Previous Page Next Page 
అర్ధచంద్ర పేజి 2


    
    "నాకు అవతలి టీమ్ బాటింగ్ చేస్తూంటే చూడబుద్ది కాదు. అందులోనూ కాసేపు చూడటం మానితే డెఫినెట్ గా వికెట్ పడుతుంది" అని రాఖేష్ లేచి తన గదిలోకి వెళ్ళాడు.
    
    "వెధవ సెంటిమెంట్సు వీడూనూ అదోరకం ఫోజు" అన్నాడు మనోజ్ విసుక్కుంటూ.
    
    "సెంటిమెంటూ కాదు ఏమీ కాదు. వాడు సిగరెట్ కాల్చుకునేందుకు వెళ్ళాడు" అంది వినూత్న కొంచెం మెల్లిగానే.
    
    అయినా ఆ మాటలు విశారదకు వినిపించాయి. భర్త ఏమయినా విన్నాడేమోనని అతని ముఖంలోకి చూసింది. అతను సీరియస్ గా మేచ్ చూస్తున్నాడు. ముఖంలో ఎలాంటి మార్పూ కనిపించలేదు.
    
    పిల్లల్లో వయసొస్తున్న కొద్దీ కలుగుతున్న మార్పులూ, వాళ్ళ ప్రవర్తనా ఆమె గమనిస్తూనే ఉంది. ప్రతిదీ డాషింగ్ అండ్ డేరింగ్ అనుకుంటారు. ఆపేక్షగా ఉన్నట్లే ఉంది ఏదో చిన్న విషయంమీద వివాదం పెరిగి అంతలోనే విరుచుకుపడిపోతూ ఉంటారు. ప్రపంచంలోని ప్రతి సంగతీ వాళ్ళకే తెలుసు ననుకుంటారు. వాళ్ళు చాలా జీనియస్ లని కూడా వాళ్ళ ఉద్దేశం. వాళ్ళ కిష్టమైతే, అవసరమని తోస్తే మాట్లాడతారు. లేకపోతే అడిగిందానికి చచ్చినా జవాబు చెప్పరు. ఉన్నట్లుండి మూడ్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ముగ్గురికీ స్నేహితులు ఎక్కువే. ఆ స్నేహితులు ఎవరో ఎక్కడనుంచి ఊడిపడేవారో అర్ధమయేది కాదు. వినూత్న కూడా రోజుకో కొత్త స్నేహితురాలని ఇంటికి తీసుకొస్తూ ఉంటుంది. ఆమె ఎక్కడికైనా బయటకు వెడుతున్నా, ఫలానా చోటుకు వెడుతున్నానని చెప్పదు. అడిగినా "ప్రతి చిన్నదానికి సంజాయిషీ ఏం చెప్పమంటావమ్మా" అనేది ఒక్కోసారి చెప్పకుండా ఫ్రెండ్స్ తో సెకండ్ షో సినిమాకి కూడా వెళ్ళేది. ఎవరి కారులోనో రాత్రి పన్నెండు గంటలకు దిగేది.
    
    ఉన్నట్లుండి విశారద ఉలిక్కిపడింది. బూన్ అవుటయిపోయాడు. వినూత్న మనోజ్ చప్పట్లు కొట్టారు కేరింతలు కొడుతూ రాకేష్ గదిలోంచి పరిగెత్తుకు వచ్చాడు. "అవుటయ్యాడా?" అని అరుస్తూ.
    
    బూన్ పెవిలియన్ లోకి తిరిగి వెళ్ళిపోతున్నాడు.
    
    తరువాత ఆస్ట్రేలియన్స్ అనుకున్నంత బాగా ఆడలేకపోయారు. పరిమిత ఏభై ఓవర్లలో రెండు వందల కన్నా ఎక్కువ పరుగులు చేయలేకపోయారు.
    
    "ఇండియా తప్పకుండా గెలుస్తుంది" అన్నాడు రాఖేష్.
    
    "కష్టం" అన్నాడు మనోజ్.
    
    "నువ్వెందుకలా ప్రతిదానికీ నెగెటివ్ గా మాట్లాడతావు?" అన్నాడు రాఖేష్ మొహమంతా జేవురించగా.
    
    "నాకు ముందుగా కొన్ని తెలుస్తూ ఉంటాయి."
    
    "ఏమిటో తెలిసేది నీ తలకాయ్! నీ వెధవనోరు ఎలా వాగితే అలా జరుగుతుందని చెప్పు. మంచి విషయాల్లో కాదు. చెడుకు సంబంధించి."
    
    "నన్ను వెధవా గిధవా అనబోకు చెబుతున్నా!"
    
