Previous Page Next Page 
మౌనవిపంచి పేజి 2

 

    ఒక్కసారి దేవుడివైపు చూసింది జాలిగా!
    
    తనని జాలిగా చూడవలసిన దేవుడు నిరద్వింద్వంగా వుంటే తనే ఆయన్ని జాలి తలచాలి! హుఁ పరిస్థితి ఎలా మారిపోయింది. తనలో తనే నవ్వుకుంది నంద.
    
    పాత్రలన్నీ శుభ్రంచేసి ఒక్కొక్కటి తిరిగి క్రమంగా యింట్లో అమర్చింది.
    
    పుట్టుకలో మానవుడెంత హాయిగా, బాధ్యతా రహితంగా వుంటాడో ఉదయం వంటింట్లో వంటపాత్రలూ అలాగే వుంటాయి.
    
    ఏళ్ళు గడిచే కొద్దీ మనిషి ఎలా మకిల మనస్సుతో చికాకుల్లో చిక్కుల్లో పడిపోతాడో, అలాగే రాత్రయ్యేసరికి పాత్రలూ, వంటిల్లూ అలా అవుతుంది!

 

    ఆలోచిస్తే బ్రతుకు సత్యం బోధపడ్తుంది. నిజానికి నిజ జీవితాన్ని నిశితంగా పరిశీలిస్తే వంటింటి పాత్రలకీ, బ్రతుకు లోని పాత్రలకీ, ఎంత సామ్యం కన్పిస్తుంది.
    
    "నిద్దర్లేచావా?" ఆలోచనల్లో వుండటంతో చప్పున ఉలికి పడింది తల్లి!
    
    "మెళుకువైంది! ఇప్పుడు టైమెంత?" అడిగిందామె.
    
    "నాలుగున్నర" మెల్లని స్వరంతో జవాబిచ్చింది నంద.
    
    "ఈ వేళ కే లేవకపోతేనేం తల్లీ! అయిదింటికి అందరి లాగా లేవకూడదూ?"
    
    ఆమె మాటలకి నవ్వుకుంది నంద! ఆమె మాటల్లోని ఆప్యాయతకి నంద మనసు కదలిపోయింది. "రోజూ వుండే మాటలే కదా?" అనుకుంది మళ్ళీ.
    
    "లేవకపోతే ఏం? ఎంత సులభంగా అనేసింది అమ్మ! నిజంగా తను ఆలోచించే అలా అంటోందా? ఇన్నేళ్ళుగా తను అలవాటుపడిపోయింది! చప్పున నాల్గింటికంతా మెళుకువ వచ్చేస్తుంది_లేవకుండా వుండగలదా? ఉహూ(
    
    ఆదివారమైనా! హాలిడే అయినా తను నాలుగు తర్వాత నిద్దర్లేచే యోగానికి దూరమైపోయింది అదంతే! అలవాటయితే దాన్నించి తప్పుకోవటం ఎంత కష్టం.
    
    తను లేవకపోతే ప్రపంచం ఆగిపోదు! ప్రపంచ పరిస్థితుల్లో ఏ మార్పులూ చప్పున రావు- కానీ తనే నిత్య జీవితం పరుగులో వెనుకబడిపోతుంది. అందుకోవలసిన వాటిని అందుకోలేదు-
    
    నీళ్ళు బాగా కాగుతున్నాయి. స్నానం చేసింది నంద!
    
    వెచ్చని నీరు శరీరంపై పడగానే వళ్ళు జల్లుమంది! చప్పున అనీల్ మాటలు గుర్తుకొచ్చాయి.
    
    నందా! ఒక్కోసారి నాకెంత ఈర్ష్యగా వుంటుందో తెలుసా? నాలుగేళ్ళుగా నిన్ను ప్రేమిస్తున్నా, నిన్ను ముట్టుకునే యోగం యింకా పట్టలేదు! నీ చేయి పట్టుకుని నీతో నడుస్తూ తడుస్తూ సుఖంచేందుకు ఇంకెన్నేళ్ళు నేను వెయిట్ చేయాలో!
    
    కానీ నువ్వు స్నానంచేసే నీరూ, నువ్వు కట్టుకునే, గుడ్డలు ఎంత అదృష్టం చేసుకున్నాయో! వాటిని చూస్తే నాకెంతో జలసీ- అది నీకు తెలుసా?"
    
    అతని మాటలు గుర్తుకురాగానే ఒళ్ళు పులకరించింది. ఆ క్షణిక తన్మయత్వంలోనే అపారమైన ఆనందం అనుభవించింది నంద. బండబారిపోయిన బ్రతుకుపై మల్లెపూల వర్షం కురిసినట్టుగా వుంటాయి అనిల్ స్మృతులు.
    
    స్నానం ముగించి వంటింట్లోకి వచ్చింది నంద.
    
    జ్యోతి వెలిగించి, ముఖాన బొట్టుపెట్టుకుని పూజచేసింది. మనసారా దేవుడిని ప్రార్ధించింది. నిర్మలమైన భక్తితో మొక్కుకుంది.
    
    "స్వామీ! నా కొరకు నేను నిన్నేమీ కోరను! నా కేమీ అక్కర్లేదు. నా తల్లికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, నా తండ్రికి చిత్తశాంతిని తమ్ముడికి, చెల్లాయికి మంచి భవిష్యత్తునీ, నా అన్నయ్యకి ప్రశాంతమైన మనస్సునీ ప్రసాదించు అంతే చాలు!" మనఃపూర్వకంగా ప్రశాంత చిత్తంతో ప్రార్దించింది.
    
    కళ్ళు తెరిచి చూసింది ప్రార్ధనాంతరం! దేవుడు నువ్వు తోన్నట్టుగా అనిపించింది. "దేవుడు తనని చూసి నవ్వేడా! తన ప్రార్ధనని చూసి దరహసించాడా?" పూజనుంచి లేచి తిరిగి హాల్లోకి వచ్చింది నంద.
    
    ప్రశాంతంగా నిదురపోతుంది విమల! పరిస్థితుల ప్రభావం ఏమాత్రం సోకని మనస్సుతో, శరీరంతో ఎంతహాయిగా పడుకుంది విమల!


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS