Previous Page Next Page 
ధ్యేయం పేజి 2


                         అధ్యాయం-1

                                                      ప్రారంభం

    లాల్ బహదూర్ స్టేడియం స్కూల్ పిల్లలతో నిండిపోయివుంది. పెవీలియన్ లో ముఖ్యమంత్రి, విద్యామంత్రే కాకుండా ఎంతోమంది ప్రముఖులు కూర్చుని వున్నారు.

    అందరి దృష్టీ స్టేడియం మధ్య ఆటస్థలంలో నిలబడ్డ పిల్లలమీదేవుంది. బారులు తీరి నిలబడ్డ పిల్లల  వెనుక చివరగా, ఒంటరిగా ధీమాగా నిలబడి వున్నాడు అవినాష్.

    .... ధన్ ......... ధన్ .... ధన్ ......... అంటూ డ్రమ్స్ లయబద్ధంగా మోగుతున్నాయి. ఆ లయకి అనుగుణంగా మొదటి వరుసలో నిలబడ్డ ఇరవైమంది కుర్రవాళ్ళు మార్చ్ చేసుకుంటూ వచ్చి ఒక వృత్తాకారంలో నిలబడ్డారు. వాళ్ళ చేతుల కలయికతో ఒక మానవ వలయం ఏర్పడింది.

    ధన్ ... ధన్........ మరో అయిదు మంది అబ్బాయిలు ముందుకొచ్చారు. మొదటి వరుసగా నిలబడ్డ మానవ వలయం మీద రెండవ వలయం ఏర్పాటు చేశారు. ఆ విధంగా పిరమిడ్ కి బేస్ ఏర్పడింది. డ్రమ్స్ లయబద్ధంగా మ్రోగుతున్నకొద్దీ అంతస్థులు  అంతస్థులుగా పిరమిడ్ ఆకారం ఏర్పడుతూ వుంది. అవినాష్ టెన్షన్ మొదలైంది. లోలోపల ధైర్యం పెంచుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు.

    ధన్ ..... ధన్ ..

    తన వంతు వచ్చింది. స్కూల్ పేరున్న బ్యానర్ చేతిలో పట్టుకొని అడుగు ముందుకేసాడు. తన భాద్యత గురుతరమైందని అతనికి తెలుసు. ఒక చేతిలో బ్యానర్ తో తను పైదాకా ఎక్కాలి. అది ఒక కొత్త పద్ధతిలో వినూత్నంగా ఎక్కాలి. దానికోసం దాదాపు నెలరోజుల నించి ట్రైనింగ్ ఇచ్చాడు టీచర్.

    తన టీమ్ కి ఫస్ట్ ప్రయిజ్ రావటం తన చేతిలోనే వుంది. ఇద్దరబ్బాయిలు కలిసి  పట్టుకున్న చేతులమీదుగా అవినాష్ మొదటి అంతస్తు ఎక్కాడు. ఇద్దరి భుజాల మీదుగా చెరొక కాలువేసి ఆ పై స్టెప్ ఎక్కాడు. ఇంకొక్కరెండు అంతస్థులు మాత్రమే వుంది. జనం గోలగోలగా హర్షధ్వానాలు చేస్తున్నారు.

    చివరి లైను పిరమిడ్ పైభాగానికి చేరడమే కష్టం. దానికోసం చాలా ప్రాక్టీస్ చేయించాడు. అక్కడే గుండెల్లో భయం. ఏమాత్రం కొద్దిగా కాలు జారినా మొత్తం పిరమిడ్ కుప్ప కూలిపోవటం ఖాయం.

    ధన్ ........ ధన్...... ఊపిరి బిగబట్టి గాలిలోకి లేచాడు. అక్కడే సమ్మర్ సాల్ట్ చేయాలి. ఒకటి, రెండు పల్టీలు కొట్టి పిరమిడ్ చేతులు కలిపిన పిల్లల అరచేతుల మీద బ్యాలెన్స్ డ్ గా నిలబడ్డాడు. అంతా రెప్పపాటులో జరిగిపోయింది. స్టేడియంలో చప్పట్లు మొదలయ్యాయి.

    అవినాష్ పెదాలమీద చిన్న విజయదరహాసం కదలాడింది. నెమ్మదిగా రెండు చేతులూ విప్పాడు. స్కూల్ బ్యానర్ గాలిలో జెండాలా ఎగరసాగింది.

    స్టేడియం చప్పట్లతో దద్దరిల్ల సాగింది. వాళ్ళ స్కూలు పిల్లలేకాదు, అతని విన్యాసానికి టీచర్లు మిగతా జనం కూడా రెట్టింపు ఉత్సాహంతో చప్పట్లు కొడుతున్నారు.

    విద్యామంత్రి కూడా కరతాళధ్వని చేయటం అవినాష్ చూశాడు. అతని మోహంలో అనిర్వచనీయమైన తృప్తి. నెమ్మదిగా తల తిప్పి దూరంగా చూశాడు. వెనుక వరసలో వున్న మమ్మీ, డాడీ లేచి నిలబడి చేతులు ఊపుతున్నారు. వాళ్ళ కళ్ళల్లో సంతోషం. గర్వంతోకూడిన కన్నీళ్ళు.

    ఎంత ప్రాక్టీసు చేశాడు దానికోసం! ఎన్ని కలలు కన్నాడు ఈ క్షణం కోసం!

    "ఏమిటా పగటి నిద్ర అవినాష్? ఎన్ని సార్లు చెప్పాను- అలా పగటి పూట పుస్తకం పట్టుకొని అలా నిద్రపోవద్దని".

    వాళ్ళ అమ్మ అరుపులకి కల చెదిరిపోయింది. చేతిలో పుస్తకం ఎప్పుడు కిందపడిపోయిందో -నేలమీదపడి వుంది.

    "ఒకసారి చదవటం అయిపోయింది మమ్మీ, అన్నీ వచ్చేశాయి" అంటూ అభ్యర్ధనగా, "ఒక్కసారి స్కూలుకి వెళతాను. రేపు సెలవేగా. రేపంతా చదువుకుంటాను. ప్లీజ్, మమ్మీ" అంటూ బ్రతిమాలాడు.

    "వీల్లేదు. డాడీ గట్టిగా చెప్పి వెళ్ళారు. స్కూలుకి వెళ్ళి రోజంతా వేస్ట్ చేయొద్దని. ఆ కాంప్లాన్ తాగేసి మళ్ళీ ఒకసారి చదువు" అంది పార్వతి.

    "మమ్మీ ప్లీజ్! పిరమిడ్ కాంపిటీషన్ లో మాకు ప్రయిజ్ రావాలంటే నేను వెళ్ళాలి మమ్మీ, ప్లీజ్!"

    "అదుగో ఆ కాంపిటీషన్లే వద్దన్నాను. డాడీకి చెప్పకుండా అసలు దాంట్లో ఎందుకు చేరావు? ఆ విషయం తెలియగానే ఎంత మండిపడ్డారో తెలుసా? ఇంకోసారి ఆ టాపిక్ ఎత్తకు. చదువుకో. నాకు సాయంత్రం చాలా పనుంది. శుభ్రంగా చదువుకో. మళ్ళీ ఆ టేప్ రి కార్దర్ పెట్టకు" అని ఆజ్ఞాపించింది.

    తల్లి బయటికి వెళ్ళగానే కోపంతో పుస్తకం విసిరికొట్టాడు అవినాష్. కాంప్లాన్ తీసుకెళ్ళి వాష్ బేసిన్ లో పోసి పంపు తిప్పాడు. నీళ్ళతో పాటే అది సింక్ లోకి వెళుతుండే చూస్తూ కసిగా నవ్వుకున్నాడు. తన పెద్దలమీద కోపం చూపించడానికి అంతకంటే మార్గం కనిపించలేదు అవినాష్ కి.

    పార్వతి వంటింట్లో సతమతమైపోతూ వుంది. చెయ్యవలసిన పదార్థాలన్నీ  రెడీగానే వున్నా ఏదో ఆరాటం.

    ఆ కాలనీలో వున్న పదిహేను ఇళ్ళల్లో పదిరోజులకోసారి ఏదో ఒక ఇంట్లో పెద్ద ఆర్భాటం కనిపిస్తుంది. నెలకో అయిదారు వందలు వేసుకొని చీటి వేయడం, ఆ నెలలో చీటి తగిలినవారు, తమ ఇంట్లో కాలనీలోని మిగతా వాళ్లందరికీ టీ పార్టీ ఇవ్వడం ఒక ఫాషన్. ఆ సమయంలో తమ ఆధిపత్యం చూపించాలనుకునే పార్వతిలాంటి వాళ్ళకి మరింత హడావుడి.

    మళ్ళీ ఇందులో చిన్న చిన్న పాలిటిక్స్ కూడా వుంటాయి. మొదటి ఇంటావిడ, మూడో ఇంటావిడతో కలిసి ఒక సినిమాకి వెళితే, రెండో ఇంటావిడ నాలుగో ఇంటావిడతో అదొక కంప్లయిట్ గా చెబుతుంది.

    అదే కాలనీలో ముగ్గురు నలుగురికి కార్లున్నాయి. కారున్నావిడ మరొక కారున్నావిడతో పోటీ పడుతుంది. కారులేని ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళని ఒక  గ్రూపుగా చేసుకుంటుంది. ఒక గ్రూపు కన్నా రెండవ గ్రూపులో వుండటంవల్ల ఎక్కువ లాభం వుందని సామాన్య గృహిణుల్లో ఇంజెక్ట్ చేయటానికి ఆ గ్రూపు అధికారిణులు అన్యాపదేశంగా కష్టపడుతూ వుంటారు.

    'ఫలానా విజయగారితో కలిసి మేమిద్దరం షాపింగ్ కెళ్ళి, అక్కడి నుంచి సినిమాకి వెళ్ళాం, అని ఒక గృహిణి మరొక గృహిణితో చెప్పుకోవటంలో 'నిన్ను తీసుకెళ్ళలేదు చూశావా? షాపింగ్ కెళ్ళటానికి నన్ను సెలక్ట్ చేసుకుంది' అన్న గర్వం కనపడుతూ వుంటుంది.

    'ఈవిడని నౌకర్ లా ఆవిడ తీసుకెళ్ళింది' అని ఆ రెండో ఆవిడ సంతృప్తి పడుతుంది.

    అలాగే ఒక కారున్నావిడకి మరో ఆవిడ దగ్గిరై కలిసి తిరగటం ప్రారంభిస్తే ఆ అవకాశంలేని వాళ్ళందరూ కలిసికట్టుగా ఒకటై ఈ విషయాన్ని పెద్ద చర్చనీయాంశంగా మార్చుకుంటారు. ఇదంతా ఆ కాలనీలో సహజమైన విషయమే.

    ఆ కాలనీలో వున్న దంపతుల పేర్లుకూడా గమ్మత్తుగా వుంటాయి. దశరధ్ భార్య కౌసల్య; అలాగే విశ్వేశ్వర్ అన్నపూర్ణ భర్త; శంకరం, పార్వతి దంపతులు కృష్ణమూర్తి, రుక్మిణి ఒక జంట.


                                                                 2


    ఆ రోజు దరధ్ ఆఫీసు నుంచి త్వరగా వచ్చాడు. రాగానే భార్య నడిగాడు "అవినాష్ వాళ్లింట్లో ఏమిటంత హడావిడి. ఆడవాళ్ళంతా వెళ్తుంటే చూశాను"

    "వాళ్ళింట్లో కిట్టీ పార్టీ పార్వతి ఇస్తుంది" అంది కౌసల్య.

    "చాలాసార్లు అడుగుదామనుకున్నాను. నువ్వెందుకు వాళ్ళల్లో కలవవు".

    "బావుంది. వాళ్ళతో కలవను అని ఎందుకనుకుంటున్నారు. ప్రస్తుతం నెలకో అయిదు వందలు చీటి కట్టే స్తోమత మనకి లేదు. ఈ రకం పార్టీలు నాకంత ఇష్టం వుండవ్ కూడా".

    దశరధ్ భార్యవైపు సాలోచనగా చూశాడు.

    "అంటే అది మంచి పద్ధతి కాదంటావా? నెలకోసారైనా కాలనీలో వాళ్ళందరూ కలవటం, మంచీచెడూ మాట్లాడుకోవటం, స్నేహాన్ని పెంచుకోవటం తప్పేంకాదు కదా" అన్నాడు.

    "పద్ధతి మంచిదికాదని నేనననుకానీ అక్కడ కలిసే వాళ్ళంతా నిజంగా సుహృద్భావ వాతావరణంలోనే కలుస్తున్నారంటారా? కలిసినపుడు బాగానే మాట్లాడుకోవటం, బయటికొచ్చి తరువాత అవతలివాళ్ళ లోటుపాట్ల గురించి చాటింపు వేయడం మీరు చూస్తూనే వున్నారుగా! అంతవరకూ ఎందుకు పెద్దవాళ్ళ సంగతి వదిలేసేయండి ఒకే కాలనీలో వుంటున్నాం కదా ! మన పిల్లలమధ్య స్నేహం ఎలా పెంపొందుతూవుందో ఎప్పుడైనా గమనించారా! మా ఇంట్లో టీ.వి. వుంది. మీకు లేదు...... మాకు కారుంది. మీకు లేదు. .... అన్న కంపారిజన్ ఎక్కువైపోతూవుంది" అంది కౌసల్య.

    అందరి భర్తల్లాగ దశరధ్ 'చాల్లే నీ ఉపన్యాసం', అని అనలేదు. ఆలోచించాడు. "నిజమే కౌసల్య! నేనా యాంగిల్ లో ఆలోచించలేదు" అన్నాడు.

    ఇంతలో రాము లోపలికొచ్చాడు. "త్వరగా తయారవు బాబూ ప్రోగ్రాంకి టైమవుతూ వుంది" అంది తల్లి.

    "ఎక్కడికి ?" అని అడిగాడు.

    "ఈ రోజు రవీంద్ర భారతిలో చెల్లి డాన్స్  ప్రోగ్రాం వుందని చెప్పాను మర్చిపోయావా?"

    "అబ్బ బోర్ మమ్మీ! మీరెళ్ళండి. నేను రాను" అన్నాడు రాము.

    కౌసల్య అతని తలపై చేయివేసి  ఆప్యాయంగా నిమిరింది.

    "అలా అంటే ఎలా  నాన్న? మొన్న మీరు క్రికెట్ ఆడుతూ వుంటే అర్థంకాకపోయినా నేనూ, చెల్లి వచ్చి నాలుగు గంటలు ప్లేగ్రౌండ్ లో, ఎండలో కూర్చోలేదూ? అప్పుడే నీకెంత సంతోషం కలిగింది. ఇప్పుడు చెల్లి డాన్స్ ప్రోగ్రాం చూస్తే తనకి తృప్తిగా వుంటుంది".

    రాము కొద్దిగా కన్విన్స్ అయినట్లు కనబడ్డాడు. "ప్రోగ్రాం ఏడింటికి కదా! ఇంకొంచెంసేపు ఆడుకొని వచ్చేస్టాన్లే" అన్నాడు.

    "అదికాదు రామూ! మనం త్వరగా వెళ్ళాలి. మనం వచ్చామని, ముందు వరసలో కూర్చున్నామని తెలిస్తే నిఖితకి ఉత్సాహంగా వుంటుంది. లేకపోతే మనం  వచ్చామో, లేదో- చూస్తున్నామో, లేదో అన్న ఆరాటంతో డాన్స్ సరిగా  చేయకపోవచ్చు. ఇంకోసారి నువ్వే ఆలోచించు. క్రికెట్ గ్రాండ్ లో వున్నప్పుడు బాల్ ని కొట్టిన ప్రతిసారీ నువ్వు మావైపు చూళ్ళేదూ?"

    "దశరధ్ భార్యవైపు సంభ్రమంగా చూశాడు. అతడికి కౌసల్య ఒక గొప్పవ్యక్తిగా వినూత్న కోణంలో కనబడుతూ వుంటుంది. పిల్లలమీద అధికారంతో కాకుండా ప్రేమతో నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తుంది ఆమె. అంతేకాదు. వంటపని, మిగతా పని తాలూకు టెన్షన్ తన మొహంలో ఎప్పుడూ కనబడనివ్వలేదు. పిల్లలమీద దాన్ని పడనివ్వలేదు.

    ఆమెని చూసి దశరధ్  కూడా చాలా నేర్చుకున్నాడు. చాలామంది మగవాళ్ళకి లేని సుగుణం అతడికి పెళ్ళయిన తరువాత అలవడింది. పని పట్ల వున్న  సిన్సియారిటీ, కొంతమంది మగాళ్ళకి కుటుంబంపట్ల వుండదు. అదంతా ఇంట్లో ఆడవాళ్ళ బాధ్యత అనుకుంటారు. ముఖ్యంగా పిల్లల సైకాలజీని అర్థం చేసుకొని ప్రవర్తించే తల్లిదండ్రులు అరుదు. అటువంటి వాళ్ళల్లో దశరధ్ ఒకడు. కౌసల్య ఇంత గొప్ప వ్యక్తిత్వాన్ని పెంచుకోవటానికి కారణం వాళ్ళ ఇంటి వాతావరణమేనని అతని నమ్మకం.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS