Next Page 
ఆదివిష్ణు నవలలు-3 పేజి 1


                                    సత్యం గారిల్లు

                                                                                    _ఆదివిష్ణు

 

    
    దయం అయిదు.

 

    అంచేత రోడ్లు అంత రద్దీగా లేవు.

 

    ఆ ప్రాంతాలప్పుడు టాంక్ బండ రోడ్డుని హైదరాబాద్ లో వున్న వాళ్ళు తప్పకుండా చూడాలి గొప్ప సరదాగా వుంటుంది.

 

    హుస్సేన్ సాగరం, దానిమీంచి వెన్నెలగుడి, ఎగిరే పక్షులు బాగా చెయ్యి తిరిగిన చిత్రకారుడు మనసుపడి గీసుకున్న బొమ్మలాగా ఎంతో ముచ్చటగా వుంటుంది దృశ్యం.

 

    అదట్లా వుంచండి.

 

    పేరు సత్యం. వయస్సు నలభై అయిదు. పుష్టిగా వున్నాడు. పసిమిఛాయ ధగధగా మెరుస్తున్నాడు, జుత్తు తెల్లబడినా-ఉంగరాల జుత్తు గనక షోగ్గానే వుంది తలకట్టు.

 

    అతని అందంలో ఒక గ్రేసుంది. పాతికేళ్ళ క్రితం ఎంత మెరిసి పోయాడోగాని ఇప్పటిక్కూడా ఆ మెరుపు తళుక్కున మెరుస్తూనే వుంది.

 

    అతను నిక్కరూ బనీనులో వున్నాడు. కసరత్తులవీ చేసిన శరీరం గనక ఆకారం మాంచిహుందాగా వుంది.

 

    సైకిలు తొక్కుచున్నాడు. సైకిలు తొక్కినా గొప్ప స్టెయిల్ గా తొక్కడం వల్ల సెలవులో వున్న ఫైలట్ సరదాగా సైకిలెక్కినట్టుంది.

 

    సైకిలు స్పీడుగానే పోతోంది. అంతలో వున్నట్టుండి ఒక పిల్లకాకి ఝామ్మంటూ దూసుకొచ్చింది ఇంకో సైకిలుమీద.

 

    దూసుకొచ్చినంతవరకు ఫర్వాలేదు. సత్యంగారి సైకిల్ని దాటేసి వెళ్ళిపోతోంది అట్లా వెళ్ళిపోయినా ఫర్వాలేదు. వెనక్కి తిరిగి వెక్కిరించి పోతోంది.

 

    దాంతో సత్యంగారికి వళ్ళు మండిపోయింది.

 

    పిల్లకాకి వయస్సు యిరవై. పొగరూ విగరూ ధాటీగానే వున్నాయి. ఎంత యిదయితే మాత్రం వెక్కిరింతలు వేళాకోళం ఏమిటి?

 

    అదే ఇరవయియేళ్ళ వయసులో సత్యంగారు కూడా అంత ఉత్సాహంగానే వుండేవాడు. ఉత్సాహంవరకు సరిపెట్టుకోవచ్చు. వెక్కిరింత లేమిటి?

 

    ఆ కుర్రాడితో పాటు తను సైకిలు తొక్కలేడనా? తన పిక్కబలం అంతంత మాత్రమేననా? సైకిలెక్కే వయస్సు దాటిపోయిందనా? దమ్ము పట్టలేడనా? ఏం చూసుకొని, ఎవరనుకుని వెక్కిరించేడు?

 

    తనకంటే ముందు వెడుతున్నాననే మిడిసిపాటుకి చిహ్నంగా ఆ కుర్రాడు ఒక పాటకూడా పాడుతున్నారు. ముసలివాళ్ళు దారివ్వాలట- కుర్రకారు దూసుకుపోతారట.

 

    తాను ఏవంత ముసలివాడు? ఆఫ్టరాల్ ఫార్టీఫైవ్ కే ముసలితనం ముంచుకు వచ్చేస్తుందా?

 

    జుత్తు తెల్లపడవచ్చు. అంతమాత్రానికే ముసలి సరుకంటేచెల్లుబడుతుందా?

 

    ఆ మాటకొస్తే తన వయస్సులో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఈ దేశంలో కాకపోవచ్చు పొరుగుదేశాల్లో మేధావులంతా తన ఈడు వస్తేగాని పెళ్ళికి సిగ్నల్ ఇవ్వడంలేదు.

 

    అల్లాంటిది తనని పట్టుకుని ముసలితొక్కూ, ముసలి భడవా అని ముద్దు పేర్లు పెడతాడా?

 

    సత్యం అంత అవమానాన్ని భరించలేకపోయాడు. ఏమైతే అయ్యింది ఈ సైకిల్ కేసులో ఈ కుర్రాడ్ని చిత్తు చేయాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చేడు.

