Next Page 
ముద్దుగుమ్మ పేజి 1


                            ముద్దుగుమ్మ

                                           __ కురుమద్దాలి విజయలక్ష్మి

 




    "డాడ్"

    తన ఏకైక గారాల తనయ తనని పలకరిస్తున్నదని తెలుసు మధుసూదనరావుకి. అయినా ఆయన తలతిప్పి చూడలేదు. కనీసం 'ఊ...." అయినా కొట్టలేదు.

    "డాడీ!" ఈ తఫా కాస్తా గట్టిగా మరింత కోపంగా పిలిచింది పద్మిని.

    పద్మిని పూర్తిపేరు పద్మిని ప్రియదర్శిని. ఇంట్లో ముద్దుగా తల్లి తండ్రి 'పప్పి'! అని పిలుస్తుంటారు.

    కోటీశ్వరుడు మధుసూదనరావుకి, పూర్ణిమాదేవికి లేక లేక కలిగిన ఏకైక సంతానం తనయ పద్మిని ప్రియదర్శిని.

    ఆ ముద్దుగుమ్మకి ఆ యింట్లో ఆడింది ఆట, పాడింది పాట. అందం, చదువు సంస్కారం అన్నీ వున్నాయి. కాకపోతే రణపెంకి. తలుచుకుంటే ఏనాడో చచ్చిన తాత కూడా దిగిరావాల్సిందే.

    ఇప్పుడు తండ్రి, కూతురు మధ్య చిన్నసైజు వార్ జరుగుతున్నది. బిజినెస్ మైండ్ మధుసూదనరావుది. అతి తక్కువ కాలంలో లక్షాధికారి కోటీశ్వరుడుగా మారగలిగాడు.

    చేతికింద ఎన్నో కంపెనీలున్నాయి. ఎన్నో కంపెనీలలో షేర్లు కూడా వున్నాయి. టి యస్.టి. బోర్డ్ చైర్మన్. జీయారామ్ షియారామ్ డైరెక్టరు. ఇలా యెన్నో వున్నవాడు.

    మధుసూదనరావుకి కావాల్సినంత డబ్బుంది. అంతకు మించిన పేరు ప్రఖ్యాతులు వున్నాయి. అలా తెలుగు సినిమాలలో తండ్రి పాత్రలాగా కఠినంగా, కర్కశంగా వుండడు. అలా అని బీదవాణ్ని కౌగిలించుకుని దయార్ద్ర హృదయుడు, ధర్మరాజు అని కూడా పేరు తెచ్చుకునే విశాల హృదయం ప్రదర్శించడు.

    డబ్బు పాపిష్టిది. అన్ని అవసరాలకి కావాల్సింది ఈ డబ్బే, అని అనర్ధకాలకి మూలం యీ డబ్బే అని మధుసూదనరావుకి బాగా తెలుసు. ఎక్కడ వుంచాల్సిన వాళ్ళని అక్కడే వుంచాలన్నది ఆయన సూత్రం. తన యింట్లో వంటావిడని, తోటమాలిని, డ్రయివరుని, నౌకర్లని గౌరవిస్తాడు. (గౌరవించడం అంటే అగౌరవ పర్చకపోవటమేనన్నాడు వెనకటి కొకాయన) అలా అని తాను నుంచుని వాళ్ళని కుర్చీలో కూర్చోపెట్టడు.

    యజమాని యజమానే, నౌకరు నౌకరే. ఈ విషయంలోనే తండ్రి, కూతురికి వాదన పడింది.

    పద్మిని తెలివికలదే కాని ఆ తెలివి మనీని పెంచటానికి ఉపయోగపడేది కాదు. మంచితనానికి మాత్రమే పరిమితమైనది. అతి మంచితనం కూడా చేతగాని తనంలో ఒక భాగం అని ఓ అనుభవశాలి ఏనాడో చెప్పాడు.

    పద్మిని ఒక్కగానొక్క సంతానం కావటంతో అతి గారాబంగా, పూర్తి స్వేచ్చా స్వాతంత్ర్యాలతో పెరిగింది. తండ్రి తర్వాత బిజినెస్ తాలూకూ మంచి చెడ్డలు చూసుకునేంతగా మటుకు మనసు ఎదగలేదు. మనిషి ఎదిగినా మనసు పసితనం వదలలేదు.

    తెలివిగల అల్లుడిని తీసుకువస్తే తన తర్వాత తనని మించినవాడయి తన కూతుర్ని సుఖపెడుతూ జీవితం అంటే మూడు పువ్వులు ఆరుకాయలు అనిపిస్తాడని...అలాంటి అల్లుడికోసం చూస్తున్న వేళ మిల్లు కార్మికులు సమ్మె చేశారు.

    వర్కర్స్ కి ప్రతి సంవత్సరం బోనస్ లు యివ్వటం, కార్మికుల కష్టసుఖాలు చూడటం ఇలాంటి విషయాలలో మధుసూదనరావు ఎప్పుడూ మంచిగానే వుంటాడు. వర్కర్స్ కి బోనస్ వగైరాలు దండిగానే ముడతాయి.వాళ్ళూ ఆయనపట్ల గౌరవంగానే వుంటారు.     

    వచ్చిన చిక్కల్లా కార్మికుల మధ్యలో వేరు పురుగు వకటి చేరింది. వాడిపేరు సూరిబాబు. రాజకీయ నాయకుడికి కావాల్సిన తెలివితేటలు వున్నాయి. కాని ఎవరూ వాడిని రాజకీయాల్లోకి రానీయలేదు. పనిలేనివాడిచేతికి పుల్లనిస్తే పచ్చిపుండుని కెలికాడట. అలాగ,సూరిబాబుకి ఉద్యోగం యిచ్చేసరికి వాళ్ళల్లోచేరి హాయిగా పనిచేయకపోగా అతి తక్కువ కాలంలోనే లీడరై వాళ్ళ బుర్రల్ని కెలికి తినేయటం మొదలుపెట్టాడు. ఫలితం సమ్మె.

    తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే ఆ పని నచ్చలేదు మధుసూదనరావుకి. మిల్లుకి తాళంవేసి మౌనంగా వుండిపోయాడు.

    సమ్మెవల్ల యజమాని నష్టపోయేది రూపాయలో, పదిపైసలు. వర్కర్స్ నష్టపోయేది అక్షరాలా రూపాయికి రూపాయి. కడుపు కాలింతరువాత ఆ మంటతో వర్కర్స్ అంతా కలిసి మధుసూదనరావు ఇంటిముందు బైఠాయించి నినాదాలు మొదలుపెట్టారు.

    వాళ్ళవల్ల మధుసూదనరావు బాధపడుతుంటే చెవిలో జోరీగలా ఇంట్లో కూతురిగోల. ఆ గోల యేదో విషయంలో కాదు. వర్కర్స్ విషయం పట్టించుకుని పిడి వాదనతో భీష్మించుకుని కూర్చుంది.

    పద్మిని ప్రియదర్శిని హిందీ, ఇంగ్లీషు సినిమాలతో పాటు చాలా యిష్టంగా తెలుగు సినిమాలు చూస్తుండి. తెలుగు సినిమాలు తీసే చాలామంది ప్రముఖులు హీరో హీరోయిన్స్ కిచ్చిన గౌరవం, పారితోషికం మిగతావారి కివ్వరని లైట్ బోయ్స్, సామానులు సర్దేవాళ్ళు రాజుగారి సింహాసనం పక్కన బొమ్మల్లా నుంచుని వింజామరలు వీచే బుల్లి ఆర్టిస్టులని లెక్క చేయరని, వాళ్ళకిచ్చేది పైన లేనని, అగౌరవంతో తలదించుకుని, గతిలేక గత్యంతరంలేక పని చేస్తారని... 

    వగయిరా తెరవెనుక సంగతులు పద్మినికి బొత్తిగా తెలియవు. తెలుగు సినిమాల్లోను, తెలుగు నవలల్లోను బీదవాళ్లు మంచివాళ్ళని వాళ్ళ బాధలు పగవాడికికూడా వద్దని డబ్బున్న వాళ్ళంతా కరుకు కసాయివాళ్ళని...తెలుగు సినిమాలు చూసి చూసి తెలుగు నవలలు చదివి చదివి రక్తంలో పూర్తిగా జీర్ణించుకుంది పద్మిని ప్రియదర్శిని. అనుభవం లేకపోతే చూసి గ్రహించమన్నారు. అదీ లేదు అందాలబొమ్మ ఆ ముద్దుగుమ్మకి.

    "పోనీ ఈ ఒక్కసారికి పప్పీమాట వినండి. కూర్చుని ఎంత తిన్నా ఏడు తరాలకి సరిపోను ఆస్తి మనకుంది" పూర్ణిమాదేవి కూతురుపక్షం చేరి అంది.

    "అది తాన అంటే నీవు తందాన అనకు" కసురుకున్నాడు మధుసూదనరావు.

    "అవతల భోజనాలవేళ అయింది" పూర్ణిమాదేవి ఆ మాట చెప్పి మౌనంగా వుండిపోయింది.

    "మమ్మీ! నీకు తెలియదు. డాడీకి డబ్బే  సర్వస్వం. ఈ ఒక్కసారికి ఆ వర్కర్స్ కి కావాల్సిన డబ్బు యిస్తే ఏంపోయిందిట? అడుగుమమ్మీ. మనకు పోయేది ఏమిటో?" పద్మిని చేతులుకట్టుకుని అటూ యిటూ పచార్లు చేస్తున్నదల్లా పచార్లు ఆపి చూపులు శూన్యంలోకి సారిస్తూ అంది.

    "కాస్త డబ్బు తప్ప పోయేది ఏమీ లేదు కాని ఆ తర్వాత వాళ్ళు బెదిరింపులకి అలవాటుపడతారు. ఇంకా... ఇంకా తేరగా ఇమ్మని అడుగుతూనే వుంటారు. నేను ఇస్తూనే వుంటాను__వాళ్ళు అడుగడుగునా వుంటాను. నేను ఇస్తూనే వుంటాను__వాళ్ళు అడుగుతూనే వుంటారు. చివరికి యెవరికి ఎవరు యజమానో అర్ధంకాకుండా పోతుంది" మధుసూదనరావుకి అంతకన్నా ఇంకా ఎక్కవ యెలా చెప్పాలో తెలియలేదు.

    "పోతే పోతుంది ఏమవుతుంది డాడీ! ఒక్కసారి వెనుక తిరిగి చూసి ఆలోచించండి మీరు చేసిన యీ మంచిపనుల వలన చరిత్రలో మహాపురుషుల్లా మిగిలిపోతారు. అది చాలదా జీవితానికి?"

    "మహాపురుషుడిలా మిగిలిపోవటం ఏమోగాని కొద్దిరోజుల్లోనే మహాబిచ్చగాడిగా మారి బిచ్చగాళ్ళ సంఘానికి అధ్యక్షుడిని కావటం మటుకు ఖాయం" వ్యంగ్యంగా అన్నాడు మధుసూదనరావు.

    "డాడీ!"

    "పప్పీ!"

    "నామాట వినరా?"


Next Page 

  • WRITERS
    PUBLICATIONS