Previous Page Next Page 
తృప్తి పేజి 2


    ఇంతలో "అమ్మా అమ్మా" అంటూ బాబు టాయిలెట్ లోంచి అరుపులు.
    "వాడి సంగతి చూడు ముందు. అందుకే కూరలు రాత్రే తరిగి పెట్టుకోవాలంటాను" అన్నాడు అరుణ్.
    సింధూకి చర్రున కోపమొచ్చింది. మొత్తం పనులన్నీ చేసుకుని, పిల్లల్ని చదివించుకుని, తన చదువు చూసుకుని పడుకునేటప్పటికే మామూలుగా పదకొండు అవుతుంటుంది. ఇక పొద్దుటి వంటకి కూడా రాత్రే చూసుకోవాలంటే పన్నెండవుతుంది. కానీ ఏం మాట్లాడదలుచుకోలేదు. పని పాడయిపోతుంది. మౌనంగా పని చేసుకుంటోంది.
    పిల్లల్ని పంపించి 'అమ్మయ్య' అని వూపిరి తీసుకుని కాఫీ గ్లాసు చేతిలోకి తీసుకుంటుండగా పనిమనిషి కొడుకొచ్చాడు. "మాయమ్మకి జొరమొచ్చింది. ఇయ్యాల రాదు" అని చావు కబురు చల్లగా చెప్పి జారుకున్నాడు.
    అరుణ్ స్నానం చేసొచ్చాడు. "ఏంటి?" అంటూ చెప్పింది.
    "ఏదో ఒకటి చెయ్యాలి. తప్పదు. చాలా కష్టంగా వుంది" అంది.
    "ఏ విషయం?" తల దువ్వుకుంటూ అడిగాడు.
    "పని విషయం. నాకు యూనివర్శిటీలో పనెక్కువగా వుంటోంది. దానికితోడు డాక్టరేట్ చేతికి రావాలంటే కొంత కష్టపడాలి. ఇవతల పిల్లలింకా చిన్నవాళ్ళు. ఇవన్నీ చూసుకోడానికి ఎవరన్నా వుంటే బావుంటుంది"
    "నీకెవ్వరూ నచ్చరుగా! ఏదో ఒక వంకపెట్టి నాలుగురోజుల్లో పంపించేస్తావు" నిష్టూరంగా అన్నాడు.
    సింధు ఇంక ఆగలేదు. "మీరు చెప్పేది మీ అమ్మగారు పంపిన వంటావిడ గురించేనా? ఆవిడ చెయ్యివాటుతనం అబద్ధమా? డబ్బుపోతే పోయింది, పిల్లలు చెడ్డమాటలు నేర్చుకుని చెడిపోతుంటే చూస్తూ వూర్కోవాలా? ఆవిడ మనవళ్ళనీ, మేనకోడల్ననీ ఎవరో ఒకళ్ళొచ్చి ఇక్కడే తిష్టవేసుకుని కూర్చుంటే కూడా వూరుకున్నాను. కానీ మన పక్కలమీద దొర్లి నేను లేనప్పుడు నా చీరలు కట్టుకుని వూరేగితే ఎలా సహించను? కాస్త బాధ్యతగా ఆలోచించు" అని అక్కడనించి లేచెళ్ళిపోయింది.
    ఇప్పటికే అత్తవారింట్లో అందరూ తను ఎక్కువ చదువులు చదివిందనీ, భయం, భక్తీ లేకుండా వుంటుందనీ, అనుకూలవతి కాదనీ అనటం ఎలాగూ వుండనేవుంది. అందుకే అత్తగారు ఆడబిడ్డ దగ్గరే వుంటుంది గానీ ఇక్కడకు రాదు. తన కొడుకుతో సమానంగా మళ్ళీ మాట్లాడితే అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నా ఇంటా బయటా చచ్చేట్లు చాకిరీ చేసుకుంటూ ఇల్లు నడుపుతున్నా, ఆడది నోరుతెరిచి మాట్లాడితే అత్త హృదయం సహించదు. 'గరిండేరి దొరికింది. నా కొడుకు జీవితం నిప్పుల కొలిమైపోయింది' అని తల్లడిల్లి పోతుంది. అదేపని అక్కడ కూతురు చేస్తే ఏమీ అనిపించదు. 'దాని మొగుడూ దానిష్టం' అనిపిస్తుంది.
    "సాయంత్రం చారీవాళ్ళని భోజనానికి పిలిచాను" చెప్పాడు అరుణ్ భోంచేస్తూ.
    "అరెరే! నాతో ముందుగా చెప్పాల్సింది. ఇవాళ కొంచెం లేటవుతుందే" గాభరాగా అంది సింధు.
    అరుణ్ మాట్లాడకుండా తింటున్నాడు. అంటే కోపమొచ్చిందన్నమాట.
    ఎందుకిలా చేస్తాడు? ముందుగా తననడగొచ్చుకదా! సింధు మనసు పాడయిపోయింది. పోనీ త్వరగా వచ్చేద్దామంటే కుదరదు. సెమినార్ వుంది. పెద్దపెద్దవాళ్ళందరూ వస్తారు.
