Previous Page Next Page 
థ్రిల్లర్ పేజి 2


    మనసు పుటలలో నిక్షిప్తమైన గుప్త అనుభవాలు జుగుప్స కలిగిస్తున్నవే తప్ప వర్షంలో తడిసిన భూమి అమాయకంగా వాసన వెదజల్లినట్టు' హాయి కలిగించటం లేదు. తల్లి రెక్కలలో వొదిగిన పక్షిలా, అర్థరాత్రి కొమ్మల మధ్య కదిలే గాలిలా ఒక అనుభవం జ్ఞాపకం వస్తే ఎంత బావుండాలి! అదీ థ్రిల్లంటే....

    .... జీవితం ఇంకా ప్రారంభం కాలేదు. చాలామందిలాగే ప్రారంభం కాకుండానే అయిపోతుందా కొంపదీసి - అనుకుంది ఆమె.

    దూరంగా పన్నెండు కొట్టింది. ఆమె ఇక వ్రాసే ప్రయత్నం మానుకుని పుస్తకాన్ని పక్క టేబుల్ మీద పడేసి, లైటార్పి నిద్రపోవటానికి ప్రయత్నించింది. చెయ్యి తలక్రింద పెట్టుకుని, దిండు గుండెల నడుమ అదుముకుని పక్కకి తిరిగి పడుకుని నిద్రపోవటం ఆమె కలవాటు. అలాగే నిద్రలోకి జారుకుంది.

    ఆమెకు ఇరవై నాలుగేళ్లు. చాలామంది అమ్మాయిలకి అందం, యవ్వన ప్రాంగణపు రూపంలో పదహారో ఏట ప్రవేశించి ఇరవై మూడు నుంచీ నెమ్మదిగా శెలవు తీసుకోవటం ప్రారంభిస్తుంది. ఆమె విషయంలో అది అక్కడే నిలిచి తీరిగ్గా బుగ్గల అద్దంలో మరింత మెరుపుని సంతరించుకుంటూంది. ఆమె కేవలం అందమైంది అంటే, అందానికి అనవసరంగా ఎక్కువ విలువ నిచ్చినట్టు అవుతుంది. అందంకన్నా పెద్ద పదం లేకపోవటం అందం చేసుకున్న అదృష్టం.

    ఆమెకి నా అనే వాళ్ళెవరూ లేరు. తండ్రి మరణించి అయిదేళ్ళయింది. తల్లి చిన్నప్పుడే చనిపోయింది. ఆమె బి.ఏ. పాసయి, ఒక ప్రైవేటు కంపెనీలో గత నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తూంది. ఆమె తండ్రి గొప్ప పండితుడు. బ్రతుకున్న రోజుల్లో ఎప్పుడూ ఆయన చుట్టూ పదిమంది తక్కువకాకుండా శిష్యులూ, శిష్యరాండ్రూ వుండేవాళ్ళు. ఆయన సంపాదకీయం వ్రాస్తే దాని కోసమే పత్రిక కొనేవాళ్ళట. ఆయన పోయిన సంవత్సరానికి ఆమె వుద్యోగంలో చేరింది.

    ఒక్కటే అమ్మాయి, గదిలో ఒంటరిగా వుంటూ ఆఫీసుకి వెళ్తుందీ అంటే ప్రేమకేం తక్కువ? వచ్చిన చిక్కల్లా ఆమెకి ఇంత ప్రేమని ఏం చేసుకోవాలో తోచడం లేదు. కర్తవ్యం భుజాలమీద వేసుకుని సంబంధాలు చూసే మానేజరు ప్రేమ, కాఫీ ఇచ్చే కుర్రబాసు ప్రేమ, ఇంటికొచ్చి పనులేమన్నా చేసిపెట్టాలా అని అడిగే నౌకరు ప్రేమ, అంతా ప్రేమమయమే.

    ... కిటికీ కొట్టుకోవటంతో ఆమెకి మెలకువ వచ్చినట్టు అయింది. మళ్ళీ నిద్రలోకి జారుకుంటూ వుండగా, ఎవరో సన్నగా పిల్చినట్టయింది. ఆమె ముందు పట్టించుకోలేదు. కానీ మళ్ళీ వినిపించింది. ఆమె చప్పున కళ్ళు విప్పింది.

