Home » Sree Sree » Srisri Kathalu


                                కన్నీటి కబుర్లు    
                                      కరుణ రసం
    
    కరుణరసం ఒలికించే కథ రాసి నా పాఠకుల్ని ఏడిపించ
    దలచుకోలేదు. ఇప్పటికే (రా.వి.శాస్త్రి చెప్పినట్లు) అయ్యో,
    అయ్యో కథలు అసంఖ్యాకంగా వెలువడుతున్నాయి.
    తెలుగునాట భక్తిరసంలాగే కరుణరసం కూడా తెప్పలుగా
    తేలుతోంది. "డ్రెయినేజీ స్కీము లేక డేంజరుగా మారే"
    అవకాశం కూడా లేకపోలేదు. (భక్తిరసం విషయంలో ఈ
    వాస్తవాన్ని కనిపెట్టిన కవి గజ్జెల మల్లారెడ్డి అని నేను వేరే
    చెప్పనవసరం లేదు)
    
    భగవంతున్ని అందరూ కరుణామయుడంటారు. అంటే, ఎప్పుడూ ఏడుస్తూ వుంటాడని నేను చెప్పే అర్ధం! భగవంతుడే వుండి అతగాడే ఈ చరాచర ప్రపంచాన్ని సృష్టించి వుంటే, తాను చేసినదాన్ని చూసుకొని ఏడవడం తప్ప ఇంకేం చెయ్యగలడాయన? నేనూ, నాలాగ ఆలోచించేవాళ్ళూ మనిషే దేవుణ్ణి సృష్టించాడని నిశ్చయంగా నమ్మేవాళ్ళం కాబట్టి దేవుడు ఏడుస్తున్నాడని చెప్పి మాలో మేం నవ్వుకుంటాం.
    బైబిల్ లో "Jesus wept" (ఏసు ఏడ్చెను) అని రెండే రెండు మాటల రచన వుంది. ఇది ప్రపంచంలోకెల్లా గొప్ప కవిత్వమని చాలామంది నమ్ముతారు. నేను ఒక్కప్పుడు ఇందులోని కరుణరసానికి ముగ్ధుణ్ణి కాకపోలేదు. కాని వోల్టేర్ నాకు కనువిప్పు కలిగించాడు. "Jesus wept, Voltaire laughed" అన్నాడతను. (జీసస్ ఏడ్చెను. వోల్టేర్  నవ్వెను.)
    అన్నట్టు జీసస్ దేవుడు కాడు కదా! అతడు దేవుని కొడుకు మాత్రమే. అతని ఏడుపు వోల్టేర్ కు నవ్వు తెప్పించింది. అసలు దేవుడంటూ వుండి ఆ దేవుడే ఏడిస్తే వోల్టేర్ ఇంకా విరగబడి నవ్వేవాడనుకుంటాను. దేవుడనేవాడు లేడు కాబట్టి వోల్టేర్ కు ఆ శ్రమ తప్పింది.
    మన ప్రబంధ కవులు పని కట్టుకొని తమ నాయికలచేత ఏడిపించిన విషయం తెలుగు సాహిత్యంతో ఏమాత్రం పరిచయం వున్నవాళ్ళకైనా తెలుసు. ఇది మన లాక్షణికులు చెప్పిన అష్టాదశ వర్ణనలలో ఒకటి కాకపోవడంవల్ల కాబోలు మన ప్రాచీన కవులు తలా ఒక్క పద్యంతో సరిపెట్టుకున్నారు. "పాటున కింతులోర్తురే కృపాకహితాత్మక" అంటూ ముక్కు తిమ్మన ముద్దుముద్దుగా ఏడ్చాడనీ, "ఆ జాబిల్లి వెలుంగు వెల్లికల డాయన్ లేక....."అంటూ భట్టుమూర్తి బావురుమని ఏడ్చాడనీ మనం చదువుకున్నాం.
    ప్రబంధ కవుల్లాగ ఒకటీ అరా పద్యాలు గాక, ఆధునిక కవి కృష్ణశాస్త్రిగారు ఏడుపు కోసం ఒక కావ్యమే రాసి మనమీద విసిరేశారు. అదే "కృష్ణపక్షం", దాన్ని వేళాకోళం చేస్తూ ఒకాయన "శుక్లపక్షం" అంటూ ఏదో గిలికేడు. దాన్ని వేళాకోళం చేస్తూ వేదుల సత్యనారాయణశాస్త్రి ఆ పుస్తకం "సారస్వతారిష్టము, అను శుక్లనష్టము" అని అభివర్ణించాడు. కవిత్వంలో ఎంత ఏడ్చినా, ఆనాటి భావకవులకు నిజ జీవితంలో మంచి హాస్యరసాభిన్న ఉందనడానికి సందేహంలేదు.
    కృష్ణశాస్త్రిగారి విషయమే తీసుకుందాం కొంతకాలంపాటు ఆయన కరుణరసాన్ని గుత్తకు తీసుకున్నా....
    ("మీరు మనసారగా నేడ్వనీరు నన్ను-
    నన్ను విడువుడు; ఒకసారి
    నన్ను విడిచినంత నేకాంత యవనికాభ్యంతరమున
    వెక్కి వెక్కి రోదింతును - విసువులేక
    విరతిలేక దుర్భరశోక విషమగీతల
    లేడ్పివైతు, ఎలుంగెత్తి యేడ్చివైతు." లాంటి రోదన గీతాలతో)
    ఆయనే తన వేమన శతకంలో పసందైన హాస్యం చిందించాడు.