    అరుణ్ కూడా ఆలోచిస్తున్నాడు. 'నేనేం చెప్పినా చటుక్కున కాదంటుంది. నా ఫీలింగ్స్ అర్థం చేసుకోదు. అందరు భార్యలూ ఇలాగే వుంటున్నారా? తన కొలీగ్ విశ్వనాథ్ భార్య ప్రతిరోజూ ఆఫీస్ కి ఒక్కసారైనా ఫోన్ చేసి త్వరగా వచ్చేయండి అని చెప్తుంది. మొన్న శాస్త్రివాళ్ళింటికెళ్ళాడు. ఆవిడ కూడా వుద్యోగస్తురాలే అయినా ఎంత నమ్రతగా వుంది. వాడు 'వుట్టి కాఫీయేనా లేక అతిథికి టిఫిన్ భాగ్యమేమైనా వుందా?" అనడగగానే విసుక్కోకుండా చిరునవ్వుతో అరటికాయ బజ్జీలు చేసి తీసుకొచ్చింది. ఇలా వుంది నా అదృష్టం అనుకుంటూ లేచి ఫోన్ దగ్గరకు నడిచాడు.
    కిచెన్ లో గిన్నెలు సర్దుతున్న సింధుకి వినిపిస్తూనే వుంది. "ఎవరూ, మిసెస్ చారీయేనా? ఏమనుకోకండి. ఇవాళ మా బాస్ కొంచెం ఇంపార్టెంట్ ఎసైన్ మెంట్ మీద బయటకు పంపుతున్నాడు. కాబట్టి మనం అనుకున్నట్టు స్పెండ్ చెయ్యడానికి టైమ్ కుదరదు. వాడితో చెప్పండి. వన్స్ ఎగైన్ సారీ" అంటూ పెట్టేశాడు.
    అబద్ధం ఎందుకు చెప్పాలి? మా ఆవిడకి చాలా అవసరమైన పనుంది అని చెప్పొచ్చుగా. అదే మేల్ ఈగో అనుకుంది సింధు. భార్య బిజీ పర్సన్ అనిగానీ, హోదాలో వుందని కానీ ఎవరితోనైనా చెప్పడానికి సంకోచిస్తారు. అదే భర్తలు పెద్ద హోదాలో వుంటే భార్యలు చెప్పుకోవడానికిష్టపడ్తారు. గర్వపడ్తారు కూడా. బహుశా చిన్నప్పటినుంచీ పెరిగిన వాతావరణాన్ని బట్టి అలా ప్రవర్తిస్తారేమో! చాలామందిళ్ళల్లో తండ్రులు తల్లుల్ని చులకన చేసి మాట్లాడ్తుంటారు. "దానికేం తెల్సు వెర్రిపీనుగ, పిచ్చిముండ" అనడం కూడా కద్దు. నలుగురిలో పట్టుకుని "నోర్ముయ్! ఏడిశావ్" అనడం వాళ్ళకో గొప్ప. భర్తలు అలా అంటుంటే మురిసిపోయే భార్యలే ఎక్కువ. ఒకవేళ ఎవరైనా ఎదిరించి "అదేమిటలా అందరిముందూ చిన్నతనంచేసి మాట్లాడతారు?" అనడిగితే పెద్దవాళ్ళు "తప్పు, అలా భర్తనెదిరించకూడదు. మాటంటే తప్పేమిటి? పోషించేవాడూ, భరించేవాడూ అయినప్పుడు ఆమాత్రం అంటే తప్పా?" అంటూ నీతులు చెప్తారు.
    ఇంకా పాతకాలంలో భార్యని కొట్టనివాడు మగాడే కాదనుకొనేవాళ్ళుట. వాళ్ళతో పోల్చుకుని వీళ్ళు మురిసిపోతుంటారు. కొందరి సంసారాల్లో భర్తలకంటే భార్యలే తెలివిగా వుంటారు. భర్త అమాయకుడూ, అసమర్ధుడు అయినప్పుడు సంసార బాధ్యత భార్య తనమీద వేసుకొని ఒకదారికి తెస్తుంటే తీరిగ్గా కూర్చుని అమ్మలక్కలు నానాపేర్లూ పెడ్తారు. 'అంతా ఆడపెత్తనం. మొగుడికి గాజులు తొడిగి తను చక్రం తిప్పుతోంది' అంటూ ఇష్టంవచ్చినట్లు సాటి ఆడవాళ్ళే అంటుంటారు. అంటే ఆడదెప్పుడూ తెలివి విషయంలో మగాడికంటే తక్కువగానే వుండాలన్నమాట.
    సింధు స్నేహితురాలు మీనా ప్రతిదానికీ 'మావారిలా అన్నారు' అనో, 'ఆయన మొదటే చెప్పారు' అనో అంటూ వుంటుంది. మీనా మొదట్నుంచీ చురుకైన పిల్ల. అలా అన్నింటికీ భర్తమీద ఆధారపడే అవసరం వున్న స్త్రీకాదు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి నెలకు నాలుగువేలు సంపాదించుకుంటున్నా తనకేమీ తెలియదనీ, అంతా ఇంట్లో భర్తే చూసుకుంటాడనీ గర్వంగా చెప్పుకుంటుంది. నిజానికతడికి ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్. మీనా అంత తెలివైనవాడు కాదు. ఆ లోటు తీర్చుకోవడం కోసం మీనా అలా నటిస్తుందని సింధుకి తెలుసు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS