ఒక ఆజానుబాహుడు.

    పాల సముద్రంలో శేషపాన్పుమీద చిద్విలాసంగా పవళించి వున్న విష్ణుమూర్తిలా వున్నాడు ఆ పెద్దమనిషి.

    ఆ ఫోమ్ బెడ్ చుట్టూ వలయాకారంలో తీగలతో ఫెన్సింగ్....

    అవి మామూలు తీగలు అని భావించిన వాళ్ళెవరైనా యధాలాపంగా ఆ ఫెన్సింగ్ మీద చేయి వేసిన మరుక్షణంలో అతను ప్రాణాలతో ఉండడు. హెవీ వోల్టేజీ సర్క్యులేట్ అవుతున్న విద్యుత్ వలయాన్ని తన చుట్టూ రక్షణ కవచంలా ఏర్పాటు చేసుకున్న ఆ వ్యక్తి పేరు....రాణా!

    చిటికెన వ్రేలితో సయితం రౌడీలనూ, గూండాలను శాసించగల గూండాయిజం అతని స్పెషాలిటీ....ఒక్కమాటలో చెప్పాలంటే చీకటి ప్రపంచాన్ని ఏలే అధినేత అతను....

    రాణా పేరు చెబితే చాలు.

    కానిస్టేబుల్ నుంచి ఉన్నత అధికారి వరకూ కంపించి పోతుంటారు....

    అంతటి నరరూప రాక్షస చక్రవర్తి అతను!

    అలాంటి క్రిమినల్ ను చూడడానికి వచ్చిన జగపతి, నగరంలో పేరుమోసిన వ్యాపార వేత్తలలో ఒకడు....

    "ఏం పనిమీద వచ్చావ్?"

    రాణా కంఠం ఖంగుమంటూ ధ్వనించింది.

    "ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ఈశ్వరరావు గారింట్లో దొంగతనం జరగాలి."

    "మిస్టర్ జగపతీ....నేనేంటో తెలిసిన వాళ్ళేనా దగ్గరకు వస్తారు. నీకు కావలసిన చిల్లర దొంగతనాలు చేసేవాళ్ళు నగరంలో చాలామంది వున్నారు. ఏదో పెద్దపనిమీద వచ్చినట్టు ఫోజు పెట్టి విలువైన నా సమయాన్ని వృధా చేసినందుకు ఈ రాణా విధించే జరిమానా చెల్లించక తప్పదు."


Next Page 

  • WRITERS
    PUBLICATIONS