Home » Sree Sree » Srisri Kathalu


                               అనువాద కథలు

                                        సశేషము
    
    అనేకమైన కారణాలచేత ఒక కథ వ్రాయడానికి
    మొదలుపెట్టాను. అన్నిటికంటే ముఖ్యకారణము ఏదో కథ
    వ్రాయవలెనన్న పట్టుదలే దీనినిబట్టి ఇతర కారణాలు
    ఎంత బలవత్తరములో పాఠకులే పర్యాలోచించవచ్చును.
    
    నాకిప్పుడు కథ వ్రాయడము ప్రధానము కాబట్టి కథకుడి స్వాత్యంత్ర్యము తీసుకుంటున్నాను. మొట్టమొదట మనస్సుకి వచ్చిన ఊహను వచ్చినట్టుగా కాగితము మీద పడవేయదలచుకున్నాను. నేనిదివరలో చాలా కథలు చదివి వుండడము చేత, వాటిమీద విమర్శనముకూడా పఠించడముచేత కథయొక్క కథ తెలిసింది. అయినా నేనింతకుముందు ఏవో కథలు వ్రాయడానికి ప్రయత్నించడమూ అవి రెండు పుటలతోనే తృప్తి కలిగించడమూ జరిగి మొత్తముమీద కథ వ్రాయడము కష్టమే అనిపించింది. వ్రాసినప్పుడైనా సులభముకదా అని మొదలుపెట్టలేదు. కాని మొదలుపెట్టిన తర్వాత కష్టమని తెలిసి వచ్చింది. ఇంతకూ బాగా వ్రాయడమన్నది కష్టమన్న సంగతి నాకు ముందే తెలుసును.
    ఇంత ఉపోద్ఘాతమైనా కథ మొదలుపెట్టలేదే అని చాలామంది నామీద కోపగిస్తారేమో, (శ్రమించి దీన్ని చదువుతున్నవాళ్ళమాటే నేను చెప్పేది) ఔను మొదలుపెట్టలేదు. కాని ఇంకా పూర్తిచెయ్యలేదుగా! కాబట్టి సగము క్షంతప్యుడనే సగము క్షమించినవాళ్ళు మిగిలిన సగానికీ లోభించినట్లైతే నా కథకి వాళ్ళనే నాయకుల్ని చేస్తాను.
    న్యాయంగా అట్టివారు ఉండరు. అందుచేత నా కథకి నాయకలోపము రావలసిందే? నా కథ ఒక vanity Fair కావలసిందే? ఎంతమాత్రమూ కాగూడదు. ఎందువల్లనంటే అంత ఘోరము జరుగుతుందన్నప్పుడు కథని వ్రాయడమే మానివేస్తాను.
    నిజానికి నాకిప్పుడు కథ వ్రాయాలన్న కౌతూహలబుద్ధి సన్నగిల్లిపోయింది. ఐదునిమిషాల క్రిందటి ఉత్సాహము ఇప్పుడు నశించిపోయింది. అప్పటి Mood ఇప్పుడు మారిపోయింది. ఇక కథ వ్రాస్తే మాత్రం ఏమి లాభము? అలాగని మానలేనుకూడా; అనేక కారణాలు అడ్డగిస్తున్నవని మొట్టమొదటే చెప్పివేశాను. అందువల్ల ఈ చిక్కు తప్పించుకోదగిన మార్గమొక్కటే, ఏమంటే ఎప్పటికీ నాలుగక్షరాలతో ఈ సమస్య భేదిస్తున్నాను.

                        
    
                                   ---౦౦౦---


Related Novels


China Yaanam

Annapurna Vari Chitralalo Sri Sri Geetalu

Sri Sri Mana Sangeetam

Srisri Kathalu

More