Next Page 
చిక్కలేదు చిన్నదాని ఆచూకీ... పేజి 1


                      చిక్కలేదు చిన్నదాని ఆచూకీ....

                                                        - సూర్యదేవర రామ్ మోహనరావు

 


    బొల్లారమ్ -

 

    రాష్ట్రపతి నిలయానికి వెనుక, అందమైన కొండలమధ్య వుంది ఆ కాలనీ.

 

    ఎవరో ప్రైవేట్ బిల్డర్స్ కట్టించిన మాసివ్ ఆపార్ట్ మెంట్ బ్లాక్స్ -

 

    ఒక్కొక్కటి పన్నెండు ఫ్లోర్లు. మొత్తం పన్నెండు బ్లాక్స్ వున్నాయి.

 

    నిండు సున్నా ఆకారంలో గుండ్రంగా కట్టారా ఫ్లాట్స్. అన్నిటికీ కలిపి పెద్ద చైనావాల్ లాంటి గోడ.

 

    మొదట్లో సెక్యూరిటీ... రెండు బ్లాక్స్ మధ్యలోంచి వెళ్తే మధ్యలో విశాలమైన ప్రదేశం...

 

    అందులో పెద్ద పార్కు, పార్కింగ్... లాన్స్... అక్కడ నిలబడి 160 డిగ్రీల్లో ఎటు తిరిగినా ఫ్లాట్స్ కనిపిస్తాయి.

 

    అంతెత్తు పెరిగిన అశోక వృక్షాలు... ఆ పక్కన వాలీబాల్ గ్రౌండ్... దూరంగా కార్నర్ లో చిల్డ్రన్ స్విమ్మింగ్ ఫూల్.

 

    రిటైర్డ్ మిలటరీ పీపుల్ కోసం ఓ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ కట్టించాడు ఆ కాంప్లెక్స్. మూడు అపార్ట్ మెంట్స్ లో మాత్రం మిలిటరీ జనం వున్నారు. ప్రస్తుతం ఆ అపార్ట్ మెంట్స్ లో సి బ్లాక్ లో, సిక్త్స్ ఫ్లోర్ లో, 69 నెంబరు ఫ్లాట్ లో వుంటున్నారు శ్రీధర్.

 

    అపార్ట్ మెంట్స్ వెనుక విశాలమైన పచ్చికబయలు. ఆ పక్కన కొండలు. ఖాళీ సమయంలో ఆ కొండలవేపు చూస్తూ గడుపుతాడు శ్రీధర్.

 

    సరిగ్గా ఎనిమిది గంటల పదిహేను నిమిషాలైంది.

 

    పరిగెడుతూనే జేబులోంచి కీ తీసుకుని, విసురుతో డోర్ మీద పడబోయి నిలదొక్కుకుని కీతో డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తుండగా... అప్పుడే... సరిగ్గా అప్పుడే అతని ఫ్లాట్ లోని ఫోన్ రింగవసాగింది. అది వింటూనే శ్రీధర్ లోని ఉద్వేగం రెట్టింపయిపోయింది. సేఫ్టీలాక్ ఎంతకీ ఓపెన్ అవడంలేదు... అతనిలోని టెన్షన్ అంతకంతకూ పెరిగిపోతోంది... మొత్తానికి డోర్ లాక్ తీసి లోపలకు దూసుకువెళ్లేలోపే ఫోన్ రింగవడం ఆగిపోయింది.

 

    దాంతో ఒక్కసారిగా నిస్పృహకి లోనయ్యాడు. లైటుతీసి, టర్కీటవల్ తో ముఖాన్ని తుడుచుకోబోతుండగా-

 

    టెలిఫోన్ మోగింది తిరిగి.

 

    గబుక్కున రిసీవర్ అందుకోవడానికి చేతిని ముందుకు సాచాడు. అంతలో టెలిఫోన్ రింగవడం తిరిగి ఆగిపోయింది.

 

    ఒక్కసారిగా శ్రీధర్ కు తట్టుకోలేని కోపం వచ్చింది.

 

    రిసీవర్ సరిగ్గా వుందో లేదో ఒకసారి చూసి, మళ్ళీ రింగ్ కోసం ఎదురుచూస్తున్నాడతను.

 

    కరెక్టుగా రెండు క్షణాల తర్వాత మళ్ళీ రింగవడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా-

 

    రిసీవర్ ని అందుకున్నాడు శ్రీధర్ మెరుపువేగంతో.

 

    "హలో... ఇప్పుడు టైమెంతో తెలుసా... ఎయిట్ ఎయిటీన్... అంటే మూడు నిమిషాల ఆలస్యం... నువ్వు స్టేట్స్ వెళ్ళాక టైమ్ సైన్స్ ను మరచిపోయావా...? ఎయిట్ ఫిఫ్టీన్ కు అపార్ట్ మెంట్ కు రావాలని ఎంత కష్టపడి వచ్చానో తెలుసా..."

 

    గబగబా ప్రశ్నల పరంపర.

 

    ఆ ప్రశ్నల వెనుక చిరుకోపం.  

 

    ఆ ప్రశ్నల్లో ఒక్క దానిక్కూడా జవాబు లేదు.

 

    "ఏం మాట్లాడవు... సరదాగా వింటున్నావా... జోక్ గా తీసుకుంటున్నావా... అపర్ణా నీకీ మధ్య అన్నీ జోగ్గా తీసుకోవడం అలవాటైపోయింది..."

 

    అట్నుంచి ఎటువంటి స్పందనా లేదు.

 

    "ఏంటి మాట్లాడడం లేదు... ఏం ఇంకా నీ అల్లరి తగ్గలేదా... ప్రాక్టికల్ జోకా ... కనీసం నవ్వకుండా మూతి ముడుచుకుని కూర్చుంటే ఎలా..." కొంచెం కోపం తగ్గించుకుని అన్నాడు శ్రీధర్.

 

    అప్పుడు చిన్నగా నవ్విన నవ్వు వినిపించింది. ఆ నవ్వు సుతిమెత్తని గులాబీ రేకులు గాలికి కదిలిన చప్పుడులా వుంది. ఆ నవ్వు జలపాతంలా కదిలిపోయి... కిందకు జారుతున్న కొబ్బరి ఆకుల సవ్వడిలా వుంది.

 

    "ఫోన్ చేయడం ఎందుకు లేటైంది... త్రీ మినిట్స్" అంటూ ఏదో చెప్పబోయాడు శ్రీధర్ సంజాయిషీగా.

 

    "త్రీ మినిట్స్.... ఏం మగాడా... తమరు కాలంతో పరుగెడతారా..."

 

    టెలిఫోన్ తీగల వెంట తేనె ప్రవహించినట్లుగా తియ్యగా వుంది ఆ స్వరం. కానీ ఆ గొంతు, తనక్కావల్సిన వ్యక్తి గొంతు కాదు.

 

    అపర్ణ గొంతు కాదు.

 

    అపర్ణ... ఇరవై రెండేళ్ళ అపర్ణ.

 

    శ్రీధర్ కి ఎంబిఏలో క్లాస్ మేట్. మంచి డాన్సర్. నెలలో ఇరవై రోజులు విదేశాల్లో డాన్స్ ప్రోగ్రామ్స్ కోసం తిరుగుతుంటుంది.

 

    మొదట్లో స్నేహంగా మొదలైన వారి మధ్య అనుబంధం ప్రేమగా రూపాంతరం చెందడం కూడా జరిగింది.

 

    పెళ్ళివరకు వెళ్ళేసరికి అపర్ణ అడ్డుపడి, తనకు అంతర్జాతీయంగా శోభానాయుడు అంత పేరు రావాలని, అది ఈ వయసులోనే సాధించుకోవాలని అనడంతో శ్రీధర్ అడ్డుచెప్పలేకపోయాడు.

 

    ఈ విషయం శ్రీధర్ ని తరచూ బాధపెడుతూ వుంటుంది.

 

    ఆ గొంతు అపర్ణది కాదు. మరెవరిది?


Next Page 

  • WRITERS
    PUBLICATIONS