Next Page 
మంచివాడు పేజి 1


                                                           మంచివాడు           
                                                                         వాసిరెడ్డి సీతాదేవి

 

                                        

సిగరెట్టు తాగుతూ స్నేహితుడితో కులాసాగా కబుర్లు చెబుతూ విజయవాడ రైల్వే ప్లాట్ ఫారం మీద నిల్చుని వున్నాడు రామారావు. అతని స్నేహితుడు రంగనాధం మద్రాసు వెళ్తున్నాడు.
వెనకనుంచి భుజంమీద చేయిపడటంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగిచూశాడు రామారావు.
బాగా మాసిపోయిన పైజమా లాల్చీలో వున్న వ్యక్తిని చూసి ముఖం చిట్లించుకున్నాడు రామారావు.
"నేను గుర్తున్నానా?" రామం ముఖంలోకి లోతుగా చూస్తూ ప్రశ్నించాడు ఆ వ్యక్తి.
"లేదు." నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు రామం.
"నా పేరు గోపాలం. ఐదు సంవత్సరాల క్రితం ఇదే ప్లాటుఫారం మీద కలుసుకున్నాం." రామం కళ్ళలోకి గుచ్చి చూశాడు గోపాలం.
రామారావు వెన్నెముకలో ఏదో జరజర పాకినట్లయింది. కళ్ళల్లో భయం, అరచేతుల్లో చెమటలు పట్టాయి. చెప్పాలంటే భయంగా వుంది. తండ్రి హెచ్చరికలు మరీ చిరాకు కలిగించాయి.
"సరేలే! ఇక నువ్వెళ్ళు!" విసుక్కున్నాడు రామం.
"వెళ్తాలే! బస్ రానియ్."
రామానికి మహా చిరాగ్గా వుంది.
"రైల్లో జాగ్రత్త..."
"అబ్బబ్బ! ఊరుకో నాన్నా!" అంటూ ఎవరైనా వింటున్నారేమోనని చుట్టూ చూశాడు. ఎవరి గొడవలో వాళ్ళున్నారు. కొద్ది దూరంలో టిప్ టాప్ గా డ్రెస్ చేసుకున్న ఒక యువకుడు సిగరెట్టు తాగుతూ రామంకేసి చూశాడు. రామం గతుక్కుమన్నాడు. వాడు తనకేసి ఎందుకు చూస్తున్నట్టు? నాన్న చెప్పడం విన్నాడేమో?
బస్ వచ్చింది. రామం బస్ ఎక్కి కూర్చున్నాడు. మరోసారి హెచ్చరించి తండ్రి వెళ్ళిపోయాడు. రామం కోటు కిందగా షర్టు మీద నుంచి బనీన్ జేబు తడిమి చూసుకున్నాడు.
బనీన్ జేబులో నాలుగు వేలు పెట్టి పిన్ను పెట్టుకున్నాడు షర్టు మీద నుంచి ఎత్తుగా కన్పిస్తుందనే భయంతో కోటు వేసుకున్నాడు. అయినా భయంగానే వుంది. జేబులు కత్తిరించే వాళ్ళ ప్రావీణ్యత గురించి ఎన్నో కథలు విన్నాడు రామారావు.
"ఎంతదాకా?"
రామం ఉలిక్కిపడ్డాడు. ప్రక్కకు చూశాడు. తన ప్రక్కన కూర్చున్న వ్యక్తిని చూసి నీరు కారిపోడు. వీడు... తనను బస్సుస్టాండ్ లో గమనిస్తూ నిల్చున్నాడు. ఇప్పుడు పక్కన చేరాడు. తన దగ్గిర పెద్ద మొత్తం వున్నట్టు వాసన పట్టినట్టు వున్నాడు. నాన్న మరీ! చుట్టూ వున్న మనుషుల్ని చూడకుండా ఒకటే హెచ్చరికలు చేశాడు.
"మాట్లాడరేం?"
"ఒంగోలు వెళ్ళాలి హైదరాబాద్ మద్రాసు ఎక్స్ ప్రెస్ లో" తీరా నిజం చెప్పినందుకు తననుతానే తిట్టుకున్నాడు.
"నేనూ గూడూరు వెళ్ళాలి. ఫర్వాలేదు తోడు దొరికారు. బోర్ కొట్టకుండా కబుర్లు చెప్పుకోవచ్చు" అన్నాడు ఆవ్యక్తి.
సందేహం లేదు. వీడు తనను వెంబడిస్తున్నాడు. హే భగవాన్ నన్ను ఈ దుర్మార్గుడి బారి నుంచి రక్షించే భారం నీదే. అతను మాట్లాడుతూనే వున్నాడు. రామం "ఆఁ ఊఁ" అంటూ యదాలాపంగా కూర్చున్నాడు.
ఇద్దరూ బస్సు దిగారు.
అతను రిక్షా పిల్చాడు. రామం మరో రిక్షా పిలుస్తూ వుంటే "ఎందుకండీ రెండు రిక్షాలు దండగ! ఎక్కండి!" అన్నాడు ఆ వ్యక్తి.
రామం గుండెలు కొట్టుకున్నాయి. "జేబు కత్తిరించే ప్రయత్నంలోనే వున్నాడు. దొంగ రాస్కెల్, పైకి ఎంత మర్యాదస్తుడిలా కన్పిస్తున్నాడో!" అనుకుంటూనే రామం రిక్షా ఎక్కాడు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS