Next Page 
స్వర్గసీమ పేజి 1

 

 

                                                    స్వర్గసీమ
                                                                                      యామిని సరస్వతి

                                             
    "శ్రీదేవి
    ...........

    "శ్రీదేవి"
    .........
    "శ్రీదూ"
    ..........
    "శ్రీ"
    పెదిమలు బిగబట్టి ముఖాన పౌడరు అద్దుకుంటు గదిలోంచి బయటికి వచ్చింది శ్రీదేవి.

    తన ప్రియమైన బి.యస్. ఏ. సైకిల్ కు ఆయిల్ వేసి శుభ్రంచేసుకుంటూ అన్నాడు--"పిలిచిన పిలుపులకి వెంటనే పలకటం అలవాటు చేసుకో శ్రీదూ"

    "తమ కిక్కడ ఏమంతరాచకార్యాలు వెలగ బెడుతున్నారని వెంటనే రావాలో అర్ధంకావటం లేదు."

    శ్రీదేవి ముఖంలోని ఆప్యాయంగా చూస్తూ అన్నాడు మాధవ్-" నీవు చాలా మంచి దానివి శ్రీ"

    తనకి చాలా యిష్టమైనపుడు శ్రీదేవిని "శ్రీ" అని పిలుస్తాడు మాధవ్.

    చిరునవ్వునవ్వుతూ అంది- "తమరి కిప్పుడు ఏం అవసరం వొచ్చిందో యింత ఆప్యాయతని వొలకబోస్తున్నారు."
    చిరుకోపంతో అన్నాడు "మరీ అంత స్వార్ధపరుడిని అనుకోకు శ్రీదూ.......నేనూ భార్యని ప్రేమించే మగాళ్ళలో వొకడిని."
    పకపక నవ్వుతూ అంది "సరి!సరి! ఇదొహటా మళ్ళీ కానీండి ఇంతకీ పిలిచిండెందుకో చెప్పండి"
    సిటుని తుడుస్తూ అన్నాడు- "ఆహా ఏం లేదు. ఈ సైకిల్ ని ఆమ్మేసి మొపేడ్స్ కొందామా అని"
    "లక్షణంగా కొనండి"
    "కొనొచ్చనుకో......."
    "చెప్పండి.......గునుస్తారెందుకు?"
    "ఏం లేదు. మామగారికి ఉత్తరం వ్రాస్తావేమో నని?"
    "ఇందు కన్నమాట......ఈ ఒలకబోతంతా! మీ అడ్డమైన కోర్కెలన్నీ తీరుస్తూ కూర్చోటానికి మావాళ్ళెం కుప్పలు పోసి కూర్చుని లేరు. చేతనైతే కొనుక్కోండి. అంతేకాని నేను మాత్రం వాళ్ళకి ఛస్తే వ్రాయను.
    "పోనీ అప్పుగా నైనా యివమను"
    ఎఱ్ఱగా చూస్తూ అంది."ఇక్కడే ఏ మార్వాడి వద్దనైనా తెచ్చుకోండి."
    పోబోతున్న శ్రీదేవి కొంగుపట్టుకొని ఏదో అనబోయాడు.
    విదిలించుకుంటు అంది "చీ!ఛి!! నేను మడి"
    విలాసంగా "నన్ను మించిన మడి ఏమిటి?" అన్నాడు.
    "అంటే?"
    "అంటే ఓ లలనా! మడి అనేది కేవలం భర్తగారి ఆయురారోగైశర్య ఫలసిద్ద్యర్ధమ్ అంటారు. చూడు అలాంటిది. కాబట్టి మడి అనేది భర్త సంబంధం. అవన్నీవున్న నాకు నీ మడితో అవసరం లేదు."
    విదిలించుకుంటూ "చాలించండి మీ వ్యాఖ్యానం" అని వంటింట్లోకి వెళ్ళిపోయింది.
    ఎలాగో సైకిల్ ని శుభ్రం చేసేసి బాత్ రూమ్ కి వెళ్ళాడు. వేన్నిళ్ళు చల్లారిపోయాయి. అలాగే కళ్ళుమూసుకుని పోసేసుకున్నాడు. ఇంకో సమయంలో అయితే మారాం చేసి ఎలక్ట్రిక్ స్టౌ మీద ఓ బిందెడు నీళ్ళు వేడి చేయించి మరీ ఉత్సాహంగా స్నానం చేసేవాడు. కాని యీ రోజు సోప్ కూడా వాడకుండా స్నానం చేసేసి పొడిబట్ట చుట్టుకుని వంటింట్లోకి వెళ్ళి పీటవాల్చుకుని వెండి పళ్ళెం పెట్టుకుని టబ్ నుంచి నీళ్ళు పట్టుకునివచ్చి కూర్చున్నాడు భోజనానికి.
    అన్నీ గమనిస్తూనే వుంది ఆమె. నరనరాన వుడికిపోతోతుంది కోపం. ఏమిటి అడారితనం? తను వడ్డించి పిలిస్తే దర్జాగా వచ్చి భోజనం చేయవలసింది పోయి........
    అయినా నిగ్రహించుకుంది. తనకి కోపం వస్తే హద్దులు తెలియవు. ఇంతకు పూరమేఅలా........
    తెర్లుతున్న చారుగిన్నేని దించి తిరుగమోతకు వేసి నింపాదిగా మరో పళ్ళెం తీసుకుని అన్నం తోడింది.
    తర్వాత పప్పూ, పచ్చడి, కూర, మాగాయి వేసి, దేవుడి మండపం వద్దకి వెళ్ళి నీళ్ళు చిలకరించి పళ్ళెం అలా పెట్టి ఓ వూదుబత్తి వెలిగించి నైవేద్యం పెట్టింది. ఆవేళకి తొమ్మిది దాటింది.
    అతనికి చిరాకు ముంచుకొచ్చింది. చిరాగ్గా చూశాడు.
    అతని చూపుల్ని లెక్కచేయకుండా పదార్ధాలన్నీ వున్న పళ్ళేన్ని అతనిముందు పెట్టింది, అంతకు ముందు అక్కడ వున్న పళ్ళేన్ని పక్కకు నేట్టుతూ.
    మౌనంగా ఆపోశనం పట్టాడు. ప్రాణహతులు వేసుకుని పచ్చడి కలుపుకున్నాడు.
    నేయివేస్తుందేమోనని చూశాడు. అదేమి లేకపోగా బయటికెళ్ళి నిలుచుంది నిత్యభిక్షవేద్దామని.
    నిట్టూర్చి నేయి వేసుకున్నాడు. పచ్చడి బ్రహ్మాండంగా వుండటంతో కమ్మగ తినసాగాడు.
    పళ్ళెంలోని పదార్ధాలన్నీ అయిపోయాయి.

    ఆమె ఇంకా బయటే వుంది.
    "ఇదిగో"
    "......."
    "నిన్నే"
    "......."
    అతనికి కాస్త కోపం వచ్చినప్పుడు శ్రీదేవిని అలా పిలుస్తాడు. అప్పటికి రాకపోయేసరికి."
    శ్రీదేవి" అని కేకేసాడు.
    "శ్రీదేవి"
    "ఓ" అంటూ వచ్చింది.
    కోపంగా అన్నాడు. "ఇక్కడే వుండి పలకవెందుకు?"


Next Page 

  • WRITERS
    PUBLICATIONS