 

    అంచేత స్పీడు పెంచేడు. ముందుకు వంగి జోరుగా తొక్కుతున్నాడు.ఆ ఊపు ఆ విధంగా అరవయి సెకన్లపాటు జరిగేసరికి సత్యంగారు కుర్రాడి సైకిల్ని అందుకున్నాడు.

 

    ముసలాయన తన్ని చేరుకోవడంతో కుర్రాయనికి పంతం పెరిగింది. మరికొంచెం వేగం పెంచేడు.

 

    అయితే సత్యంగారు మాత్రం సాక్షాత్తూ ఆంజనేయుడయి పోయేడు. గాల్లో ఎగురుతున్నట్టు సైకిల్ని తూనీగలాగా పోనిస్తున్నాడు.

 

    ఆ దెబ్బతో కుర్రాడి సైకిలు వెనకపడిపోయింది.

 

    ఎంతయినా కుర్రాడు గనక తాను వెనక పడిపోవడం సహించలేక పోయాడు. ఉక్రోషం వచ్చింది. విజృంభించేడు.

 

    ముందు ముసలాయన, వెనక కుర్రాయన!

 

    వాళ్ళ సైకిళ్ళు స్కూటర్ల వేగంతో పరిగెత్తుతున్నాయి. ఆ పరిసరాల్లో మార్నింగ్ వాక్ చేస్తున్న జనాభాకి వీళ్ళ వరస విడ్డూరంగా తోచింది.

 

    వాకింగ్ ఆపేసి ఆ సైకిళ్ళ పోటీని ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

 

    సైకిళ్ళు విమానంలాగా వెళ్ళొచ్చుగానీ-రోడ్డు నిబంధనలు కొన్ని పాటించాలి గదా! పోటీలోపడి వాటినికూడా ఖాతరు చేయకుండా పోతుంటే ట్రాఫిక్ పోలీసు చూస్తూ ఊరుకోలేడుగదా!

 

    అంచేత ఆ పోలీసుగారు మోటారు సైకిలుమీద వాళ్ళ వెనకపడ్డాడు. మోటారు సైకిలుక్కూడా దొరక్కుండా సైకిళ్ళు పోతుంటే పోలీసు అల్లాడి పోయేడు.

 

    వాళ్ళ పొగరేమిటో కనుక్కొని తిక్క కుదర్చాలని ఒట్టేసుకున్నాడు.

 

    ఎంతయినా సైకిలు సైకిలే! మోటారు మోటారే!

 

    పోతే సైకిలుముందు మోటారు సైకిలు అడ్డంగా ఆగడంవల్ల సైకిళ్ళకు వెలువడ్డాయి.

 

    ఇద్దరూ దిగేరు.

 

    సైకిళ్ళు తొక్కినవాళ్లు చెక్కుచెదరకుండా నిలబడితే మోటారు సైకిలుమీద వెంబడించిన పోలీసు ఆపసోపాలు పడిపోతూ, ఆయాసపడిపోతూ జేబులోంచి పుస్తకంతీసి పేర్లు చెప్పండి- కేసు పెడతానని దబాయించాడు.

 

    ముసలాయన తన పేరు సత్యం అని చెప్పేడు.

 

    కుర్రాయన కృష్ణమూర్తి అన్నాడు.

 

    అడ్రసులు చెప్పండన్నారు పోలీసు. సత్యం చెప్పింది విని పోలీసు తెల్లబోయాడు.

 

    "వీడు మా అబ్బాయి. నేను వీడికి తండ్రిని. సత్యం ఇండస్ట్రీస్ ప్రొప్రయిటర్ని. ఈ వివరాలు చాలనుకుంటాను" అన్నాడు సత్యం.

 

    సత్యంగారిని ఇదే చూడటమైనా-సత్యం ఇండస్ట్రీస్ సత్యంగారికి, తన డిపార్టుమెంటులో ఉన్నతాధికారులకూ ఎట్లాంటి పరిచయముందో తెలిసిన వాడు గనుక-ఆ వివరాలు వినగానే నోటు పుస్తకం దాచేసి పోలీసు బ్రాండ్ సెల్యూట్ చేసేడు పోలీసు.

 

    ఎంతయినా చేసింది పొరపాటు గనక సత్యం సారీ చెప్పారు. అదీ కధ.


                                      2


    "నువ్వు స్పీడు తగ్గించాలి" అన్నాడు తండ్రి బస్కీలుతీస్తూ.

 

    "మెల్లిగా వెళ్లడం నాకిష్టంలేదు" అన్నాడు కొడుకు తండ్రితోపాటు కసరత్తు చేస్తూ.

 

    "నీ స్పీడు నన్ను రెచ్చగొడితే బ్రేకులేయడం నా డ్యూటీ! అవునా? కాదా?"

 

    "అవును"

 

    "ఆ డ్యూటీలో వుండగా పోలీసువాడికి చిక్కిపోయాం. సారీ కూడా చెప్పేసాం!"


Next Page 

  • WRITERS
    PUBLICATIONS