Next Page 
థ్రిల్లర్ పేజి 1


                                        థ్రిల్లర్
                                                                       యండమూరి వీరేంద్రనాథ్

    Man has an edge over other animals, and conquered the earth with his only power ! That power is called ... 'Reasoning'                
                                                                          యండమూరి వీరేంద్రనాథ్    

    "నిజం సుమా" అనుకుంది విద్యాధరి ఆ రెండు వాక్యాలూ చదివి. మొదటి పేజీలో ఆ రెండు వాక్యాలే వున్నాయి. అదికూడా ప్రింటు కాదు. రచయిత చేత్తో వ్రాసిన దానికి ఫోటోకాపీలా వున్నాయి ఆ అక్షరాలు.

    ఆమె పేజీ తిప్పబోతూ వుంటే స్నేహితురాలు వచ్చింది. విద్యాధరి చేతిలో పుస్తకం చూసి "ఏమిటది?" అని అడిగింది.

    "థ్రిల్లర్ - అని కొత్త నవల. ఈ రోజే మార్కెట్ లోకి వచ్చింది. ఇప్పుడే కొన్నాను హడావుడిగా ఆఫీసుకొస్తూ" అని పుస్తకం ఆమెకి అందించి, "ఆ మొదటి వాక్యాలూ చూడు గమ్మత్తుగా వున్నాయి" అంది.

    స్నేహితురాలు దాన్ని చదివి నొసలు విరుస్తూ, "నాకేం అర్థంకావటం లేదు బాబూ" అంది.

    "మిగతా జంతువులతో పోలిస్తే మనిషికున్న తార్కిక జ్ఞానమే అతడిని ఈ భూమ్మీద జీవకోటికి 'రాజు'ని చేసింది. ఒక రాతిని సూదిగా చెక్కితే జంతువుల్ని సులభంగా చంపవచ్చు కదా అనుకొన్నాడు. ఆయుధం తయారైంది.... అడవులు ఎందుకు తగలబడుతున్నాయా అని ఆలోచించి, నిప్పు తయారుచేయటం కనుక్కున్నాడు. ప్రతిదానికీ రీజనింగ్ ఆలోచించటం వల్లనే మనిషి అభివృద్ధి సాధ్యపడింది అని రచయిత చెపుతున్నాడు."

    "నువ్వు చెప్పింది నా కొక్కముక్కా అర్థంకాలేదు కానీ ఒకటి మాత్రం గమనించావా?"

    "ఏమిటి?"

    "ఏ ఇంగ్లీషు రచయిత కొటేషనో వ్రాయకుండా ఇతనే స్వంతముగా రాసుకున్నాడు పెద్ద గొప్పగా..."

    ఆమె ఆ మాటలకి నవ్వి, పేజీ తిప్పింది. ఆమె మోహంలో నవ్వు మాయమైంది. గబగబా పేజీలు  తిప్పటం ప్రారంభించింది. తొందర తొందరగా పుస్తకం అటూ ఇటూ తిరగేసిండి. విద్యాధరి మోహంలో కనబడుతున్న విస్మయాన్ని చూసి స్నేహితురాలు కూడా ఆ పుస్తకంలోకి చూసింది. ఆమెక్కూడా ఆశ్చర్యమేసింది.

    లోపల పేజీలన్నీ ఖాళీగా వున్నాయి. తెల్లగా.... ఒక్క వాక్యం కూడా ప్రింటవకుండా.

    ఇద్దరూ ఒకర్నొకరు చూసుకున్నారు. కారణం తెలీదు, కానీ సన్నటి చలి వెన్ను చివర మొదలై వళ్ళంతా పాకి అరక్షణంపాటు వణికించింది.

    "మొసం... దారుణం" అరిచింది స్నేహితురాలు. "అట్టమీద బొమ్మ నీట్ గావేసి, లోపల తెల్లకాగితాలు పెట్టి అమ్ముతారా? ఎక్కడ కొన్నావో పద అడుగుదాం".

    ఆమె క్కూడా అది ఆశ్చర్యంగా వుంది. ఇద్దరూ ఆ పుస్తకం కొన్న షాపుకి వెళ్ళారు. అది పబ్లిషరు స్వంతషాపు.

    "గంటక్రితం ఈ పుస్తకం మీ దగ్గిర కొన్నాం" అందామె నవలని అతడికి చూపిస్తూ "... ఇందులో కాగితాలన్నీ ఖాళీవి".

    అతడా పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకొని, "మైగాడ్! ఈ పుస్తకం మీకెలా వచ్చింది?" అని అడిగాడు.

    "ఎలా రావటం ఏమిటండీ? కొంటే వస్తుంది" అంది పక్కనుంచి స్నేహితురాలు.

    "ఏదో పొరపాటు జరిగిపోయింది. మా అబ్బాయి దీన్ని మీకమ్మి వుంటాడు. నిజానికిది డమ్మి మాత్రమే. పుస్తకం కవర్ సైజ్ చూసుకోటానికి వేసిన రఫ్ కాపీ" డబ్బు వెనక్కి అందిస్తూ అన్నాడు.

    - "వియ్ ఆర్ సారీ మేడమ్"

    "పుస్తకం ఎప్పుడొస్తుంది?" అడిగింది విద్యాధరి.

    "తెలీదు మేడమ్. అసలింకా ఆయన రాయటం ప్రారంభించలేదు" "ఏడ్చినట్టుంది ఆయనింకా మొదలెట్టలేదు. తెల్లకాగితాలకి అట్టవేయటం, అమ్మేయటం కూడా జరిగిపోతుందా?" స్నేహితురాలు గయ్యిమంది.

    "క్షమించండి. మా అబ్బాయి అమెరికా వెళ్లే హడావుడిలో అలా చేశాడు. మాకు తెలిసిన వార్త ఏమిటంటే, ఆయన ఆ ఒక్క వాక్యం వ్రాసి చాలా రోజులైంది. తరువాత ఏం వ్రాయాలో తోచక అలా ఆపుచేసేశారు. ఎప్పటికి పూర్తవుతుందో తెలీదు."

    "మీరేమీ కవర్ పేజీ ప్రింట్ చేసుక్కూర్చున్నారు. వెళదాం పద" అంది విద్యాధరితో.     

    విద్యాధరి వెనుదిరగబోతూ, "ఈ పుస్తకాన్ని నేను తీసుకు వెళ్ళవచ్చా" అని అడిగింది రిక్వెస్టు చేస్తున్నట్టు. ఆమె అభ్యర్ధనలో, 'చూడండి ఇంతదూరం తిరిగి నడచి వచ్చాం' అన్న నిష్టూరం బహుశా అతడికి కనపడిందేమో, "నిరభ్యంతరంగా మేడమ్" అన్నాడు దాన్ని ఆమెకి తిరిగి అందిస్తూ.

    ఆమె దాన్ని తీసుకొని "థాంక్స్" అంటూ వుండగా ప్రక్కనున్న స్నేహితురాలు "ఎందుకా పుస్తకం" అంది.

    ఆమె నవ్వింది. "పుస్తకం పేరు థ్రిల్లర్, కవరు పేజీ కూడా వుంది. లోపలన్నీ తెల్లకాగితాలే... లైఫ్ లో ఏదైనా థ్రిల్లింగ్ సంఘటనలు జరిగితే అందులో డైరీలా వ్రాసుకుంటూ వుండవచ్చు."

    స్నేహితురాలు కూడా నవ్వింది. "ఆలోచన బావుందే.... అసలిలాటి పుస్తకం దొరకటమే ఒక థ్రిల్. దాంతోనే ప్రారంభించు."

    పబ్లిషర్ వీళ్ళ మాటలు వింటున్నాడు. వాళ్ళు మెట్లు దిగుతూ అనుకుంటున్నారు. "ఇంకా ఆయన వ్రాయటమే మొదలు పెట్టలేదట"

    "పోనీ మనమే వ్రాసి రిలీజ్ చేద్దామా ? డబ్బులొస్తాయి" నవ్వుకుంటూ సాగిపోయారు.

    వాళ్ళు వెళ్ళేవరకూ అటే చూస్తూ నిలబడ్డ పబ్లిషర్ వాళ్ళు కనుమరుగయ్యాక లోపలికి వెళ్ళి హైదరాబాద్ డయల్ చేశాడు.

    9246502662?

    "యస్"   

    "వీరేంద్రనాథ్?"

    "స్పీకింగ్."

    "ఇప్పుడే థ్రిల్లర్ పుస్తకాన్ని ఒకమ్మాయి వచ్చి తీసుకువెళ్ళింది."

    "గుడ్. పదిహేను రోజుల్లో నవల రిలీజ్ డేట్ ఇచ్చేయండి" లైన్ కట్ అయింది.

                                                               *    *    *

    1 - 5 - 87
    విజయవాడ
    రాత్రి 11 - 55

    పక్కమీద బోర్లా పడుకుని, పెన్ క్యాప్ నోట్లో పెట్టుకుని ఆ పుస్తకంవేపే చూస్తూ చాలా సేపట్నుంచి వుంది విద్యాధరి.

    చల్లటి గాలి లోపలికి ఆగి ఆగి వీస్తూంది. వెన్నెలవల్ల బైట మల్లెతీగ నీడ లోపల గోడమీద నాట్యం చేస్తోంది.

    కొత్తగా నోట్ బుక్స్ కొనుక్కున్న పిల్లలు వెంటనే వాటికి స్టిక్కర్స్ అంటించి పేర్లు వ్రాసుకోవాలని ఎలా ఉత్సాహపడతారో ఆమెక్కూడా అలా ఏదైనా ఆ పుస్తకంలో వ్రాయాలని తొందరగా వుంది. స్నేహితురాలు అన్నట్టు అలా నీటైన పుస్తకం తెల్లకాగితాలతో దొరకటమే ఒక థ్రిల్.

    ఆమె ఆ రోజు జరిగిన థ్రిల్ ఏదైనా వ్రాద్దామనుకొంది. ఏముంటాయి థ్రిల్స్? ప్రొద్దునే ఆఫీసు కెళ్ళింది. బాస్ పదిన్నరకే లోపలికి పిలిచాడు. 'ప్రొద్దున్నే మిమ్మల్ని చూసి ప్రారంభిస్తే రోజంతా హుషారుగా వుంటుంది' మార్కు డైలాగ్ తో స్వయంగా ఇంటినుంచీ తెచ్చిన ఫ్లాస్క్ లో కాఫీ పోసి అందించటం - తను మర్యాదగా తిరస్కరించటం.

    అది థ్రిల్లా?

    కాదు.

    సాయంత్రం ఇంటికొస్తుంటే - అందమైన కూలింగ్ గ్లాసెస్ తో స్కూటర్ మీద వెనుకే ఫాలో అయ్యే డబుల్ - బుల్ షర్టు కుర్రవాడు దాదాపు ఆర్నెల్ల నుంచీ చెయ్యలేని ధైర్యం మొదటి చేసి - 'హలో' అనటం - తను విననట్టు కదిలి వచ్చెయ్యటం.

    అది థ్రిల్లా ?

    కాదు.  


Next Page 

  • WRITERS
    PUBLICATIONS