    "నిన్ను అనలేదు నీ నోటిని అన్నాను."
    
    "నా నోటిని అంటే నన్నన్నట్లే. ఆ మాటకొస్తే నా శరీరంలో ఏ పార్టుని అన్నా నన్ను అన్నట్లే."
    
    "నీ మిగతా పార్టుల గురించి నాకెందుకులే వాటి జోలికి పోకుండా ఉండటమే మంచిది."
    
    "నువ్వు నన్ను చాలా అవమానిస్తున్నావు."
    
    "ఒరేయ్ మీరిద్దరూ నోరు మూసుకోండి" అంటూ స్నానం చెయ్యటానికి లేచాడు రాజాచంద్ర. ఇండియన్స్ బాట్ చెయ్యటానికి దాదాపు గంట వ్యవధి ఉంది.
    
                                                           * * *
    
    పదయిపోయింది. స్నానంచేసి బట్టలేసుకుని కూర్చున్నాడుగాని రాజాచంద్ర ఆఫీసుకు వెళ్ళే ప్రయత్నాలు చెయ్యటంలేదు. విశారద చకచకా ఈ గంటలోపలే వంట చేసేసింది.
    
    "రండి ఆఫీసుకు టైమయిపోతుంది" అన్నది భర్తని పిలుస్తూ.
    
    "నేనాఫీసుకు వెళ్ళను" అన్నాడు రాజాచంద్ర.
    
    "అదేమిటి?"
    
    "అదంతే ఫోన్ చేసేశాను రానని."
    
    "క్రికెట్ గురించా?"
    
    "అవును దగ్గరుండి ఇండియాను గెలిపించాలి. ఓ కాఫీపట్రా" అని టీ.వీ దగ్గరకు వెళ్ళిపోయాడు.
    
    ఇండియా బాటింగ్ జరుగుతోంది. గవాస్కర్ కు దెబ్బ తగలడంవల్ల అతను ఓపెనింగ్ బాట్స్ మేన్ గా రాలేదు.
    
    శ్రీకాంత్ రెండు, మూడు అద్భుతమైన షాట్స్ కొట్టాడు.
    
    "శ్రీకాంత్ విజ్రుంభించి శివమెత్తి ఆడితే ఈ రెండొందల పరుగులూ చెయ్యటం ఓ లెక్కలోవి కాదు" అన్నాడు మనోజ్.
    
    అతని నోట్లోనుంచి మాట పూర్తిగా ఇంకా వెలువడలేదు. డేవిస్ వేసిన బంతిని కొట్టబోయి శ్రీకాంత్ వికెట్ కీపర్ కు కాచ్ ఇచ్చాడు.
    
    "అదిగో! అలా కామెంట్స్ చెయ్యద్దన్నా నువ్వలా అనబట్టే శ్రీకాంత్ అవుటయిపోయాడు" అన్నాడు కోపంగా రాఖేష్.
    
    "వెధవ సెంటిమెంట్సూ నువ్వూనూ నేనట్లా అనబట్టే అవుటయిపోతాడా? నే నిక్కడ్నుంచి అనటం శ్రీకమత్ కు వినిపించదా? అతనలా ముక్కు పీలుస్తూ ఉండటంబట్టి కాన్ సన్ ట్రేషన్ చెదిరి ఉండవచ్చు."
    
    "ఆట జరుగుతున్నప్పుడు అలా కామెంట్స్ చెయ్యటం నాకిష్టం వుండదు."
    
    "ఆట జరుగుతున్నప్పుడు బొమ్మలా బిగుసుకు కూర్చోవటం నాకూ ఇష్టం ఉండదు. నేను కామెంట్స్ చెయ్యకుండా గేమ్ ఎంజాయ్ చెయ్యలేను."
    
    "నా కలాంటివి నచ్చవు చెబుతున్నా."
    
    "నీకు నచ్చేదేవిటి పోవోయ్!"
    
    రాఖేష్ కోపంగా లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు.
    
    "సిగరెట్ కాల్చుకోటానికి ఇదో వంక నాకు తెలీదనుకున్నావు" అన్నాడు మనోజ్ కాస్త గట్టిగానే.
    
    విశారద భర్త ఎక్కడ విన్నాడోనని అతనివంక చూసింది మళ్ళీ అతని హృదయమెంత మెత్తనో, ఎంత సుకుమారమో ఆమెకు తెలుసు.
    
    శ్రీకాంత్ అంత త్వరగా అవుటయిపోయినందుకు అతను పడుతున్న బాధ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. మనోజ్ మాటలు విన్నట్లుగా లేడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS