Home » Sree Sree » Srisri Kathalu


                                         బొమ్మ
                                   (అలేఖ్యం)

    
    మరి నేను చెబితే నమ్మరు కాని నాకు చెప్పక తప్పదు.
    ఆ బొమ్మ నన్ను కొనమని మరీ అడిగంది. నేనూ
    మొదట నమ్మలేదు ముందుకు సాగిపోయి 'కూడా
    జేబులోంచి చర్మంలోంచి గుండె తడిమినట్లనిపించింది.
    వెనక్కి వచ్చి పిలుపు విని ప్రార్ధన ఆలకించి బేరమాడ    
    కుండా వాడెంత చెప్పాడో అంతకూ తీసుకున్నాను బొమ్మని.
    ఎవరు హర్షిస్తారు ఈ నా చర్యను. బుద్ధిపుట్టగానే సారా
    కొట్లో దూరేవారో -  ఊహ తట్టగానే చెరువులో పడి
    పోయేవారో?
    
    టేబిలు మీద బొమ్మను అలంకరించాను. నా నలుగురైదుగురు స్నేహితులూ నా యింటికి రావడం మానేశారు. నా అభిరుచిని అభినందించమని వారిని కోరలేదు నేను. వాళ్ళుకూడా కారణాలు చెప్పలేదు. అప్పుడప్పుడు బొమ్మను చూచినప్పుడు నాక్కూడా ఎందుకు కొన్నానా అనిపించేది. నిజంగా నన్నిడిగిందా లేదా? బొమ్మ నన్ను మోసగించిందా? లేక నన్ను నేనే మోసగించుకున్నానా? ఈ నిర్జీవ ప్రతిమకు ఇంత శక్తి నేనే ఆరోపించి ఉండాలి. లేక నా నిమిత్తం లేకుండానే ఇంకొకడ్ని అడిగి, ఆకర్షించుకుని కొనిపించుకునేదేమో కొంటెరకం నేను అదృష్టవంతున్ని కాబోలు నని అనుమానం కలిగింది. ఎందువల్లనంటే ఈ బొమ్మ నా టేబిలు మీద కూర్చున్నప్పటినుండి నా సిగరెట్లు ఖర్చు తగ్గిపోయింది. అప్పులన్నీ తీర్చివేశాను. రెండు మూడు మణియార్డర్లు వచ్చాయి. ఇంక కొన్నాళ్ళు చూసి బ్యాంక్ అకౌంట్ ప్రారంభించాలనుకుంటున్నాను. చాకలివాడు మూడు రోజులకే బట్టలు తెచ్చాడు. పద్దుపుస్తకం వెంటనే దొరికింది. మా యింట్లో పిల్లులు దెబ్బలాడుకోవడం మానివేశాయి (బహుశా అది కేవలం తాత్కాలిక యుద్ద విరామ సంధి అయినా కావచ్చును.)
    నా కాలంలో నూటికి తొంభైవంతులు వీధిలోనూ, పదివంతులు ఇంటిలోనూ గడపడానికి అలవాటుపడ్డ నేను సెబాస్, ఇప్పుడు ఆదర్శ గృహస్థున్నయాను. మరేముంది. ఈనాడు నాకంటే సంతుష్టుడీ మూడుజగంబుల పూజ్యుండు!
    చెడిపోతున్న వాళ్ళను క్షమించకూడదనీ, జీవితమంతా సిరాబుడ్డిలోనే గడపకూడదనీ, ఉన్నతాశయాలను తోరణాలుకట్టి మెళ్ళో మాత్రమే వేసుకోవాలనీ, వేళపట్టున నిద్రపోవాలనీ నిశ్చయించుకున్నాను.
    అన్నిటికన్నా గొప్ప సంగతి సాంతంగా ఆలోచించడం మానివేశాను. గొప్ప బెడద వదలిపోయింది. బొమ్మ చేతిలో కీలుబొమ్మనైపోయాను. రూళ్ళు గీసి కాపీలు రాసుకుంటుంది నామీద. తెల్ల కాగితం లాగ పడుక్కుంటాను నేను.
    ఉదయం కాఫీ ద్రావకంలో ప్రతిబింబించే నా ముఖం నాకెంతో కృతజ్ఞత కనబరుస్తుంది. నేను నవ్విన నవ్వును మళ్ళీ నాకు ఇచ్చివేస్తుంది. మధ్యాహ్నం భోజనానంతరం ఇదే అనుభవం. తాంబూల చర్వణం చేస్తూంటే అద్దంలో నా ముఖం నెమరు వేస్తుంది. నా కళ్ళు కుశలప్రశ్నలు వేస్తాయి. రాత్రి మంచం భావగీతం పాడుతుంది. గడియారం జోకొట్టుతుంది.
    నాకు శిల్పమన్నా శిల్పులన్నా విసుగు పుట్టిపోయింది. ఈ బొమ్మను తప్ప ఇంక దేన్నీ మెచ్చుకోవలసిన అవసరం లేదని రూఢీ అయిపోయింది. ఏ లోపం లేకుండా తీర్చి దిద్దినట్లుగా ఉండడమే దీని లోపమని నా శిల్పి మిత్రుడొకడు విమర్శించాడు. నిజాన్ని వక్రోక్తితో చెప్పడమే శిల్పానికి పరమార్ధం అన్నాడు. చర్మచక్షువు ఇచ్చే సాక్ష్యం అసమగ్రమని వాదించాడు.
    నేను చాలా ఓర్పుతో విన్నాను. నాకు వాడి మాటలు బోధపడలేదు. నా బొమ్మని చూసి ఈర్ష్యతో అంటున్న మాటలని మాత్రం నిశ్చయించుకున్నాను. ఏమయినా వాడు బుకాయింపులో నేర్పరి. నాకు వాదించడం చేతగాదు. చాలా పారిభాషిక పదాలతో నన్ను బోల్తాకొట్టించాడు. కొంతదాకా ఈడిగిలబడ్డాను - కలర్, కాంపోజిషన్, పెర్ స్పెక్టివ్ అంటూ ఉప్పెనలాగా వాడు తిరగబడి డైనమో, వెర్టిగో, పెనంబ్రా, క్యూబా అన్నాడు. నాకు జబ్బుచేసి ఇప్పుడే పథ్యం తింటున్నాను.
    బొమ్మ మాట్లాడుతుందా అని కొందరు వేసే చచ్చుప్రశ్నకి జవాబివ్వకుండానే మా యిద్దరి మధ్యా జరిగే సంభాషణను దాచవలసినంత మాత్రం దాచి మిగిలినది బైట పెడుతున్నాను.
    "....అని నువ్వన్నప్పుడు నాకు సిగ్గేసింది. నీకెందుకు పోనిస్తూ."
    "ఊరుకో కూడదు ఇవాళ ఇదయింది రేపు మరొకటవుతుంది. చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి......."
    "నలుగురితో చావు పెళ్ళితో సమానం."
    "నలుగురితో పెళ్ళి చావుతో సమానం."
    ఈ విధంగా మా సంభాషణ సాగుతూ వుంటుంది. ఇందులో బొమ్మ మాట లేవో నామాటలేవో అడగవద్దు. ఐనా బొమ్మతో సంభాషణ ఇలాగే వుంటుంది. నా మాటలు బొమ్మవైనా బొమ్మమాటలు నావైనా మించిపోయిందేదీ లేదు.
    చేసుకున్న పాపంలాంటిది కొనుక్కున్న బొమ్మ.
    
                                              ---౦౦---


Related Novels


China Yaanam

Annapurna Vari Chitralalo Sri Sri Geetalu

Sri Sri Mana Sangeetam

Srisri Kathalu

More