    ఉదాహరణకు :
    "ముడియొకండు, బాహుమూలంబులొకరెండు
    దాడి యొకడు, తమిళనాడొకండు
    వెరసి పంచశిఖలు తిరుపతి యోగికి
    విశ్వదాభిరామ...."
    భావకవుల మీద యెంత వెటకారంగా రాశాడో చూడండి!
    "మెరుగు కళ్ళజోళ్ళు, గిరజాలు, సరదాలు,
    భావకవికి లేనివేవి లేవు
    కవితయందు తప్ప గట్టివాడన్నింట    
    విశ్వదాభిరామ..."
    అందుచేత కరుణరసాన్ని మనం ఒక కంట కనిపెట్టక తప్పదు. జీసస్ ఏడిస్తే వోల్టేర్ నవ్వితీరుతాడు.
    "కృష్ణపక్షా"నికి ముందు కృష్ణశాస్త్రి గారు "కన్నీరు" అని ఒక చిన్న ఖండకావు సంపుటి ప్రకటించారు. అందులోని గీతాలన్నీ దరిమిలాను "కృష్ణపక్షం" లో చోటు చేసుకున్నవి.
    ఆ తర్వాత వెలువడ్డ "ప్రవాసము : ఊర్వశి" లో ఊడా ఈ కన్నీరు ఓవర్ ఫాస్ట్ అయింది.
    "అపుడు గొంతెత్తి యేడ్చినాను :
        అపుడు నన్ను
    కాంచగా నోపగాలేక కన్నులట్టె
    యార్చికొనినవి తారకలు :
        అపుడు మొగిళ్ళు
    లల్లనల్లన నలనల్లనై భరమ్ము
    లైన నిట్టూర్పు దొంతరలైనవి! అపుడు
    కుంచుకొని కుంచుకొని కుహూ
        కుహరవాటి
    "ననుతొలగి దవ్వు దవ్వులు చనిశిరాలు
    వాల్చి కొనినవి తిమిరాలు భయవశాన"
    ఇందులో షెల్లీ కవి ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. కృష్ణశాస్త్రిగారు "Prome theus unbound" చదువు లేదనుకోవడానికి ఆస్కారంలేదు.
    ఈయేడుపంతా ఎందుకంటే, "దైవం కోసం ప్రేమకోసం" అంటాడు టాగూరు. రవీంద్రుని మంత్రజాలంలో చిక్కుకున్న కృష్ణశాస్త్రిగారు "ఊర్వశీ! ప్రేయసీ!" అంటూ విప్రలంభ శృంగారం ఆలంబనంగా కడవలకొద్దీ కన్నీరొలకబోస్తారు. దేవుడికి కూడా
    "కలుష దుద్దాంత పంక సంకలిత కుహరముల జనించు మదీయాశ్రు మలిన ధార స్వామి, భవదీయ పాదదేశమున బారి పరమ పావన జాహ్నవీ ప్రతిభగాంచు" అంటూ అశ్రుతర్పణం విడుస్తారు.
    అశ్రుతర్పణం అంటే జ్ఞాపకం వచ్చింది. ఎవడేనా ప్రముఖుడు చచ్చిపోయాడంటే చాలు మన పత్రికలలో సంపాదకీయాలు కుంభవృష్టిగా కన్నీరు కురిపిస్తాయి. ఆ మధ్య తరిమెల నాగిరెడ్డిగారు చనిపోయిన సందర్భంలో ఒక సంపదకీయం చదివాక, "అయ్యో! సంపాదకా!" ("అయ్యా! సంపాదకా!" అని కాదు) అని ఒక సంపాదన లేఖ రాద్దామనుకున్నాను. అనుకోవడమే కాదు రాశాను కూడా! కాని పోస్టు చెయ్యలేదు. ఎలాగూ అది బుట్టదాఖలయి పోతుందని నాకు తెలుసు కాబట్టి.
    ఆ ఉత్తరంలో నేను మన శవారాధన తత్పరతను దుయ్యబట్టాను దీన్నే శవ సంస్కృతి అంటాన్నేను. "ఒక గొప్పవాడు మరణిస్తే ఏడుపు కాక నవ్వొస్తుందా? అని ఎవరైనా నన్నడగవచ్చును-ఏడవండయయా! ఏడవండి మీతోబాటు నేనూ ఏడుస్తాను. కాని, వెంటనే కళ్ళు తుడుచుకుని కార్యరంగంలోనికి దిగడమే మన కర్తవ్యం!" అనేదే నా హెచ్చరిక.
    అందుకే "ఏకో రసః కరుణ ఏవ" అంటే నే నొప్పుకోను. శృంగార రసానికి కూడా ప్రముఖ స్థానం ఇవ్వడానికి నేనంగీకరించను. ఈ రెండు రసాలూ ఉన్నాయే, ఇవి పశుపక్ష్యాదులకూ మనకూ సామాన్యమైనవి, వీటిని గద్దెమీదనుంచి క్రిందికి దించి, ఈనాడు వీర రసానికి పట్టం కట్టాలని నేను సిఫారసు చేస్తున్నాను.
    
                                     ---౦౦౦---


Related Novels


China Yaanam

Annapurna Vari Chitralalo Sri Sri Geetalu

Sri Sri Mana Sangeetam

Srisri Kathalu

More