Next Page 
గోడచాటు ముద్దు పేజి 1

                                                                            

 

                                                గోడచాటు ముద్దు
                                                                                          

                                                  --సూర్యదేవర రామ్ మోహన్ రావు
   

                                   
                                                                              
             

 

     ప్రేమ, ద్వేషం రెండూ రెండు విభిన్న ధృవాలు...
   
    ఒక్కొక్కప్పుడు ప్రేమ విషయంలో కొంతమంది రాజీ పడతారు. రాజీ లేనిది విషంలాంటి ద్వేషమే ద్వేషం అడవి నాగుపాము కుబుసం లాంటిది. ప్రతిరోజూ అందంగా పురులువిప్పే నెమలి పించం ప్రేమకు నిదర్సనమైతే ప్రతి ఊపిరిలోనూ ద్వేషాన్ని వెలిగ్రక్కే ఆదునిక మృగమే మనిషి!
   
                                             *    *    *    *
   
    "ఇదిగో మయూషా, ఆ కరివేప రెమ్మలు ఏం తెచ్చావే తల్లీ. అదేదో నీ ఆస్తి పోతుందన్నట్టు రెండంటే రెండు రెమ్మలు తెచ్చావేంటి పిల్లా చారులోకి రెండు రెమ్మలు విరుచుకురా తల్లీ" వంటగదిలోంచి వదిన మాలతి పిలుపువిని డ్రెస్సింగ్ టేబుల్ ముందు బొట్టు పెట్టుకుంటున్న మయూష తలతిప్పి కిచెన్ రూమ్ వేపు ఓరగా చూసింది.
   
    "ఉదయం లేచిన దగ్గర్నుంచీ, బాత్ రూమ్ లో గంట, డాబామీద అరగంట, అద్దం ముందు రెండుగంటలు తప్ప  ఇంటి పన్లమీద దానికి ధ్యాసేవైనా ఉందా మాలతీ-నే వెళతానుండు" బియ్యం ఏరుతున్న మయూష తల్లి చేట ముందునుంచి ఆయాసంతో లేవబోయింది.

   
    గబుక్కున లోన రూమ్ లోంచి పరుగు పరుగున బయటికొచ్చింది మయూష. వరండా మీద నిలబడి తల్లివేపు చుర చుర లాడుతూ చూసింది.
   
    "కరివేపాకు రెమ్మల్ని తగు మాత్రమే వంటల్లో వాడాలి తప్ప గోంగూర కట్టల్లా వేయకూడదు. అందుకే రెండంటే రెండు రెమ్మలు తెచ్చాను. కావాలంటే తెస్తానుగా. ఎందుకలా నస" వదినతో చనువుగా నవ్వుతూ అనేసి పెరటి మెట్టుమీద కాలేసింది మయూషా.
   
    "ఆ వంటల పుస్తకం చదివి వంటలు నేర్చుకోమని అనడం నాదీ తప్పు ఆ పుస్తకాల్లో రాసినట్టుగా తగుమాత్రం కరివేపాకు, రెండు చెంచాల ఉప్పు, ఈ పద్దతిలో వంట చేశావనుకో-నీ కొస్తాడే ఆ మొగుడు రెండ్రోజుల్లో బైరాగుల్లో కలిసిపోవడం ఖాయం" వదిన మాలతి నవ్వుతూ అంది.
   
    "ఆ వచ్చే మొగుడికి వంట చేయడం కోసం నేను పెళ్ళి చేసుకోవాలా-చచ్చినా పెళ్ళిచేసుకోను" మొగుడు అనే పదం వినబడగానే ఎందుకో మయూష కళ్ళల్లో ఆనందం, బుగ్గలమీద అంచక్కటి నీరెండ లాంటి వయసు వెలుగు తొంగి చూసింది.
   
    ముచ్చటగా సిగ్గుపడింది మయూష!
   
    ఇరవై రెండేళ్ళ మయూష సన్నగా పొడవుగా వుంటుంది. అటు నలుపూ, ఇటు తెలుపూ కాని దేహఛాయ కోలగా పొడవాటి ముఖం విశాలమైన నుదురుకింద నల్ల కలువల్లాంటి కళ్ళు-చిన్ని పెదాలు-జలపాఠం లాంటి జుత్తు-ఈ ఏడాదితో డిగ్రీ ఫైనలియర్ పూర్తవుతుంది.
   
    పెరట్లోకి అడుగుపెట్టిన మయూష గోడవరకూ వెళ్ళి ఆగింది.
   
    పాతకాలపు యింటి పెరడు కావడంవల్ల విశాలంగా వుంది. ఎత్తుగా పెరిగిన కొబ్బరిచెట్లు, ఆ పక్కన గుబురుగా చింతచెట్లు, ఆ పక్కన మామిడిచెట్లు, ఆ మామిడి చెట్టుకి ఆనుకుని వరసగా కూరగాయల మొక్కలు, ఆ పక్కన దానిమ్మ, దాని పక్కన కరివేపాకు చెట్లు.
   
    ప్రతిరోజూ లేవగానే తోటలోను, డాబామీద కాసేపు తిరగడం మయూషకు అలవాటు. ఆమె ఇంటికి ఎడమపక్కన చిన్న పెంకుటిల్లు వుంది. డాబామీంచి ఆ యిల్లు చెట్లమధ్యనుంచి కుటీరంలా కనబడుతుంది.
   
    మొన్నటివరకూ ఆ యిల్లు ఖాళీగానే వుంది. రెండ్రోజుల క్రితం ఆ ఇంట్లో కొత్తగా ఎవరో దిగారు.
   
    క్రితంరోజు ఉదయం సరిగ్గా ఎనిమిది గంటలకు డాబామీద కెక్కి అలవోకగా పక్కింటి పెరడువైపు చూసిన మయూషకు ఒక అనుకోని దృశ్యం కనబడింది-అలాంటి దృశ్యాన్ని చూడడం ఆమెకు అదే ప్రధమం__ఏదో తెలియని ఉత్సాహంతో గోడ చివరవరకూ వెళ్ళి చింతచెట్టు కొమ్మల వెనకనుంచి రహస్యంగా చూసింది. ఆ దృశ్యాన్ని.
   
    పాతికేళ్ళ యువతి బకెట్ తో నీళ్ళు తెచ్చుకుని బాత్ రూమ్ లో పెట్టి టవల్ ని గోడమీద పెట్టి బాత్ రూమ్ లోకి అడుగు పెట్టేలోపలే__
   
    ముప్పై ఏళ్ళ వ్యక్తి గబగబా లోన్నుంచి లుంగీతో పరుగెత్తుకొని వచ్చి అటూ యిటూ దొంగచూపులు చూసి చటుక్కున మెరుపు వేగంతో ఆ యువతిని గోడచాటుకి లాగి తన రెండు చేతుల్లో గాఢంగా బంధించి ఆమె ఏదో మాట్లాడబోయేటంతలో తన రెండు పెదవుల్తో ఆమెను కొన్ని క్షణాలసేపు మాట్లాడనివ్వకుండా చేసి ముద్దు పెట్టేసుకుని ఆ పనయిన తర్వాత__
   
    నవ్వుతూ ఆమెవేపు చూసి, ఆమె బుగ్గమీద చిటికెన వేలితో చిన్నగా కొట్టి, వేగంగా లోనికి వెళ్ళిపోయాడు.
   
    ఆదరా, బాదరాగా వెళ్ళిపోతున్న అతనివేపు ఆమె ఒక్కక్షణం చిరుకోపంగా చూసి, అంతలోనే అందమైన నవ్వుని పెదవులమీద పూసుకుని పమిటలో ఇరుక్కుపోయిన మంగళసూత్రాన్ని సర్దుకుని బాత్ రూమ్ లోకి వెళ్ళిపోయిందామె.
   
    మాటలులేని ముచ్చటయిన దృశ్యం ఒక అద్భుతమైన నిశ్శబ్దదృశ్యం-
   
    ఆ గోడచాటు ముద్దు దృశ్యం ఆ వివాహిత యువతి మనసులో ఎలాంటి భావ సంచలనాన్ని కలిగించిందో తెలీదుగాని, పెళ్ళి కాని మయూష వంటినిండా చిరుచెమటలు పట్టేసాయి ఎవరో తననే అదృశ్యంగా ముద్దుపెట్టుకునట్లుగా అయిపోయిందామె.
   
    కాసేపు తనెక్కడున్నదో మరిచిపోయింది ఆమె.
   
    చాలా సినిమాల్లో ముద్దు దృశ్యాలను చూసినా, ఎప్పుడూ ఎన్నడూ కలగని సంచలనం-మనసంతా సముద్రపు ఒడ్డులా అయిపోయింది.
   
    బస్సులో వెళుతున్నప్పుడు కాలేజీలో కుర్రాళ్ళ మధ్యనుంచి నడుస్తున్నప్పుడు ఏదోరకంగా అమ్మాయిల్ని టచ్ చెయ్యాలని అబ్బాయిలు ఎందుకు ప్రయత్నిస్తారో, చాలా కాలం మయూషకు అర్ధం అయ్యేది కాదు.
   
    పక్కింటి పెళ్ళయిన భర్త తన భార్యను అంత రహస్యంగా ఎందుకు ముద్దు పెట్టుకున్నాడు? అంత దొంగచాటుగా ముద్దు పెట్టుకోవాల్సిన ఆగత్యం వాళ్ళకేముంది? భార్యాభర్తల మధ్య జరిగే సహజమైన చర్య అది. దాని కెందుకంత భగీరథ ప్రయత్నం....? అది తప్పుకాదే?!
   
    రహస్య ప్రేమలో అంతటి తీయదనం ఉంటుందా? థ్రిల్ వుంటుందా? ఎందుకో ఆ ముచ్చటైన ముద్దు దృశ్యం చాలా నచ్చింది ఆమెకు.
   
    క్రితం రోజంతా ఆ దృశ్యమే ఆమెను వెంటాడింది.
   
    బస్సు సీట్లో కూర్చున్నప్పుడు, కాలేజీలో లెక్చరర్ లెసన్ చెపుతున్నప్పుడు, క్యాంటీన్ లో ఫ్రెండ్స్ మధ్య జోక్స్ కట్ చేస్తున్నప్పుడు, మధ్యాహ్నం ఒంటరిగా బస్టాపులో నిలబడినప్పుడు__
   
    గోడచాటు ముద్దు!
   
    గోడచాటు ముద్దు!!


Next Page 

  • WRITERS
    PUBLICATIONS