Next Page 
ఫాలాక్షుడు పేజి 1


                                ఫాలాక్షుడు

                                                             _సూర్యదేవర రామ్ మోహనరావు

 

                                         


    ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్...

 

    అర్దరాత్రి పన్నెండు గంటలు దాటి పదిహేను నిమిషాలయింది. చీకటి దుప్పటి కప్పుకొని యూనివర్సిటీ హాస్టల్స్ నిద్రపోతున్నాయి. రోడ్డుకి దూరంగా ఓల్డ్ పి.జి. హాస్టల్లో మాత్రం లైట్లు అక్కడక్కడ వెలుగుతున్నాయి.

 

    ఆ హాస్టల్ కు ఎదురుగా రోడ్డు పక్కనున్న ఓపెన్ ప్లేస్ లో ముగ్గురు పోస్టుగ్రాడ్యుయేట్ స్టూడెంట్సు ఆరాధన ధియేటర్లోంచి వచ్చి అక్కడ కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు.

 

    "ఏంది... గోవిందు... సినిమాల... ఆ వయొలెన్స్ ఏంది? ఈడ్ని... ఆడు... ఆడ్ని ఈడు... పొడుసుకు సంపుకోడమేనా... పని. గ్యాంగ్ వార్ లు, గూండాల స్టోరీలు తీసి... సంపేస్తన్నారు... జనాల్ని" అన్నాడు యాదగిరి.

 

    "సిటీల్లో ఏం జరుగుతోందో... అదే తీస్తున్నారు... ఏం జరగడం లేదా?" అన్నాడు ముఖేష్ రెడ్డి.

 

    యాదగిరి మౌనంగా వున్నాడు.

 

    "పిచ్చి యాదగిరీ... హైద్రాబాద్ లో తప్పబుట్టావ్... జనరేషన్స్, జనరేషన్స్ చదువులు పూర్తి చేసేసుకుని వెళ్లిపోతున్నా- నువ్వు యూనివర్సిటీ ఫౌండర్ లా, హాస్టల్లో పదేళ్ళుగా వుండడమే తప్ప... సిటీ జ్ఞానం బొత్తిగా లేదు. పోలిటిక్స్, జ్ఞానం లేని, పొలిటికల్ స్టూడెంట్ వి." ముఖేష్ రెడ్డి తిరిగి అన్నాడు నవ్వుతూ.     

 

    "ఓల్డ్ సిటీని తీసుకో... న్యూసిటీని తీసుకో... పొలిటికల్ లీడర్స్ ని తీసుకో... కర్ఫ్యూలు, కమ్యునల్ గొడవలు... బంద్ లు... హర్తాళ్ళు... మర్డర్స్... వీటన్నిటికీ కారణం ఏంటంటావ్... ఇలాంటి వాటన్నిటికీ సిటీలే పుట్టినిళ్ళవుతున్నాయ్... ఏడాది కేడాది, వయొలెన్స్ రేట్ ఎంత స్పీడుగా పెరుగుతోందో... తెల్సా... యూనివర్సిటీలు వేలకొద్దీ, కొత్త నిరుద్యోగుల్ని తయారు చేస్తే... ఈ వయొలెన్స్ - కొత్త, కొత్త, క్రిమినల్స్ ని మర్డరర్స్ ని తయారు చేస్తోంది. యూనివర్సిటీలో స్టూడెంట్ ఎలక్షన్స్ పేరిట... ఎంత వయొలెన్స్ జరుగుతుందో... నీ కళ్ళకు కన్పించడం లేదా..." ఆవేశంగా ప్రశ్నించాడు గోవిందరాజు.

 

    "యూనివర్సిటీల్లో పొలిటికల్ పార్టీస్ ఇన్ ఫ్లుయన్స్ ని తగ్గిస్తేనే, వయొలెన్స్ తగ్గుతుంది" ముఖేష్ రెడ్డి అన్నాడు.

 

    "లేదు భాయ్... ఎలక్షన్స్ ని బేన్ చెయ్యాలి" యాదగిరి ఆ మాటని, రోడ్డువేపు చూశాడు కేజువల్ గా.

 

    ఆర్ట్స్ కాలేజీ రోడ్డు దగ్గర మలుపు తిరిగి... వరసగా నాలుగు జీపులు... ఓల్డ్ పి.జి. వేపే వస్తున్నాయి.

 

    చిమ్మచీకటిలో, జీపుల హెడ్ లైట్లు వాళ్ల మీదే పడ్తున్నాయి సూటిగా.

 

    "ఏ రాడికల్స్ కోసమో పోలీసులు... మళ్ళీ వేట ప్రారంభించారన్న మాట... పద... పద..." ముఖేష్ రెడ్డి గొంతులో ఆత్రుత ధ్వనించింది.

 

    ఎందుకైనా మంచిదని - ముగ్గురూ గబగబా లేచి, రోడ్డు క్రాస్ చేసి, హాస్టల్ వేపు పరుగెడుతున్నారు-

 

    ఒకింత సేపటికి సడెన్ గా వాళ్ళ ముందుకే వచ్చి ఆగాయి జీపులు.

 

    దగ్గరగా వచ్చి ఆగిన జీపుల్ని చూడగానే అర్ధమైపోయింది యాదగిరికి. అవి పోలీసు జీపులు కావని- అందుకే ఆగి, ఆసక్తిగా చూడడం మొదలుపెట్టాడు.


    
    "ఏయ్... ఆగు... ఓల్డ్ పిజి... ఇదేనా..." డ్రైవర్ సీట్లో కూర్చున్న ఓ వ్యక్తి, కరుకు గొంతుతో అడిగాడు యాదగిరిని.

 

    "అవ్...." జవాబిచ్చాడు యాదగిరి!

 

    "ఆదిత్య... ఏడుంటాడు...?" ఇంకో గొంతు అడిగింది.

 

    చెప్పాడు ముఖేష్ రెడ్డి.

 

    "ఆదిత్య ఎందుకు... ఎవరు... మీరు..." గోవిందరాజ్ నోట్లోంచి, ఈ మాట బయటకింకా రాలేదు-

 

    జీపుల్లోని వ్యక్తులందరూ... వడివడిగా బయటకు దిగి - అక్కడక్కడా నుంచున్నారు.

 

    "ఆదిత్యకోసం... అహోబలపతి... సార్ వచ్చిండ్రు..." అందులో ఒకడు చెప్పాడు.


    
    అహోబలపతి....

 

    పవర్ పార్టీ మాజీ ఎమ్మెల్యే... పవర్ పార్టీ వైస్ ప్రెసిడెంట్... ఓల్డ్ జాకాల్... అహోబలపతి...

 

    టాంక్ బండ్ మీదున్న విగ్రహంలా వున్నాడు... అక్కడక్కడ నెరిసిన తల...

 

    చేతిలో త్రిబుల్ ఫైవ్ సిగరెట్ ప్యాకెట్... నోట్లో సిగరెట్...

 

    "మీరిక్కడ వుండండి... నేను మాట్లాడొస్తాను..." జీపులోంచి దిగి, హాస్టల్ మెట్లెక్కాడు అహోబలపతి!

 

    ఆదిత్యకుమార్ ఫైనలియర్ లా స్టూడెంట్ - ఏ పొలిటికల్ పార్టీనీ సమర్ధించడు - ఏ పొలిటికల్ పార్టీలోనూ మెంబర్ షిప్ లేదు - పొలిటికల్ లీడర్స్ లో ఫ్రెండ్స్ లేరు - స్టూడెంట్ ఎలక్షన్స్ క్కూడా దూరంగా వుంటాడు - మరి...?

 

    అలాంటి-

 

    ఆదిత్య కోసం-

 

    అహోబలపతి ఎందుకొచ్చినట్టు? ఆలోచిస్తూనే ముందుకి నడుస్తున్నాడు యాదగిరి. ఆ పక్కన ముఖేష్ రెడ్డి... గోవిందరాజ్...


Next Page 

  • WRITERS
    PUBLICATIONS