Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
ఒకనాడు ఒక వర్తక మిత్రుడు నాకు రహస్య సమాచారం అందించాడు. గార్లనుంచి 1800 బస్తాల జొన్నలు వ్యాగన్ల ద్వారా దొంగరవాణ అవుతున్నాయి. దాన్ని నిలుపు చేయాలని నా తాపత్రయం. తెలుగులో ఒక దరఖాస్తు వ్రాశాను. వరంగల్లు వెళ్లాను. దరఖాస్తు అనువాదం చేయించాను. టైపు చేయించాను. అది తీసుకొని పళని అప్పన్ గారి దగ్గరకి వెళ్లాను.
పళని అప్పన్ DCA. కలెక్టరు చదివాడు. పెద్ద అధికారి. వారి దర్శనం సామాన్యం కాదు! నా పేరూ - ఊరు వ్రాసి పంపించాను. వెంటనే కాదుగాని, కొంత ఆలస్యంగా పిలిచారు. వెళ్లాను.
పళని అప్పన్ గారు నన్ను గుర్తించారు. గార్ల విషయాలు - గింజల దుకాణాల విషయం అడిగారు. అప్పటి నా ధైర్యానికి మెచ్చుకున్నారు. దరఖాస్తు అందించాను. అందుకుని ఏమిటి అని అడగలేదు. మొత్తం చదివారు. వారి ముఖం వికసించింది. దరఖాస్తు పేరు చూచారు. 'డియర్ రంగా! నువ్వు కుర్రాడివి. దేశభక్తునివి. నీలాంటి వాళ్లు ఉండాలయ్యా! నీముందే చర్య తీసుకుంటా, కూర్చో' అన్నారు.
నాకు 19-20 ఏళ్లు ఉన్న మాట నిజమే. కాని జబ్బులు - నిక్కరు షర్టు - చిన్నవాడిలా ఉంటాను. కాలేజి కుర్రానిలాగా కూడా కాదు. స్కూలు పిల్లవానిలా ఉంటాను. అందుకే DCA అలా అన్నారు.
అప్పటికి టెలిఫోను వ్యవస్థ లేదు. రైల్వేకు మాత్రమే టెలిఫోను ఉండేది. DCAకు రైల్వే టెలిఫోనుతో సంబంధం ఉంది. వారు డైరెక్టుగా గార్లకు మాట్లాడారు. నేను తెలియపరచింది. నిజం అని తేల్చుకున్నారు. వ్యాగన్లు నిలుపు చేయవలసిందని ఉత్తరువు చేశారు.
"డియర్ రంగా! కంగ్రాచ్యులేషన్స్! గింజ నిలిచిపోయింది - చాలునా?" అడిగారు.
"చాలదు సర్!"
"ఇంకా ఏం చేయమంటావయ్యా?"
"ఆ గింజ గార్ల దాటరాదు సర్. అది గార్లలోనే అమ్మించాలి."
"సరే, ప్రయత్నిస్తాం. నీవు ప్రభుత్వానికి సహకరించావు. నీకు బహుమతి లభిస్తుంది."
"వద్దు సర్! మీరు ఇంత త్వరగా చర్య తీసుకున్నారు. అదే చాలు. కృతజ్ఞతలు" అని వచ్చేశాను. నాకు అప్పటికి ఇంగ్లీషుమాట రాదు.
నేను గార్ల వచ్చాను. చూచాను. వాగిన్లున్నాయి. ఒక మంచి ఆలోచన వచ్చింది. పక్కనే జీవంజిగూడెం ఉంది. అక్కడ కొన్నాళ్లు రాత్రి పాఠశాల నడిపాను. జనాన్ని కూడగట్టుకు రమ్మని పంపించాను. జనం వందల వేల సంఖ్యలో వచ్చింది.
పేదజనం విపరీతంగా కూడింది. "ఇది నల్ల బజారు ధాన్యం. ఎవరిదీ కాదు. మనది. సర్కారు నిలిపి ఉంచింది. ఇదంతా మీ కోసమే. తీసికెళ్లండి" అన్నాను. ఆవేశంగానే మాట్లాడాను.
పేదలు పొలోమని వ్యాగన్లమీద పడ్డారు. బద్దలు కొట్టారు. బస్తాల్లో - గంపల్లో - బిందెల్లో - మూటల్లో వందలు వేలమంది పచ్చ జొన్నలు తీసికెళ్తున్నారు. వాళ్ల అరుపులు - కేకలు - తొక్కిళ్లు - తొక్కిసలాటలు - కొట్టుకోవటాలు!
ఎంత గొప్ప దృశ్యమండీ అది! ఎంతటి వెలుగండీ వాళ్ల కళ్లల్లో! ఎంతటి ఆరాటమండీ! ఇంత మందికి గింజ అందించ కలిగాను. నా ఆనందం ఎంతండీ! ఎంతండీ! ఎట్లా చెప్పడం? నేను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయినాను.
అవునండీ! పుచ్చుకోవడంలో ఆనందం లేదు.
ఇచ్చుకోవడంలోనే ఆనందం!
పోలీసులు వచ్చేవరకు గింజ అయిపోయింది!
వ్యాగన్లు కాళీ అయినాయి. నేలమీది గింజలు ఆడాళ్లు దోసిళ్లతో ఎత్తుకుంటున్నారు.
"నీవేనా ఇదంతా చేసింది?" అమీను అడిగాడు.
"మీ పని నేను చేశాను. నాకు కృతజ్ఞత చెప్పాలి."
"పద స్టేషనుకు?"
"ఎందుకు?"
"దొమ్మీ కేసు"
"గింజ ఎవరిదో తేల్చండి. యజమాని తెలిస్తే గదా!"
అమీను స్టేషను మాస్టరు దగ్గరికి వెళ్లాడు. ఇద్దరు చాలసేపు మాట్లాడుకున్నారు. భాగాలు కుదిరినట్లున్నాయి! బయటికి వచ్చాడు. మళ్లీ నన్ను పలకరించలేదు. అమీను వెళ్లిపోయాడు.
కథ కంచికి!
గింజ ఇంటికి!!
వెసులుబాటు:
ఈలోగా కుటుంబం విషయంలో మంచి పరిణామాలు కలిగాయి.
మాకు గార్లలోను - చినగూడూరులోనూ పొలాలున్నాయి. వ్యవసాయం లేదు. నాయన కవులుకు ఇస్తారు. ఇంతకాలం నాయన మాకు ఒక్క గింజ రానీయలేదు. గార్లలో పేష్కారు బలంతో నిలిపాడు. అప్పుడు ప్రభుత్వం వాళ్లది. యంత్రాంగం సాంతం వాళ్లపక్షం. అయినా ఎదిరించి జాగీరులో నిలువగలిగాం! హతమార్చడం వారి గూటివిద్య! మేమెంత? మా బలం ఎంత? ఇవ్వాళ ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రజాబలంతో రాతిమనుషులను ఎదిరించి నిలువగలిగాం!
అన్నింటినీ మించింది దైవకృప - భగవదనుగ్రహం.
ప్రభుత్వం మారింది. పేష్కారు శక్తిహీనుడు అయినాడు. పలుకుబడి కొంత మావైపు మొగ్గింది. గార్ల పొలం గింజలు బలవంతంగా తెచ్చుకొన్నాం. కవులుదారు మా పక్షంవాడే. కాబట్టి నామమాత్ర బలం అవసరం అయింది.
నాయన, పేష్కారు చూస్తూ మిన్నకున్నారు. ఏమీ చేయలేకపోయారు!
"కాలో2యం దురతిక్రమః" అంటాడు వాల్మీకి. కాలాన్ని అతిక్రమించడం అసాధ్యం.
ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయని సామెత! నీరు సహితం ఒకచోట ఉండదు. మారుతుంటుంది. నీరు ఉన్నచోటికే ఓడలు చేర్తాయి.
చిన్నగూడూరులో నాయనకు రామరెడ్డి బలం. అతడే అన్నయ్యను పోలీసులకు పట్టిచ్చింది. రామరెడ్డి అతి తెలివి ప్రదర్శించాడు. కమ్యూనిస్టులతో మైత్రిగా ఉన్నాడు. పోలీసులకు సమాచారం అందించాడు. దళం వారికి అది తెలిసింది. దళంవారు - కమ్యూనిస్టులు పట్టపగలు రామరెడ్డిని పట్టుకుపోయారు. తాటి చెట్టుకు కట్టారు. తుపాకితో కాల్చి చంపారు.
ఇది దైవన్యాయం.
రామరెడ్డి చచ్చాడు.
పేష్కారు పెత్తనం ఊడింది.
చినగూడూరు గింజలు కూడా అనాయాసంగా తెచ్చుకున్నాం. నాయనా మాకు ఎనలేని అన్యాయం చేశాడు. మేము చేయదలచలేదు. మరుసటి సంవత్సరం నుండి గూడూరు గింజలు నాయనకు వదిలేశాం.
అన్నయ్య జేలు నుంచి వచ్చింతరవాత చెప్పిన విషయం - అన్నయ్య జేలునుంచి నాయనకు ఉత్తరం వ్రాశారట. తాను జైల్లో ఉన్నాడు. తమ్ముడు చిన్నవాడు. కుటుంబాన్ని ఆదుకోవలసిందని వ్రాశారట. ఆ కష్టకాలంలో నాయన కనీసం ముఖం చూపించలేదు. అది అన్నయ్య మనసు విరిచింది!
మరొక విషయం ఏమంటే - నాకు వాంతిలో రక్తం పడడం తగ్గలేదు. బెజవాడలో సుంకవెల్లి సత్యనారాయణ డాక్టరు దగ్గరికి వెళ్లాను. డాక్టరు దగ్గరికి వెళ్లడం అదే తొలిసారి. పది రూపాయిలు తీసుకున్నారు. మందులు వ్రాసి ఇచ్చారు. వాడితే వాంతులు తగ్గేయి. ఉప్పు - అన్నం తింటున్నాను.
గాంధీజీ - కస్తూరిబా:
గ్రామంలో తాసిల్దారు స్థలం ఆక్రమించుకున్నాం. గాంధీజీ - కస్తూరిబా విగ్రహాలు ప్రతిష్టించాం. పార్కు ఏర్పాటు చేశాం.
గాంధీజీ గతించిన తొలిరోజు. పోలీసు చర్య జరిగిన ఉత్సాహం. చాలచోట్ల మహాత్ముని విగ్రహాలు ప్రతిష్టించారు. కస్తూరిబా విగ్రహం నేను సూచించాను. ఆ విగ్రహం ముస్లిములు కొని ఇచ్చారు.
విగ్రహ ప్రతిష్టాపన అత్యంత ఉత్సాహంగా జరిగింది. కుల మత భేదాలు, ధనిక - పేద భేదాలు మరిచి వేల మంది పంక్తి భోజనం చేశారు. పేదలకు లేదనకుండా అన్నదానం చేశాం.
ఇరవయి అయిదు
"సాతంత్రం వచ్చిందంటున్రు":
నిజాం రాజ్యం మీద పోలీసు చర్య జరిగింది. అందుకు రెండు ప్రధాన కారణాలు:
1. నిరంకుశ నిజాం ప్రభుత్వాన్ని రద్దు చేయడం. అలా చేసి భారత సార్వభౌమ అధికారాన్ని నిరూపించడం. రజాకార్లను అణచడం కాదు - నిర్మూలించడం.



