Next Page 
కనబడుటలేదు పేజి 1

 

    
                            కనబడుటలేదు

 

                                                                                        సి. అనందరామం.

 

                   

 

అణువేద పేరున్న్ డాన్సర్. ఆమె అందాన్ని, డాన్స్ ను చూసి ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు జీవన్. అతడు జమిందారీ వంశానికి చెందిన వ్యక్తీ. ఆస్తి మొత్తం కరిగిపోయి అప్పులు మిగిలిపోయినా డబ్బును మంచినీళ్ళలా ఖర్చు పెట్టె అలవాటు మాత్రం మనుకోలేకపోయాడు. పెళ్ళయిన తర్వాత అభిప్రాయబేధాల వల్ల విడిపోతారు అణువేద జీవన్. అణువేద భువనేశ్వర్ వెళ్ళిపోయి అక్కడ డాన్స్ స్కూల్ పెట్టుకుంటుంది. కూతురు రాగమాలను కూడా తనతో పాటే తీసుకువెళ్తుంది.

జీవన్ తన కూతురు రాగమాలను అణువేద దగ్గర్నుంచి తెచ్చి తనకు అప్పగించేందుకు హమేషా అనే ఒక కిడ్నాపర్ ను కుదుర్చుకుంటాడు. అయితే తర్వాత తెలుస్తుంది అతనికి ఒక నిజం. అదేంటంటే ఆ హమేషా అనే గుండా పసిపిల్లల్ని రేప్ చేసే ఒక మానసిక రోగి, ఆ విషయం భువనేశ్వర్ లో వున్న తన భార్యకు ఫోన్ చేసి చెప్పబోతే ఆమె వినిపించుకోదు. ఇంతలో రాగమాలను కిడ్నాప్ చేస్తాడు ఆ మానసికరోగి. ఆద్యంతం సస్పెన్స్ తో నిండిన నవల ఇది.

శీతాకాలం సూర్యుడుదయించినా వెలుగు రేఖలు మంచు పొరలను చీల్చుకొని భూమిని తాకలేక పోతున్నాయి. తలుపులన్నీ బిడాయించుకొని, రగ్గు మూసుకు పెట్టుకొని, ఫోమ్ పరుపుల్లో పడుకున్నవాళ్ళకి, ఉదయం ఆరు గంటలైనా అర్ధరాత్రి లాగే వుంది. అలావాటుగా ఆరు గంటలకే మెళుకువ వచ్చింది జీవన్ కి. అయినా కళ్ళు తెరవాలనిపించడంలేదు. నిద్ర మెళుకువ వచ్చినా ఇలా కళ్ళు మూసుకు పడుకోవడంలో ఏంటో హాయి వుంది అతనికి ఆ హాయి తడిపొడిగా వున్న మెత్తని వెంట్రుకలు కలిగిస్తోన్న గిలిగింతలలో చెవి దగ్గర గుసగుసలాడే మెత్తని పెదవులలోంచి వెలువడే తియ్యని మేలుకొలపులలో అందుతుంది అతనికి.

"ఇక లేవండి సార్! తెల్లవారింది. ఇప్పట్నించి తమరి పనులు ప్రారంభిస్తే కాని వర్కు షాప్ కి కనీసం అరగంట లేటుగా నైనా చేరుకోలేరు."

గభాల్న కళ్ళు తెరిచి చుట్టూ చూసాడు. ఎవరు లేరు. అంతా తన భ్రాంతి తియ్యని మెత్తని గొంతులేవి లేవు అమ్మా, అక్కయ్య కాబోలు మిల్లు సైరన్ లా అరుస్తూ ఏదో వాదించుకుంటున్నారు. అణువేద వున్నన్నాళ్ళు వాళ్ళిద్దరూ ఏకమై ఆమెని నానా మాటలు అనేవారు. ఇప్పుడు ఆమె లేక పోయేసరికి వీళ్ళిద్దరూ ఒకరిమీద ఒకరు అరుచుకుంటున్నారు.