    విద్యాధరి స్వతహాగా ధైర్యస్తురాలు. ఎన్నో ఏళ్ల ఒంటరితనం ఆమెకి ధైర్యాన్నిచ్చింది. అంత వొద్దిక, మంచితనం, నెమ్మదీ వున్న అమ్మాయి నలుగురు తిరిగే ఇంటిలో వున్నట్లయితే, ఆకుచాటు మొగ్గలా వుండి వుండేది. ఇప్పుడీ ఒంటరితనం ఆమెకి పుస్తకాలు చదవటం నేర్పింది. లోతుగా ఆలోచించటం నేర్పింది. తన మనోహరమైన నవ్వుని అనవసరమైనప్పుడే పెదవుల మీదకు తీసుకురావటం నేర్పింది. మనుష్యుల్ని విశ్లేషించటం నేర్పింది.

    అంత ధైర్యస్థురాలూ ఆ క్షణం భయపడింది.

    ఎక్కణ్ణుంచో సన్నటి శబ్దం వినిపిస్తూంది.

    ఆమె పక్కనే వున్న స్విచ్ వేసింది.

    ఒక్కసారిగా అంత వెలుతురు ఆ పుస్తకం అట్టమీద పడేసరికి దానిమీద రంగు ఆమె పైకి ఒక పెద్ద అలలాగా రిఫ్లెక్టు అయింది.

    "థ్రిల్లర్" అన్న అక్షరాలు మెరుస్తూ కనిపించాయి.

    ఆమె అప్రయత్నంగా గుటక మింగింది. అంతలోనే ఆమెకి తన భయానికి నవ్వొచ్చింది. గాలికి ఆ కాగితాలు చేసే చప్పుడది. ఆమె ఆ పుస్తకాన్ని వడిలోకి తీసుకుంది. నిద్ర పారిపోయినట్టయింది. ఆమె పేజీ తిప్పింది.

    అప్పటివరకూ వీస్తూన్న గాలి ఆగినట్టు ఆ గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. మల్లెతీగ నీడకూడా కదలడం మానేసింది.

    ఆమె మొదటి పేజీలో వ్రాసివున్న వాక్యాల్ని మరోసారి చదివింది.

    "ఈ భూమ్మీద మనిషి అనే జీవి, కేవలం ఒకే ఒక శక్తివల్ల మిగతా అన్ని ప్రాణులమీదా ఆధిపత్యం సంపాదించగలిగాడు. ఆ శక్తి పేరు రీజనింగ్."

    ఆమె ఆ వాక్యాల్నే చూస్తూ వుండిపోయింది. ఆమెలో ఏదో సంచలనం ప్రారంభమయింది. ఎందుకో తెలీదుగానీ, గట్టిగా "...నో" అని అరవాలనుకుంది. ఆ పుస్తకాన్ని దూరంగా విసిరెయ్యాలనుకుంది. కానీ ఆ అక్షరాలు మాత్రం ఆమె కంటిచూపుని అయస్కాంతంలా పట్టుకుని నిలబడ్డాయి. పుస్తకంలో తెల్లకాగితాలు "వ్రాయి.. వ్రాయి" అంటూ రెట్టిస్తున్నట్టు కనబడ్డాయి. నీ కోసమే మేమిలా వుండిపోయామన్నట్టు ఆహ్వానించసాగాయి.

    ఆమె పెన్నుతీసి, వ్రాసివున్న అక్షరాల పక్క పేజీలో పెద్ద పెద్ద అక్షరాల్తో విసురుగా వ్రాసింది -

    "ఏం రీజనింగ్ వుందని నా తండ్రి నా తల్లిని హత్య చేశాడు?"

    అది వ్రాయగానే ఆమెలో ఆవేశం తగ్గి, లైటార్పి, దిండు గుండెల దగ్గరగా తీసుకుని నిద్రలోకి జారిపోయింది.

    అప్పటివరకూ నిశ్శబ్దంగా వున్న మల్లెతీగ గాలికి కదలటం ప్రారంభించింది. కాగితాలు మాత్రం ఆమెనిక ఆ రోజుకి డిస్టర్బ్ చేయలేదు.

                                         *    *    *

    మే 2, 1987
    మధువన్ రెస్టారెంట్
    రాత్రి 8-30
    ఆమెకి ఆ గార్డెన్ రెస్టారెంట్ లో అలా కూర్చోవటం ఇబ్బందిగా వుంది. ఎదురుగా వున్న చక్రధర్ కి మాత్రం ఏనుగెక్కినంత సంబరంగా వుంది. ఇన్నాళ్ళకి ఆమె తనతో డిన్నర్ కి రావటానికి ఒప్పుకున్నందుకు.

    వచ్చేపోయే జనం అంతా, తనని చూస్తున్నారని ఆమెకు తెలుసు. సంవత్సరం నుంచీ వాయిదా వేసుకుంటూ వచ్చింది.... ఇక లాభం లేకపోయింది. ఈ రోజు రాక తప్పలేదు. సంవత్సరం నుంచీ అతడు అఫ్కోర్స్ సంస్కారయుతంగానే అడుగుతూ వున్నాడు. ప్రొద్దుటే ఆఫీసుకు రాగానే ఫ్లాస్క్ లోంచి కాఫీ పోసి .... "ఈ రోజైనా డిన్నర్ కి వస్తున్నానన్న శుభవార్తతో దినచర్య ప్రారంభించేలా చేస్తారా -" అని అడుగుతాడు.

    చక్రధర్ అందగాడు. ఒంటరివాడు. చిన్నవయసులోనే పెద్ద కంపెనీకి మానేజరు.

    ఏ అమ్మాయీ సంవత్సరంపాటు అడిగించుకోదు. మరి తనెందుకు అడిగించుకుంది! ఇష్టం లేకపోతే డైరెక్టుగా చెప్పొచ్చుగా ?

    భయం. తనని అహ్మదాబాద్ బ్రాంచ్ కి బదిలీ చెయ్యవచ్చు. ప్రతీ చిన్న తప్పుకీ తలవాచేలా చివాట్లు వెయ్యవచ్చు. ఇవన్నీ జరక్కుండా ఉండటం కోసం ఇన్నాళ్ళూ కర్ర విరక్కుండా, పాము చావకుండా దాటేస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు లాభం లేదు. తాడు ఎలాగూ తెగడం తప్పనిసరి అయినప్పుడు బలంగా లాగెయ్యటమే మంచిది. ఆమె దానికి ప్రిపేర్ అయింది.

    "ఏమిటి ఆలోచిస్తున్నారు?"

    "ఏం లేదు."

    "ఏదైనా మాట్లాడండి"

    "డిన్నర్ కి పిలిచింది మీరు. మీరే మాట్లాడాలి."

    అతడు ముందుకు వంగి. "ఈ రోజు కోసం ఎన్నాళ్ళనుంచీ ఎదురు చూస్తున్నానో తెలుసా?" అన్నాడు.

    "ఎందుకండీ" అమాయకంగా అడిగింది నిజంగానే.

    "నా మనసులో మాట చెప్పాలని."

    "దానికి ఎదురుచూడటం ఎందుకు? ఎప్పుడైనా చెప్పొచ్చుగా."

    "అమ్మయ్య. ఇంత తొందరగా అర్థం చేసుకుంటావనుకోలేదు."

    "నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను విద్యా."

    "ఒక మనిషి మరో మనిషిని ఎందుకు ప్రేమిస్తాడో మీరు చెప్పగలరా?"

    సరదాగా సాగిపోతుందనుకున్న సంభాషణ ఈ విధంగా అయ్యేసరికి చక్రధర్ ఖంగుతిన్నాడు. ఆ అమ్మాయి ఈ విధంగా ప్రశ్న అడుగుతుందనుకోలేదు. అయినా తమాయించుకొని "ప్రతి మనిషికీ ఒక తోడు కావాలి. దానికోసం వెతుక్కుంతాడు" అన్నాడు. ఆమెకు తన తండ్రి గుర్తొచ్చాడు. భార్య తోడుండగా పనిమనిషిని ఎందుకు వెతుక్కున్నాడు?

    "మీరు నన్నెందుకు వివాహం చేసుకోవాలనుకుంటున్నారు?"

    ఈ ప్రశ్నకి అతడు కాస్త దెబ్బతిన్నట్టు కనిపించాడు. "మిమ్మల్ని చూడగనే మీరు నాకు తగినవారు అనిపించింది."

    ఆమెకీ సమాధానం నచ్చలేదు. చూడగానే నచ్చటం అంత ఆరోగ్యకరమైన ఆలోచనకాదు. ప్రేమకి అందం ఒక్కటేనా పునాది? "రేపు వివాహమయ్యాక నాలో మీకు నచ్చని గుణాలు ఎన్నో బయటపడవచ్చు. అప్పుడు?"

    "వివాహంలో ఆ రిస్కు ఎప్పుడూ వుంది విద్యాధరీ."

    "దానికన్నా - ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకున్నాక ఒక నిర్ణయానికి వస్తే బావుంటుంది కదా".

    అతడి మొహంలో రిలాక్సేషన్ కనిపించింది. "గుడ్ ! అదే నేనూ చెప్పాలనుకుంటున్నది" అన్నాడు.

    "అయితే మీ గురించి చెప్పండి."

    "ఏం చెప్పను? నా గురించి మీకంతా తెలుసు. ఉద్యోగం వుంది. మంచి ఉద్యోగం. మనిషిని చూశారు. అందంగానే వుంటాననుకుంటున్నాను" అంటూ నవ్వేడు. ఆ నవ్వులో కాస్త గర్వం కనపడింది.

    "ఇవన్నీ ప్లస్ పాయింట్స్. మైనస్ చెప్పండి."

    అతడు మళ్ళీ నవ్వి "నాకు తెలిసినంతవరకూ ఏమీలేవు."

    "మీ భార్య గురించి చెప్పండి."

    అతడి చేతిలో స్పూన్ జారిపడింది ".... మీకెలా తెలుసు?" అని అడిగాడు.

    ప్రతి మనిషీ తన మైనస్ గురించి ప్రపంచానికి ఏమీ తెలీదనుకుంటాడు. అందరికీ తెలుసుననీ, ఆ మనిషివల్ల తమకున్న ఉపయోగాన్ని దృష్టిలో వుంచుకుని ఆ విషయంపై బయటపడరనీ తన తండ్రి సహేతుకంగా నిరూపించాడు.

    "మీ భార్య మీ నుంచి రెండు సంవత్సరాలుగా విడిపోయి వుంటోంది. కారణాలు ఏమైనా గానీ, ఆ విషయం మీరు నాకు చెప్పి వుండాల్సింది."

    "ఆమె రాక్షసి".

    "అయి వుండవచ్చు. కానీ ఆ విషయం మీ మైనస్ గా మీరు నాకు చెప్పాలి కదా."

    "నెమ్మదిగా చెప్పాలనుకున్నాను" హీనస్వరంతో అన్నాడు.

    "ఎప్పుడు? మన ప్రేమ గట్టిపడి, ఇక నేను మిమ్మల్ని విడిచిపెట్టలేను - అన్న నమ్మకం కుదిరాక, ఒక వర్షం రాత్రి నా చేతులు పట్టుకుని నా జీవితంలో జరిగిన విషాద సంఘటన వింటావా విద్యాధరీ అంటూ - ఆ రాక్షసి మీ జీవితాన్ని ఎలా నరకం చేసిందో వివరించి, సానుభూతికి ప్రయత్నించి వుండేవారు."

    "నువ్వు మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నావు."

    "లేదు. ప్రేమకి పునాది ఫ్రాంక్ నెస్ అని చెపుతున్నాను."

    "ఆవిడతో విడాకులు తీసుకోగానే మన వివాహం జరుగుతుంది అనుకున్నాను."

    "అప్పుడు చెపుదామనుకున్నారా ఈ విషయాన్ని?"

    అతను మాట్లాడలేదు. "పోన్లెండి. మీ అభిప్రాయాలు మీవి. వాటిని విమర్శించే హక్కు నాకు లేదు. నేను మాత్రం ఫ్రాంక్ గా చెప్పెయ్యదల్చుకున్నాను. చాలాకాలం క్రితం నాకో బోయ్ ఫ్రెండ్ వుండేవాడు. ప్రేమించుకున్నాం. నా ఉద్దేశ్యంలో ప్రేమంటే అంతా.... అర్థమైందిగా. కానీ తరువాత తెలిసింది అతడు రాక్షసుడని - విడిపోయాం."

    "అంతా అంటే?"

    "ఎందుకు 'అంతా'కి అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు. మనిద్దరి అనుభవాలూ ఒకటే. పోతే మీరు వివాహమయ్యాక వదిలేశారు, నేను కాకుండా వదిలేశాను".


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS