Next Page 
లవ్ స్టోరీస్  పేజి 1

                          
                                                                 లవ్ స్టోరీస్

                                                                           -యర్రంశెట్టి శాయి

                                                                     బొమ్మరిల్లు

    సామంత ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ లో నుంచి చిరాకుగా బయట చీకట్లోకి చూస్తున్నాడు. ఉండి ఉండి సన్నగా కురుస్తున్న వర్షంలోకి కిటికీలో నుంచి చేయి జాపి చూసి విసుక్కొంటున్నాడు.

    "వెధవ వర్షం! ఇప్పుడే మొదలెట్టాలా? స్టేషన్ కి రంగన్నదొర వస్తాడో, రాడో! రాకపోతే ఈ వర్షంలో తనెలా పోగలడు? ఒకవేళ వర్షం లేకపోయినా కూడా అతనిల్లు కనుక్కోవటం తనకి కష్టమే అవుతుంది. ఇంత రాత్రివేళ ఎవర్ని లేపి అడగాలి?.......  

    రైలు వేగం తగ్గింది. పరీక్షగా బయటికి చూశాడు సామంత. రోడ్ గేట్ దాటుతోంది రైలు. రోడ్ మీద వరుసగా లారీలు, హైదరాబాద్ పోయే బస్సులు ఆగి ఉన్నాయి. అంటే, ఖచ్చితంగా తరవాత స్టేషన్ వల్లూరే! వల్లూరికి మైలు దూరంలోనే ఈ మెయిన్ రోడ్డు వుంది. రెయిన్ కోటు భుజం మీద వేసుకుని, సూట్ కేస్ లాక్ చేసి, తలుపు దగ్గర నిలబడి , బయటకు చూశాడు సామంత. కొబ్బరితోటలు దాటుతోంది బండి. ఎత్తుగా, గుబురుగా ఆ ప్రదేశాన్ని మరింత చీకటి మయం చేస్తున్నాయవి. ఇవన్నీ మునసబుగారి తోటలే. వీటినానుకొనే తమ కొబ్బరితోట ఉంది. తన బాల్యమంతా ఇంచుమించుగా ఆ కొబ్బరితోటలోనే గడిచింది. తోటలో తన తండ్రి అందమయిన గది ఒకటి కట్టించాడు. అప్పట్లో ఆ గది అంటే  తనకెంత ఇష్టమో! తరువాత తమ చదువుల కోసం కుటుంబమంతా హైదరాబాద్ వెళ్ళిపోవడం, అక్కడే తన ఉద్యోగం, వివాహం , పిల్లలు - అంతే! ఈ ఊరు వదిలి ఇరవై ఏళ్లవుతూంది. ఇంతవరకూ మళ్ళీ తిరిగిరావడం పడలేదు. ఇప్పటికయినా వచ్చేవాడు కాదు గానీ, ఆ కొబ్బరితోట అమ్మి పారేద్దామని నిర్ణయించుకోవడం చేత రాక తప్పలేదు. అది అమ్మటం తన తండ్రికి ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. ప్రతిసారీ ఆయనే వెళ్ళి పంట అంతా అమ్మి డబ్బు తీసుకొని తిరిగి వస్తూండేవాడు.

    "ఎందుకు నాన్నా, మీకీ శ్రమ? మనమా తోటమీద ఆధారపడిలేము  కదా? ఎలాగూ ఇక్కడే స్థిరపడిపోయాం. ఇంకా ఆ మారుమూల మనకెందుకు ఆస్తులు? అమ్మిపారేసి ఇక్కడే ఇంకో ఇల్లు కొనుక్కుందాం" అని తనెంత చెప్పినా వినేవాడు కాదు.

    "నా ఘటం ఉన్నంతవరకూ అది అమ్మటానికి వీల్లేదురా! ఆ తరువాత నీ ఇష్టం!" అనేవాడు నవ్వుతూ. నవ్వుతూనే కన్నుమూశాడు ఆర్నెల్ల క్రితం.

    రైలు కీచుమంటూ ఆగింది స్టేషన్లో... రెండు దీపం స్తంభాలు గుడ్డిగా వెలుగుతున్నాయి. 'వల్లూర్' అంటూ పోర్టర్ గొంతు వినిపించింది.  

    సూట్ కేస్  తీసుకొని ప్లాట్ ఫారమ్ మీదికి దిగి నించున్నాడు సామంత. కొద్దిసేపటి క్రితం అక్కడ బాగా వర్షం కురిసి ఉండచ్చు. ఫ్లాట్ ఫారమంతా అరంగుళం లోతు నీళ్ళు నిలిచి ఉన్నాయి. స్టేషన్ మాస్టర్ ఉన్ని దుస్తులు వేసుకొని ఆఫీస్ ముందు నించున్నాడు. తను తప్ప ఇంకెవ్వరూ ఆ స్టేషన్లో దిగినట్లు కనిపించటం లేదు సామంతకి. రంగన్న దొరకూడా స్టేషన్ కొచ్చినట్లు లేదు. బహుశా తను వ్రాసిన ఉత్తరం అందలేదేమో?

    నెమ్మదిగా స్టేషన్ మాస్టర్ ఆఫీస్ దగ్గరికి నడిచాడు.

    "నేను ఈ ట్రైన్లో దిగాను. లోపలికి రావచ్చా?" అనడిగాడు ఇంగ్లీష్ లో.

    "రండి.... రండి...." అన్నాడతను, తనూ లోపలికి నడుస్తూ.

    లోపలికి నడిచి, సూట్ కేస్ కింద ఉంచి, రెయిన్ కోట్ చేతిమీదికి లాక్కొని కుర్చీలో కూర్చున్నాడు సామంత.

