Previous Page Next Page 
సీతాచరితం పేజి 2


    ఉపనిషత్తులు మనకు మిత్రసంహితములు. భయంవల్ల మనిషి లొంగడు అని తెల్సుకున్నాక, నయం వల్ల అతన్ని మంచిమార్గాన పట్టించాలనుకున్నారు. ప్రభువు వలె చెప్పి ప్రయోజనం లేదని గ్రహించిన ఉపనిషత్కారులు, మిత్రుని వలె మానవుని చెంతకొచ్చారు. కథలల్లి, గాథలు చెప్పి, మిత్రునివలె అతనికి బోధించసాగారు. మనిషి మిత్రుని మాట వినసాగాడు. కాబట్టే కొంతకాలం మిత్రసంహితలు ఏలినాయి.


    మనిషి క్రొత్తను కోరుకుంటాడు. ఎప్పుడు ఒకేదానికి కట్టుబడటం అతనికి గిట్టదు. సాహిత్యం ప్రభు సంహిత నుండి మిత్ర సంహితం అయింది. బాగుంది. కాని ఎంతకాలం వింటారు; మిత్రుని మాట? మిత్రుని మాటలో పస కన్పించలేదతనికి. అతను చెప్పిందాన్నంతా తాను వినాలనేం? అని మిత్రుని వాక్యాన్ని పెడచెవిన బెట్టాడు.


    మనిషి పెడచెవినబెట్టాడు పోనీ అని ఊరుకొనలేదు. అలా ఊరుకోలేడు రచయిత. అలా మిన్నకుండలేదు సాహిత్యం. సమాజం పెడదారిన పోతుంటే అందును గురించి నిరంతరం ఆలోచించడం, దాన్ని సరియైన మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నించడం, రచయితలు అనాదిగా చేస్తున్న పని. అందుకే వారు కొన్ని మేథస్సులను మధించి, సాహిత్యంలో క్రొత్త ప్రక్రియా, క్రొత్త వ్యవస్థను కనుగొన్నారు. అలా కొత్తగా కనుగొన్నది కాంతా సంహితం.


    మానవుడు ప్రభువు మాటను ధిక్కరించాడు. మిత్రుని మాటను కాదన్నాడు. తన ప్రియురాలు చెప్పింది కాదనగలడా? మానవుడు ప్రేమపాశబద్ధుడు. ప్రేమతో అతణ్ణి కట్టివేయడం తేలిక అని నిర్ణయించుకున్న రచయితలు కాంతాసంహితలను కనుగొన్నారు. ప్రియురాలు ప్రక్కన కూర్చొని  'విడెం' అందిస్తూ "ప్రియా! నీకిది తగదు" అని చెబితే వినని మనిషి వుంటాడా? అలా మనిషికి చెప్పాలని కాంతా సంహితలు అవతరించాయి. కావ్యం కాంతాసంహితం. రసస్నిగ్ధమైన కావ్యాన్ని చదివించి తద్వారా అతనికి హితబోధ చేయడం కావ్యలక్ష్యం. విశ్వశ్రేయస్సే కదా కావ్య లక్ష్యం! 'కావ్యేషు నాటకం రమ్యం' కావ్యాల్లో నాటక ప్రక్రియ విలక్షణమైంది! ఎదుట నటుల నటన చూచి తాదాత్మ్యం పొందిన ప్రేక్షకుడు నాటకంలో వున్న నీతిని గ్రహించకపోడు.


    ఈ విధంగా సాహిత్యం ప్రజాశ్రేయస్సును గోరి, ప్రభుసంహిత నుండి మిత్రసంహిత, మిత్ర సంహిత నుండి కాంతాసంహితకు మారడం సమాజ పరిణామాన్ని బట్టే, సమాజంలో వచ్చే పరిణామాలకు అనుగుణంగా మారడం సాహిత్య స్వభావం.

    
    సమాజం


    సమాజం విలక్షణమైంది. ఉన్నతమైంది. శాశ్వతమైంది. సమాజం శాశ్వతమైందే ఐనా దానికి పరిణామం వుంది. సమాజానికి పరిణామం వుంది కాబట్టి సాహిత్యానికి పరిణామం వుంది. అసలు సమాజం ఏమిటి?


    వ్యక్తుల సముదాయాన్ని సమాజమందామా? అశేష సమాజమందామా? జనాన్ని సమాజమందామా? లేక జనపదాన్ని సమాజమందామా? దేశాన్ని సమాజమందామా? ప్రపంచాన్ని సమాజమందామా? సమాజం ఎలాంటిది? ఎలా ఏర్పడింది? ఎలా మారుతున్నది?


    జనం సమాజమంటే సరిపోదు! అంటే ఒకచోట గూడిన జనం, ఒక దేశంలోని జనం సమాజమవుతుందా? అరిచే జనం, ఉరికే జనం సమాజమవుతుందా? కాస్త ఆలోచించండి.


    జనం సమాజమా! జన జీవితం సమాజమా! జనం మాత్రం సమాజం కాకపోవచ్చు. ఎందుకంటే, ఈ జనానికి లక్ష్య లక్షణాలు లేవు. జనం ఏం చేస్తుంది. ఏవైపు పరుగెడ్తుంది. నిర్దిష్టంగా చెప్పడం కష్టం. జనానికి ఆవేశకావేశాలు ఉన్నాయి. ఆవేశకావేశాలతో ఉద్రిక్తత పొంగుతుంది. ఉరకలు వేస్తుంది. ఉప్పెన తెస్తుంది. ఇదంతా జనం చేసే పనే. పోతే జనం ఎప్పుడూ ఉద్రిక్తత పొందదు. జనం సముద్రంలాంటిది. అందులో బడబానలం ఉంది. కాని ఎప్పుడూ బయటపడదు. బడబానలం సృష్టించనప్పుడు జనం ఏం చేస్తుంది. ఏమి చేయదు. ఊరుకుంటుంది. మరి ఎప్పుడో బడబానలం సృష్టించే జనం సమాజమవునా జనం సమాజమనుకుంటే చాలాకాలం జనం ఏం చెయ్యదు. అంటే సమాజం ఏం చెయ్యదు.


    సమాజం సజీవమైంది. చైతన్యవంతమైనది. అది మిన్నకుండటూనికి వీలులేదు. దాని గుండె చప్పుళ్ళు ఎప్పుడూ వినిపించాల్సిందే. సమాజపు గుండె లిప్తపాటు నిలవడానికి వీలులేదు. సమాజపు హృదయ స్పందనలు సమాజపు నాళికల్లో నిరంతరం రక్తం ప్రవహింపచేయాల్సిందే ఈ రక్త ప్రసరణ ఆగడానికి వీలులేదు. ఇది ఆగదు. దీనికి వయో నిర్దేశం లేదు. సమాజం అనంతమైంది.


    ఈ సమాజపు హృదయ స్పందనలే జన జీవితం అంటే తప్పా? జనానికి, జన జీవితానికి చాలా బేధముంది. జనజీవితం శ్రమపైన ఆధారపడివుంది. శ్రమ జన జీవితానికి పునాది. శ్రమలేనిదే జీవితం లేదు. జన జీవితం లేదు. శ్రమించడం నుండి జనజీవనం ఉత్పన్నమవుతుంది. అశేష ప్రజానీకపు శ్రమ జన జీవితాన్ని క్రమబద్ధం చేస్తుంది. ఈ క్రమబద్ధమైన జన జీవితం సమాజం.


    జన జీవితం అంటే జనులు జీవించాలి. ఈ జీవించడం మాములు పనికాదు. జనంగాలి పీల్చుకొని, నీరు త్రాగి జీవించలేదు. సరే గాలి ఉచితంగా లభిస్తుంది. ఎవరి శ్రమ అక్కరలేదనుకుందాం. కాని నీరు వర్షం పడ్డప్పుడు నీరు ఉచితంగా లభిస్తుంది నిజం. వర్షం లేనప్పుడు నీటిని నిల్వ చేసుకోవాలి. ఈ నిల్వచేయడం సాధారణమైన పనికాదు. నీటిని నిల్వచేయడానికి చెరువులు కట్టాలి. చెరువు కట్టడం వల్ల నరు నిలుస్తుందని తెల్సుకోగల మేధావి కావాలి. చెరువుకు కట్టవేయడానికి ప్లానువేసే ఇంజనీరింగు కావాలి. తమ శ్రమతో కట్టకట్టి నీరు నిలిపే శ్రామికులు కావాలి. ఇంతమంది శ్రమ ఫలితంగా వర్షం లేని సమయంలో నీరు లభించే సదుపాయం ఏర్పరచుకోవాలి. ఇది నీటి మాట మాత్రమే. మరి తిండిమాటో? ఆహారం సమకూర్చుకోవడానికి వ్యవసాయం కావాలి. వ్యవసాయానికి పంట పండించే రైతు, శ్రమచేసే కూలీ, ఎరువులందించే కర్మాగారాలు, నాగళ్ళు చేసే ఇనుము, ఇంకెన్నో పచ్చని పంట పండటానికి మాత్రమే కావాలి. ఈ విధంగా ఆలోచిస్తూ పోతే మనం త్రాగే ప్రతి నీటి గుటకకు, మనం తినే ప్రతి అన్నం ముద్దకు, మనం కట్టుకొనే ప్రతి గుడ్డపీలకకు వెనుక అశేష ప్రజానీకపు శ్రమ ఇమిడి వుంది. అన్నం మాత్రమే జీవితంకాదు. ఆరోగ్యం కాపాడటానికి డాక్టర్లు కావాలి. శాంతి భద్రతలు రక్షించడానికి ప్రభుత్వం యంత్రాంగం కావాలి. దేశ రక్షణకు సైన్యం కావాలి. సైంటిస్టులు కావాలి. శాస్త్రజ్ఞులు కావాలి. రచయితలు కావాలి. కళాకారులు కావాలి. జన జీవితానికి ఇంత మహత్తరమైన యంత్రాంగం అవసరమనుకున్నప్పుడు ఆశ్చర్యం కలుగదూ! కాని మనం బ్రతకడానికి ఇంత శ్రమ జీవితం జన జీవితానికి ఆధారం.


    ఈ శ్రమ జీవిత జన జీవితాన్ని సమాజమందాం. సమాజం జన జీవితం. జన జీవితమే సమాజం.

    
    సమాజ పరిణామము


    సమాజం శాశ్వతమైంది - సజీవమైంది. కాబట్టి సమాజం మారడం సమాజం. సమాజం ఉత్పత్తి శక్తులమీద ఆధారపడివుంటుంది. ఉత్పత్తి చేసే పనిముట్లలో ప్రగతి వస్తున్నప్పుడు సమాజంలో మార్పు వస్తుంది. సమాజానికి ఉత్పత్తి ప్రధానం. ఈ ఉత్పత్తి శ్రమ ద్వారా జరుగుతుంది. మానవుడు పుట్టినప్పటి నుండి తన శ్రమను తగ్గించుకోవడానికి, ఉత్పత్తిని పెంచడానికి నిరంతరం ఆలోచిస్తున్నాడు. జీవితాన్ని సుఖమయం చేసుకోవాలనే తపన, ఆనాటి నుండి ఈనాటి వరకు వుంది. జీవితానికి భద్రత, జీవితంలో ఆనందం, ఈ రెంటిని గురించి నిరంతరమైన ఆలోచనే కొత్త ఉత్పత్తి సాధనాల ఆవిష్కరణకు కారణం.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS