Next Page 
అందమైన శతృవుతో అరవై రోజులు పేజి 1


                      అందమైన శతృవుతో అరవైరోజులు           
                                                     - యర్రంశెట్టి సాయి

                                


    హైద్రాబాద్ ఎయిర్ పోర్ట్ మామూలుగానే చాలా హడావిడిగా ఉందా సమయంలో.
    విజిటర్స్ లాంజ్ లో కూర్చుని మరోసారి అసహనంగా వాచ్ చూసుకున్నాడు నిరంజన్.
    "తొమ్మిది గంటలకల్లా ఫైయిట్ హైద్రాబాద్ చేరాల్సి ఉంది ఎంక్వయిరీ సూచన ప్రకారం. కానీ ఇప్పుడు తొమ్మిదీ అయిదయింది. ఇంతవరకూ ఆ జాడే లేదు.
    తన పర్సనల్ సెక్రటరీ శ్రీరామ్ వేపు చూశాడు నిరంజన్.
    "బ్లడీ షేమ్. ఎయిర్ లైన్స్ ఎంక్వయిరీ కంటే రైల్వే ఎంక్వయిరీ బెటర్ అనుకుంటాను" అన్నాడతనితో.
    "అవున్సార్! ఈరోజుల్లో వాళ్ళు చాలా యాక్యురేట్ ఇన్ ఫర్మేషన్ ఇస్తున్నారు" వినయంగా అన్నాడు శ్రీరామ్.
    "టైమ్ వేల్యూ తెలీనివాళ్ళను నేను హేట్ చేస్తాను" అన్నాడతను.
    శ్రీరామ్ ఏమీ మాట్లాడలేదు. ఆ విషయం అతనికి బాగా తెలుసు.
    నిరంజన్ టైమ్ విషయంలో చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాడు.
    చాలాసార్లు టైమ్ కీపప్ చేయనివాళ్ళ అపాయింట్ మెంట్స్ కాన్సిల్ చేసి వాళ్ళను వెనక్కు పంపిన సంఘటనలున్నాయి.
    అవతలి వ్యక్తి ఎంత గొప్పవాడయినా సరే. అతన్నలా ఇన్సల్ట్ చేయటం వల్ల తమకు ఎంత నష్టం కలుగబోతున్నా సరే అతను లెక్క చేయడు.
    శ్రీరామ్ మళ్ళీ ఎంక్వయిరీ కౌంటర్ దగ్గరకు నడిచాడు.
    "ఢిల్లీ ఫ్లయిట్..."
    "లాండింగ్ లో చిన్న ప్రాబ్లెమ్ వచ్చింది. అఫ్ కోర్స్. నథింగ్ టు వర్రీ. లాండింగ్ గేర్ సరిగ్గా ఆపరేట్ అవటం లేదు. ఇంకో అయిదు నిమిషాల్లో లాండ్ అవుతుంది.
    శ్రీరామ్ కలవరపడ్డాడు.
    ఆ విషయం చెప్తే నిరంజన్ ఎంతగా అప్సెట్ అయిపోతాడో తనకు తెలుసు. ఈ అయిదు నిముషాలూ అయిదు యుగాలవుతుంది అతనికి. అంత ప్రేమ అతనికి కూతురు దీప మీద. అతని పంచప్రాణాలు దీప మీదే!
    "ఏమయింది?" శ్రీరామ్ దగ్గరకు రాగానే అడిగాడు నిరంజన్.
    "లాండింగ్ లో చిన్న ప్రాబ్లెమ్ వచ్చిందట సార్! కానీ వర్రీ అవాల్సిన పని లేదన్నారు. ఇంకో అయిదు నిముషాల్లో క్షేమంగా లాండ్ అవబోతోంది."
    నిరంజన్ ఒక్కసారిగా నిశ్చేష్టుడయిపోయాడు. అతని మొఖంలో ఆవేదన, భయం మేఘాల్లా క్షణాల్లో కమ్ముకొచ్చినయ్.
    "మైగాడ్" అంటూ సోఫాలో కూలబడ్డాడు.
    ఎంత ప్రయత్నించినా తనను తను అదుపులో పెట్టుకోలేకపోతున్నాడతను. అతి కష్టంమీద దుఃఖాన్ని ఆపుకుంటున్నాడు.
    "డాడీ" అంటూ పరుగుతో తన కౌగిట్లో కొస్తున్న దీప రూపమే కళ్ళముందు కనబడుతోంది. అసలతను దీపను చూసి ఎంతకాలమయిపోయింది?"
    మూడు నెలలా?
    ఊహు! రెండు నెలలు.
    మధ్యలో ఒకసారి తనే వెళ్ళి ఆమెను చూసివచ్చాడు.
    ఈ సంవత్సరంతో ఆమె డిగ్రీ అయిపోతుంది. ఆమె ఇంక రెండు నెలలపాటు ఇంట్లోనే ఉంటుందన్న ఆనందంతో ఉన్నాడతను.
    విమాననికేమీ ప్రమాదం జరగదు కదా! దీపకేమయినా జరుగితే తను బ్రతకలేడు.
