Previous Page Next Page 
రాగోదయం పేజి 2


    నలుగు గుంజలు పాతుకుని, చుట్టూ కంది రెమ్మలో తాటాకు మట్టలో జంబునారో అల్లుకుని, పైన అడ్డంగా నాలుగు వెదుళ్ళు వేసి ఆపైన వరిగడ్డి కప్పుకున్న గడపలే ఎక్కువ. వాటికి వెదురు తలుపులు అంతే! అది భద్రం కాదని తెలుసు వాళ్ళకి, కానయితే దాచుకుంది ఏమీ లేదనీ తెలుసు.
    చుట్టూ రాళ్ళు పెట్టుకుని, చెక్క తలుపులు పెట్టుకున్న కుటుంబాలు వేళ్ళపై లెక్కపెట్టొచ్చు. ఇక మిద్దెలు, పెంకుటిళ్ళూ ఆ గూడెంలో లేనే లేవు. నిత్యదారిద్ర్యం, రోగం ఎప్పుడూ తాండవీస్తూ వుంటుందక్కడ.
    ఉదయం ఏడు గంటల వేళ.
    సోము మడికి కాడిగట్టుకుని వెళ్ళిన తర్వాత గుడిసె ముందు కూర్చుని తాడు పేనుకుంటున్నాడు జానయ్య.చంద్రమ్మ లోపల సద్దికి వండుతోంది అది తయారవగానే భుజాన వేసుకుని వెళతాడు జానయ్య.
    అల్లంత దూరంలో వస్తున్న చౌదరిని చూడగానే లేచి నుంచుని తలపాగా చుట్టుకుని పక్క మంచంమీదున్న తువ్వాలు తీసుకుని భుజాన వేసుకున్నాడు జానయ్య.
    చౌదరి దగ్గరగా రాగానే "దండాలండీ బాబుగారూ!" అన్నాడు వినయంగా. ముఖాన లేని నవ్వు పులుముకున్నాడు. అతనికి చౌదరిని చూడగానే వళ్ళు జవ జవ మంటుంది. నరాల్లో రక్తం నీరైపోతుంది.
    "జానయ్య! ఈ పూట కాడి గట్టుకుని రా! మా కాలవగట్టు చేను దున్నిస్తున్నాను!"
    ఆ మాటలు వినగానే జానయ్య గుండె జల్లుమంది. పాలిపోయినముఖంతో మా కాడి మా మడికి పోయింది బాబుగారూ! నా కొడుకు కట్టుకెళ్ళినాడు! అన్నాడు బితుకు బితుకుమంటూ.
    చౌదరి ముఖం ఎర్రనైంది. "ఇప్పుడెందుకు పోయినాడు! నేనంటే చేను చదరం చేయిస్తా వున్నా!" అన్నాడు.
    "ఏరువాక సాగినాం బాబూ!"
    "ఏ-రు-వా-క-" ఎద్దేవాగా అన్నాడు చౌదరి. "జానయ్యా! అయ్యగారు ముగూర్తం పెట్టినాడా! నీకున్న నూటొక్క ఎకరంలో యీసారి యిరగ బండిత్తావా? బలే"
    జానయ్య తలొంచుకున్నాడు.
    "జానయ్యా! అదేం కుదర్దు. నువ్వెళ్ళి కాడి మరల్చక రా! చేని నిండా కూలీలున్నారు. పని అవసరం వుంది!"
    "బాబుగారూ! ఈయాలకి పోనీ యండి రేపొస్తాం!" దీనంగా అన్నాడు జానయ్య.
    "ఏమిటీ?" ఆశ్చర్యంతో, కోపంతో గర్జించాడు చౌదరి. మీకు అప్పులియ్యాల - ఇయ్యకుంటే కాళ్ళ వేళ్ళ పడతారు. పానం దీస్తారు. ఇచ్చినాక ఒక్కసారయినా అప్పు దీర్చరు. వడ్డీ కింద జమవేస్తారు. ఇట్లా పనికి పిలిస్తే దొంగెత్తువేస్తారు. మళ్ళీ ఏదైనా అంటే గోలు గోలు మంటారు."
    "లేదు బాబూ! ఈసారి వాడు ముచ్చటపడి ఏరువాక బయల్దేరినాడు దయ చూడండి. రేపు నేనే వస్తా. మీపనయ్యే దాకా దున్నుతూ వుంటా తర్వాతే మా మడి దున్నుకుంటా."
    "ఆహా - అట్లాగా! జానయ్యా మొన్నే మన్నావు, గింజెలు కొలిచినావు. అప్పు ఇంకా మిగిలింది. ఎరువు తోలమన్నా. సరే అని వచ్చి, నీ చేనికి తోలుకున్నావు. అదేమంటే ఈసారి మిర పెడతన్నా సత్తువ గావాల అన్నావు. సరే! అన్నా! నా యింట్లో నా పొలాల్లో అవసరమయితే వస్తారని చేస్తారని కదా మీకు అప్పు లిచ్చేది. పైగా యిచ్చినందుకు నిష్ఠూరం!"
    "నిష్ఠూరం ఏమీ లేదు బాబుగారూ! మీ కాళ్ళ దగ్గర బ్రతికే వాళ్ళం. మా రాజులు మీరు దయతలచాల, మేం బ్రతకాల!"
    "ఈ కబుర్ల కేంలే! ఇవన్నీ దొంగెత్తులు. నాకు తెలియదూ! అవసరం వస్తే ఇంద్రుడు చంద్రుడు అంటారు. అది తీర్తే దొంగ ముండాకొడుకు, రక్తం తాగుతాడు అంటారు. నాకు తెలియదా?"
    "ఎంతమాట బాబుగారూ! నా గొంతు కోసినా అలాంటి మాట వస్తుందా? మా యింటిల్లిపాదీ మీమీద ఆధారపడి బ్రతుకుతున్నాం!"
    "అదో! అగాత్యం మాట! గొంతెందుకు కోస్తాంరా మేము?" ఉడుక్కున్నాడు చౌదరి.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS