Next Page 
అర్ధరాత్రి ఆర్తనాదం పేజి 1

 

                                   అర్ధరాత్రి ఆర్తనాదం   
                                                           ---కురుమద్దాలి విజయలక్ష్మి   
                               

     "అవును సరిగ్గా ఐదుసార్లు"
    ఈ మాట అనిత ఏ అరవైసార్లో అనుకుంది. కిరణ్ కి ఆ మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఐదు లోపల ఐదుసార్లు ఫోన్ చేసింది.
    "నో రెస్పాన్స్"
    "కిరణ్ ఏమయ్యాడు? ఎక్కడికి వెళ్ళాడు?" ఎంత ఆలోచించినా అనితకు అర్ధం కాలేదు.
    అర్జంట్ గా కిరణ్ ను కలుసుకోవాలి ఈ వార్త అందించాలి. అపుడు కిరణ్ ఏమంటాడు! ఏమైనా అనచ్చు. "ఎంత గుడ్ న్యూస్ వినిపించావు అనితా!" అనొచ్చు.
    "అబ్బ, అప్పుడే ఏం తొందర అనితా!" అనొచ్చు.
    "ఏమో ఏమైనా అనొచ్చు!"
    ఏదైనా అది కిరణ్ ని కలుసుకున్న తరువాత సంగతి.
    కిరణ్ ఏమయ్యాడు? ఎక్కడికి వెళ్ళాడు?" అరగంటకి ఒకసారి ఆగి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తే నాధుడు కనపడలేదు.  మహానుభావుడు ఎక్కడ తిరుగుతున్నాడో!
    అనిత ఆలోచిస్తూ అటు ఇటు పచార్లు చేస్తూ ఉండిపోయింది.
    చాలాసార్లు కిరణ్, అనిత అదేపార్కులో కలుసుకున్నారు. కిరణ్ కోసం వెతికి వేసారి అనిత చివరకు పార్కుకు వచ్చి పచార్లు చేస్తూవుండిపోయింది.
    "ఇపుడు కిరణ్ ను ఎక్కడ పట్టుకోవాలి?" అతని కోసం ఎక్కడంటూ వెతకాలి? అనిత ఆందోళనగా ఆలోచిస్తుంటే, అదే సమయంలో కిరణ్ పార్కులో కాలు పెట్టాడు.
    అనితను చూసి కిరణ్ "హాయ్ అనితా?" అన్నాడు.
    కిరణ్ ని చూసి అనిత రెట్టింపు సంతోషంతో "హాయ్ హాయ్ నాయకా" అంది అనిత.
    "ఏంటి చాలా హుషారుగా వున్నావ్! దగ్గరికి వచ్చి అడిగాడు కిరణ్.
    "ఆ విషయం తరువాత చెప్తాను. ముందు ఇది చెప్పు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం లేదు" అని అడిగింది అనిత.
    "వెయ్యి ఇళ్ళ పూజారిని అంతా నీకు తెలుసు కదా అనితా!" అన్నాడు నవ్వుతూ కిరణ్.
    "వెయ్యి ఇళ్ళ పూజారివో, వెయ్యి గుళ్ళ పూజారివో నాకు తెలియదు బాబు. నీకోసం ఇవాళ ఎదురు చూసినట్టు ఇంతవరకు ఎప్పుడు ఎదురు చూడలేదు!" అంది అనిత.
    అనిత ప్రక్కనే క్రింద కూచుంటూ "ఏమిటబ్బా అంత విశేషం?" అన్నాడు కిరణ్.
    "ఈరోజు చాలా కష్టపడ్డాడు తెలుసా?"
    "ఎందుకనో పాపం!"
    అనితకి చిలిపి ఆలోచన వచ్చింది. "కనుక్కో చూద్దాం!" అంది చిలిపిగా.
    "ఊ నామీద మనసై వుంటుంది".
    "నీకెప్పుడూ అదే రంధి".
    "కాదామరి? నీలనతి అప్సరసను ఎదురుగా పెట్టుకుని!" కొద్దిసేపు వారిద్దరిమధ్య ఎప్పటిలాగానే చిలిపిగా మాటలు దొర్లాయి. తరువాత అనిత సూటిగా అసలు విషయంలోకి వచ్చింది.
    "నీకో శుభవార్త వినిపిద్దామని అనుకుంటే నువ్వు ఫోన్ లో దొరకలేదు, ఇంటిదగ్గర లేవు. చివరికి ఈ పార్కుకు వచ్చి కూర్చుంటే ఇక్కడ అనుకోకుండా ప్రత్యక్ష మయ్యావు" అంది అనిత.
    ఆ మాట వింటూనే కిరణ్ గుండె గుభేల్ మంది. ఆడపిల్లలు వినిపించే శుభవార్త ముఖ్యంగా ఇలాంటి సమయాల్లో వినిపించే శుభవార్త ఏమిటో కిరణ్ కి బాగా తెలుసు. అయినా తనంతట తానుగా బయటపడకుండా "నాకు తెలుసులే!" అన్నాడు కిరణ్.
    "తెలుసా?" తెల్లబోయింది అనిత.
    "తెలుసు" అన్నాడు కిరణ్.
    "ఏమిటో చెప్పు చూద్దాం?"
    "ఏముంది ఇవాళ నువ్వు నన్ను సినిమాకి తీసుకువేడుతున్నావ్" అన్నాడు తేలికగా కిరణ్.
    పొంగే పాలమీద చన్నీళ్ళు గ్రుమ్మరించినట్టు అనిత ఉత్సాహం చల్లారిపోయింది.
    నా ముఖంలా వుంది! అంది చిరాగ్గా అనిత.
    "నీ ముఖానికే పసిపాప ముఖంలా అమాయకంగా అందంగా వుంటుంది!" అన్నాడు కిరణ్.
    "అమ్మయ్య ఎలాగైతేనేం అసలు విషయానికి వచ్చావ్ అదే, అదే." అంది ఆనందంగా అనిత.
    కిరణ్ తన పెదవి గంటుపడేలా కొరుక్కుని ఇక లాభం లేదు అని తెలుసుకుని అసలు విషయంలో సూటిగా దిగాడు, "అయితే ఏంటో చెప్పు?" అన్నాడు.
    "మొద్దు బుర్ర, ఏమీ అర్ధంకాదు" ముద్దుగా అంది అనిత.
    "అర్ధం కానపుడు చెప్పొచ్చుగా!"
    "నేనే చెప్పాలా!"
    "చెప్పాలి"
    తప్పదా"
    "తప్పదు"
    అనిత కళ్ళు మూసుకుని చెప్పింది, "మనకి ఓ బాబు పుట్టబోతున్నాడు" అని.
    అనిత శుభవార్త అనగానే ఇలాంటిదేదో అని ముందే వూహించాడు కిరణ్. అతని బుర్ర వేగంగా పనిచేయటం మొదలుపెట్టింది. అతని బ్రెయిన్ అందరి బ్రెయిన్ లాంటిది కాదు. చాలా క్విక్ గా పనిచేస్తాడు క్విక్ గా నిర్ణయం తీసుకుంటాడు. అప్పటికప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాడు.
    కళ్ళు మూసుకుని ఈ విషయం చెప్పిన అనిత, తను ఈ శుభవార్త వినిపించినందుకు కిరణ్ నుంచి ఎటువంటి రెస్ పాన్స్ లేదేమిటా? అని అనుకుంటూ కళ్ళుతెరిచింది.
    తీవ్రంగా ఆలోచిస్తూ నొసలు ముడేసిన కిరణ్. నేవినిపించిన వార్త నీకు షాక్ లాగా తగిలిందా కిరణ్" డగ్గుత్తికతో అడిగింది.
    "అవును, షాక్ లాగానే తగిలింది. అయితే అది తియ్యని షాక్," అన్నాడు కిరణ్.
    కిలకిలా నవ్వింది అనిత ఆ మాటలకి.
    "ఇప్పుడు మనం తొందర పడాలి" అంది అనిత.
    "అవును చాలా తొందరగా నిర్ణయం తీసుకోవాలి" అన్నాడు కిరణ్.
    "దేనికి?"
    "మన పెళ్ళికి"
    అనిత ఆల్చిప్పల్లాగా కళ్ళు విప్పార్చుకుని అడిగింది "నిజం" నిజంగా నిజం!"
    "నేనీ విషయం చెప్పగానే ఒప్పుకుంటావనుకోలేదు కిరణ్"
    "అంటే నన్నాపర్ధం చేసుకున్నావన్నమాట."
    "అలా అని కాదు కిరణ్, నువ్వు ముందే చెప్పావు కదా పెళ్ళికి కొన్నాళ్ళు ఆగాలని, అందుకని అలా అన్నాను"
    "కానీ ఇప్పుడు తప్పదు"
    "అవును తప్పదు."
    "అనితా నేను  రేపు ఊరు వెడుతున్నాను. శనివారం ఉదయం వస్తాను. ఆదివారం డాడీతో మాట్లాడతాను డాడీ మన పెళ్ళికి వప్పుకున్నారా సరే, లేకపోతే నిన్ను ఏ గుళ్ళోనో పదీమంది ఫ్రెండ్స్ ఎదుట పెళ్ళి చేసుకుంటాను. మనం క్రొత్త జీవితం ప్రారంభిద్దాం. మనం తొందర పడ్డాం. ఈ పరిస్థితులలో పెళ్ళికికూడా తొందరపడటం మంచిది....కిరణ్ చెప్పుకుపోతున్నాడు.      


Next Page 

  • WRITERS
    PUBLICATIONS