    చిన్నప్పటినుంచీ తనకు తెలీకుండానే అతిగా ఎటాచ్ మెంట్ పెంచుకున్నాడు. ప్రతిరోజూ ఏదొక సమయంలో ఆమెతో ఎస్.టి.డి.లో మాట్లాడాల్సిందే, ఆమె ఎక్కడున్నా సరే.
    దీపక్కూడా అంతే! తనంటే పంచప్రాణాలు. తను ఆమెకు కేవలం తండ్రేకాదు స్నేహితుడు కూడా! అంత ఆత్మీయత!
    సరోజ డెత్ బెడ్ మీద తనను రెండు కోరికలు కోరింది.
    దీప ఏ పరిస్థితిలోనూ కంటతడి పెట్టకూడదు. అంత అపురూపంగా పెరగాలి.
    రెండోది తను ఇంకో పెళ్ళి చేసుకోకూడదు.
    ఆ కోరికలు శిరసా వహిస్తానని తను సరోజకు ప్రామిస్ చేశాడు. ఆమె సంతృప్తిగా కళ్ళు మూసింది. మొదటి కోరిక తను సంతృప్తికరంగా నెరవేర్చుకున్నాడు.
    దీపకు కంటతడి పెట్టే అవసరం ఇంతవరకూ కలుగలేదు. ఆమె కోరిన వస్తువు క్షణాల్లో ఆమెముందుంటుంది. ఆమెకోసం ప్రత్యేకంగా ఓ సర్వెంట్ మెయిడ్ ని ఏర్పాటుచేశాడు. ఆమెకోసం ప్రత్యేకంగా ఓ కారు. ప్రత్యేకంగా బ్యాంక్ ఎకౌంట్.
    అవును. ఆమె కంటతడి పెట్టే పరిస్థితి ఇకముందుకూడా రాదని తన నమ్మకం. తనదగ్గర మూలుగుతున్న కోట్లకొద్దీ బ్లాక్ మనీ ఆమెకంట కన్నీరొలకకుండా కాపాడగలదు.
    కానీ తన మనసుని తొలచే విషయం ఇంకొకటుంది.
    అది తన రెండో పెళ్ళి విషయం.
    తను గతకొద్ది సంవత్సరాలుగా శ్రీరంజనితో ప్రణయ కలాపాలు జరుపుతున్నాడు. అది పెళ్ళివరకూ దారితీసింది. సరోజకిచ్చిన మాటను పక్కకుపెట్టి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె నగరంలోని ఓ ప్రముఖ నగల వర్తకుని కూతురు.
    పెళ్ళయిన కొద్దిరోజులకే భర్తనుంచి విడాకులు తీసుకుంది. తనకు క్లబ్ లో ఓ ఫ్రెండ్ భార్య ద్వారా పరిచయమయింది. మొదటిచూపులోనే ఆమె సెక్సీ ఫిగర్ తనను ఆకర్షించింది. ఇద్దరూ చాలా రోజులు ఒకరినొకరు స్టడీ చేసుకున్నారు.
    ఆ తరువాతెప్పుడూ తనా వివాహం చేసుకున్నందుకు పశ్చాత్తాపపడలేదు. అన్ని విధాలా ఆనందంగానే గడిచిపోతుంది జీవితం.
    అయితే గత కొద్దిరోజులుగా తనను కొంచెం కలవరం కలిగించిన విషయాలు బయటికొచ్చినాయ్. తనూహించిన విధంగా శ్రీరంజని, దీపాల మధ్య అవగాహన కుదరటంలేదు. ఇద్దరిమధ్యా చాలా పెద్ద గ్యాప్ ఏర్పడినట్లు తనకు అర్థమయింది. పైకి చెప్పకపోయినా వాళ్ళ బిహేవియర్ మాటలను బట్టి తను తెలుసుకున్నాడు.
    ఆ విషయంలో తను చొరవ తీసుకుని ఇద్దరిమధ్యా చక్కని అనుబంధం ఏర్పడేందుకు ప్రయత్నించాలని నిశ్చయించుకున్నాడు.
    శ్రీరామ్ హడావుడిగా వచ్చాడు.
    "సార్! ఫ్లైయిట్ సేఫ్ గా లాండ్ అయింది."
    నిరంజన్ గుండెల్లోని ఆవేదన ఒక్కసారిగా తొలగిపోయింది లేచి అతనితోపాటు వడివడిగా నడిచాడు.
    ప్రయాణీకులు ఒక్కొక్కరే బయటికొస్తున్నారు.
    నిరంజన్ కళ్ళు ఆత్రుతగా దీపకోసం వెతుకుతున్నాయ్.
    కొద్దినిమిషాల తర్వాత వచ్చిందామె.
    నిరంజన్ ని చూస్తూనే పరుగుతో వచ్చి కౌగిట్లో వాలిపోయింది "డాడీ!"
    "హౌ ఆర్ యూ బేబీ? జర్నీ కంఫర్టబుల్ గా ఉందా?"
    "రఫ్ ఫ్లైయిట్ డాడీ! డిజ్ గస్టెడ్"


Next Page 

  • WRITERS
    PUBLICATIONS