రగ్గు విసిరేసి లేచి కూర్చున్నాడు జీవన్. డబుల్ బెడ్ లో రెండో భాగం. ఖాళీగా బోసిగా వెక్కిరించింది. కలుక్కుమంది మనసు. ఇంకెంతలే వారం. పది, కాకపోతే పదిహేనురోజులు అంతే. లేగ వెంట గోవులా ఆ నారీ శిరోమణి తనంతట తానే పరుగుపరుగున వచ్చేస్తుంది. ఆ ఆలోచనే అతని కెంతో హుషారు నిచ్చింది. బ్రష్ పైన పేస్టు వేసుకుని, పక్కనే వున్న మరో చిన్న గదిలోకి నడిచాడు. బేబికాట్ ఖాళీగా వుంది. అల్మార నిండా కీ ఇస్తే పరుగులు తీసే కార్లు రైళ్ళు మొదలైనవి, నొక్కగానే కీచు కీచుమని అరిచే రకరకాల ప్లాస్టిక్ జంతువులు , నీలిరంగు కళ్ళతో బంగారురంగు జుట్టుతో కళ్ళు మూసి తెరచే సేల్యులైడ్ పాపలు, డయల్ బోర్డు వున్న టెలిఫోను రకరకాల బొమ్మలు అస్తవ్యస్తంగా వున్నాయి. అవన్నీ చూస్తూ నిట్టూర్పు వదిలాడు.

అది అతడి నిత్యకార్యక్రమంలో మొట్టమొదటిది. రాగమాల బేబికాట్ మీద కళ్ళు మూసుకుని అమాయకంగా నిద్రపోయే రోజుల్లో ఆ పసిడిబుగ్గమీద ముద్దు పెట్టుకున్న తరువాత గాని అతని రోజు మొదలయ్యేది కాదు. పాచి మొహంతో నిద్రపోతున్న పాపను ముద్దు పెట్టుకోవద్దని అణువేద ఎప్పుడూ పోట్లాడుతూనే వుండేది. తను ఆమె మాటలు వినిపించుకున్నదెప్పుడు?

సైరన్ మోతలు కుక్కల అరుపుల స్థాయికి దిగాయి. పాపం అలసిపోయారు కాబోలు కాఫీ కోసం డైనింగ్ హాలులోకి వెళ్ళక తప్పదు. అక్కడికి వెళ్ళాలంటేనే భయం. అతనికి తల్లి అక్క  చెరొక వైపు నుంచి తగులుకుంటారు తీరుబడిగా తమ వాదనలన్నీ వినిపించాలని చూస్తారు. అవతలి వాళ్ళ మూడ్ అర్ధం చేసుకోరు. లోలోపల విసుక్కుంటూనే డైనింగ్ హాల్లోకి వచ్చి "కాఫీ" అని గట్టిగా అరిచాడు. అంత గట్టిగా అరవకపోతే వాళ్ళిద్దరిలో ఎవరికి తన గొంతు వినిపించేలా లేదు. జీవన్ గొంతు వినగానే ఒక్క క్షణం నిశ్శబ్దం ఆవరించింది.

ఏదో భయంకరమైనది చూపించబోయే ముందు తెలుగు సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టరు సృష్టించే నిశ్శబ్దంలా తోచింది అది. అతడూహించినట్టుగానే అక్క,అమ్మ చెరొక వైపు నుంచి హయ్యి మంటూ ఒకేసారి చెరొక స్థాయిలో ఏదేదో అరవడం మొదలుపెట్టారు. అతను వాళ్ళ మధ్య నుంచి తప్పించుకొని చెప్పులేసుకుని బయటికెళ్ళాడానికి తయారయ్యాడు.

"ఎక్కడికిరా?" అంది తల్లి ఆయాసంతో వగరుస్తూ.

"బయటకు వెళ్లి ఏ హొటల్ లోనైనా కాస్త కాఫీ తాగి రావడానికి. "తాపీగా అన్నాడు. తల్లి నెత్తినోరు కొట్టుకుంటూ "కాఫీ కావాలని అడగరాదుట్రా! తెచ్చి పెట్టాను!

వ్యంగ్యాలు, వెటకారాలు దేనికి? వంటలక్కలా పడి వున్న ముసలితల్లితోనా నీ హాస్యాలు!" అని  వొంగి పోతున్న నడ్డిమీద రెండుచేతులు వేసుకుని కిచెన్ లోకి వెళ్ళబోయింది.

"చూశావా! చూశావా! తమ్ముడూ! తను వంటలక్కలా పడి వుంటుందట. అంటే నేనేం చెయ్యటం లేదనేగా దెప్పి పొడుపు. నిన్న నాన్నగారి తద్దినం అంటే "తడి బట్టకట్టుకోలేను జలుబు చేసింది అన్నాను. అంతే నా మొగుడు నన్ను నిర్లక్ష్యం చేసి వదిలేసేడనేగా నేనంటే అందరికి చులకన." ఏడుస్తూ పైట కొంగు పాడవకుండా పాత బట్టతో ముక్కు చిదుకుంది. అక్క. కిచెన్ లోకి నడవబోతున్న ముసలావిడ గిరుక్కున వెనక్కి తిరిగి-

"ఎవరు ఎవరిని చులకన చేస్తున్నారో అందరికి తెలుసు. ముసలిదాన్ని తడిబట్ట కట్టుకుని వంటంతా చేస్తుంటే చీమ కుట్టినట్టయినా వుంది నీకు. తడి బట్టకట్టుకోవడానికి నీకు జలుబైతే కూరలు తరిగివడానికి , పప్పులు రుబ్బి ఇవడానికి ఏం రోగం?" అని సాగదిసింది.

"అక్క తన ఏడుపు మరిచిపోయి ఏదో అందుకోబోతుంటే చల్లగా అక్కడ్నుంచి జారుకున్నాడు జీవన్. మండు వేసవిలో తలుపులు, కిటికీలు మూసి వున్న ఫాన్ లేని గదిలోంచి చల్లని ఏ.సి. రూమ్ లోకి వచ్చి పడినట్లయింది. తల్లిని, అక్కని చూసిన బైటవాళ్ళు వాళ్ళిద్దరూ ఆగర్భశత్రువులనుకుంటారు. అయితే వాళ్ళిద్దరిమధ్య ప్రేమభిమానాలకి తక్కువ లేదు. అసలు రహస్యం వాళ్ళకి తగిన వ్యాపకం లేదు. మానవ సంభాషణలో అత్యంత ప్రధానమైన అంశం అభివ్యక్తి. తెలివితేటలు న్న వాళ్ళు, తెలివితేటలతో కూడిన వ్యాపకాలను కల్పించుకోగలిగిన వాళ్ళు, తమ కార్యకలాపాల్లో తమని తము వ్యక్తికరించుకోగలుగుతారు. అది లేని వాళ్ళు ఏదో కబుర్లతో వ్యక్తికరించుకోవాలని చూస్తారు. తమని తాము సమర్ధంగా వ్యక్తికరించుకోలేక తమకే తెలియని అసంతృప్తిలో బాధపడుతూ, ఆ అసంతృప్తిని పోట్లాటలుగా, దెప్పి పోడుపులుగా రకరకాలుగా వ్యక్తపరుస్తుంటారు.

మగవాళ్ళలో కంటే చాలా మంది ఆడవాళ్ళలో అసంతృప్తి , అసహనం ఎక్కువ కావడానికి ఇదే కారణమేమో? తల్లి సరే పాతకాలం మనిషి చదువుకోని, కానీ అక్క బి.ఏ. వరకు చదువుకుంది. అయినా ముర్ఖత్వంలో పాట కాలపు తల్లికి ఏమాత్రం తీసిపోదు. పుస్తకాలు కంఠతా పట్టేసి  డిగ్రీలు తెచ్చేసుకోవడంకంటే అక్క లాంటి ఆడపిల్లల చదువులకి విలువ లేదేమో? ఒకవేళ స్వతంత్రంగా ఆలోచించగలిగిన ఆడపిల్లలుంటే అణువేద లాగ సమస్యలని ఎదుర్కోక తప్పదేమో?

అటుతిరిగి ఇటుతిరిగి ఎప్పటికప్పుడు ఆలోచనలు అణువేద దగ్గరకే రావడం, నవ్వు తెప్పించింది జీవన్ కి.

"అణు! నువు నా దగ్గరకొచ్చేస్తావు తప్పకుండా వచ్చేస్తావు. "సంతృప్తిగా మనసులో అనుకోని హొటల్ బ్లూకింగ్ ఆవరణలో మోటార్ సైకిల్ పార్కు చేసి వెజిటేరియన్ రెస్టారెంట్ సెక్షన్ లోకి వెళ్లి కాఫీ ఆర్డరు చేసి వెంట తెచ్చుకున్న న్యూస్ పేపర్ తెరిచాడు. ఫ్రంట్ పేజిలో ప్రచురించిన మగవాడు ఫోటో చూసి అదిరిపడ్డాడు. మరోసారి పరిశీలనగా చూసాడు. సందేహం లేదు ఖచ్చితంగా అతనే.ఇతని ఫోటో యెందుకు వేసారు? కొంపదీసి తను ఆర్డరు చేసిన పని చేస్తూ పట్టుబడలేదు కదా!


Next Page 

  • WRITERS
    PUBLICATIONS