Next Page 
ఒక జంట కలిసిన తరుణాన పేజి 1


               ఒక జంట కలిసిన తరుణాన...
                                     __ కురుమద్దాలి విజయలక్ష్మి


    సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు.
    వాతావరణం వేడిగా వుంది.
    వెంకట్రామయ్యగారింట్లో వీధివాకిలి మొదలు వంటింటిదాకా ప్రతి గుమ్మానికి ప్రతి కిటికీకి నీళ్ళతో తడిసిన వట్టివేళ్ళ తడికలు కట్టారు.
    బైట నూట పద్దెనిమిది డిగ్రీల ఎండకాస్తున్నా ఇంట్లో చల్లగానే వుంది. ఇల్లు పెద్దదికావటం ఆ ఇంటి కాంపౌండ్ చుట్టూతా పెద్దచెట్లు గుబురైనవి వుండటంవల్ల చెట్లగాలి వట్టివేళ్ళలోంచి గదుల్లోకి ప్రవేశించి చల్లదనాన్ని యిస్తున్నాయి. ప్రతిరోజు లాగానే ఎండ తీవ్రంగా బైటకాస్తున్నది. ఇంట్లో చల్లగా వుంది. ఉన్నట్లుండి ఆ యింట్లో చల్లదనంతగ్గి వేడి ఎక్కింది. కారణం చిన్నదే.
    "నువ్వు ఆడపిల్లవు కావుటే!" అంది ఆదిలక్షమ్మ.
    తల్లిమాట వింటూనే వాసంతి ఇంతెత్తు ఎగిరిపడింది. "చూడండి నాన్నగారూ! అమ్మ ఏమంటున్నదో, నువ్వాడపిల్లవుకావా! అంటున్నది. ఆడపిల్లయితే ఏమిటి? బోలెడు సిగ్గుపడుతూ ఒదిగి ఓ మూల కూర్చోవాలా! ఛీ...ఛీ...ఈ దేశంలో ఆడపిల్లలు వెన్నెముక లేకుండా పెరిగి పెద్దవారు కావటానికి తల్లులే కారణం. బిడ్డ భూమ్మీద పడంగానే అయ్యో ఆడపిల్ల అంటారు. ఆ తర్వాత పిల్ల పెరిగి పెద్దదవుతున్నకొద్దీ "నువ్వాడపిల్లవమ్మా జాగ్రత్త" ఇలా మాట్లాడరాదు, ఇలా నవ్వరాదు, ఇలా నడవరాదు అంటూ గానుగ నడపటం ఎద్దుకి నేర్పినట్లు ముల్లుకర్ర అనేమాటలతో పొడిచి ఓదోవలోకి మళ్ళిస్తారు. గానుగచుట్టూ తిరిగేఎద్దు భూప్రదిక్షణం చేస్తున్నానని వెర్రి ఆనందం పొందినట్లు, ఓజో నేనాడ పిల్లను కదూ, ఈ పనులు చేయరాదు, ఇలా వుండాలికాబోలు మరోవిధంగా వుండటం చాలా తప్పు. ఆడదానికిది లాయకీ కాదు అమ్మచెప్పింది, అనుకుంటూ తల్లిమాటలు వల్లిస్తూ అలాగే నడుస్తారు అమ్మాయిలు...
    వాసంతి పెదవి కదిపితే ఆవాక్ ప్రవాహం ఎంతదూరం పోతుందో అనుభవమున్న ఆదిలక్షమ్మ వాసంతి మాటల మధ్యలో అడ్డుతగిలి భర్తతో "దాని మాటలకు తర్వాత మురిసిపోదురుగాని కాస్త నచ్చచెప్పండి" అంది.
    తల్లీకూతుళ్ళ ఫార్సు పావుగంటనుంచీ తిలకిస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్న వెంకట్రామయ్యగారు చిన్నగా ఓ నిట్టూర్పు విడిచి "నాటకంలో నాపాత్ర ప్రవేశించక తప్పదా లక్ష్మి!" అన్నారు.
    "ఇదీవరస, మీతీరు దానితేరు యిట్లా," అంటూ మూతి బహు ముచ్చటగా తిప్పింది ఆదిలక్షమ్మ.
    "చూడండి నాన్నగారూ! అమ్మ మనిద్దరినీ కలిపి తిడుతున్నది." తండ్రి కూర్చుని ఉన్న పడక్కుర్చీ కోడుమీద కూర్చుంటూ ఫిర్యాదు చేసింది వాసంతి.
    "వింటున్నానురా వాసూ! నువ్వు బాధపడకు!" అన్నారు వెంకట్రామయ్యగారు.
    తెల్లబోయింది ఆదిలక్షమ్మ. "నేను తిట్టానా?" అంది.
    "ఊ...తిట్టలేదేమిటీ? తీరు ఇట్టా అట్టా అంటూ ఇప్పుడేగా అన్నావ్?"
    "ఇది తిట్టడమా!"
    "కాదేంటిమరి...!"
    వాసంతి అన్నదానికి ఆదిలక్షమ్మకి ఏమి మాట్లాడాలో తెలియలేదు. వెంకట్రామయ్యగారికి ఆదిలక్షమ్మకి ఏకైక సంతానం వాసంతి. అందువల్లే ముద్దుగా బొద్దుగా అతిగారాబంగా పెరిగింది. ఆధునిక పద్ధతులు ఆదరించే వెంకట్రామయ్యగారు మొగేమిటి ఆదేమిటి అన్నట్లు అన్నింటిలో చనువు పోత్సాహము ఇచ్చి వాసంతిని తీర్చిదిద్దితే, ఆడ ఆడే, మగ మగే అనే పూర్వసాంప్రదాయాలను గౌరవించే ఆదిలక్షమ్మ అప్పుడప్పుడు వాసంతిని కోప్పడేది. తండ్రి తనపక్షం కావటంతో వాసంతి లెక్కచేసేదికాదు. ఇప్పుడు జరుగుతున్నదీ అదే.
    వాసంతి బి.ఏ. పాస్ అయింది. ఎమ్మేలో చేరాలని పట్టుబట్టింది మళ్ళీ కాలేజీలో చేరాలని. వాసంతికిప్పుడు నిండా ఇరవై ఏళ్ళు. వాసంతికి పెళ్ళీడు దాటిందని పెళ్ళి చేయమని వాసంతి ఈడువాళ్ళు పెళ్ళయి, అప్పుడే ముగ్గురు బిడ్డల తల్లులయారని, వాసంతి కడుపున ఓ కాయకాస్తే చూసి ఆనందించాలని చాలాచాలా కోరికలున్నాయి ఆదిలక్షమ్మకి. పెళ్ళి విషయం ఎత్తి మాటకుముందు గొణగటం ఆవిడకలవాటే.
    వెంకట్రామయ్యగారికి మనసులో వాసంతికి పెళ్ళి చేయాలని, ఓ బుల్లి మనవవణ్నో మనుమరాలినో ఎత్తుకోవాలని వుంది. కాకపోతే బైటపడే వారుకాదు. కోప్పడి బలవంతాన ఎవరికో వకరికిచ్చి ముడిపెట్టాలనే తొందరరేంలేదు. ఆడయినా మగయినా వాసంతి వక్కతే. వాసంతిని బాధపెట్టి ఆతర్వాత తాము బాధపడి ప్రయోజనం ఏముంది! ఇదీ ఆయన ఆలోచన.
    ఇహ వాసంతి, గారాబంతో పెరిగినా బుద్దివిషయంలో అక్షరాలా బుద్ధిమంతురాలే. కాకపోతే పూర్వాచారాలకు మాత్రం తలవగ్గేరకంకాదు. అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు సమాన హక్కులుండాలని ఆలోచించిచూస్తే మగదిక్కు లేకుండా ఆడాళ్ళు బ్రతకగలరని...ఆడదిక్కు లేకుండా మగాళ్ళే బ్రతకలేరని... పదేళ్ళు నిండని ఆడపిల్ల విడో అయి వంటరి జీవితంలో నూరేళ్ళు గడిపిందని... నలుగురు బిడ్డలతండ్రి భార్య మరణిస్తే ఆడదిక్కు తోడులేక వెంటనే మరోపెళ్ళి చేసుకుంటాడని, స్త్రీ శక్తిస్వరూపిణీ అంటూ యెన్నోసార్లు కాలేజీలో డిబేట్ లో పాల్గొని వాదించింది. ప్రకృతి పురుషులు సమానమేనని ప్రకృతిలేంది పురుషుడు లేడని, పురుషుడు లేని ప్రకృతిలేదని కాపోతే కొన్ని ఆచారాలు కొన్ని సాంప్రదాయాలు స్త్రీ పురుషులలో ఒకరికి యెక్కువ అధికారం ఇచ్చిందని. అదే ఓనాడు మాతృస్వామ్యిక వ్యవస్తగా మరోసారి పితృస్వామ్యిక వ్యవస్తగా చలామణి అయిందని వాసంతి గ్రహించిందో లేదోగాని డిబేట్ లోమాత్రం స్త్రీ శక్తి గురించి వాదించి నెగ్గేది.
    ఎప్పటిలా కాకుండా ఈరోజు ఆ ఇంట్లో వాతావరణం వేడిగా మారటానికి కారణం బైట నిప్పులు చెలరేగే ఎండకాదు. వాసంతిని చూడటానికి పెళ్ళివారు రాబోతున్నారు. "ఇప్పుడే పెళ్ళేమిటి! పెళ్ళికెవరు తొందర పడుతున్నారు?" అంటూ వాసంతి కోపగించుకుంది.
    "ఇప్పటికిగాని మరెప్పటికిగాని పెళ్ళి అవసరమే, వయసు ముదిరింతరువాత పెళ్ళేమిటి? ఏ వయసు ముచ్చట ఆ వయసుది. యెప్పుడు జరగాల్సినవి అప్పుడు జరిగితే బాగుంటుంది. నీకు నచ్చేవాడు రావాలంటే అదివక్కసారితో అయేపనా! ఎందరబ్బాయిలను చూడాలో యెందరికి వంకలు పెట్టి తిరగ్గొడతావో ఆ సర్వేశ్వరుడికెరుక. చూడు అబ్బాయి నచ్చితే "ఊ అను." అంటూ ఆదిలక్షమ్మ బ్రతిమిలాడింది.
    "చూడండి నాన్నగారూ!" అంటూ తండ్రికి ఫిర్యాదు చేసింది వాసంతి.
    ఆదిలక్షమ్మ మాటలు నిజమేననిపించిన వెంకట్రామయ్య "పోనీలేరా వాసూ! ఈవక్కమాట అమ్మది విందాం." అన్నారు.   
    వెంకట్రామయ్యగారి దృష్టిలో వాసంతి ఆడపిల్ల కాదు. అలా అని మగపిల్లవాడూకాదు. ఉన్న ఒక్క అమ్మాయిలోను అబ్బాయిని చూసుకున్నారు. అందువల్లనే వాసంతిని "అదికాదురా వాసూ!" అంటూ పిలుస్తూ పసితనంనుంచి పిలిచే ఆ పిలుపు అలా వుండిపోయేటట్లు ఆయనే కారకులయ్యారు.
    తల్లి తండ్రిమాట కాదనలేక ఇంతలో కొంప మునిగిపోదులే అనుకుని "ఊ," అంటూ అంగీకారం తెలిపింది వాసంతి.
    పెళ్ళిళ్ళ పేరయ్య ఓ సంబంధం తీసుకువచ్చాడు. మర్నాడు పెళ్ళికొడుకు తదితరులు వచ్చి వాసంతిని చూస్తారు. పెళ్ళిచూపుల తతంగం ఎలాగో ఆదిలక్షమ్మ వివరంగా బోధించింది వాసంతికి. అంతే ఇంట్లో వాతావరణం వేడిగా మారింది. వాసంతిచేసే అల్లరికి గడ్డుప్రశ్నలకి.
    "పెళ్ళికొడుకు మగవాడేకాదనను. అయితే మాత్రం నే కింద చాపమీద తలొంచుక్కూర్చోవాలా? అతగాడు దర్జాగా సోఫాలో కూర్చుని నన్ను శల్య పరీక్షచేసి యక్ష ప్రశ్నలు కురిపిస్తాడా? డామ్ ఇన్ సల్ట్. అతన్ని తలొంచుకుని చాపమీద కూర్చోమను. నేను సోఫాలో కాలుమీద కాలేసుకుని కూర్చోటమేగాక నీకువంటొచ్చా? గుడ్డలుతకటం వచ్చా! ఆటొచ్చా, పాటొచ్చా? అని వెధవ యక్షప్రశ్నలు  వెయ్యి అడుగుతాను? అంది వాసంతి నిప్పుతొక్కిన కోతిలా ఎగిరిపడి. 
    వెంటనే ఆదిలక్షమ్మ "నువ్వు ఆడపిల్లవు కావుటే?" అంది. దాంతో ముగ్గురిమధ్య వాదన ప్రతివాదనలు ఘాటుగా జరిగాయి
    ఏంచెప్పాలో ఆదిలక్షమ్మకు తెలియలేదు.
    ఎవరిపక్షం వహించి నచ్చచెప్పాలో వెంకట్రామయ్యగారికి తెలియలేదు.
    ఏంచేయాలో వాసంతికి తెలియలేదు.
    సరిగ్గా అదే సమయంలో రాధాకృష్ణమూర్తి ఆ ఇంట్లో అడుగుపెట్టాడు.
                                          2
    "సమయానికొచ్చావ్, రాధాకృష్ణా!" అంది అది లక్షమ్మ విప్పారిన ముఖంతో.
    ఆదిలక్షమ్మకి స్వయానా తమ్ముడు రాధాకృష్ణమూర్తి. ఎర్రగా బొద్దుగా అందమైనవాడు. వయసు నలభై దాటింది. గవర్నమెంటు హాస్ పటల్లో సైకియాట్రిస్ట్. మంచి డాక్టరుగా పేరువుంది.
    "బైటనే ననుకున్నాను. ఇంట్లో కూడా చాలావేడిగా వుంది. ఏంటీ కథ?" రాధాకృష్ణ గుమ్మంలో అడుగుపెడుతూనే ముగ్గురి ముఖాలలో భావాలు చదివి అన్నాడు.
    "ఈరోజు సూర్యుడు మీ అక్కయ్యకి అతిధిగా వచ్చాడు." వెంకట్రామయ్యగారు నవ్వుతూ అన్నారు.           


Next Page 

  • WRITERS
    PUBLICATIONS