    రైలు పెద్దగా కూతవేసి కదిలింది.

    పాయింట్స్ మన్ లోపలికొచ్చి చేతి దీపం ఓ పక్కన ఉంచి సామంత వంక చూస్తూ నించున్నాడు.

    "నా పేరు సామంత! హైదరాబాద్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. మా స్వంత ఊరిదే కాని వదిలేసి చాలా సంవత్సరాలయిపోయింది"

    "అలాగా!" అన్నాడతను.

    "ఇక్కడ మాకు కొబ్బరితోట ఉంది. 'రంగన్నదొర' అనీ - అతను చూస్తున్నాడు ఆ తోట వ్యవహారం! అది అమ్మిపారేయాలని అభిప్రాయం! అందుకే వచ్చానిక్కడికి..."ఆప్తునితో మాట్లాడినట్లు అన్నాడు సామంత.

    "రంగన్నదొర - నాకు తెలుసులెండి! అప్పుడప్పుడు ఇక్కడికొచ్చి కష్టం, సుఖం మాట్లాడిపోతుంటాడు."

    "అప్పట్లో అతను మా తోట దగ్గర్లోనే ఉంటూండేవాడు. ఇప్పుడు ఊళ్ళోనే ఎక్కడో ఉంటున్నాడట! ఈ చీకట్లో అతని ఇల్లు తెలుసుకోవడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను."

    "దాన్దేముంది! మా పాయింట్స్ మెన్ని దీపం యిచ్చి మీతో పంపిస్తాను. అతనికి రంగన్నదొర ఇల్లు తెలుసు."

    "థాంక్యూ! థాంక్యూ  వెరీమచ్!" అన్నాడు సామంత కృతజ్ఞతా పూర్వకంగా.

    "అయ్యగారిని రంగన్న దొర ఇంటిదగ్గర వదిలిరా, సత్యం!" అన్నాడు స్టేషన్ మాస్టర్.

    లేచి సూట్ కేస్ తీసుకొని బయటికి నడిచాడు సామంత . పాయింట్స్ మెన్ దీపం పట్టుకొని ముందు నడవసాగాడు.

    అదివరకు మట్టిరోడ్డు ఉండేది ఊళ్ళోకి. ఇప్పుడు కంకరరోడ్డు పడినట్లుంది. రోడ్డంతా గుంటలు గుంటలుగా ఉండి నీళ్ళు నిలిచినాయి. కప్పలు, కీచుపురుగులు కలిసిపోయి గుండె దడ పుట్టేట్లుగా అరుస్తున్నాయి. టైమ్ చూసుకొన్నాడు సామంత. రేడియం ముళ్ళు రెండూ పదిమీద ఉన్నాయి. మరి కాసేపట్లో ఊళ్ళోకి చేరుకున్నారు వాళ్ళు. వీళ్ళను చూసి రెండు, మూడు కుక్కలు హడావుడిగా మొరగడం మొదలు పెట్టాయ్. అదివరకు తమదొక్కటే పెంకుటిల్లు ఉండేది. మిగతావన్నీ పాకలే! ఇప్పుడు రెండు, మూడు డాబాలు కనబడుతున్నాయి. రావిచెట్టూ, దానిచుట్టూ కట్టిన సిమెంట్ అరుగూ - అచ్చం అదివరకు లాగానే ఉన్నయ్.

    కుడిచేతివేపున్న పాక ముందాగి, "రంగన్నా" అంటూ గట్టిగా పిలిచాడతను.

    రెండో కేకకే "ఆ! వచ్చే" అంటూ రంగన్న దొర గొంతు వినిపించింది.

    మరి కొద్ది క్షణాల తరువాత తలుపు తెరుచుకొని, "ఎవరిది?" అంటూనే లాంతరు పట్టుకొని బయటికొచ్చాడు రంగన్న.

    "నేను - సత్యాన్ని! ఈయన నీ కోసం వచ్చారు, చూడు!"  అన్నాడు సత్యం.

    లాంతర్ ఎత్తి పట్టుకొని ఆ వెలుగులో సామంత ముఖం గుర్తించడానికి ప్రయాత్నిస్తూ "ఎవరది బాబూ?" అనడిగాడు రంగన్న.

    "గుర్తుపట్టలేదా, రంగన్నా? నేను సామంతని." నవ్వుతూ అన్నాడు సామంత.

    "తమరా!" ఆశ్చర్యానందాలతో అన్నాడు రంగన్న.

    "ముందు లోపలికి రండి. సత్యం, ఇంక నువ్వెళ్ళు.... చాలా సహాయం చేశావు!"

    అతను వెళ్ళిపోయాడు.

    చాలాకిందికి ఉన్న చూరుని వంగి, దాటి లోపలికి నడిచాడు సామంత. చాలా చిన్నపాక అది. ఒంటి నిట్రాట అది. అందులోనే రెండు గదుల్లా చేశాడు. నవారు మంచం మీద పరిచి ఉన్న దుప్పటి తీసి మరో తెల్ల దుప్పటి పరిచాడు రంగన్న.

    "కూర్చో, సామంత బాబూ..."

    సామంత కూర్చుని బూట్లు విప్పి ఓ మూలకి తోశాడు.

    "ఉత్తరం ముక్క రాస్తే స్టేషన్ కొచ్చేవాడిని కదు, బాబూ..." నొచ్చుకుంటూ అన్నాడతను.

    "రాశాను, రంగన్నా! ఇంకా నీకు చేరలేదనుకొంటానది. లేదా మిస్సయిపోయుంటుంది..." అంటూ రంగన్నను పరిశీలనగా చూశాడు సామంత.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS